సంపాదకీయం

జాతీయ నిష్ఠకు జయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య సుప్రభాత
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వజాతీయ స్వాభిమాన
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి జగతి కనులు
‘తూర్పు’వైపు చూస్తున్నవి,
అరుణ తరుణ కిరణమ్ములు
ధరణి చరిత వ్రాస్తున్నవి..
భారతీయ జనతాపార్టీ ‘ప్రతీక’ మాత్రమే.. భారత జాతీయ వౌలిక అస్తిత్వం మరింతగా ప్రస్ఫుటించడం, మరింతగా విస్తరించడం ‘మత ప్రదాతలు’- వోటర్‌లు- సాధించగలిగిన మహా పరిణామ క్రమం. ఈ చారిత్రక పరిణామ పథంలో గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో ప్రగతి పదం.. ‘భారతీయ జనతాపార్టీ’ మాధ్యమం... భారతీయ జన జీవన ప్రవృత్తి ఈ మాధ్యమం ద్వారా మరోసారి సమావిష్కృతం కావడం ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఇతివృత్తం! ఈ ఇతివృత్తం ఐదేళ్ల క్రితం, 2014లో జరిగిన పదహారవ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అంకురించింది. ఈ పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ అంకురాలు మొక్కలుగా మారాయన్న దానికి నిదర్శనాలు! మరికొన్ని దశాబ్దులపాటు భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ ఈ ఇతివృత్తం ప్రాతిపదికగా వికసించడం ఖాయం. ఇది చారిత్రక అవసరం. ఈ ‘ఇతివృత్తం’ ఐదేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ నాయకుడుగా ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో తొలిసారి ప్రవేశించినప్పుడు ప్రస్ఫుటించింది. పార్లమెంటు భవనం గడప వద్ద ఆగిన మోదీ వంగి భూమాతకు నమస్కరించడం ఈ ఇతివృత్త సమావిష్కరణ. ఇదీ క్రీస్తుశకం 1947 నుంచి నడచిన రాజకీయ విధానానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతం! ఈ ప్రత్యామ్నాయ సైద్ధాంతిక భూమికపై జరిగిన ఐదేళ్లపాలన భారత జాతీయ వౌలిక తత్త్వానికి అంతర్గతంగా బలం చేకూర్చింది, అంతర్జాతీయంగా భారత జాతీయ గరిమకు సరికొత్త పరిగణనను తెచ్చిపెట్టింది! ఇదీ ఈ పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో ‘మత ప్రదాతలు’-వోటర్‌లు-‘్భజపా’కు, భాజపా నాయకత్వంలోని ‘జాతీయ ప్రజాస్వామ్య సంఘటన’- నేషనల్ డెమొక్రాటక్ అలియన్స్- ఎన్‌డిఏ-కు ఘన విజయం సమకూర్చడానికి నేపథ్యం. 1947 నుంచి 2014 వరకు రాజకీయాలను, పరిపాలనను నడిపించిన విధానానికి విరుద్ధమైన ఈ ప్రత్యామ్నాయ సైద్ధాంతిక పథంలో దేశం పయనించాలన్నది జనాదేశం! ఈ ఎన్నికలలో లభించిన ‘జనాదేశం’ అందువల్ల 2014 నాటి లోక్‌సభ ఎన్నికల నాటి ప్రజల తీర్పునకు పునరావృత్తం..
