సబ్ ఫీచర్

నిరుపమాన త్యాగధనుడు ‘నీలం’ ( నేడు జయంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ నీలం సంజీవరెడ్డి గొప్ప జాతీయ నాయకుడు మాత్రమేకాదు మహోన్నత జాతీయవాది. భారతీయులు గర్వించదగ్గ నిష్కళంక తేజోమూర్తి. స్వయం ప్రతిభతో, స్వయం కృషితో, అంచలంచలుగా ఎదిగి, రాజకీయాలలో అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన జీవిత కాలంలో అధికభాగం దేశ సేవకే అంకితంచేశారు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా, రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, పరిపాలనా దక్షతకి నిదర్శనంగా నిలిచారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ప్రభుత్వంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ ఐదు దశాబ్దాల కాలంలో కీలక సమయాలలో కీలక పదవులను అతి సమర్ధవంతంగా నిర్వర్తించి - నీరాజనాలందుకున్నారు. భారత జాతీయ చరిత్రలో వారిదొక సువర్ణ్ధ్యాయం. స్వచ్ఛతకూ చిత్తశుద్ధికీ, నిరాడంబరతకూ, మారుపేరైన నీలం పొగడ్తలకి వ్యతిరేకి. సునిశిత దృష్టితో ఎదుటివారి మనస్థత్వాలను అంచనాలువేస్తూ తదనుగుణంగా వర్తిస్తూ నిర్భీతితో, నిజాయితీతో ముందుకు సాగిపోయే అరుదైన వ్యక్తిత్వం వీరి సొంతం. ప్రలోభాలకు లొంగక, వొత్తిళ్ళకు తలవంచక, అంతరాత్మ సాక్షిగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజాక్షేమంకోసమే పాటుపడుతూ ఎంతటి త్యాగానికైనా వెనుకాడని నిప్పులాంటి నాయకుడు నీలం.
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్ జిల్లాలోని ఇల్లూరు గ్రామంలో 1913, మే 19న రైతు కుటుంబంలో జన్మించారు. 18 సంవత్సరాల పిన్న వయస్సులోనే గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా తన రాజకీయ జీవితానికి అంకురార్పణ చేశారు. 46 సంవత్సరాల వయస్సులోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయ్యారు. తమ జీవిత ప్రథమాంకంలోనే వివిధ రంగాలలో శ్రీ సంజీవరెడ్డి అద్భుత విజయాలను సాధించారు.
1937లో ప్రొవెన్షియల్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి పదవి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయికి ఎదిగారు. 1946లో మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యత్వంనుండి, 1949లో మద్రాస్ మంత్రి మండలిలో మంత్రిగా, 1953లో ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అతి సమర్ధనీయంగా పనిచేశారు. 50 సంవత్సరాల వయస్సులోనే, రాజకీయ రంగంలో ఎన్నో విశిష్ట స్థానాలను పొందగలగటం చరిత్రలోనే అరుదూ- అద్భుతం. 1962లో ముఖ్యమంత్రిగా తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో రాజకీయ సంక్షోభాలను నిగ్రహంతో ఎదుర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే, నీటి పారుదల, విద్యుత్‌చ్ఛక్తీ, సంబంధిత అనేక ప్రాజెక్టులూ, విజయవాడ కృష్ణా నదిపైన నిర్మించిన వంతెనా, ప్రతిష్టాత్మకమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టూ ప్రారంభింపబడ్డాయి. ఆయన సారధ్యంలో 18 ప్రాజెక్టుల పైగా నిర్మాణ దశలో వుండగా, ప్రపంచ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత వ్యవసాయ రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచింది.
కర్నూల్ జిల్లా బస్సురూట్లను జాతీయంచేసిన సందర్భంలో, సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా 1964 ఫిబ్రవరి 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అవలీలగా త్యజించారు. నెహ్రూ వారించినా అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా క్షీణిస్తున్న కాంగ్రెస్ గౌరవం, ప్రతిష్టా సంజీవరెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ స్థాయికి అత్యున్నత స్థితిలో నిలిపింది. అధికారం, పదవులూ తనకు తృణప్రాయాలని ఎన్నోసార్లు నిరూపించారు. 