సంపాదకీయం

రాలిన ‘మొగ్గలు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ‘ఇంటర్ మీడియట్’ పరీక్ష తప్పిన భ్రమకు గురి అయి అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- రాక్షసక్రీడలో వర్తమాన ఘట్టం! దేశంలోని అన్ని జీవన రంగాలను వాణిజ్య బీభత్సం ఛిద్రం చేస్తోంది, ముక్కలు చెక్కలు చేస్తోంది. భారతీయ స్వభావాన్ని విధ్వంసం చేస్తున్న ఈ వాణిజ్య బీభత్సం వౌలిక కారణం. క్రూరమైన నిర్లక్ష్యం వహిస్తున్న అవినీతి అధికారులు, అధికార రాజకీయవేత్తలు పాత్రధారులు. సూత్రధారి ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్-! ప్రపంచీకరణ కబంధ బంధం నుంచి దేశం విముక్తి కానంతవరకు తెలంగాణలో మాత్రమే కాదు దేశమంతటా విద్యావ్యవస్థ ఇలా భయంకర బీభత్సకాండకు బలి అవుతూనే ఉంటుంది! ప్రభుత్వం తన క్రూరమైన రాక్షసమైన అవినీతి మయమైన పెను నిద్దుర నుండి ఉలిక్కిపడి లేచినట్టు కూడ లేదు. మూడురోజులుగా ఆత్మహత్యలకు పాల్పడిన పిల్లల తల్లిదండ్రులు, బంధువులు చేస్తున్న ఆర్తనాదాలు సైతం వినిపించని బండ నిద్దురలో తెలంగాణ ప్రభుత్వం పడి ఉంది. ఈ బండ నిద్దురకు కారణం ‘ప్రపంచీకరణ’! లేదా ప్రభుత్వం బండ నిద్దురను అభినయిస్తోంది. ఈ అభినయానికి సైతం కారణం వాణిజ్య ప్రపంచీకరణ! అక్రమ వాణిజ్యవేత్తలకు అవినీతి స్వభావులైన అధికార రాజకీయవేత్తలు సహాయం చేయడం గతం! దుర్మార్గులైన, దేశద్రోహులైన, మాతృభూమి మమకార విహీనులైన, జాతీయ సార్వభౌమత్వ అధికార పరిధి పట్ల నిష్ఠలేని వాణిజ్యవేత్తలు ప్రభుత్వాలను నడిపిస్తుండడం, నియంత్రిస్తుండడం ప్రపంచీకరణ యుగం! ఇలా వాణిజ్య దుర్మార్గ వర్తనులు దేశమంతటా ప్రభుత్వాలను నడిపిస్తున్న భయంకర వాస్తవానికి తెలంగాణ ‘ఇంటర్’ పరీక్షా పత్రాల మూల్యాంకన రంగంలోని - నందన వనంలోకి విషపుకోరల అడవి పంది వలె- ‘గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’అన్న ముఠా చొరబడిపోవడం ఒక ఉదాహరణ మాత్రమే! అడ్డదిడ్డంగా పరీక్షా పత్ర మూల్యాంకన క్షేత్రాన్ని ‘కోరలతో’ కుమ్మేసి బౌద్ధిక విధ్వంసం సృష్టించిన ఈ ప్రభుత్వేతర వాణిజ్య బీభత్సపు ముఠా ఇంతమంది విద్యార్థుల ప్రాణాలను బలిగొనింది, వారి రక్తం తాగింది! ఈ పాపం ఈ ‘గ్లోబరీనా’ ముఠాది మాత్రమే కాదు, ఈ ఘోరమైన పాపం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థది. నైతిక నిష్ఠ, సామాజిక బాధ్యత, దేశభక్తి, ప్రజాహితం గురించి పట్టని వాణిజ్యపు ముఠాలు అక్రమ లాభాలను మూటకట్టుకోవడం ‘ప్రపంచీకరణ’ మాయాజాలం! మన దేశంలోనే పుట్టిపెరిగిన అక్రమ వాణిజ్య సంస్థలు కావచ్చు, విదేశాల నుంచి చొరబడిన వాణిజ్యపు ముఠాలు కావచ్చు- అన్నింటిదీ ఒకే స్వభావం! జాతీయతా నిష్ఠను ధ్వంసం చేస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్యం’ ఈ బీభత్స స్వభావం! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు- విద్యారంగంలో సృష్టించిన బీభత్సం నిరంతరం విస్తరిస్తోంది. పరీక్ష తప్పినామన్న భ్రమకు లోనైన ఈ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొనడం ఈ విస్తరణకు సరికొత్త నిదర్శనం! ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు పరీక్ష తప్పలేదు. తప్పిన భ్రమను ‘గ్లోబరీనా’ ముఠా కల్పించింది, వాణిజ్య బీభత్సం కల్పించింది, ‘ప్రపంచీకరణ’ మారీచ మాయామృగజాలం కల్పించింది...
