సంపాదకీయం

దొంగలా? ‘జిహాదీ’లా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుమంది భారతీయ నావికులను ఆఫ్రికా ఖండపు నైజీరియా సముద్ర తీరంలో ఓడదొంగలు అపహరించుకొని పోవడం ఆశ్చర్యకరం కాదు. నైజీరియా తీరంలో గత కొనే్నళ్లుగా జిహాదీ బీభత్సకారులు, ఓడదొంగలు విశృంఖల విహారం చేస్తుండడం ఇందుకు కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరవైమంది భారతీయ వాణిజ్య నావికులను ఓడదొంగలు అపహరించుకొని పోవడం ఈ ‘విశృంఖల జిహాదీ బీభత్స విస్తరణ’ ఫలితం. ఆ తర్వాత అరవై రెండుమందిని, వారు పయనించిన వాణిజ్య నౌకను మన ప్రభుత్వం విడిపించ గలిగింది. ఆ దుర్ఘటనకు ఇప్పుడు జరిగిన ఐదుమంది భారతీయ నావికుల అపహరణ పునరావృత్తి కావచ్చు! గత ఏడాది జరిగిన ‘అపహరణ’ ఉదంతం ఆరు రోజుల్లో ముగిసింది. కానీ ప్రస్తుతం అపహరణకు గురైన మన నావికుల ఆచూకీ వారాలు గడిచినప్పటికీ తెలియడం లేదు. మన ప్రభుత్వానికి సైతం ‘అపహరణ’ జరిగిన తర్వాత అనేక రోజుల పాటు ఈ సంగతి తెలియదన్నది విస్మయకరమైన వాస్తవం! ఎన్నికల ప్రచారపు హోరు కారణంగా ఇతరేతర వ్యవహారాలు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల దృష్టికి రావడంలో జాప్యం జరిగి ఉండవచ్చు. కానీ అధికార యంత్రాంగం దృష్టికి కాని, నైజీరియాలోని మన దౌత్య అధికారుల దృష్టికి కాని ఈ ‘అపహరణ’ రోజుల తరబడి రాకపోవడమే విచిత్రం. ‘అపహరణకు గురైన నావికుల ఆచూకీ కనుక్కోండి..’ అని విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ నైజీరియాలోని మన దౌత్య కార్యాలయ నిర్వాహకులను కోరినట్టు బుధవారం ప్రచారమైంది. నైజీరియా తీరంలో లంగరు వేసి ఉండిన ఒక వాణిజ్యనౌకలోకి ఓడదొంగలు ధైర్యంగా చొఱబడి ఆరుగురు నావికులను బలవంతంగా లాక్కొని వెళ్లారట! గత నెల పంతొమ్మిదవ తేదీన ఈ అపహరణ జరిగిందట. అపహరణకు గురైన ఆరుగురిలో ఐదుగురు మన దేశానికి చెందినవారు. పదమూడు రోజుల తర్వాత మన దేశంలో ఈ అపహరణ గురించి మాధ్యమాల్లో ప్రచారమైంది. ప్రచారమైన తర్వాత వారం రోజులకు మంగళవారం మన విదేశ వ్యవహారాల మంత్రి స్వయంగా ఆదేశిస్తే కానీ నైజీరియాలోని మన దౌత్యవేత్తలకు ఈ సంగతి తెలియలేదట. అపహరణకు గురైన వారి కుటుంబాలవారు, బంధువులు సుషమా స్వరాజ్‌కు ఈ సంగతి నివేదించి సహాయం అర్థించారట! సముద్రంలో పయనించే వాణిజ్య నావికుల, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగుల భద్రత గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడ కష్టం. కష్టమన్నది ఇప్పుడిలా మరోసారి ధ్రువపడింది. గత ఏడాది పిబ్రవరిలో ఇరవై రెండు మంది మన నావికులను అపహరించిన ఓడదొంగలు వారం తిరగక ముందే వారిని వదలిపెట్టేశారు. నైజీరియా ప్రభుత్వం, నైజీరియాకు పొరుగున ఉన్న ‘బెనిన్’ దేశపు ప్రభుత్వం అప్పుడు తక్షణం రంగంలోకి దిగి గాలింపు చర్యలను జరిపించడంతో అప్పుడు మన నావికులకు తొందరగా విముక్తి కలిగింది. కానీ ఇప్పుడు అపహరణ జరిగిన తర్వాత పంతొమ్మిది రోజులు గడిచాయి. గాలింపుచర్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది స్పష్టం కాలేదు. ఓడదొంగలు బందీల ప్రాణాలకు హాని కలిగించరు. ‘దండుగ’ సొమ్ము-రాన్‌సమ్-ను దండుకొని బందీలను వదలిపెడ్తారన్నది ఆకాంక్ష!
