సంపాదకీయం

వైరుధ్య పునరావృత్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకారాత్మక-నెగిటివ్-ప్రాతిపదికపై ఏర్పడే ప్రతిదీ ఎప్పుడో అప్పుడు విచ్ఛిన్నం కాక తప్పదన్న వాస్తవానికి ఇది మరో ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని ‘బహుజన సమాజ్ పార్టీ’-బసపా-కి మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆధ్వర్యంలోని ‘సమాజ్‌వాదీ పార్టీ’-సపా-కీ మధ్య గత ఏడాది మార్చినుంచి కొనసాగిన ‘మైత్రి’ పరిసమాప్తం కావడం ఇందుకు సరికొత్త ధ్రువీకరణ. దాదాపు రెండు దశాబ్దులపాటు ఉత్తరప్రదేశ్‌లో భయంకరంగా కలహించిన ఈ ఉభయ పక్షాలు గత ఏడాది అకస్మాత్తుగా ఏకం కావడం విచిత్ర రాజకీయ పరిణామం. గత ఏడాది మార్చిలో జరిగిన రెండు లోక్‌సభ ఉపఎన్నికలలో ‘స.పా’, ‘బ.స.పా’కూటమి భారతీయ జనతాపార్టీని ఓడించడం ఆ మైత్రి ఫలితం. ఉప ఎన్నిక జరిగిన గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అనేకసార్లు ఎన్నికయ్యాడు. 2014లో సైతం మూడు లక్షల పదమూడు వేల వోట్ల ఆధిక్యంతో ఆయన ‘సపా’ అభ్యర్థిని ఓడించగలిగాడు. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఆదిత్యనాథ్ యోగి లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశాడు. 2018 మార్చిలో జరిగిన ఉప ఎన్నికలో గోరఖ్‌పూర్ స్థానంలో ఇరవై రెండు వేల వోట్ల ఆధిక్యంతో ‘సపా’, ‘బసపా’ కూటమి అభ్యర్థి గెలుపొందాడు. ఇరవై తొమ్మిది ఏళ్ల తరువాత ‘భాజపా’ ఓడింది. 2014లో ‘భాజపా’ నాయకుడు కేశవప్రసాద్ వౌర్య మూ డు లక్షల తొమ్మిది వేలకు పైగా వోట్ల ఆధిక్యంతో గెలిచిన ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని సైతం ‘సపా’, ‘బసపా’ కూటమి 2018నాటి ఉప ఎన్నికలో అరవై వేల వోట్ల ఆధిక్యంతో కైవసం చేసుకుంది. 2018వరకు బద్ధ విరోధులైన ‘సపా’, ‘బసపా’ నాటి ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత అకస్మాత్తుగా జట్టుకట్టడం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో సంభ్రమాశ్చర్య సంచలనం! ‘బస పా’, ‘సపా’ విడివిడిగా పోటీ చేయడం వల్లనే 2014నాటి లోక్‌సభ ఎన్నికలలోను, 2017నాటి శాసనసభ ఎన్నికలలోను ‘భాజపా’ ఘన విజయాలను సాధించగలిగిందన్న ‘సిద్ధాంతం’ ప్రచారమైంది. ‘బసపా’, ‘సపా’ ఒకే జట్టుగా తలపడినట్టయితే యూపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో భాజపా ఘోర పరాజయం పాలుకాక తప్పదని విశే్లషకులు, వ్యాఖ్యాతలు, రాజకీయ జ్యోతిషవేత్తలు ‘‘తాన తందాన, తందాన తాన..’’లు పాడారు. అందువల్ల ‘బసపా’, ‘సపా’లు జట్టుకట్టి అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలన్న వ్యూహం సిద్ధమైంది. 2014లో మొత్తం ఎనబయి లోక్‌సభ స్థానాలలోను డెబ్బయి మూడు గెలిచిన ‘్భజపా’కు 2019 ఎన్నికలలో ఇరవై ఆరు మాత్రమే వస్తాయని ముప్పయికి మించి రావని ‘అధ్యయన’ ఆవిష్కరణలు జరిగిపోయాయి. ఇలా ఉత్తరప్రదేశ్‌లో దాదాపు నలబయి స్థానాలను- 2014లో గెలిచిన వాటిలో ‘భాజపా’ కోల్పోయినట్టయితే లోక్‌సభలో ‘్భజపా’కు ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ రాదన్నది జరిగిన నిర్ధారణ. ‘బసపా’, ‘సపా’ల కలయికతో ‘మహా గటబంధన్’ ఏర్పడడానికి ఇదీ నేపథ్యం. మాయావతిని అఖిలేశ్‌యాదవ్ ‘మేనత్త’- బూవా- బూ ఆ’-గా సంబోధించడానికి ఇదీ నేపథ్యం, ‘అక్కయ్య’గా సంభావించడానికి ఇదీ పూర్వ రంగం! ‘్భజపా’ కూటమి ఓడిన పక్షంలో మాయావతిని ప్రధానమంత్రిని చేయడానికి సైతం అఖిలేశ్ రంగాన్ని సిద్ధం చేశాడు! కానీ అంచనాలు తప్పిపోయాయి. మాయావతి బృందానికీ, అఖిలేశ్ బృందానికి మధ్య రెండు దశాబ్దుల పూర్వం వైరుధ్యాలు మళ్లీ వికృతంగా నిక్కి చూస్తున్నాయి.
