సంపాదకీయం

పరాజయ స్వరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాన్య ప్రజలకు కలుగుతున్న సందేహం ఇది! ‘ఎన్నికల సాధికార సంఘం’ వారు రాజ్యాంగంలోని, ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోని ‘నియమాల’కు అనుగుణంగా విధులను నిర్వహించాలా? లేక రాజకీయ మహాశయుల ‘నిర్దేశాల’కు అనుగుణంగా విధులను నిర్వహించాలా??- అన్నది జన మానస సీమలలో దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన ఈ ‘మీమాంస’. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఈ ‘మీ మాంస’ కూడ మొదలైపోయింది. అనేక రాజకీయ పక్షాలవారు విజయం కోసం ప్రత్యర్థి పక్షాలతో పోరాడుతున్నారా? లేక ప్రజాస్వామ్య ప్రక్రియకు రాజ్యాంగ మాధ్యమమైన ‘ఎన్నికల సాధికార సంఘం’- ఎలక్షన్ కమిషన్- ఈసీ-తో వారు తలపడుతున్నారా? అన్నది సామాన్య ‘మత ప్రదాత’- వోటర్-లను ఉత్కంఠకు గురిచేసిన మరో మీమాంస. ‘ఎన్నికల సాధికార సంఘం’ రాజ్యాంగ సంస్థ- కాన్‌స్టిట్యూషనల్ ఇన్‌స్టిట్యూషన్-! రాజ్యాంగంలోని మూడువందల ఇరవై నాలుగవ అధికరణం ప్రకారం ‘ఎన్నికల సాధికార సంఘం’ ఏర్పడి ఉంది. మూడువందల ఇరవై ఐదవ అధికరణం నుంచి ఇరవై తొమ్మిదవ అధికరణం వరకుగల రాజ్యాంగ నియమాలలో ఎన్నికల ప్రక్రియను నిర్వచించారు. ఈ రాజ్యాంగ నియమాల మేరకు ‘ప్రజాప్రాతినిధ్యపు చట్టం’- రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్- రూపొందింది. కానీ ‘ఎన్నికల సాధికార సంఘం’వారు ఈ నియమాల- రూల్స్-కు అనుగుణంగాకాక తమ ‘నిర్దేశాల’-రూలింగ్స్-కు అనుగుణంగా విధులను నిర్వహించాలన్న మహదాకాంక్షలను కొన్ని రాజకీయ పక్షాల ప్రముఖులు గత రెండు నెలలుగా ఆవిష్కరిస్తుండడం నడుస్తున్న చరిత్ర! భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘రాజ్యాంగ సంస్థల’ను బలహీనపరచడానికి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందన్నది ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు కొందరు గత ఏడాదిగా చేసిన ఆరోపణ! కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రతిపక్షాల నాయకులు ‘ఎన్నికల సాధికార సంస్థ’- ఈసీ-ని అడుగడుగునా విమర్శిస్తున్నారు. ‘ఈసీ’ కేంద్ర అధికార పక్షం అడుగులకు మడుగులొత్తుతోందన్నది ప్రతిపక్షాల అధినేతలు చేసిన ఆరోపణ. ‘రాజ్యాంగ సంస్థల’ను కేంద్ర ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షం వారు నీరుకార్చడానికి యత్నిస్తోందన్న ఆరోపణ నిజమా? లేక ఒక ‘రాజ్యాంగ సంస్థ’- ఈసీ- కేంద్ర ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షం వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణ నిజమా? ఈ రెండు ఆరోపణలు పరస్పరం విరుద్ధం.. ఒకటి నిజమైతే మరొకటి నిజం కాదు! ఏది నిజం? ఏది కాదు?? - అన్నది ఇలా ఆరోపణ చేసిన రాజకీయ పక్షాల ప్రముఖులు ప్రజలకు వివరించవలసి ఉంది! ఈ లోక్‌సభ ఎన్నికలలో తాము ఓడిపోవడం ఖాయమని స్పష్టం అవుతున్నకొద్దీ ఈ రాజకీయ పక్షాల నేతలలో అసహనం పెరుగుతోంది! ‘అత్త’మీది కోపం ‘దుత్త’మీద చూపినట్టుగా ‘వోటర్’లపై - తమను ఓడించనున్న మత ప్రదాతలపై- తమకు కలిగిన ఆగ్రహాన్ని ఈ రాజకీయ దురంధరులు ‘ఈసీ’పై ‘్భళ్లున’ వెళ్లగక్కుతున్నారు! ముఖ్యమంత్రులు ‘ఈసీ’ కార్యాలయాలలోకి చొరబడి ధర్నాలు చేయడం, ఆ కార్యాలయాల ఎదుట బైఠాయించడం ఈ దురాగ్రహానికి పరాకాష్ఠ!!
ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షాన్ని, ప్రభుత్వ పక్షం వారు ప్రతిపక్షాలను తిట్టడం పరిపాటి అయింది. పరుష పదజాలం, అసభ్య పదజాలం, అశ్లీల పదజాలం, అతార్కిక పదజాలం వరదలెత్తి రాజకీయ క్షేత్రాన్ని ‘బురద’తో నింపేసింది. అందువల్ల ప్రచారపర్వం పరస్పరం దూషణపర్వంగా మారడం ఈ ఎన్నికలలో జనానికి ఆశ్చర్యం కలిగించలేదు. రాజకీయ ప్రమాణాలు దిగజారిపోయినట్టు జనం గతంలోనే గుర్తించారు. తిట్టుకోవడం ముదిరి కొట్టుకోవడం కూడ క్రమానుగతి విపరిణామం- తొండలు ముదిరి ఊసరవెల్లులుగా మారి రాజ్యాంగ ప్రక్రియను వికృతంగా వెక్కిరించిన దృశ్యాలు గత రెండు నెలలుగా ఆవిష్కృతమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ప్రతి ‘దశ’-రౌండ్- ఎన్నికల మత ప్రదానం రక్తసిక్తం కావడం పరాకాష్ఠ. కానీ ఈ రాజకీయ విద్వేషం ‘ఎన్నికల సాధికార సంఘం’ పట్ల వ్యితిరేకతగా మారడం ‘‘ఆడలేనమ్మ మద్దెల’’ను నిందించినట్టయింది! నిజానికి ‘ఎన్నికల సంఘం’ ప్రధాన అధికారి, ప్రాంతీయ ప్రధాన అధికారులు తమ సంస్థ పనితీరును దూషించిన రాజకీయ ప్రముఖుల పట్ల ‘అతి సహనం’ ప్రదర్శించారు. అంతేకాదు, ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి’- మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్-ను నిర్లజ్జగా నిర్భయంగా ఉల్లంఘించిన ప్రభుత్వపక్ష, ప్రతిపక్ష రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమించడానికి సైతం తటపటాయించింది. చర్యలు తీసుకున్నట్టయితే చర్యలకు గురి అయిన రాజకీయవేత్తలు తమ సంస్థను మరింతగా దూషించే ప్రమాదం ఉందన్న భయానికి ‘ఈసీ’ అధికారులు గురిఅయ్యారన్న భావం లేదా భ్రాంతి కూడ వ్యాపించింది. ఈ తటపటాయింపును సర్వోన్నత న్యాయస్థానం వారు తప్పుపట్టిన తరువాత మాత్రమే ‘ప్రవర్తన నియమావళి’ని ఉల్లంఘించిన రాజకీయవేత్తలను శిక్షించే కార్యక్రమానికి ఎన్నికల సాధికార సంఘం వారు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేష పూరిత ప్రసంగాలను చేస్తున్న వారిపై ఎందుకు చర్యలను తీసుకొనడం లేదు? మీకు అధికారం లేదా? అన్న ప్రశ్నలతో సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సాధికార సంఘాన్ని ఏప్రిల్ పదహైదవ తేదీన నిలదీసింది. ఇలా నిలదీయించుకొనే స్థితి ఏర్పడడం ‘ఈసీ’వారి మితిమీరిన సంయమన వైఖరికి నిదర్శనం.
ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారు అధికార పక్షం వారా? విపక్షం వారా? అన్న మీమాంసకు ‘ఎన్నికల సాధికార సంఘం’ వారు గురికావడం- ‘ఈసీ’ నిష్పక్ష వైఖరికి నిదర్శనం, నియమ పాలనకు తార్కాణం! ‘‘విద్వేష ప్రసంగాలను చేసిన’’ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని డెబ్బయి రెండు గంటలపాటు ఎన్నికల ప్రచారం నుంచి బహిష్కరించడం ‘ఈసీ’ నిష్పక్ష వైఖరికి ఒక ఉదాహరణ మాత్రమే. ఏప్రిల్ పదహారవ తేదీనుంచి మూడురోజులు ఆదిత్యనాథ్ యోగి ‘ప్రచారం’ చేయలేకపోయాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ‘బహుజన సమాజ్ పార్టీ’- బసపా- అధినేత్రి మాయావతిని, కేంద్ర మంత్రి మేనకాగాంధీని కూడ నలబయి ఎనిమిది గంటలపాటు ‘ఈసీ’ ప్రచారానికి దూరంగా ఉంచింది. అఝామ్‌ఖాన్ అనే ‘సమాజ్‌వాదీ పార్టీ’- సపా-కి చెందిన అభ్యర్థి కూడా మూడురోజులు ప్రచారంలో పాల్గొనరాదని ‘ఈసీ’ నిర్దేశించింది! ‘ఈసీ’ అధికారపక్షం పట్ల కాని, ప్రతిపక్షాల పట్ల కాని వివక్ష చూపడం లేదన్నది ఒక ఉదాహరణ మాత్రమే. ఒక ముఖ్యమంత్రిని, ఒక కేంద్ర మంత్రిని ఇలా ‘శిక్షించ గలిగిన’ ఎన్నికల సాధికార సంఘం వారిని అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన వారి తీరును ప్రజలు హర్షించలేదు... ఏప్రిల్ పదకొండవ తేదీన తెలుగు రాష్ట్రాలలో ‘ఎన్నికల మత ప్రదానం’- పోలింగ్- జరిగింది. మత ప్రదానం వ్యవధి ముగిసేసరికి ‘వరుసల’-క్యూలైన్స్-లో ఉన్నవారందరికీ ‘వోటు’వేసే అవకాశం ‘ఈసీ’ ఎలాగూ కల్పిస్తుంది, కల్పించింది. కానీ ఈ ‘అవకాశం కల్పించాలని’ మధ్యాహ్నం నుంచీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవేత్తలు ‘ఈసీ’కి విజ్ఞప్తులు చేశారు. తాము చెప్పకపోయినట్టయితే ఎన్నికల అధికారులు ఈ వరుసలలో ఉన్న వారికి ‘వోటు’వేసే అవకాశం కల్పించకుండా వెనక్కి తరిమివేస్తారేమోనన్న భయాందోళనలను ఈ వేత్తలు అభినయించారు! అందువల్ల కొన్ని మత ప్రదాన కేంద్రాలలో రాత్రి పొద్దుపోయేవరకు మతప్రదానం కొనసాగిందట. పగటిపూట కొన్ని గంటలపాటు ఆ కేంద్రాలలో ‘ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు’- ఈవీఎమ్‌లు- పనిచేయకపోవడం వల్ల కొందరు ‘వోటర్’లు తిరిగి వెళ్లారు. ఈ మత ప్రదాతలందరికీ మళ్లీ వోటువేసే అవకాశం కల్పించడం వల్ల ‘పోలింగ్’ ప్రక్రియ రాత్రి పొద్దుపోయేవరకు జరిగిందట! ఇలా ‘అందరికీ వోటు వేసే అవకాశం కల్పించాలని’ పగలంతా ఆర్భాటించిన రాజకీయవేత్తలు, ‘అంత పొద్దుపోయేవరకు ఎందుకని పోలింగ్ నిర్వహించారు?’ అని మరుసటి రోజున ‘ఎన్నికల సంఘం’ అధికారులను నిలదీశారు! ‘ఈసీ’పై రాజకీయవేత్తలు జరుపుతున్న దాడి తీరునకు ఇది మరో మచ్చుతునక!
వోటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయిల్- వివిపాట్-లను యంత్రాలలోని వోట్లుతో సరిపోల్చడం గురించి, సరిపోల్చవలసిన ప్రక్రియ గురించి సర్వోన్నత న్యాయస్థానం రెండుసార్లు సృష్టీకరణ ఇచ్చింది. అయినప్పటికీ ఈ ‘సరిపోల్చడం’ గురించి ‘రగడ’ను కొనసాగిస్తున్న రాజకీయ పక్షాల రాజ్యాంగ నిబద్ధత ఎంత? ఏది గీటురాయి?? ఎవరు రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేయ యత్నిస్తున్నారు?? ఎవరు రాజ్యాంగ ప్రక్రియను రాజకీయం చేశారు??- సమాధానాలు ప్రజలకు తెలుసు. తెలిసిన ప్రజలు తీర్పునిచ్చారు..