నైజీరియా తీరంలో లంగరు వేసిన ఓడలోకి దొంగలు భద్రతా సిబ్బంది సముఖంలోనే చొఱబడినారట! భద్రతాదళాల వారు అపహరణకర్తలను అటకాయించ లేదు, నావికులను కాపాడే ప్రయత్నం చేయలేదు. నైజీరియాలో కొనసాగుతున్న అరాజక పరిస్థితికి ఇది మరో నిదర్శనం. ఓడదొంగలు నౌకలోని సిబ్బందిని మొత్తం అపహరించలేదు. ఆరుగురిని మాత్రం అపహరించుకొనిపోయారు. నౌకలో ఉండిన ఇతర సిబ్బందికి అపహరణకు గురైన భారతీయ నావికులు తెలుసు. వారు వెంటనే నైజీరియాలోని భారతీయ దౌత్య కార్యాలయానికి ఈ అపహరణ గురించి చెప్పి ఉండవచ్చు. లేదా తమ దేశాల దౌత్య కార్యాలయాలకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు. ఏదీ జరగలేదు. తాపీగా అపహరణకు గురైన వారి బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఓడనుంచి నావికులను ఓడదొంగలు అపహరించుకొనిపోయిన చోద్యాన్ని చూసిన నైజీరియా భద్రతాసిబ్బంది తమ అధికారులకు సైతం ఈ సంగతిని తెలుపలేదన్నది స్పష్టం. వాణిజ్యనౌకలకు తమ సార్వభౌమ జలాలు విస్తరించినంత మేర భద్రత కల్పించడం ప్రతి స్వతంత్ర దేశ ప్రభుత్వం విధి. ఈ విధిని నిర్వహించడంలో నైజీరియా ప్రభుత్వం విఫలమైంది. సముద్ర తీరం నుంచి సముద్రం లోపలికి పనె్నండు మైళ్ల మేర ప్రతి దేశానికి సార్వభౌమ జలాలు- టెర్రిటోరియల్ వాటర్స్ విస్తరించి ఉన్నాయి. నైజీరియా సార్వభౌమ జలాల్లో ప్రవేశించిన ఈ ఓడ మళ్లీ అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి పునఃప్రవేశం చేసేవరకూ నైజీరియా నిబంధనలు పాటించాలి. ఆ ఓడను, అందులోని సిబ్బందిని పరిరక్షించ వలసిన బాధ్యత నైజీరియా ప్రభుత్వానిదే. భద్రతాదళాలు ఓడదొంగలను నిరోధించి ఉండాలి. నిరోధించే ప్రయత్నం విఫలం కావడం, సఫలం కావడం వేఱు విషయం. కానీ నైజీరియా సముద్రతీర భద్రతాసిబ్బంది నావికుల అపహరణను నిరోధించే ప్రయత్నమే చేయలేదు. ఎందుకు చేయలేదన్నది బహిరంగ రహస్యం..