ఈ దారుణకాండలో దోషి ‘ప్రపంచీకరణ’! మొగ్గల వంటి పసిమి తొలగని మిసిమి సొగసుల విద్యార్థులు వికసించి పరిమళించకుండానే రాలిపోయారు. కన్నబిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల హృదయాలలో చెలరేగుతున్న దుఃఖ భావోద్వేగ తరంగాలను ఆవిష్కరించగల దృశ్యాలు లేవు, వివరింపచాలిన అక్షరాలు లేవు! నిన్నటివరకు ఆనంద శోభలతో అలరారిన ఆ పిల్లల తల్లిదండ్రుల ఇళ్ల ప్రాంగణాలు నేడు ‘ఘోర భయంకర ఖేద తమాల వాటికలు..’. వారు ఆత్మహత్యలు చేసుకోలేదు. వారిని ‘గ్లోబరీనా’ ముఠా హత్య చేసింది. ప్రపంచీకరణ వారిని హత్య చేసింది. ఈ హంతక ‘ప్రపంచీకరణ’కు తగిన దండన విధించడం నేరానికి తగిన శిక్ష! లేనట్టయితే దేశవ్యాప్తంగా విద్యారంగంలో మాత్రమే కాదు, అన్ని జీవన రంగాలలోను మరిన్ని భయంకర వైపరీత్యాలు జరిగిపోగలవు. ‘ప్రపంచీకరణ’ హంతకునికి తగిన దండన విధించడం ‘ప్రపంచీకరణ’ ప్రతినిధులైన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ను దేశం నుండి వెళ్లగొట్టడం, భారతీయ జీవన రంగాన్ని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ కబంధ బంధం నుంచి, మారీచ మృగ మాయాజాలం నుంచి విముక్తి చేయడం. ఈ విముక్తి జరిగినట్టయితే ‘గ్లోబరీనా టెక్నాలజీస్’వంటి వాణిజ్య బీభత్స సంస్థలు ‘ఇంటర్ మీడియట్’ పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే దురహంకారపూరిత దుస్సాహసానికి ఒడిగట్టే ప్రమాదం ఉండదు. ఉత్తీర్ణులైన విద్యార్థులు పరీక్షలు తప్పారన్న భ్రాంతి ఏర్పడే వీలుండదు. భ్రాంతికి గురి అయిన చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదు. వివిధ జీవన రంగాలలో భారతీయత అంతరించిపోతున్న ప్రమాదాన్ని ఈ ‘విముక్తి’ద్వారా మాత్రమే నిరోధించగలం...
