సంపాదకీయం

అమెరికా అహంకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రక్షణ అవసరాలకు అనుగుణంగా మన సమర పరిజ్ఞాన పాటవం పెంపొందకపోవడం ఏడు దశాబ్దుల వైపరీత్యం. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు తరచు మన ఆంతరంగిక వ్యవహారాలలో అక్రమ ప్రమేయం కల్పించుకొంటూ ఉండడానికి ఇది అతి ప్రధానమైన కారణం! రక్షణ రంగంలో సైతం విదేశీయ సంస్థల పెట్టుబడులకు మన ప్రభుత్వం అనుమతినివ్వడం ‘ప్రపంచీకరణ’ ఫలితం! ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలో భాగంగా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన రక్షణ రంగంలోకి చొరబడుతుండడం స్వయం సమృద్ధిని, స్వావలంబనను దెబ్బతీస్తున్న విపరిమాణ క్రమం! అమెరికా ప్రభుత్వం సరికొత్తగా మన అంతర్గత వ్యవహారాలను గురించి వ్యతిరేక వ్యాఖ్యలను చేయడానికి ఇదీ ప్రాతిపదిక! గతంలో వలెనే మన ప్రభుత్వం అమెరికా అక్రమ ప్రమేయాన్ని నిరసించింది.. కానీ యథావిధిగా అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలుకు ఒప్పందాలను కుదుర్చుకుంటూనే ఉంది. రష్యా నుంచి మనం ఆయుధాలను కొనరాదని, ఇరాన్ నుంచి ముడి చమురును, ఇంధన వాయువును దిగుమతి చేసుకోరాదని అమెరికా ప్రభుత్వం తరచు హెచ్చరికలను జారీచేయడం అమెరికా ఆధిపత్య ధోరణిలో భాగం! మనం ఏ దేశం నుంచి ఆయుధాలను కాని, ఇంధనాన్ని కాని ఇతర అవసరమైన వస్తువులను కాని కొనుగోలు చేయాలన్నది మనం నిర్ధారించుకోవాలి. ఇది మన దేశపు సార్వభౌమ అధికారానికి సంబంధించిన వ్యవహారం. కానీ అమెరికా నిర్లజ్జగా, నిర్భయంగా ఈ వ్యవహారాలపై మనకు ఆదేశాలను జారీచేస్తోంది. మన ప్రభుత్వం ఈ ‘ఆదేశాల’ను పట్టించుకుందా? లేదా? అన్నది వేఱు కథ. కానీ మనకూ అమెరికాకు మధ్యగల ద్వైపాక్ష సంబంధాలలో అమెరికా ‘ఆధిపత్యం’ నిక్కి చూడడం మన జాతీయ గరిమకు అవమానకరం, మన స్వాభిమాన ప్రవృత్తికి విఘాతకరం.. మన దేశంలో అల్పసంఖ్య మతాలవారి హక్కులకు విఘాతం కలుగుతోందని అమెరికా ప్రభుత్వం ఆదివారం ‘అబద్ధపు నివేదిక’ను ఆవిష్కరించడం ఈ అక్రమ ప్రమేయ చరిత్రలో సరికొత్త ఘట్టం!!