1977 లోక్‌సభ ఎన్నికలలో ప్రత్యర్థులూ, స్వార్థపరులూ ఎన్ని అవాంతరాలు సృష్టించినా, బ్యాలట్ బాక్సులను అపహరించినా, చివరికి ఆయన మరణించారని వదంతులు లేవదీసినా సంజీవరెడ్డి ఎంతమాత్రమూ చలించలేదు. సుడిగాలిలా రాష్టమ్రంతా పర్యటించి, అఖండ విజయం సాధించారు. ఈ చారిత్రాత్మక ఎన్నికలలో జనతాపార్టీ నుండి ఒకే ఒక్క అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1977 జూలైలో అన్ని పార్టీల సమ్మతితో భారతదేశాధ్యక్షునిగా అత్యున్నత పీఠాన్ని కైవశం చేసుకున్నారు. తన రాజకీయ పయనంలో ఐదేళ్ల పూర్తికాలం దేశాధినేతగా అలరించి 1982లో పదవీ విరమణ చేశారు. అనంతరం ఒక యోగిలా ప్రశాంత జీవితాన్ని గడిపారు. యువకుడైన సంజీవరెడ్డి నిజాయితీ గాంధీజీని ఎంతగానో ఆకట్టుకుంది. సేవాగ్రాంకు వచ్చి తనతో వుండవలసిందిగా ఆహ్వానించారు గాంధీజీ. ఈ అవకాశం నీలంకు ఎంతగానో ఉపకరించింది.
రాష్టప్రతిగా పదవీ విరమణ చేశాక కొంతకాలం అనంతపూర్‌లో వున్నప్పుడు, ఆయన్నుంచి అమూల్య సలహాలను తీసుకోటానికి, జ్ఞానీజైల్‌సింగ్, వెంకట్రామన్, శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ఎన్.టి.ఆర్. మొదలైన వారెందరో సందర్శించి వెళ్ళేవారు. ‘‘ఈనాడు, రాజకీయ నాయకులనబడేవారిలో ధనాపేక్షా, పదవీ వ్యామోహం తప్ప, దేశ సంక్షేమంకోసం పాటుపడాలనే, తపనా ఇంగిత జ్ఞానం ఏమాత్రమూ కన్పించడం లేదు. ఎంతసేపూ డబ్బును గురించిన ఆలోచనే. డబ్బును ఎలా కూడబెట్టాలి? ఎంత కూడబెట్టాలి? అన్న దురాశ తప్ప వారిలో నాకేమీ కన్పించటం లేదు...’’ అంటూ మనస్తాపం చెందేవారు. ఆంధ్రా స్టేట్‌లో అధికారపార్టీకి నాయకునిగా ఎన్నికైనప్పుడు తన బదులుగా, ఎంతో సమర్ధుడూ, ధీరోదాత్తుడూ, త్యాగమూర్తీ అయిన ప్రకాశంగారిని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యవలసిందిగా ఇంటికి వెళ్ళిమరీ అభ్యర్థించటం, ప్రకాశంగారు నివ్వెరపోగా, దేశ సంక్షేమంకోసం తప్పదని పట్టుపట్టి వొప్పించటం, తాను ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమవటం- తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోయే సమయంలో అప్పటికే వోటమి పాలైన బెజవాడ గోపాలరెడ్డిగారిని మంత్రి మండలిలోనికి రెండవ స్థానంలోకి ఆహ్వానించటం, తనకు వ్యతిరేకంగా వోట్లువేశారని తెలిసినా రాష్ట్ర ప్రగతికోసం, ప్రజాసంక్షేమంకోసం, కె.వి.రంగారెడ్డి, మెహదీ నవాజ్ జంగ్ వంటివారిని, మంత్రి వర్గంలోనికి స్వయంగా ఇంటికి వెళ్ళిమరీ ఆహ్వానించటం ఇలా ఎన్నోఎన్నో విషయాలను గుర్తుకు తెచ్చుకుని చిన్మయానంద భరితులయ్యేవారు.
‘‘డ్యాములూ, కట్టడాలూ, అవీ ఇవీ, కట్టాలని ఈనాటి రాజకీయ నేతలు ఊరికే రాజకీయం చేస్తున్నారు. వీటి వనరుల మీద సరైన అవగాహన లేకుండా ఎలా? అనుభవశూన్యంగా ప్రవర్తిస్తే ప్రజలకు న్యాయంజరిగేది ఎలా? అంటూ ఎంతో బాధపడేవారు. భారత రాజ్యాంగం పట్ల విశేషమైన అవగాహనా, ఆరాధనావున్న నీలం రాష్టప్రతిగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా మాత్రమే ప్రవర్తించేవారు. ‘రాష్టప్రతి రబ్బర్‌స్టాంపు’అన్న నానుడిని పూర్తిగా నిర్వీర్యంచేసి ఆ పదవికి హుందాని పెంచి ఆరాధ్యుడయ్యారు. ‘‘నేను భారతీయుడిని. ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించిన వాడిని కాను. అందరూ నావారే. నేను అందరివాడినే. అందుకే నా మరణానంతరం, నేనెక్కడవుంటే అక్కడే నా అంత్యక్రియలు జరిపించండి’’. ఆయన అంతిమ కోరికకు మా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన గొప్ప రామభక్తులు. ప్రొద్దుటే శ్రీరాముని పూజించుకున్నాక గానీ, నిత్యవిధులలోకి అడుగుపెట్టేవారు కాదు. నీలం జాతీయ నాయకుడు. ప్రాంతీయ తత్త్వాలకు అతీతులు. ఆయన జయంతి వర్ధంతులను ప్రజలు కృతజ్ఞతాభావంతో నిర్వహించినప్పుడే ఆ మహానేతకు నిజమైన నివాళినర్పించిన వారమవుతాము. ఆయన కోరుకోకపోయినా అది మన ధర్మం, మన బాధ్యత.

చిత్రం... సంజీవరెడ్డితో కృష్ణకుమారి (ఫైల్ ఫోటో)

- డాక్టర్ కె.వి.కృష్ణకుమారి సెల్ నెం. 9704068673