రాజకీయమే దేశ ప్రజల సర్వసమగ్ర అస్తిత్వ వికాసానికి ప్రాతిపదిక అన్నది 1947 నుంచి 2014 వరకు కొనసాగిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని బ్రిటన్ దురాక్రమణదారులు మన నెత్తికెత్తిపోయారు. అందువల్ల రాజకీయమే ‘జాతీయ తత్త్వం’ అన్న భ్రాంతి దేశ ప్రగతి గతిని నిర్దేశించింది. రాజకీయ నాయకులకు జయ జయ నాదాలను పలుకడమే ‘దేశభక్తి’ అన్న భ్రమ వ్యాపించింది. అందువల్ల రాజకీయ నాయకుల ప్రవర్తనను అనుకరించడం ‘జీవన విలాసం- ఫ్యాషన్-గా మారింది. ఈ రాజకీయ నాయకులు ‘ఆదర్శ శృంగాల’ నుంచి దిగజారి అధఃపతనం అయినకొద్దీ ప్రభుత్వాన్ని, పాలనను, సర్వ రంగాలను అవినీతి వ్యాపించింది. దేశ వ్యతిరేకత, అస్తిత్వం పట్ల అవహేళన, సంస్కృతి పట్ల నిరాదరణ, జాతీయ స్వభావం పట్ల ధ్యాసలేనితనం విస్తరించాయి. ఈ భ్రాంతికి, రాజకీయమే జాతీయత అన్న భ్రమకు- ప్రత్యామ్నాయం జాతీయ తత్త్వంలో ‘రాజకీయం’ కేవలం ఒక విభాగం అన్న వాస్తవం! రాజకీయం, రాజ్యాంగం, విజ్ఞానం, విద్యావిధానం, వ్యవసాయం, వాణిజ్యం, అభ్యుదయం, సంక్షేమం, మతాలు, సంప్రదాయాలు, భాషలు, ఇతరేతర అసంఖ్యాక వైవిధ్యాలు ‘జాతీయ తత్త్వం’లోని విభాగాలు మాత్రమేనన్నది అనాదిగా భారతీయ జనజీవన వాస్తవం! ఇదీ 1947నుంచి ‘నడిపించిన’ సిద్ధాంత భ్రాంతికి ప్రత్యామ్నాయంగా 2014లో ప్రస్ఫుటించిన సైద్ధాంతిక వాస్తవం. రాజకీయ నాయకులకు కాక జాతీయ తత్త్వ నిష్ఠకు జనం జయ నాదాలు పలకడం ఈ ఐదేళ్ల చరిత్ర! ‘భారత్ మాతాకీ జయ్’అన్న నినాదం రాజకీయ వేదికలపై మారుమోగడం ఈ ఐదేళ్ల చరిత్ర. ఈ సైద్ధాంతిక ప్రత్యామ్నాయం ‘భాజపా’ మాధ్యమంగా రాజకీయ రంగంలో ప్రస్ఫుటిస్తోంది...
భారతీయ జనతాపార్టీ పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంత ప్రాతిపదికగా జరిగిన ఆవిష్కరణల సమాహారం కారణం. ఐదేళ్ల వివిధ సంక్షేమ పథకాలు, అభ్యుదయ కార్యక్రమాలు ఈ ‘సిద్ధాంత ప్రత్యామ్నాయ’ విస్తరణకు దోహదం చేశాయి. ‘రాజకీయమే’ సర్వసమగ్ర అస్తిత్వం అన్న భ్రాంతి కొనసాగిన కాలంలో కూడ అనేక సంక్షేమ పథకాలు, అభ్యుదయ కార్యక్రమాలు రూపొందాయి. కానీ అవన్నీ అవినీతి ఊబిలో కూరుకొనిపోయాయి, అంకురాలు మొక్కలు కాలేదు. మొక్కలు వికసించలేదు. గత ఐదేళ్లలో వివిధ పథకాల వికాసక్రమానికి ‘భ్రాంతి’నుంచి విముక్తమైన వాస్తవం కారణం. ఆ వాస్తవం జాతీయతత్త్వ నిష్ఠ. అందువల్లనే సంక్షేమ, ప్రగతి పథకాలు అవినీతి ఊబిలో కూరుకొని పోలేదు.. ‘భాజపా’మాధ్యమంగా ఈ ఎన్నికలలో భాసించిన జాతీయ తత్త్వ విజయ పునరావృత్తికి ఇదీ కారణం! పథకాలు అంకురించి వికసించి పుష్పించి పరిమళాలను వెదజల్లుతున్నాయన్నది ఈ ఎన్నికలలో ఇలా ధ్రువపడింది. పరిమళ ఫలాలను చవిచూసిన ‘వోటర్’లు మతప్రదానం చేశారు! కానీ, ఇలా ‘‘ప్రత్యామ్నాయ సిద్ధాంతం’’గా ప్రచారమైన ఈ వాస్తవం నిజానికి ప్రత్యామ్నాయం కాదు, ఇదే తరతరాల యుగాల భారతీయ జీవన వాస్తవం! ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమితల్లి- నేను ఆమె పుత్రికను, నేను ఆమె పుత్రుడను- అన్నది ఈ శాశ్వత- సనాతన- వాస్తవం! ఇదీ జాతీయతత్త్వ నిష్ఠ, జాతీయ నిరంతర వికాసానికి జవం కలిగించిన - కలిగిస్తున్న- జన జీవన జలం.. ‘‘నేను ఈ జాతికి, ఈ దేశానికి ఏమిచేయగలను’’అన్నది జాతీయతత్త్వ నిబద్ధులైన ప్రజల స్వభావం! ఆ ప్రజలు ఇప్పుడిలా తీర్పు చెప్పారు. ఈ నిరంతర జాతీయ వికాసం ‘భాజపా’ మాధ్యమంగా మాత్రమే సాధ్యమన్నది ప్రజల విశ్వాసం. ఈ ఎన్నికల ఫలితాలు ఈ విశ్వాస నిష్ఠకు ప్రజాస్వామ్య దర్పణం....
