సంపాదకీయం

పేట్రేగుతున్న ‘పెద్దన్న’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రదేశాల పట్ల ఆధిపత్య ధోరణి దశాబ్దుల తరబడి అమెరికా విదేశాంగ విధానంలో నిహితమై ఉన్న దౌత్య దౌర్జన్యం. ఈ ‘‘దౌర్జన్యాన్ని’’ మన ప్రభుత్వం రెండు దశాబ్దులకు పైగా సహించవలసి వస్తోంది. ఇరాన్ దేశం నుంచి మన దేశం ఇంధన తైలాన్ని, ఇంధన వాయువులను కొనరాదన్నది మన ప్రభుత్వాన్ని నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం అమలు జరుపుతున్న వ్యూహంలో వర్తమాన ఘట్టం... ‘శాంతి ప్రయోజన అణువిద్యుత్ సహకార అంగీకారం’ పేరుతో 2007వ సంవత్సరం నుంచి అనేక ఏళ్లపాటు అమెరికా ప్రభుత్వం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకొనడానికి ముందు, ఆ తరువాత కూడ మన దేశం అనేక ఇతర దేశాలతో ‘శాంతి ప్రయోజన అణు విద్యుత్ సహకార అంగీకారం’ కుదుర్చుకొంది. ఈ ఒప్పందాలన్నీ ఆర్భాటం లేకుండా ద్వైపాక్షిక స్థాయిలో కుదిరాయి. కానీ అమెరికాతో 2008లో కుదిరిన ఒప్పందం సృష్టించిన అంతర్జాతీయ ఆర్భాటం అంతా ఇంతా కాదు. అమెరికాతో మన ద్వైపాక్షిక అంగీకారానికి ‘అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ’- ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ- ఐఏఇఏ- వారి ధ్రువీకరణ అవసరమైంది. ‘అణ్వస్త్ర పాటవ ప్రయోగ సమగ్ర నిషేధపు ఒప్పందం- కాంప్రహెన్సివ్ టెస్టబాన్ ట్రీటీ- సీటీబీటీ- వ్యవస్థలో మన దేశం చేరని కారణంగా అమెరికాతో మన దేశం ద్వైపాక్షిక అంగీకారం కుదుర్చుకోవడానికి వీలుకాదన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అమెరికా చేయించింది. చివరికి ‘అమెరికా మన దేశం తరఫున గొప్ప కృషిచేసిన కారణంగా’ ‘ఐఏఇఏ’ మన దేశానికి మినహాయింపు ఇచ్చింది. ‘అణు పదార్థ పరిజ్ఞాన పరికరాలు సరఫరా చేస్తున్న దేశాల కూటమి’- న్యూక్లియర్ సప్లయ్యర్స్ గ్రూప్- ఎన్‌ఎస్‌జి-లో మన దేశానికి సభ్యత్వం లేదు కనుక అమెరికాతో మనం ద్వైపాక్షిక అంగీకారం కుదుర్చుకోరాదన్నది జరిగిపోయిన మరో ప్రచారం. దీనికి కూడ ‘మినహాయింపు’ను పొందడానికి అమెరికా చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. ‘ఎన్‌ఎస్‌జి’లోని దాదాపు అన్ని దేశాలూ మినహాయింపును ఇవ్వడానికి ఒప్పుకున్నప్పటికీ ‘ఆస్ట్రియా’వంటి కొన్ని ఐరోపా దేశాలు అంగీకరించలేదు. ఫలితంగా ‘ఏకగ్రీవం’ కుదరక ‘ప్రతిష్టంభం’ ఏర్పడింది. మళ్లీ అమెరికా రంగప్రవేశం చేసి ‘ఆస్ట్రియా’ను ఇతర దేశాలను ఒప్పించింది. ఇలా అడుగడుగునా ఈ ద్వైపాక్షిక అంగీకారంలో అమెరికా ఆధిపత్యం, ఆర్భాటం ఆవిష్కృతమయ్యాయి. ఇతర దేశాలతో మనం కుదుర్చుకున్న ద్వైపాక్షిక అణు సహకార అంగీకారాలకు అవసరం లేని ఈ ‘అంతర్జాతీయ సంస్థల మినహాయింపులు, అనుమతులు’ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందానికి మాత్రం కావలసి వచ్చాయి! ఇదీ ద్వైపాక్షిక మైత్రిలో నిహితమై ఉన్న అమెరికా ఆధిపత్యం! 2008లో ఒప్పందం కుదిరిన తరువాత అమెరికా వల్ల మనకు లభించిన అణుప్రయోజనం ఇంతవరకు సున్న..