ఓడదొంగలు సముద్రాల మధ్యలో వాణిజ్య నౌకలను అటకాయించి దోపిడీ చేయడం, అపహరించుకొని పోవడం శతాబ్దుల వైపరీత్యం. ఐరోపా దేశాల ప్రభుత్వాలు సైతం ఓడదొంగల ముఠాలను ప్రోత్సహించడం క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ధి ఆరంభం వరకూ నడిచిన ‘ముచ్చట..!’ ఇలా ఓడదొంగలు కొల్లగొట్టిన సొమ్ములో ఈ ప్రభుత్వాలకు వాటా లభించేదట! ప్రభుత్వాలకు వాటా ఇవ్వడం ఇష్టం లేని ‘ముఠాలు’ స్వతంత్రంగా వ్యవహరించేవి. ఇలాంటి స్వతంత్ర సముద్ర చోరుల ముఠాలకు, ప్రభుత్వ ప్రేరిత ముఠాలకు మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు కూడా జరిగేవట! 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు గెలవడం గొప్ప చారిత్రక ఘటన అన్నది ఆంగ్లేయులు మనకు మప్పిన పాఠం. ఈ యుద్ధం తర్వాత బ్రిటన్ దేశపు ‘ఈస్టిండియా కంపెనీ’ వారి పెత్తనం మన దేశంపై స్థిరపడిందన్నది ఈ పాఠం. ఆ సమయంలో మన దేశంలో ‘ఈస్టిండియా’ దోపిడీ ముఠాకు రాబర్ట్ క్లయివ్ అనేవాడు ప్రధాన ప్రతినిధి, పెద్ద దళారీ! ఈ క్లయివ్ ‘ఈస్టిండియా’లో చేరక పూర్వం సముద్రపు దొంగల ముఠాలో పనిచేశాడన్నది ఆలస్యంగా వెలుగు చూసిన చారిత్రక వాస్తవం. ఇప్పుడు ఐరోపా దేశాలు నాగరిక ప్రజాస్వామ్య వ్యవస్థలు. కానీ వారి ఓడదొంగల వారసత్వం మాత్రం వివిధ దేశాలను ఆవహించింది. ఆఫ్రికా ఖండం తూర్పు తీరంలోని సోమాలియా దేశం ప్రధాన స్థావరంగా గత అనేక దశాబ్దుల నుంచి ఓడదొంగలు అరేబియా సముద్రంలోను, హిందూ మహాసాగరంలోను వాణిజ్యపు ఓడలను కొల్లగొడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స సంస్థ- ఐఎస్‌ఐ- ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్- వివిధ జిహాదీ హంతక ముఠాలను ఓడదొంగల తండాలతో అనుసంధానం చేసిందన్నది పదిహేనేళ్లుగా జరిగిన ప్రచారం. అందువల్ల కొన్ని జిహాదీ ముఠాలు సైతం ఓడదొంగలుగా చెలామణి అవుతుండడం నడుస్తున్న చరిత్ర. మన దేశానికి దక్షిణంగా ఉన్న సముద్ర జలాలలో ఓడదొంగలు, ఓడదొంగల ముసుగులోని జిహాదీ బీభత్సకారుల కలాపాలను పెంచడానికి ఇదంతా నేపథ్యం...
‘ఐఎస్‌ఐ’ అనుసంధాన దుశ్చర్య కారణంగానే ఓడదొంగలు ఆఫ్రికా తూర్పున ఉన్న సముద్ర జలాల నుంచి ఆఫ్రికా పడమటి తీరంలో ఉన్న సముద్ర జలాలకు విస్తరించారన్న అనుమానం అతార్కికం కాదు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో పయనించే నౌకలపై దాడులు సలుపగలిగిన ఓడదొంగలు సముద్ర తీరాల్లో లంగరు వేసి ఉన్న నౌకల్లోకి సైతం ధైర్యంగా చొఱబడగలగడం జిహాదీ బీభత్సకాండను ధ్వనింపచేస్తోంది, స్ఫురింపచేస్తోంది. మన దేశపు నావికులను నైజీరియా తీరం నుంచి అపహరించడం రెండేళ్లుగా సాగుతున్న వికృత క్రీడ. నైజీరియాలో ‘బొకోహరామ్’ అనే జిహాదీ ముఠా ఏళ్ల తరబడి బీభత్సకాండను సాగిస్తోంది. 2014లో ఈ ముఠా వారు రెండు వందలమందికి పైగా పాఠశాల విద్యార్థినులను అపహరించారు. క్రైస్తవ మతానికి, ప్రాచీన ‘వన మతాల’కు చెందిన ఈ బాలికలను ఇస్లాంలోకి బలవంతంగా మార్చి జిహాదీలు వారిలో అత్యధికులను పెళ్లి చేసుకున్నట్లు అప్పుడు ప్రచారమైంది. ఈ ‘బొకోహరామ్’ ముఠా వారికి పాకిస్తాన్‌లో శిక్షణ లభించిందన్న ప్రచారం కూడ జరిగింది. నౌకాశ్రయం లోకి చొఱబడి మన నావికులను లాక్కొనివెళ్లిన వారు కేవలం ఓడదొంగలా? లేక ఓడదొంగల ముసుగులోని ‘జిహాదీ’లా? ఓడదొంగలకు ఇంత ధైర్యం ఉందా?