కానీ విదేశాల పెట్టుబడుల మత్తెక్కి వాణిజ్య సదస్సుల వేదికలపై ‘తైతక్కల’ విన్యాసాలను ప్రదర్శిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, ప్రతిపక్ష రాజకీయవాదులు దశాబ్దుల తరబడి ఈ వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. కృత్రిమ వ్యవసాయ పద్ధతులు రైతన్నల ప్రాణాలను తీస్తుండడం ‘ప్రపంచీకరణ’ ఫలితం. కల్తీ నూనె కల్తీ పాలు కల్తీ తిండి కల్తీ పండ్లు వ్యాపార రంగాన్ని, సామాజిక జీవనాన్ని ముంచెత్తుతుండడం ప్రపంచీకరణ ఫలితం. అడవుల హత్య, హరిత వ్యవసాయ క్షేత్రాల హత్య కొనసాగుతుండడం ప్రపంచీకరణ ఫలితం. ‘ప్లాస్టిక్’ భూతం నిరంతర కోరలు విసురుతుండడం, నదుల నీరు మురికికావడం ప్రపంచీకరణ ఫలితం. మన భాషలు, భావాలు, స్వభావాలు, జీవన రీతులు, విలాసాలు-్ఫ్యషన్స్-, విహారాలు కల్తీ కావడం పేరు ప్రపంచీకరణ. దేశభక్తిని వాణిజ్యసంస్థల పట్ల భక్తి, జాతీయతా నిష్ఠను వాణిజ్య నిష్ఠ తొలగించి వేస్తుండడం ‘ప్రపంచీకరణ’కు విస్తృతి! అయ్యవార్లు కానివారు, పరీక్షా పత్రాలను దిద్దడానికి అర్హతలేని దళారీలు, ‘గ్లోబరీనా’ తొత్తులు ‘ఇంటర్ మీడియట్ విద్యామండలి’ని తప్పుదారి పట్టించగలగడం ప్రపంచీకరణ ఫలితం. వాణిజ్యవేత్తలు, అక్రమాలకు అలవాటుపడిన వారు విద్యారంగంలో చొరబడి వాణిజ్య-కార్పొరేట్- కళాశాలలను, విశ్వవిద్యాలయాలను నిర్వహిస్తుండడం ప్రపంచీకరణ ఫలితం! ఇలాంటి విద్యావ్యవస్థ హృదయం లేని బుద్ధిని పెంచుతోంది, విచక్షణ లేని విజ్ఞానాన్ని పెంచుతోంది, నైతికత లేని విద్యావంతులను తయారుచేస్తోంది, సంస్కారం లేని చదువులను మప్పుతోంది!! ఇలాంటి సంస్కార విహీనులయిన చదువరులు, నైతికత లేని విద్యావంతులు అధికారులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారు. వీరే రాజకీయవేత్తలుగా మారి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో పోటీచేస్తున్న వారిలో ఇరవై ఆరు శాతం నేరాభియోగగ్రస్తులన్నది ‘ప్రపంచీకరణ’ ఫలితం. వాణిజ్య ప్రపంచీకరణ ఐరోపా సామ్రాజ్యవాదుల, చైనీయ విస్తరణవాదుల దురాక్రమణకు మరో పేరు. వాణిజ్య సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్న రాజకీయవేత్తల పరిపాలన వ్యూహంలో ఇలా ఇంటర్ పరీక్షా ఫలితాలను ఒక ప్రభుత్వేతర సంస్థ నిర్ధారించడం ఒక అంశం. విద్యకు సంబంధించిన వ్యవహారంలో మాత్రమే అన్ని జీవన రంగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తుండడం నడుస్తున్న ఘోరం. ఇలా ‘కాంట్రాక్టుల’ను కాజేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు ప్రభుత్వ ధనం, ప్రజల ధనం అక్రమ రీతిలో ఇబ్బడి ముబ్బడిగా అందుతోంది. ఇలా భారీగా అక్రమ లాభాలను పొందుతున్న ప్రభుత్వేతర సంస్థల యజమానులు తాము కొల్లగొట్టిన ప్రజల ధనంలో అక్రమ రాజకీయవేత్తలకు అవినీతి అధికారులకు ‘వాటా’లు పంచుతున్నారు. ఇలాంటి ‘వాటా’ల పంపకంలో బహుశా ఈ ‘మూల్యాంకన’ వాణిజ్యం కూడ భాగం కావచ్చు. ఇదికాకపోయినా, ‘‘అవుతున్నవి’’ అసంఖ్యాకం. ఇది ప్రపంచీకరణం..
దేశమంతటా అధికాధిక ప్రజాప్రతినిధులది, ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలది ఇదే తీరు. రాజకీయవేత్తలే ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ నిర్వాహకులు అటు వాణిజ్య పారిశ్రామికవేత్తలుగా, ఇటు పాలనాకర్తలుగా ద్విపాత్రాభినయం చేస్తుండడం మన ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న వికృత జాడ్యం. ఇప్పుడు పరీక్షా ఫలితాలను నిర్ధారించే బాధ్యతను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించారు. రేపు ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఘనకార్యాన్ని కూడ ప్రభుత్వేతర సంస్థలకు కట్టబెడుతూ చట్టాలను సవరించవచ్చు. బడ్జెట్‌ను తయారు చేయడం, చట్టాల బిల్లులను రూపొందించడం వంటి రాజ్యాంగ విధులను సైతం ప్రభుత్వేతర బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అప్పగించే రోజు సైతం వస్తుందేమో?