ఇప్పుడు ‘అణుపాటవ ప్రయోగ నియమాలను ఉల్లంఘిస్తున్న’ ఇరాన్‌ను శిక్షించే నెపంతో అమెరికా తన మిత్రదేశాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. మన దేశం పట్ల కూడ ఈ ఆధిపత్య ధోరణిని ఏళ్లతరబడి అమెరికా కొనసాగిస్తోంది. ఇరాన్ దశాబ్దుల తరబడి అణ్వస్త్ర రూపకల్పనకు సంబంధించిన పాటవ ప్రయోగాలను జరుపడానికి యత్నిస్తోంది. ఇది బహిరంగ రహస్యం. చైనా నుండి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్ నుంచి ఇరాన్‌కు ఈ ‘అణ్వస్తప్రాటవ పరిజ్ఞానం’ చేరడం కూడ బహిరంగ రహస్యం. కానీ ఇరాన్‌ను శిక్షించవలసింది ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ అణుఇంధన సంస్థ. ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మన ప్రభుత్వం సైతం ఈ ‘ప్రక్రియ’లో భాగస్వామ్యం వహించింది. 2006 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆంక్షలను విధించింది. 2008లో మరోసారి ఐక్యరాజ్యసమితి ఈ ఆంక్షలను ధ్రువీకరించడమేకాక మరిన్ని కోతలను విధించింది. 2005లో మతోన్మాద తీవ్రవాది మహమూద్ అహ్మదీ నీజాద్ ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను ధిక్కరించడం దీనికి నేపథ్యం. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేస్తామని, ‘ప్రపంచ పటంలో ఇజ్రాయిల్‌ను తుడిపివేస్తామని’ అహ్మదీ నీజాద్ పదే పదే ప్రకటించడం చరిత్ర. అహ్మదీ నీజాద్ బీభత్స రాజ్యాంగ వ్యవస్థను నెలకొల్పడం కూడ చరిత్ర. ఈ చరిత్ర 1970వ దశకంలో ఇరాన్‌లో నడచిన బీభత్స అరాజక చరిత్రకు పునరావృత్తి. అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్ధంగా ఇరాన్ ప్రభుత్వం తన రాజధాని టెహరాన్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం సిబ్బందిని నెలల తరబడి నిర్బంధించడంతో 1979లో అంతర్జాతీయ అభిశంసనకు గురి అయింది. ఈ అరాజక, బీభత్స చరిత్రను పునరావృత్తం చేయడానికి అహ్మదీ నీజాద్ ప్రభుత్వం యత్నించింది. 2013లో హాసన్ రోహానీ ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత ఈ దుస్థితి చాలావరకూ తొలగిపోయింది.
