సంపాదకీయం

‘నిర్వాహక’ వైచిత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్ ప్రకాశ్ నడ్డా భారతీయ జనతాపార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడుగా నియుక్తుడు కావడం విలక్షణ పరిణామం. ఈ విలక్షణ వైచిత్రి ముప్పయి తొమ్మిదేళ్ల ‘భాజపా’ చరిత్రలో గతంలో సంభవించలేదు. మొదటిసారిగా సంభవించింది కనుక విలక్షణమైనది. ‘భాజపా’లో కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కూడ- అధ్యక్ష పదవితోపాటు- ఉందన్న విషయం తెలియని ‘అనభిజ్ఞుల’కు ఇది విచిత్రం. అందువల్లనే నడ్డా ఎంపిక విలక్షణ వైచిత్రి! ‘భాజపా’ ఇతర రాజకీయ పక్షాల కంటె ‘విలక్షణ’- డిస్టింక్ట్-మైనది. పార్టీకి ఈ ‘విలక్షణత’ను కలిగిస్తున్న విశేషణాలలో ప్రధానమైనది సంస్థాగత ప్రజాస్వామ్యం! వ్యక్తుల కంటె సిద్ధాంతానికి, విధానానికి, కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండడం పార్టీకి విలక్షణతను కలిగిస్తున్న మరో అంశం! సంస్థాగత నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కార్యనిర్వాహక అధ్యక్షుని నియామకం జరిగిందని భావించడం సతార్కికం! ఇన్నాళ్లుగా కార్యనిర్వాహక అధ్యక్షుని నియుక్తి ఎందుకని జరుగలేదన్నది ప్రశ్న. అలాంటి అవసరం రాలేదు కనుక కార్యనిర్వాహక అధ్యక్షుని నియామకం జరుగలేదన్నది బహుశా సమాధానం కావచ్చు! సంస్థాగత నిబంధనావళి- పార్టీ కాన్‌స్టిట్యూషన్- లోని ఫలానా క్రమసంఖ్య కల నిబంధన మేరకు ‘కార్యనిర్వాహక’ అధ్యక్షుడిని నియమించినట్టు భాజపా పార్లమెంటరీ బోర్డువారు స్పష్టం చేసి ఉండినట్టయితే అర్థం చేసుకోగల వారికి మరింత సౌలభ్యంగా ఉండేది. ఇలాంటి నిబంధన పార్టీ అవతరించిన నాటి నుంచి ఉందా? లేక మధ్యమధ్యలో జరిగిన సవరణల సందర్భంగా ఇది చోటుచేసుకుందా? అన్నది కూడ ‘పార్లమెంటరీ బోర్డు’వారి వివరణకు యోగ్యమైన ప్రశ్న. సంస్థాగత నిబంధనావళిని సోమవారం సవరించారా? సవరించిన తరువాతనే నడ్డాను నిర్వాహక అధ్యక్షుడుగా నియమించారా? అన్నవి కూడ ‘జిగీషువుల’ మనస్సులలో మెదలుతున్న ప్రశ్నలు! కాంగ్రెస్ వంటి ఏక వ్యక్తి నిర్దేశిత రాజకీయ పక్షాలలో ఇలాంటి ‘వైచిత్రి’ సంభవించినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. అందువల్ల ఇందిరాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ‘వ్యక్తి ఆరాధన’- పర్సనాలిటీ కల్ట్- పరాకాష్ఠకు చేరింది. రాజకీయ పక్షాలలో ఇలాంటి వ్యక్తి పూజలు పనికిరావన్నది ప్రజాస్వామ్య ఆదర్శం. అందువల్లనే ‘భాజపా’లోను, ‘భాజపా’ నిర్వహించే సభలలోను వ్యక్తులకు కాక ‘భారతమాత’కు జయనాదాలు చేయడం సంప్రదాయమైంది. ఇలాంటి విలక్షణ భాజపా అధికార పక్షంగా కొనసాగుతుండడం వల్ల ఈ ‘భారతమాతకు జయకారం చేసే పద్ధతి’ని ఇతర పక్షాలు సైతం స్వీకరించగల అవకాశం ఉంది. ద్వాపర యుగంలో యదుకుల కృష్ణుడు కురుకుల అర్జునునికి బోధించినట్టు ‘శ్రేష్ఠుడు ఆచరించిన దానిని ఇతరులు ఆచరిస్తారు. అతడు ప్రమాణంగా స్వీకరించిన దానిని లోకము కూడ అనుసరిస్తుంది..-‘యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనాః, సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే..!’
