సంపాదకీయం

సంయమన శూన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోటిలో కాలుపెట్టుకోవడం కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెలామణిలో ఉన్న రాహుల్ గాంధీ అనే రాజకీయ విదూషకునికి పరిపాటి! నోటిలో వేలుపెట్టుకోవడం శిశువుల ప్రవృత్తి కావచ్చు, మాన్పించడానికి తల్లిదండ్రులు మహాయాతన పడుతున్నారు, మాన్పిస్తున్నారు కూడ. కానీ నోటిలో కాళ్లు పెట్టుకుంటున్న రాహుల్ గాంధీ వంటి వారిని మాన్పించడం సాధ్యం కాదు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతిపరుడన్నది’’ రాహుల్ గాంధీ మూడేళ్లక్రితం చేసిన ఆరోపణ. అప్పటి నుంచి మొదలు.. ‘‘కాపలాదారుడు దొంగ’’ అన్నది నడుస్తున్న ఘట్టం! అన్ని ఘట్టాలలోను రాహుల్ గాంధీ ‘నోటి’లో ‘కాలు’పెట్టుకున్న ‘దృశ్యం’ ఆవిష్కృతమైంది. వాళ్లూ వీళ్లూ కల్పించుకొని, కాంగ్రెస్ నాయకులు తలలు బాదుకుని ఆ ‘కాలు’ను బలవంతంగా బయటికి లాగుతున్నారు. కాని ప్రస్తుత ఘట్టంలో రాజకీయవేత్తలకు రాహుల్ గాంధీ ‘నోటిలోని’ ఆయన ‘కాలు’ను ఊడబెరకడం సాధ్యం కావడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం వారు చీవాట్లు పెడితే కాని రాహుల్ గాంధీ ‘నోటి’లోనుండి ఆ ‘కాలు’ బయటపడడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా మందలించిన దృశ్యం మంగళవారం ఆవిష్కృతమైంది.. రాహుల్ గాంధీ వంటివారు ఇలా ప్రవర్తించడం ఇప్పుడు జనానికి సుపరిచిత వినోదం.. ఈ వెకిలితనం పట్ల జనం అందువల్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు, విస్మయానికి గురికావడం లేదు. కానీ రాహుల్ గాంధీ విచిత్ర ప్రవర్తన ప్రభావం మాత్రం విస్తరిస్తోంది. ఇతర రాజకీయ పక్షాల వారిని సైతం ఆవహిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టంలో ఈ విదూషక ప్రభావ విస్తృతి మరింతగా విస్తరించింది. సంయమనం కోల్పోతున్న దాదాపు అన్ని రాజకీయ పక్షాల నేతలు నోళ్లు పారేసుకుంటున్నారు. మాటల గారడీ చేయడం వల్ల ప్రజలను ప్రధానంగా వోటరులను ‘‘మంత్రముగ్ధుల’’ను చేయవచ్చునన్న భ్రాంతికి అత్యధిక శాతం రాజకీయవేత్తలు బందీలయి ఉన్నారు. అందువల్ల ఎన్నికల ప్రచార ‘ప్రవర్తన నియమావళి’- కోడ్ ఆఫ్ కాండక్ట్-ని గాలికి వదలేసిన నేతలు యథేచ్ఛగా ‘వికృత వదన గహ్వర విన్యాసాల’ను ప్రదర్శిస్తున్నారు. సభలలో ఈ నేతల ‘‘వికారపు నోళ్ల మాటల ఆట’’కు అనుగుణంగా వీరాభిమానులు కొందరు తైతక్కలాడుతున్న దృశ్యాలు కూడ ప్రచార ప్రహసనాన్ని పరిపుష్టం చేస్తున్నాయి. ఈ వీరాభిమానులు మాత్రమే మొత్తం ‘మత ప్రదాత’-వోటర్-లన్నది నాయకులను ఆవహించిన భ్రాంతి. అందువల్ల ఇలాంటి ప్రముఖుల విషయంలో మన పూర్వులు చెప్పిన హాస్యరస సూక్తి మరోసారి అమలు జరుగుతోంది. ‘‘కుండను పగులకొట్టడం వల్ల కాని, కట్టుకున్న వస్త్రాన్ని చింపుకొనడం వల్ల కాని, గాడిద వలె ఓండ్ర పెట్టడం వల్ల కాని... ఏదో ఒక ఉపాయాన్ని అమలుజరుపడం ద్వారా మానవుడు ప్రసిద్ధుడుగా చెలామణి కావాలి!’’ అన్నది ఆ సూక్తి- ఘటం భింద్యాత్, పటం ఛింద్యాత్, కుర్యాత్ వాగార్ద్భ స్వరం, యేన కేనపి ఉపాయేన ప్రసిద్ధః పురుషోభవేత్- అందువల్ల అరచి ఆర్భాటించి సంయమనాన్ని కోల్పోయి ప్రసంగాలు చేయడం వల్ల వోటరులను ఆకట్టుకొనగలమన్న భ్రాంతికి మహానాయకులు గురి అయి ఉన్నారు. ఇదంతా రాహుల్ గాంధీ రాజకీయ విదూషకత్వ ప్రభావం విస్తరిస్తోందన్న దానికి నిదర్శనం. ప్రధానమంత్రి, ‘్భరతీయ జనతాపార్టీ’ అధినాయకుడు నరేంద్ర మోదీ వంటివారు సైతం ‘సంయమన రాహిత్యాన్ని’ ప్రదర్శిస్తుండడం పరాకాష్ఠ.. తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యులు కొందరు ‘‘నా సంపర్కంలో ఉన్నారు..’’ అని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రచార సభలో వాక్రుచ్చడం సంయమనం లేని రాజకీయ ప్రచార విన్యాసం...
