సంపాదకీయం

కొత్త సచివాలయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ భవనాలను ఉన్నచోటనే పునర్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం విచిత్రమైన పరిణామం.. రాజధాని మహానగరం నడిబొడ్డున- కోర్ ఏరియా- వెలసి ఉన్న రాష్ట్ర సచివాలయం దశాబ్దుల తరబడి ‘‘కేంద్రీకరణ’’కు దోహదం చేసింది. ఈ కేంద్రీకరణ వల్ల లకడీకాపూల్, ఖైరతాబాద్, టాంక్‌బండ్, బషీర్‌బాగ్, నాంపల్లి వంటి నడిబొడ్డు ప్రాంతాలలో రాకపోకల రద్దీ పెరగడం, రాకపోకలు స్తంభించిపోవడం వంటివి నిరంతర నిత్య దృశ్యాలు. అందువల్ల ప్రభుత్వ సచివాలయ - సెక్రటేరియట్- భవన సముదాయ ప్రాంగణాన్ని ప్రస్తుతం ఉన్నచోట నుంచి మరోచోటికి తరలించనున్నట్టు- అంటే వేఱు ప్రదేశంలో నిర్మించనున్నట్టు- తెలంగాణ ప్రభుత్వం దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రకటించినప్పుడు జనం సంతోషించారు. సచివాలయం, దానితోపాటు ‘శాసనసభ’ నడిబొడ్డు ప్రాంతం నుంచి తరలిపోవడంవల్ల ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పలుచబడి కాలుష్యం తగ్గిపోతుందన్నది వ్యక్తమైన ఆశాభావం! టాంక్‌బండ్- వినాయక్‌సాగర్- హుస్సేన్‌సాగర్- మురికినీటి కుంటగా మారి ఉండడం ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ నాటి వారసత్వం. ఈ ‘జలాశయం’ పరిశుభ్రమైన మంచినీటి చెఱువుగా అవతరించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ జలాశయాన్ని, రాజధాని ప్రాంగణంలోని అనేక జలాశయాలను- పూడిపోయి స్థిరాస్తుల ప్రాంగణాలుగా మారి భవన సముదాయాలుగా వెలసి ఉన్న భూతపూర్వ జలాశయాలు కాక మిగిలి ఉన్న మురుగునీటి మడుగులను- గోదావరి జలాలతో నింపగలిగినట్టయితే అది ‘స్వచ్ఛ భాగ్యనగర’ పునరవతరణకు దోహదం చేయవచ్చు. ‘భగీరథ’ ఉద్యమంలో భాగంగా రాజధాని శివారు ప్రాంతంలో అనేక జలాశయాలను నిర్మించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించి ఉంది. కొత్త గుడిని నిర్మించడం కంటె పాడుపడిన గుడులను పునరుద్ధరించడం సనాతనమైన శుభ కార్యక్రమం.! ఈ సూత్రాన్ని పవిత్రవంతమైన నీటికి కూడ వర్తింపచేయడం సంప్రదాయం. అందువల్లనే కొత్త బావిని తవ్వడం కంటె పాత బావికి ‘పూడు’తీయడం - లోతు చేయడం గ్రామీణులకు తెలిసిన చరిత్ర! ఈ చరిత్రకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ‘కాకతీయ’ ఉద్యమంలో భాగంగా రాష్టమ్రంతటా వేలాది పాడుపడిన చెఱువుల మరమ్మతునకు పూనుకొని ఉంది. ఈ చెఱువులను నింపినట్టుగానే రాజధాని నడిబొడ్డున, రాజధాని ప్రాంగణంలోను ఉన్న చెఱువులను స్నాన యోగ్యమైన, పానయోగ్యమైన నీటితో నింపగలిగితే స్వచ్ఛ హైదరాబాద్ ఏర్పడుతుంది. అందువల్ల హుస్సేన్‌సాగర్‌ను మంచినీటి మయం చేయడం, సచివాలయాన్ని ఉన్నచోట నుంచి తరలించడం వంటి చర్యలవల్ల ఈ నడిబొడ్డు ప్రాంతం కాలుష్యం నుండి భయంకరమైన రద్దీనుంచి విముక్తం కాగలదు... కానీ ఉన్నచోటనే మళ్లీ సచివాలయ భవనాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం వారు నిర్ణయించడం ఈ ‘స్వచ్ఛ’ ఆకాంక్షలను అడియాసలుగా మార్చింది. ప్రభుత్వం పునరాలోచించడం కాలుష్య నిర్మూలనకు దోహదకరం కాగలదు.
సికిందరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లకు పైగా చెప్పిన మాట. ఈ స్థలాన్ని తమకు అప్పగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులను చేసింది. రక్షణ మంత్రిత్వశాఖకు, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య సంప్రతింపులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ స్థలాన్ని తమకు అప్పగించడానికి రక్షణ మంత్రిత్వశాఖ అంగీకరించినట్టు కూడ తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రాంతం కంటె మరింత జన సమ్మర్దం, వాహనాల రాకపోకల రద్దీ ఉన్న ఈ రక్షణ మంత్రిత్వ శాఖ స్థలంలో సచివాలయ ప్రాంగణాన్ని ఊహించుకున్న జనం బెంబేలెత్తిపోయారు. ఆ తరువాత, రక్షణ మంత్రిత్వశాఖ వారు విధించిన భూమి వినిమయ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించవలసి ఉందని ఉన్నత న్యాయస్థానంలో వెల్లడైంది. రక్షణమంత్రిత్వశాఖకు తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య సికిందరాబాద్ ప్రాంతంలోని ఈ ‘స్థలం’ గురించి అంగీకారం కుదరలేదన్నది మంగళవారం తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల విదితమైంది. సికిందరాబాద్‌లోని ఆ స్థలం ఉన్న ప్రాంతంలో కాలుష్యాన్ని, రాకపోకల స్తంభనను పెంచగల సచివాలయం నిర్మాణం అక్కడ జరగడం లేదు. ఇది శుభ సూచకం, పర్యావరణ పరిరక్షణకరం. కానీ ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి ‘సచివాలయం’ వేరేచోటికి తరలిపోతుందని, ఈ ప్రాంతంలో జన సమ్మర్ధం తగ్గుతుందని, వాహనాలు క్రిక్కిరిసిపోయి కాలుష్యాన్ని విస్తరింపచేసే ప్రమాదం తప్పిపోతుందని భావించిన వారికి గొప్ప నిరాశ ఎదురైంది. సచివాలయం అక్కడ నుంచి తరలిపోతే ఈ ప్రాంగణం ‘హరిత ప్రాంగణం’గా ఏర్పడవచ్చు!
‘‘అదిగో ఇదిగో..’’అని అంటూనే ఐదేళ్లు గడిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించదలచిన సచివాలయ స్వరూపం నమూనా ఆవిష్కృతం కాలేదు. దేశంలోని పలుచోట్ల అధ్యయనం చేసి సచివాలయం ‘నమూనా’ను ‘పరిమాణాన్ని’ నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ధారించడం ముదావహం! ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు గడిచినప్పటికీ కొత్తగా శాశ్వత రాజధాని ఏర్పడకపోవడం సమాంతర వైపరీత్యం. అందువల్ల ఐదేళ్లు వేచి ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరో ఒకటి రెండేళ్లు వేచి ఉండవలసి వచ్చినప్పటికీ ముప్పులేదు. కానీ జంటనగరాల హరిత శాఖలను స్వచ్ఛతను పునరుద్ధరించడానికి వీలుగా నూతన సచివాలయాన్ని నిర్మించడం గురించి ప్రభుత్వం యోచించాలి. జన సమ్మర్దం, కాలుష్యం, ఇరుకుదారులు, వాహనాల రద్దీ కల ‘కటక’ మహానగరం ఒడిస్సా రాష్ట్రానికి ఒకప్పటి రాజధాని. ఈ వైపరీత్యం నుండి తప్పించుకొనడానికై ఒరిస్సా ప్రభుత్వం కటకానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్‌లో కొత్త రాజధానిని నిర్మించుకొనడం చరిత్ర. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేయదలచిన తెలంగాణ ప్రభుత్వం వారు ఈ విషయాన్ని అధ్యయనం చేయవచ్చు! జంటనగరాల శివారునకు కొంత దూరంగా సచివాలయాన్ని, విధాన మండలి- శాసనసభ, శాసనమండలి- భవన ప్రాంగణాన్ని నిర్మించడం వల్ల కాలుష్యం వికేంద్రీకృతం కాగలదు. ప్రస్తుతం ‘ఉన్నత న్యాయస్థానం’ భవన సముదాయం చుట్టూ ఇరుకు రహదారులు ఏర్పడి ఉన్నాయి. భవనం వెనక మూసీ మురుగు ముంచెత్తుతూ ఉంది. ముప్పయి నలబయి ఏళ్లక్రితం ‘ఉన్నత న్యాయస్థానం’ భవనాల చుట్టూ సువిశాలమైన ఖాళీ స్థలం ఉండేది. ముందు ఉన్న ఖాళీ స్థలంలో భవనాలు నిర్మించడం వల్ల భవన ప్రాంగణ సౌందర్యం చెడిపోయి ఉంది. ప్రాంగణం ఇరుకయిపోయి ఉంది. అందువల్ల నగర శివారునకు దూరంగా సచివాలయం, విధానమండలి, ఉన్నత న్యాయస్థానం భవనాలను నిర్మించడంవల్ల నగరం ‘నడిబొడ్డు’ ప్రాంతం ఊపిరి పీల్చుకోగలదు. ఇలా మూడు రాజ్యాంగ విభాగాల కార్యాలయాలను వాటికి అవసరమైన అనుబంధ వౌలిక సదుపాయాలను ఒకేచోట నిర్మించడం వల్ల అది ఒక ‘పట్టణ వాటిక’ లేదా ‘ఉపగ్రహ నగరం’గా విస్తరించవచ్చు.
అందువల్ల భువనగిరి సమీపంలోనో షాద్‌నగర్‌కూ షంషాబాద్‌కూ మధ్యలోనో, చేవెళ్ల సమీపంలోనో లేదా మేడ్చెల్‌కు ఉత్తరంగానో ఈ పాలనా పట్టణ వాటికను ఏర్పాటు చేయవచ్చు. మంత్రులకు న్యాయమూర్తులకు అధికారులకు సిబ్బందికీ అక్కడనే నివాస గృహాలను నిర్మించవచ్చు. దీనివల్ల జంటనగరాలలో అనేకచోట్ల భవనాలు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోను, ఇతర ఖాళీ స్థలాలలోను మామిడి నేరేడు వేప మఱ్ఱి రావి వంటి సంప్రదాయ వృక్షాలను పెంచడంవల్ల హరిత శోభలు విస్తారిస్తాయి. కోతులకు చెట్లమీద తిండి దొరకడం వల్ల అవి ఇళ్లలోకి చొఱబడే ప్రమాదాలు తగ్గుతాయి.. విజ్ఞత వికసించుగాక!