ఇతర రాజకీయ పక్షాలలో పదవులకు సంబంధించిన కచ్చితమైన నిబంధనలు లేకపోవడం గురించి కాని, హఠాత్తుగా కొత్త నిబంధనలు అవతరించడం గురించి కాని జనానికి ధ్యాస లేదు, ఆయా పక్షాల కార్యకర్తలు అసలే పట్టించుకోరు. ‘్భజపా’ గురించి జనం పట్టించుకుంటున్నారు, ప్రజాస్వామ్యప్రియులు మరింతగా పట్టించుకుంటున్నారు! ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా ఉండిన సమయంలో అర్జున్‌సింగ్ కొన్నాళ్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా పనిచేసినట్టు చరిత్ర... కాంగ్రెస్‌లో ‘జనరల్ సెక్రటరీలు’ - ప్రధాన కార్యదర్శులున్నారు. 1979లో అప్పటివరకు జనతాపార్టీలో ఉండిన హేమవతీ నందన బహుగుణ అనే రాజకీయవేత్త ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌లో చేరిపోయాడు. ఈ బహుగుణ 1977కు ముందు కాంగ్రెస్‌లో ఉండినట్టు చరిత్ర.. మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిత్వంలో జనతాపార్టీ ప్రభుత్వంలో పనిచేసిన బహుగుణ 1979లో కాంగ్రెస్‌లో పునఃప్రవేశం చేశాడు. ఇందిరాగాంధీ ఆయనను కాంగ్రెస్‌కు ‘మహోన్నత కార్యదర్శి’- సెక్రటరీ జనరల్-గా నియమించిందట. ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలోను, రాజీవ్ గాంధీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోను కాంగ్రెస్‌కు కమలాపతి త్రిపాఠీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా 1980వ దశకంలో కొనే్నళ్లు ఉన్నాడు. రాజీవ్ గాంధీ ఆ వృద్ధనేతను- ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ‘‘పనిలేని అధ్యక్షుడు’’- నో వర్క్ ప్రెసిడెంట్- అని బహిరంగంగా యద్దేవా చేయడం కూడ చరిత్ర విదితం... రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి ఇలా పార్టీకి చెందిన వరిష్ఠుల -సీనియర్‌ల-ను అవమానించడం ప్రవృత్తి! ఒకే వ్యక్తి పార్టీ పదవులలోను ప్రభుత్వ పదవులలోను ఒకేసారి కొనసాగరాదన్నది మన దేశంలోను ఇతర కొన్ని ప్రజాస్వామ్య దేశాలలోను ఉన్న ‘అలిఖిత’ ప్రజాస్వామ్య సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ‘భాజపా’యేతర పక్షాలవారు పాటించకపోవడం కూడ నడచిపోతున్న వైపరీత్యం.....