మంగళవారం మన దేశానికి వస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాషియో ఆదివారం ఈ ‘అబద్ధాల పత్రాన్ని’ ఆవిష్కరించడం అమెరికా దురహంకార ప్రవృత్తికి అద్దం.. 2018వ సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘్భరతీయ జనతాపార్టీ’ ఆధ్వర్యవంలోని రాష్ట్రాల ప్రభుత్వాలు ‘‘ఇస్లాం మతస్థులకు వ్యతిరేకమైన చర్యల పాలుపడినట్టు’’ అమెరికా వారి ఈ అబద్ధాల నివేదికలో పేర్కొన్నారు. మన విదేశాంగ మంత్రిత్వశాఖవారు వెంటనే ఈ నివేదికను తిరస్కరించారు. మన దేశంలో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ అనాదిగా కొనసాగుతోంది. బ్రిటన్ విముక్త అఖండ భారతదేశం మూడు ముక్కలు కావడానికి కారణం మహమ్మదాలీ జిన్నా పెత్తనం లోని ‘ముస్లింలీగ్’ వారి ఇస్లాం మతోన్మాదం. ఈ మతోన్మాదాన్ని పెంచి పోషించిన బ్రిటన్ దురాక్రమణదారులు మత ప్రాతిపదికపై పాకిస్తాన్‌ను ఏర్పాటుచేశారు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న పాకిస్తాన్ ‘ఇస్లాం ఏకమత రాజ్యం’గా ఏర్పడింది, ఇస్లామేతర మతాలను పాకిస్తాన్ నిర్మూలించింది, నిర్మూలిస్తోంది. కానీ అఖండ భారత్ విభజన తరువాత కూడ హిందూ జాతీయులు అధిక సంఖ్యలో ఉన్న అవశేష భారత్‌లో మాత్రం సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఇందుకు కారణం హైందవ జాతీయ సమాజ స్వభావం అనాదిగా సర్వమత సమభావం! బ్రిటన్ దురాక్రమణ తరువాత ఏర్పడిన కొత్త రాజ్యాంగం ఈ తరతరాల స్వభావానికి సరికొత్త ధ్రువీకరణ! ప్రజల సమష్టి స్వభావానికి అనుగుణంగా వివిధ దేశాల రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది ఆరంభం నుంచి అమెరికాలో పాత జాతిని నిర్మూలించి సరికొత్త జాతిగా ఏర్పడిన ఐరోపా జాతులవారు క్రైస్తవ మతోన్మాదులు.. తమది కానిదాన్ని దేనిని కూడ సహించని ఐరోపావారు అమెరికాలోని అనాది జాతిని నిర్మూలించి తాము కొత్త జాతిగా అమెరికాలో తిష్ఠవేయడం చరిత్ర. మతోన్మాదం, అసహిష్ణుత పునాదులుగా ఏర్పడిన కొత్త అమెరికా జాతి గత వంద ఏళ్లుగా ప్రపంచానికి ‘సర్వమత సమభావ’-సెక్యులర్- పాఠాలను చెపుతుండడం చారిత్రక నిర్లజ్జకు నిదర్శనం..
మన దేశంలో సర్వమత సమభావ వ్యవస్థ సర్వసమగ్రంగా వికసించింది, వికసిస్తోంది. అల్పసంఖ్య మతస్థులకు అధిక సంఖ్య మతస్థులకంటె ఎక్కువ ప్రత్యేక అధికారాలు ప్రత్యేకమైన సదుపాయాలు, ఆరక్షణలు ఉన్న దేశం మనది మాత్రమే. ప్రపంచంలోని మరే ఇతర దేశంలో ఇలా అల్పసంఖ్య మతస్థులకు ప్రత్యేకమైన అధికారాలు, సదుపాయాలు లేవు. ఇలాంటి ఆదర్శమైన అనుసరణీయమైన మన ‘సెక్యులర్’ వ్యవస్థను విమర్శిస్తున్న అమెరికా, చైనా వంటి నియంతృత్వ దేశాలలోను, సౌదీ అరేబియా వంటి బీభత్స మతోన్మాద దేశాలలోను జరిగిపోతున్న మానవీయ అధికారాల హననం గురించి మాత్రం పట్టించుకొనడం