ప్రజల ఈ జాతీయ విశ్వాస నిష్ఠ నిరంతరం విస్తరిస్తోందన్న వాస్తవానికి ఈ ఎన్నికల ఫలితాలు మరో ధ్రువీకరణ. 2014నాటి ఎన్నికలలో ‘భాజపా’ విజయం ప్రస్ఫుటించని చోట్లకు కూడ ఈ ఎన్నికలలో ఈ ప్రభావం విస్తరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటిచోట్ల ‘భాజపా’కు లోక్‌సభ సభ్యుల సంఖ్య ఈ ఎన్నికలలో పెరగడం ఈ జాతీయతత్త్వ నిష్ఠా ప్రభావ విస్తరణ... ప్రతిపక్షాల ‘మహాఘట బంధన్’లు, ప్రచార ఆర్భాటాలు, అసత్య ఆరోపణలు, ‘ఎన్నికల సాధికార సంఘం’- ఎలక్షన్ కమిషన్-పై విరుచుకొని పడడాలు ఈ ప్రభావ విస్తృతిని నిరోధించలేకపోయాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ వంటిచోట్ల ‘భాజపా’ ప్రత్యర్థులు తుడిచిపెట్టుకొని పోవడం ‘భాజపా’ ద్వారా ప్రస్ఫుటిస్తున్న ‘జాతీయ తత్త్వనిష్ఠ’పట్ల ప్రజల విశ్వాసం మరింత పెరిగిందనడానికి తార్కాణం. ‘భాజపా’ను నిరోధించడం పేరుతో ఈ జాతీయ భావ నిష్ఠను వెక్కిరించినవారు, ధిక్కరించినవారు ఘోర పరాజయం పాలయ్యారు. జాతీయ తత్త్వ నిష్ఠను ‘మతోన్మాదం’గా చిత్రీకరించి చిందులు తొక్కినవారు కుప్పకూలి కూలబడ్డారు. సైనిక దళాల కర్తవ్య దీక్షను, నైతిక నిబద్ధతను అనుమానించి అవమానించినవారు మట్టికరచారు. కృత్రిమ రాద్ధాంత రాజకీయ విదూషకులకు శృంగ భంగం జరిగింది, ఆర్భాటపు అసత్య ప్రచారరంగ భంగం జరిగింది.... ఆంధ్రప్రదేశ్‌లో, కర్నాటకలో, ఉత్తరాది రాష్ట్రాలలో, బెంగాల్‌లో ఈశాన్యంలో ఇలాంటి వారందరినీ పరాజయ పరాభవం ముంచెత్తుతుండడం ఈ ఎన్నికలలో జనాదేశం.. భయంకర బీభత్సకారులకు వ్యితిరేకంగా ‘సాయుధ చికిత్స’ చేసిన ‘భాజపా’ ప్రభుత్వానికి ఈ ‘జనాదేశం’ మరో జయ నాదం! యోగ విద్యకు అంతర్జాతీయ సమ్మాన ముద్రను సాధించగలిగిన ‘భాజపా’కు ఈ ‘జనాదేశం’ మరో ప్రశంసాపత్రం.. అంతర్జాతీయ ‘సౌరశక్తి దేశాల సమాఖ్య’ను మన దేశం నాయకత్వంలో ఏర్పాటుచేయగలిగిన మోదీ దౌత్యనీతికి ఈ ‘జనాదేశం’ సముత్కర్ష సమ్మానం.. ‘‘నిరుపేదల కాళ్లుకడిగిన’’ అభినవ వివేకానంద సంస్ఫూర్తికి ఈ జనాదేశం మరో మంగళకర నీరాజనం....
జన జీవన జల కణాలు
జలజలమని ఉప్పొంగెను,
జాతీయ విరోధ భావ
విషకీలల ముంచెత్తెను..
సకల జనుల ఆదేశం
దిక్కులందు మార్మోగెను,
అఖిల జనాభ్యుదయ ధ్వజం
అంతరిక్షమునకెగసెను...