ప్రజలు కాంగ్రెస్‌లోని, ఇతర పక్షాలలోని ఈ వైపరీత్యాలను పట్టించుకోవడం మానేశారు. నల్లరంగుపై ఎంత నల్లదనం వచ్చి పడినప్పటికీ మరకలు కనిపించవు. కానీ ‘తెల్లరంగు’-విలక్షణ పక్షం-గా వినుతికెక్కిన ‘భాజపా’పై చిన్న మరకపడినప్పటికీ అది పెద్దగా కనిపించడం సహజం! అందువల్ల సంస్థాగత ప్రజాస్వామ్య నియమాలను తాము పాటిస్తున్నట్టు ‘భాజపా’ అధిష్ఠానం వారు స్పష్టంచేయవలసిన అవసరం ఉంది. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద రాజకీయ పక్షం అయినందున ‘భాజపా’ సంస్థాగత ప్రవర్తన ఒక ఆదర్శవంతమైన, ఇతర పక్షాలు అనుసరించదగిన ‘నమూనా’కావాలి! అందువల్ల ఇప్పుడు నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమించడానికి, అమిత్‌షాకు అటు ప్రభుత్వ పదవినీ ఇటు పార్టీ పదవినీ కూడ అప్పగించడానికి దారితీసిన ‘నియమ ఔచిత్యం’గురించి ‘భాజపా’ పార్లమెంటరీ బోర్డువారు వివరించాలి! అమిత్‌షా దేశ వ్యవహారాల మంత్రిగా ‘పదోన్నతి’ని పొందినందున ఆయన రెండు పదవుల బాధ్యతలనూ నిర్వహించలేకపోతున్నాడట! అందువల్ల ఆయనకు సహకరించడానికి వీలుగా జగత్ ప్రకాశ్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియమించారన్నది కొనసాగుతున్న ప్రచారం. అమిత్‌షాకు రెండు పదవీ బాధ్యతలు ఏర్పడడమే నడ్డా నియామకానికి ఏకైక కారణం. కానీ అమిత్ రెండు పదవులను ఎందుకు నిర్వహించాలి? అన్నది మరింత వౌలికమైన ప్రశ్న. గతంలో 1998లో అప్పటి ‘భాజపా’అధ్యక్షుడు లాల్‌కృష్ణ అద్వానీ దేశ వ్యవహారాల మంత్రి పదవిని చేపట్టాడు, అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వంలో చేరాడు. అందువల్ల ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాడు. 1991 లోక్‌సభ ఎన్నికల తరువాత అద్వానీ ‘భాజపా’‘పార్లమెంటరీ పార్టీ’ నాయకుడిగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ సమయంలో మురళీమనోహర్ జోషి పార్టీ అధ్యక్షుడు. జోషి పదవీకాలం ముగిసిన తరువాత అద్వానీ మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. వెంటనే అద్వానీ పార్టీ పార్లమెంటరీ నాయకత్వానికి రాజీనామా చేశాడు, వాజ్‌పేయిని పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఎన్నుకున్నారు. ఒకరే రెండు పదవులను స్వీకరింపరాదన్నది సంప్రదాయం. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ వ్యవహారాల మంత్రిగా చేరిన రాజ్‌నాథ్‌సింగ్ కూడ అప్పటి తన అధ్యక్ష పదవిని పరిత్యజించాడు, అమిత్‌షా అధ్యక్షుడయ్యాడు. ఇదే సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం అమిత్‌షా పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలి...
అమిత్‌షా రెండు పదవులను నిర్వహించడం ఎందుకు? నడ్డాకు కొత్త పదవి ఎందుకు?? అమిత్‌షా వైదొలగి, నడ్డాను తాత్కాలిక అధ్యక్షునిగా నియమించవచ్చు. ఆయన అధ్యక్షతన విలంబం లేకుండా సంస్థాగతమైన ఎన్నికలను పూర్తిచేసి కొత్త అధ్యక్షుని ఎన్నుకోవచ్చు. ఇప్పటికే సంస్థాగత ప్రజాస్వామ్య ప్రక్రియ ఏడాదిపాటు వాయిదాపడి ఉంది. నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగాకాక ‘ఎన్నికల’ ప్రక్రియ పూర్తయ్యేవరకు తాత్కాలిక అధ్యక్షునిగా పనిచేయనివ్వవచ్చు.. విజ్ఞులు ఆలోచించాలి!