లేదు! చైనాలోని సింకియాంగ్ ప్రాంతంలో ‘జిహాదీ’ బీభత్సకారులను చైనా ప్రభుత్వం తీవ్రంగా అణచివేసింది. ఈ బీభత్స నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మసీదులలోకి చొఱబడిన సైనికులు నేరస్థులను, జిహాదీ హంతకులను బయటికి లాక్కొనివచ్చిన ఘటనలు ప్రచారమయ్యాయి. ఇలా బీభత్సకారులను నిర్మూలించడం అభిలషణీయం. కానీ బీభత్సకారులన్న ఆరోపణపై వందల మంది నిరపరాధ ఇస్లాం మతస్థులను చైనా సైనికులు హింసించినట్టు ప్రచారమైంది. కానీ ఈ వ్యవహారంపై అమెరికా ప్రభుత్వ ప్రచారకర్తలు నోరువిప్పలేదు. ఎందుకంటె ‘‘నోరు విప్పితే మాడు పగలగొట్టగల’’ దౌత్య నీతిని చైనా ప్రభుత్వం అనుసరిస్తోంది. కానీ మన దేశంలో ‘‘జరగని హక్కుల ఉల్లంఘన’’ను ‘‘జరిగినట్టుగా’’ అమెరికా ప్రభుత్వం చిత్రీకరించడానికి కారణం మన ప్రభుత్వం కూడ చైనావలె అమెరికాపట్ల ‘‘నోరువిప్పితే మాడు పగులగొట్టే’’ విధానాన్ని అనుసరించ లేకపోవడం. అందువల్ల అమెరికాకు మన ప్రభుత్వం పట్ల ‘తేలిక’్భవం ఏర్పడి ఉంది. ఇలా ఏర్పడడానికి కారణం మన ప్రభుత్వం ఆయుధ సామగ్రి కోసం, రక్షణ పరికరాల కోసం అమెరికాపై ఆధారపడి ఉండడం, నిజానికి అమెరికాకు చెందిన వాణిజ్య సంస్థలు తమ ఆయుధాలను అమ్ముకొనడానికి మన దేశంపై ఆధారపడి ఉన్నాయి. మన దేశం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ - తమ ఉత్పత్తులను అమ్ముకునే అతిపెద్ద ‘విపణి’-మార్కెట్-గా ఏర్పడిపోవడం ప్రపంచీకరణ ఫలితం! అందువల్ల మన దేశం ఈ వస్తువుల కొనుగోళ్లను నిలిపి వేసినట్టయితే అమెరికాలోను, చైనాలోను, ఐరోపా సమాఖ్యలోను, దక్షిణ కొరియాలోను అనేక వాణిజ్య సంస్థలు దివాలా తీస్తాయి. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోగల ‘జాతీయాత్మ స్థైర్యం’ మన ప్రభుత్వానికి కలగాలి! అమెరికా ఇలా ‘అబద్ధాల నివేదిక’ను ప్రచారం చేసిన సమయంలోనే మన ప్రభుత్వం మరో డెబ్బయివేల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను రక్షణ సామగ్రిని అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసింది!!
ఏడు దశాబ్దులు గడిచిన తరువాత కూడ, బ్రిటన్ విముక్త భారత్ రక్షణ రంగంలో మాత్రం స్వదేశీయ అవసరాలకు అనుగుణంగా ఎదగలేదన్నది నిరాకరింపజాలని నిజం. మన రక్షణ శాస్తవ్రేత్తలు సుదూర లక్ష్యచ్ఛేదక క్షిపణులను, శత్రుక్షిపణులను నిరోధించి నిర్మూలించగల శస్త్రాలను రూపొందించగలిగారు. శత్రు దేశాల ఉపగ్రహ వ్యవస్థలను సైతం నిర్మూలించగల ‘అంతరిక్ష యుద్ధ’-స్టార్‌వార్- క్షిపణులను సైతం మనం రూపొందించగలిగాము. అంతరిక్ష పరిశోధన రంగంలోను, ఆర్థిక, వ్యవసాయ, సమాచార సాంకేతిక రంగాలలోను మనం తథాకథిత- సోకాల్డ్- సంపన్న దేశాలతో పోటీపడుతున్నాము అయినప్పటికీ రక్షణ అవసరాల కోసం మనం ఇప్పటికీ ఇతర దేశాలపై ఎందుకు ఆధారపడవలసి వస్తోంది..?