కాపలాదారుడే దొంగ- చౌకీదార్ చోర్ హై- అని రాహుల్ గాంధీ పదే పదే నరేంద్ర మోదీని నిందించడం నెలల తరబడి కొనసాగిన ప్రహసనం. మన దేశంలో నియోజకవర్గానికీ- కాన్‌స్టిట్యూయెన్సీకి- రాజ్యాంగానికీ - కాన్‌స్టిట్యూషన్‌కూ- మధ్యగల తేడా తెలియని వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయిపోతున్నారన్నది దశాబ్దులకు పూర్వం చెలామణి అయిన ‘చతురోక్తి’.. ‘‘మీది ఏ కానిస్టిట్యూయెన్సీ?’’ అని అడగదలచిన ఇలాంటి వారు ‘‘మీది ఏ కాన్‌స్టిట్యూషన్?’’అని అడిగిన సందర్భాలుండేవట! ఇది ఆంగ్ల భాషాపరమైన ‘అనభిజ్ఞత’ మాత్రమే! ఈ ‘అనభిజ్ఞత’ ‘అజ్ఞానం’గా మారడం- ఊసరవెల్లిగా మారిన తొండవలె- రాహుల్ గాంధీ వంటి రాజకీయ ప్రముఖులు చెలామణిలోకి రావడానికి కారణం. రాహుల్ గాంధీకి లభిస్తున్న ప్రాముఖ్యం రెండు రకాలు; మొదటి ప్రాధాన్యం కాంగ్రెస్ మహాసంస్థ అనే ‘చంద్రుడి’ని ‘రాహువు’వలె ఆవహించి ఉన్న కుటుంబ వారసత్వ రాజకీయం. రాహుల్ గాంధీకి కేవలం వారసత్వంగా మాత్రమే రాజకీయ ప్రాధాన్యం లభించింది, ప్రజలు ఇతగాడిని మహానాయకుడిగా గుర్తించలేదు. అందువల్ల ఇది ప్రజలిచ్చిన ప్రాధాన్యత కాదు. ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబం వారికి తరతరాలుగా సంక్రమించిన రాజకీయ వారసత్వం ఈ ప్రాధాన్యం. అందువల్లనే నూట ముప్పయి నాలుగేళ్ల చరిత్ర కలిగిన ఒక సంస్థకు రాహుల్ గాంధీ వంటి ‘హాస్యాస్పద వర్తనుడు’ అధ్యక్షుడయి కూర్చోగలిగాడు. మహాసంస్థ మరుగుజ్జు సంస్థగా మారడం ఈ కుటుంబ రాజకీయ వారసత్వ ఫలితం! రాహుల్ గాంధీకి ప్రాధాన్యం సంతరించిపెడుతున్న రెండవ కారణం వినోద ప్రియులైన జనం.. రాహుల్ గాంధీ సభలకు హాజరవుతున్న ప్రజలలో అత్యధికులు ఈ వినోద ప్రియులు! అజ్ఞానం, అహంకారం కవల పిల్లలు. అహంకారులను క్రమంగా అజ్ఞానం అలముకొంటుంది...
ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి సర్వదా ప్రత్యామ్నాయం ఉండి తీరాలి. అందువల్ల ‘కాంగ్రెస్ విముక్త’ భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ అభిలషణీయం కాదు, కానీ ‘కాంగ్రెస్ పార్టీ’కి కుటుంబ రాజకీయ వారసత్వం వైపరీత్యం నుంచి విముక్తి లభించాలి. కావలసింది కాంగ్రెస్ విముక్త భారత్ కాదు, రాహుల్ గాంధీ విముక్త కాంగ్రెస్.. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ వారు, కార్యకర్తలు తెలుసుకోకపోవడం వల్ల, తెలుసుకున్నప్పటికీ రాహుల్ గాంధీ వంటివారిని వదిలించుకునే మార్గం వారికి కనిపించనందువల్ల ఆయన వారి నెత్తినెక్కి తొక్కుతున్నాడు, తైతక్కలాడుతున్నాడు. ‘సంయమనం’ అంటే ఏమిటో తెలియని రాహుల్ గాంధీకి ఎవరో ‘‘చౌకీదార్ చోర్ హై’’ అన్న నినాదాన్ని అందించారు. ఆయన దానిని పదే పదే వల్లెవేశాడు! ‘ప్రాస’ కుదిరింది లేదా ‘యతి’ కుదిరింది. ‘చౌకీదార్’లోని ‘చౌ’అన్న అక్షరానికి ‘చోర్’లోని ‘చో’అన్న అక్షరం ప్రాస.. అందువల్ల నినాదం ‘వినోదం’గా మారింది.. నిజానిజాల సంగతి ‘నినాద వినోద’ మానవులకు అక్కరలేదు. అందువల్ల రాహుల్ గాంధీ మరింత ముందుకెళ్లాడు. సొంత తెలివిని ఉపయోగించాడు. ‘నోటి’లో ‘కాలు’పెట్టుకోవడం ఈ ‘సొంత తెలివి’! ‘‘చౌకీదార్ చోర్ హై’’ అన్న దాన్ని సర్వోన్నత న్యాయస్థానం కూడ ఆమోదించిందని ధైర్యంగా, నిర్లజ్జగా ప్రచారం చేశాడు. కాపలాదారుడు- నరేంద్ర మోదీ- దొంగ అన్న తన వాదాన్ని సుప్రీం కోర్టు అంగీకరించిందన్న అబద్ధం చెప్పడం ‘అజ్ఞాన అహంకార’ గ్రస్తుడైన రాహుల్ గాంధీ ‘వ్యూహం’! సర్వోన్నత న్యాయస్థానం కూడ తన మాటను ఒప్పుకున్నదని చెప్పినట్టయితే జనం మరింతగా విశ్వసిస్తారన్నది వ్యూహం! అందువల్ల రాహుల్ గాంధీ అబద్ధం చెప్పాడు. ‘‘దేవతలు ప్రవేశించడానికి సైతం భయపడే దుర్గంధ సీమలలో మూర్ఖులు ధైర్యంగా విహరిస్తారన్నది’’ఒక సామెత. ఈ సామెతకు ఆకృతి రాహుల్ గాంధీ. అందువల్లనే ధైర్యంగా సర్వోన్నత న్యాయధిక్కరణకు పాల్పడ్డాడు. సర్వోన్నత న్యాయస్థానం వారు మంగళవారం మరోసారి రాహుల్ గాంధీని మందలించారు. రాహుల్ గాంధీ క్షమార్పణ చెప్పడం అతని అబద్ధాల ప్రచారానికి వికృతమైన ముగింపు.. ఈ క్షమార్పణను సోమవారం వ్రాతపూర్వకంగా సమర్పించవలసి ఉంది.
రాహుల్ గాంధీ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యం కాదు. కానీ నరేంద్ర మోదీ సైతం ప్రచార సభలలో సంయమనాన్ని పాటించకపోవడమే విస్మయకరం. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ఈ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోతుందని నరేంద్ర మోదీ ప్రకటించవచ్చు. గెలుపోటములను నిర్ణయించేది ‘వోటరు’లు, నరేంద్ర మోదీ కాదు, మమతాబెనర్జీ కాదు! కానీ ఈ ఎన్నికల తరువాత నలబయి మంది శాసనసభ్యులు తృణమూల్ కాంగ్రెస్ నుండి బయటికి వస్తారని, మమతాబెనర్జీని వదిలిపెడతారని మోదీ ప్రకటించడం విస్మయకరం. ఫిరాయింపులను ఉసిగొలిపి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారా?