సంపాదకీయం

శిశు కార్మికులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలు అజరామర
భావానికి రూపాలు
అక్షరాలు విశ్వ విహిత
నాద జనిత రాగాలు
అక్షరాలు ఎద విరిసిన
అనుభూతుల పరిమళాలు
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధక స్వరాలు..!
పసిపాపలు సహజ పరిశోధకులు. ఈ పరిశోధన వికసించడం తరతరాల మానవ చరిత్ర.. యుగయుగాల మానవీయ సంస్కారం. ఈ చరిత్ర చెఱగిపోతుండడం ఆధునిక నాగరిక జీవన ‘విలాసం’- ఫ్యాషన్-! ఈ సంస్కారం సంకరమైపోతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం! ఐరోపా వారు, ఆరబ్బు జాతుల వారు మానవులను బానిసలుగా అమ్మడం చరిత్ర. చిన్నపిల్లలను కర్మాగారపు గొట్టాలపైకి ఎక్కించి పనిచేయించిన పాశవిక ప్రవృత్తి ఐరోపా వారి శతాబ్దుల చిత్తవృత్తి. ఈ చిత్తవృత్తి శతాబ్దుల పాటు మానవీయ జీవన సంస్కారాన్ని మలినం చేసింది. ఈ మాలిన్యం భారతీయ సమాజాన్ని సైతం ఆవహించడం ఐరోపా ఆర్థిక భౌతిక బౌద్ధిక దురాక్రమణ ఫలితం! ఐరోపా దురాక్రమణ ముగిసిందన్న మురిపెం మూన్నాళ్ల ముచ్చట.. వాణిజ్య ప్రపంచీకరణ వచ్చి తగులుకుంది.. ఈ వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- ఐరోపా దురాక్రమణకు ఆధునిక విస్తృతి! అందువల్ల బాలకార్మిక వ్యవస్థ వంటి వైపరీత్యాలు చట్టాల వల్ల తొలగిపోవడం లేదు. నిర్బంధంగా చిన్నపిల్లలకు పాఠశాల విద్యను బోధించి తీరాలన్న ‘విద్యాధికార చట్టం’ వచ్చిన తరువాత కూడ చిన్నపిల్లలందరూ పాఠశాలల్లో ఉండడం లేదు. అనేకమంది పిల్లలు అన్ని చోట్లా ఇప్పటికీ ‘పని చేస్తున్నారు’.. ‘స్వయం ఉపాధి’ని పొందుతున్నారు. బాలకార్మికులను సరఫరా చేస్తున్న వాణిజ్యపు ముఠాలు పనిచేస్తున్నట్టు ప్రచారం అవుతుండడం ఈ అమానుష అమానవీయ ప్రహసనంలో సరికొత్త ఘట్టం, ప్రవర్ధమాన వైపరీత్యం. ఝార్‌ఖండ్ ప్రాంతానికి చెందిన పిల్లలను హైదరాబాదుకు తరలించుకొని వచ్చి వెట్టి చాకిరీకి కుదిర్చినట్లు వెల్లడైంది. ఈ తరలింపునకు ఢిల్లీలోని ఒక దళారీ ముఠా ఆధ్వర్యవం వహించిందట! హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఒక సంపన్న కుటుంబం వారు ముగ్గురు చిన్నపిల్లలను వెట్టిచాకిరీ చేయడం కోసం నియమించుకున్నారట! ఈ సంపన్న ‘రాక్షస’ కుటుంబపై దాడి చేసిన పోలీసులు ఈ చిన్నిపిల్లలకు విముక్తిని కలిగించారట! చిన్నపిల్లలను వెట్టిచాకిరీకి ఉపయోగించుకుంటున్న సంపన్నులపై అభియోగాలను నమోదు చేశారట! కానీ హైదరాబాద్ నగరంలో అనేకమంది బాలకార్మికులు ఇప్పటికీ నిర్మాణ రంగంలో రాళ్లెత్తుతున్నారట. ఇసుక గంపలు మోస్తున్నారట! ఫ్యాక్టరీ- కర్మాగారపు- పొగగొట్టాలను చిన్నపిల్లలు శుభ్రం చేయడం గత శతాబ్దుల ఐరోపా కథ. పత్తికాయలను తెంపుతూ పొలాల్లో కనిపించిన బాలకార్మికులు ఈ శతాబ్దిలో నడుస్తున్న ప్రపంచీకరణ వ్యథ. చట్టాలు సర్వ సమగ్రంగా ఉన్నాయి. అమలు జరుపవలసిన మానవులలో మాత్రం మానవీయత లేదు. సౌదీ అరేబియా వంటి మతోన్మాద వ్యవస్థలున్న దేశాల్లో యజమానులు పనివారిని ప్రధానంగా విదేశీయ కార్మికులను జంతువుల కంటె హీనంగా చూస్తున్నారు. మన దేశంలో మతోన్మాద వ్యవస్థ లేదు, మానవీయ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ మానవత్వపు అమృతభాండంలో విషపుచుక్కలు కనిపిస్తున్నాయి. బాలకార్మికులతో ఇసుక గంపలను మోయిస్తున్న వారు ఈ విషపుచుక్కలు. అందుకే ‘నిర్మాణోంకే పావన యుగ్ మే హమ్ చరిత్ర నిర్మాణ కరే..’ అని అన్నాడు ఓ హిందీ మహాకవి. ‘కట్టడాలు కొనసాగుతున్న ఈ పావన యుగంలో మనం ‘నడవడి’ని నిర్మించాలి..’ నడవడి- సమాజంలో అత్యధికుల నడవడి- సరిగాలేకపోవడం బాలకార్మికులు ఇప్పటికీ పనిచేస్తుండడానికి కారణం!
మన భావాలను పాశ్చాత్య వాణిజ్య వికృతులు దిగమింగడం ‘భూతదయ లేని’ ప్రగతి పుట్టలుగా గుట్టలుగా దిగమింగడానికి కారణం. భూతదయ లేనివారు ‘శిశువుల’ను ‘పని పశువులు’గా మార్చివేశారు. విశ్వ విహిత స్వభావాన్ని వైయక్తిక క్రౌర్యం దిగమింగడం ‘భూతదయ’ లేని ప్రముఖులు, పశ్చాత్తాప హృదయ విహీనులు పరిఢవిల్లడానికి కారణం. భవనాలను నిర్మిస్తున్న వారి ‘హృదయ భవనాలు’ మాత్రం భయంకర వికృత విష భావ క్రిములకు, కీటకాలకు ఆలవాలం అయ్యాయి. అందువల్ల చిన్నపిల్లలను కార్మికులుగా మార్చి చెత్తను ఎత్తడానికి వినియోగించారు. విరిసిన అనుభూతులు బాలకార్మికులకు విషాద స్మృతులుగా మారిపోతున్నాయి. అనేక ఏళ్ల క్రితం ఒక వాణిజ్య భోజనశాలలో కనిపించిన దృశ్యం... తిరుపతిలోని ఆ భోజనశాలలో ఒక బాలుడు మాసిన దుస్తులతో బట్ట తీసుకొని ‘తినిపోయిన చోటు’ శుభ్రం చేస్తున్నాడు. బల్లలను శుభ్రం చేస్తూ కనిపించాడు. ఎనిమిదేళ్ల పాప అప్పుడే బడి నుంచి వచ్చింది. ఒక ఉన్నత ఆసనంపై కూర్చుని మిఠాయిలను నమిలింది. నములుతూ నములుతూ బల్లలు తుడుస్తున్న బాలుని వైపు చూసి వెక్కిరించింది. బల్లలు తుడిచే బాలకార్మికుడు నిశ్చలంగా తనపని తాను చేసుకుంటూ వెళ్లాడు. ఇదీ అనుభూతుల మధ్య అంతరం.. ఆ పాప అనుభూతికీ, ఆ బాలుడి అనుభూతికీ మధ్య ఉండిన అంతరాన్ని ఏ అక్షరాలు వివరించగలవు? ఆ పాప ఆ భోజనశాల యజమాని కుమార్తె!
ఆ పాపకు తెలీదు, ఆ బాలకార్మికునికీ తెలీదు. తెలుపవలసింది పెద్దలు.. అక్షరాస్యత పెరిగిన కొద్దీ అక్షరాస్యులైన పెద్దలలో అసురశక్తులు తిష్ఠ వేసుకొని మానవత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. ఈ ‘వెక్కిరింపు’ గతంలో పెట్టుబడి తత్త్వం- కాపిటలిజమ్-! తొండ ముదిరింది, ఊసరవెల్లిగా మారింది. ఈ ఊసరవెల్లి.. ప్రపంచీకరణ! ప్రపంచీకరణకు మరోపేరు ‘స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ! ప్రపంచీకరణ ‘్భరతీయత’ను బద్దలు కొడుతోంది. ‘మార్కెట్ ఎకానమీ’ మానవత్వాన్ని మంట గలిపింది. ‘రాజవత్ పంచ వర్షాణి’ అన్నది భారతీయ సంస్కారం,. ఐదేళ్ల వయసు వచ్చే వరకూ ప్రతి శిశువును ‘రాజు’వలే సంభావించాలి. ఈ రాజభోగము సంపన్నుల శిశువులకు, నిరుపేదల శిశువులకు సమానమన్నది భారతీయ సంస్కారం. సమాజంలో ఆర్థిక, శారీరక, బౌద్ధిక, సంస్కార పరమైన అంతరాలు ఉండవచ్చు. అవి పెద్దలకు మాత్రమే పరిమితం. శిశువుల మధ్య ఈ అంతరాలు లేవు, ఉండరాదన్నది భారతీయ సంస్కారం. అంతేకాదు- ఐదేళ్లు నిండిన తరువాత పదేళ్ల వరకూ అంటే పదిహేనేళ్లు నిండే వరకూ కూడ పిల్లలంతా సమానులే. ఈ పిల్లలు బ్రహ్మచారులు అంటే విద్యార్థులు. యుగాల తరబడి విద్యార్జన చేసిన బాలలు- రాజుల పిల్లలైనా, సంపన్నుల పిల్లలైనా, నిరుపేదల పిల్లలైనా గురుకులాల్లో సమాన స్థాయిని పొందడం చరిత్ర. ఈ చారిత్రక వాస్తవాన్ని బ్రిటన్ దురాక్రమణదారులు వికృత పరిచారు. విదేశీయులు వికృత పరిచారు. కొందరు మాత్రమే విద్యార్థులుగా మనుగడ సాగించారు. విద్యావంతులయ్యారు. ఎందరో బాలకార్మికులుగా మారిపోయారు. విదేశీయ భౌతిక దురాక్రమణ నుంచి దేశం విముక్తమైన తర్వాత ఏడు దశాబ్దులు గడిచాయి. ఎనిమిదవ దశాబ్ది నడుస్తోంది. ఇప్పటికీ బాలకార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న దుర్జనులు ఉండడానికి కారణం విదేశీయ ‘వికృత బుద్ధి’ ఇప్పటికీ మన దేశంలోని అక్షరాస్యులలో అత్యధికంగా ఆవహించి ఉండడం. సౌశీల్య రహితులైన అక్షరాస్యులు విబుధ దైత్యులు! ఈ తొలగని ‘వికృత బుద్ధి’ గతంలో పాశ్చాత్య వాణిజ్య సామ్రాజ్యం.. ప్రస్తుతం అది ప్రపంచీకరణ..
తల్లిదండ్రులు తమ పిల్లలను బాలకార్మికులుగా మార్చి వేస్తుండడం మరో వైపరీత్యం. రెండేళ్లు నిండినప్పటి నుంచీ శిశువులతో బలవంతంగా బడిపని చేయిస్తున్నారు. ఐదవ ఏట మాత్రమే అక్షరాభ్యాసం చేయించాలన్నది తరతరాల భారతీయ సంస్కారం. రెండేళ్లు నిండిన శిశువులకు అక్షరాభ్యాసం చేయించి వారిని ‘క్రీడా తరగతుల’- ప్లే క్లాసెస్- పేరుతో నడుస్తున్న బందిఖానాలకు తోలిస్తున్నారు. స్వేచ్ఛంగా ఇంటిలోను, ఇంటిబయట ఆడుకోవలసని రెండు, మూడేళ్ల పిల్లలను తల్లిదండ్రులు ‘బడి చాకిరీ’ పాలచేస్తున్నారు. ఈ ‘బడులు’ పిల్లల పాలిట బందిఖానాలు! దీనికి ఎవరు బాధ్యులు? ఐదేళ్లు నిండక ముందు పిల్లలకు అక్షరాలను మప్పరాదనే చట్టం చేయాలన్న ధ్యాస కూడ ప్రభుత్వాలకు లేదు. అలాంటి చట్టం వచ్చేవరకూ ఐదేళ్ల లోపు పిల్లలందరూ కార్మికులే.. వీరు బాల కార్మికులు కాదు.. వీరంతా చదువుల పేరుతో వెట్టిచాకిరీ చేస్తున్న శిశు కార్మికులు..