గత సంవత్సరం ఉభయ పక్షాలు- సమాజ్‌వాదీ, బహుజన సమాజ్- జట్టుకట్టడం కృతకమైన మైత్రి, కృత్రిమ సౌహార్దం. బహుజన, సమాజ్‌వాదీల మధ్య మాత్రమే కాదు, అనేక పక్షాల మధ్య పొత్తులు ఏర్పడుతుండడానికి, వెంటనే ఆయా పక్షాల మధ్య మైత్రి విచ్ఛిన్నం అవుతుండడానికి కారణం నకారాత్మకమైన- నెగిటివ్- విధానాలు! తమ పక్షం కాని, తమ కూటమి కాని ఎన్నికలలో సంఖ్యాధిక్యం- మెజారిటీ సీట్లు- సాధించాలన్న లక్ష్యంతో కూటమిని ఏర్పాటుచేయడం సకారాత్మక- పాజిటివ్- విధానం. కానీ అధికారంలో ఉన్న పక్షాన్ని గద్దెదింపడం చరమ లక్ష్యంగా కూటమిని ఏర్పాటుచేయడం నకారాత్మక విధానం. అధికార పక్షం ఓడిన తరువాత ప్రత్యామ్నాయం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం అప్పుడు తమ కూటమివారు ఇతర మిత్రపక్షాలను కలుపుకొని కొత్త కూటమిని ఏర్పాటుచేయడం! ఈ ఎన్నికలలో మాత్రమేకాదు గతంలో జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికలలోను జనం ఈ ‘నకారాత్మక’ వ్యూహాన్ని తిరస్కరించారు. అధికార పక్షం కంటె మెరుగైన పాలనను ఏర్పరచగల ప్రతిపక్ష కూటమి అవతరించినట్టు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ‘మతప్రదాతలు’- వోటర్లు- మార్పును నిర్ణయించారు. ‘ప్రత్యామ్నాయం’ ఉందని తెలిసినప్పుడు మాత్రమే ఎవరైనా తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. మరో ఇంటిలో చేరడానికి అవకాశం ఉందన్న విశ్వాసం కుదిరినప్పుడే ఎవరైనా తాము ఉన్న ఇంటిని వదలి పెడతారు. రాజకీయ పక్షాలు ‘వోటరు’లకు ఇలాంటి విశ్వాసం కలిగించడం సకారాత్మక- పాజిటివ్ - వ్యూహం! ‘‘ఉన్న చెట్టును కొట్టివేద్దాం, నీడ కోసం మరో చెట్టును ఏర్పాటుచేసే సంగతిని, అనే్వషించడాన్ని ఆ తరువాత నిర్ధారిస్తాము’’-అన్నది నకారాత్మకం!