హాసన్ రోహానీ ప్రభుత్వం ‘అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ’ నియమ నిబంధనలకు లోబడి శాంతి ప్రయోజనాలకు మాత్రమే అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అంగీకరించింది, ఐక్యరాజ్యసమితితోను అమెరికాతోను ఐరోపాతోను చర్చల ప్రక్రియను ప్రారంభించింది. తమ అణు ఇంధన కార్యక్రమం పారదర్శకంగా కొనసాగుతుందని 2013 జూన్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయిన రెండురోజులకే రోహానీ ప్రకటించాడు. తమ దేశం అణ్వస్త్రాలను తయారుచేయబోదని కూడ రోహానీ 2013 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చాడు. 2013 నవంబర్‌లో అమెరికాతో, మరో ఐదు ఐరోపా దేశాలతో ఇరాన్‌కు ఒప్పందం కుదిరింది. ‘యురేనియమ్’ ఇంధన ‘పరిపుష్టి’-ఎన్‌రిచ్‌మెంట్-ని ఐదు శాతం స్థాయికి పరిమితం చేయడానికి ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ హామీ ఇచ్చింది. అణ్వస్త్రాల తయారీకి ఇలాంటి ‘పలచని’ యురేనియమ్ ధాతువు ఉపయోగపడదు. శాంతి ప్రయోజనాల కోసం అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఈ ‘పలుచని’ శుద్ధిచేసిన ‘యురేనియమ్’ ధాతువు ఉపయోగపడుతుందట, ఈ ఒప్పందం కుదిరిన తరువాత ఏళ్లతరబడి వివిధ దేశాలలోని ‘బ్యాంకుల’లో ‘జప్తు’నకు గురి అయి ఉండిన, - స్తంభించి ఉండిన- దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇరాన్ ప్రభుత్వం తిరిగి దక్కించుకుంది. ఇలా ‘కథ’ సుఖాంతమైంది. కానీ అమెరికా అధ్యక్షుడుగా 2017 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ‘కథ’ మళ్లీ మొదలైంది. 2016 జనవరిలో అమెరికా ఇరాన్‌కు వ్యతిరేకంగా అమలులో ఉండిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేసింది, కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2013నాటి ‘బహుళపక్ష శాంతి’ అంగీకారాన్ని 2018లో రద్దుచేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు వ్యతిరేకంగా దశలవారీగా ఆంక్షలను విధించింది. ఇదంతా ఇరాన్‌కు అమెరికాకు మధ్యకల ద్వైపాక్షిక సంబంధాలకు మాత్రమే పరిమితం అయినట్టయితే మన దేశానికి దీనితో ప్రమేయం లేదు. కానీ మన దేశం ఇరాన్ నుంచి ‘చమురు’ను కొనరాదని గత ఏడాది అమెరికా నిర్దేశించడమే దురహంకార దౌత్యానికి నిదర్శనం. మళ్లీ మనం అడగకుండానే అమెరికా అధ్యక్షుడు ‘ఆరునెలల మినహాయింపు’ను కూడ ప్రసాదించాడు. ఈ మినహాయింపు గడువు మే నెల రెండవ తేదీతో ముగిసిపోయింది. ఇరాన్ విదేశాంగ మంత్రి జావీద్ జారిఫ్ తనంతతానుగా మన దేశానికి వచ్చి మంగళవారం మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్‌తో జరిపిన చర్చలకు ఇదంతా నేపథ్యం. ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాలా? వద్దా? అన్న మీమాంసకు మన ప్రభుత్వం గురి అయి ఉండడానికి కారణం అమెరికా ప్రభుత్వ అక్రమ ప్రమేయం! మన వ్యవహారాలను నిర్ణయించవలసింది మనం మాత్రమే..
సౌదీ అరేబియాకు, ఇరాన్‌కు మధ్య పశ్చిమ ఆసియాలో ఆధిపత్య సమరం నడుస్తోంది. యెమెన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి కారణం కూడ సౌదీ అరేబియాకూ ఇరాన్‌కు మధ్య నడుస్తున్న ఆధిపత్య సమరం. అమెరికా దశాబ్దులుగా సౌదీ అరేబియాను చంకనెత్తుకొని ఉంది. సౌదీలో పనిచేస్తున్న అమెరికా చమురు సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడం అమెరికాకు ప్రధానం. అందువల్లనే అమెరికా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్న ఇరాన్‌ను వ్యతిరేకిస్తోంది, బీభత్స మతోన్మాద రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉన్న సౌదీ అరేబియాను సమర్ధిస్తోంది. ఇరాన్ సమీపంలోని సముద్ర జలాలలో అమెరికా తన నౌకాదళాన్ని మోహరిస్తుండడం ప్రస్తుత పశ్చిమ ఆసియా ముఖ చిత్రం. సౌదీ అరేబియాకు ఇరాన్‌కు మధ్య ఘర్షణలు మరింతగా రాజుకుంటున్నాయి.