అందువల్లన ఉత్తరప్రదేశ్‌లో ‘సపా’, ‘బసపా’ల ‘మహా గటబంధన్’ కుప్పకూలింది. ఘోరంగా ఓడింది. ‘భాజపా’కు లభించే వోట్లకంటె ‘సపా’కు, ‘బసపా’కు విడివిడిగా లభించే ‘వోట్లు’ తక్కువ. రెండు ‘పార్టీ’లు కలిసినట్టయితే ‘కూటమి’ వోట్లు ‘్భజపా’కంటె ఎక్కువ అవుతాయన్న ‘లెక్కలు’ బెడిసికొట్టాయి. ఇందుకు కారణం ‘సపా’ ‘బసపా’ల కార్యకర్తల మధ్య ఈ పక్షాలకు వోట్లువేసే ‘మత ప్రదాత’ల మధ్య సహజంగా ఏర్పడి ఉన్న ప్రయోజన వైరుధ్యాలు, స్వభావ వైపరీత్యాలు. ఈ వైరుధ్యాలు రెండు దశాబ్దుల నాటివి! అందువల్లనే ఉభయ పార్టీల నేతలు కరచాలనాలు, ఆలింగనాలు చేసుకున్నప్పటికీ, ఒకే వేదికపై నిలబడి ‘ఊదరగొట్టి’నప్పటికీ కింది స్థాయిలో ఉభయ పక్షాల కార్యకర్తలు, మతప్రదాతలు కలసిపోలేదు. ‘సపా’ అభ్యర్థి లేనిచోట ‘సపా’కార్యకర్తలు, వోటరులు ‘బసపా’ అభ్యర్థులకు కాక భారతీయ జనతాపార్టీకి ‘వోట్లు’వేశారు! ఇలా జరుగుతుందని ముందుగానే ప్రచారమైంది. కానీ తమ పార్టీ అభ్యర్థి లేనిచోట్ల ‘బసపా’ కార్యకర్తలు, మత ప్రదాతలు తప్పకుండా ‘సపా’కు వోట్లు వేస్తారన్నది వ్యక్తమయిన విశ్వాసం. కానీ వారు కూడ ‘్భజపా’కే వోట్లువేసినట్టు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ధ్రువపడింది. ఇలా ‘కార్యకర్తలు’ ఈ ‘పక్షాల’ మత ప్రదాతలు పరస్పరం గాఢంగా విరోధిస్తున్న వాస్తవాన్ని గుర్తించకపోవడం, వారికి చెప్పి, ఒప్పించలేకపోవడం మాయావతి వ్యూహాత్మక పరాజయం, అఖిలేశ్‌కు వ్యూహాత్మక పరాభవం. పరాజయ ప్రభావంతో మాయావతికి తమ పూర్వ వైరుధ్యాలు గుర్తుకువచ్చాయి. ‘భాజపా’ పరాజయం, తనకు ప్రధాని పదవి సంభవం కాకపోవడం- దీనికి కారణం ‘సపా’కార్యకర్తలు, మత ప్రదాతలన్నది మాయావతికి స్ఫురించిన వాస్తవం!
ఉమ్మడి శత్రువునుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఉమ్మడి విపత్తు ఎదురయినప్పుడు అంతవరకు పరస్పరం కలహించినవారు మిత్రులయిపోతారు. ఉమ్మడి శత్రువు భయం తీరగానే మళ్లీ ఈ కృత్రిమ మిత్రులు పరస్పరం శత్రువులైపోతారన్నది రెండువేల వంద సంవత్సరాలకు పూర్వం, క్రీస్తుపూర్వం ఒకటవ దశాబ్దిలో జీవించిన మహాకవి కాళిదాసు తన ‘ఋతు సంహారమ్’ అన్న కావ్యంలో చెప్పిన మాట! ‘‘నెమలి పింఛం నీడలో పాము పడుకొని ఉంది, పాము పడగ నీడలో కప్ప విశ్రాంతి తీసుకుంది. తోడేళ్లు కుందేళ్లు ఒకే చెట్టుకిందికి చేరాయి’’ వీటన్నింటికీ ఉమ్మడి శత్రువు గ్రీష్మతాపం- ఎండ వేడిమి! ఈ ‘వేడి’తగ్గగానే ఇవన్నీ మళ్లీ శత్రువులు.. మాయావతికి, అఖిలేశ్‌కూ 2022వరకు ఉమ్మడి శత్రు భయం లేదు!