సంపాదకీయం

‘ప్రజ్ఞా’ వాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమంత కర్కరే అన్న ఉన్నత పోలీస్ అధికారిని తాను శపించానని అందువల్లనే ఆయన దుర్మరణం పాలయ్యాడని ‘ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సాధ్వి’ ‘ప్రవచించడం’ వౌలిక హైందవ జాతీయ ప్రవృత్తికి విరుద్ధం. ఆ తరువాత ఆమె క్షమార్పణ చెప్పడం ద్వారా తప్పును దిద్దుకొంది. కానీ సంయమనంతోను, ఇతరులకు ఆదర్శంగాను వ్యవహరించవలసిన ఈ సంన్యాసిని ఇలా మాట్లాడడమే విస్మయకరం! మహారాష్టల్రోని మాలేగావ్‌లో 2008లో జరిగిన బీభత్సకాండకు ప్రజ్ఞాసాధ్విని బాధ్యురాలుగా చేయడం మహారాష్ట్ర ప్రభుత్వ ‘బీభత్స వ్యతిరేక దళం’- యాన్టీ టెర్రరిజమ్ స్క్వాడ్- ఏటిఎస్- వారి పొరపాటు కావచ్చు. కానీ ఈ పొరపాటునకు కారణం 2008లోను 2014వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వారి దుశ్చర్య. ఈ దుశ్చర్య పదకొండు ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రజ్ఞాసాధ్విని దోషిగా నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2016లో ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’- నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ- నిర్ధారించడం కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2014వరకు జరిపిన దుశ్చర్యను ధ్రువపరచింది. అయినప్పటికీ ప్రజ్ఞాసింగ్‌కు వ్యతిరేకంగా విచారణ కొనసాగించడానికే ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం 2017లో నిర్ధారించింది. అందువల్ల నిజానిజాలు న్యాయ విచారణలో నిగ్గుతేలవలసి ఉంది. ఏమయినప్పటికీ ‘వోట్లు గుత్తగంప’ రాజకీయాలలో భాగంగా ‘‘హిందూ బీభత్సకారులు’’ దేశంలో ఉన్నట్టు కల్పించిన 2008వ 2014వ సంవత్సరాల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజ్ఞాసింగ్ సాధ్వి, అసీమానంద స్వామి వంటివారు జైళ్లపాలుకావడానికి కారణం. అసీమానంద స్వామి నిర్దోషి అని ఇప్పుడు ధ్రువపడింది. కాంగ్రెస్ దుశ్చర్య బండారం బద్దలైంది. అందువల్ల ప్రజ్ఞాసాధ్వి నిర్బంధంలో ఘోరమైన చిత్రహింసలను అనుభవించడానికి కారణం అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మన దేశంలోని దర్యాప్తుసంస్థలు పాటుపడుతుండడం విమర్శలకు గురి అవుతున్న వాస్తవం. ప్రజ్ఞాసాధ్వి ఆరోపించినట్టు హేమంత కర్కరే- ఏటిఎస్ అధినేత హోదాలో ఆమెను నిర్బంధంలో రాక్షసమైన చిత్రహింసలపాలు చేసి ఉండినట్టయితే అందుకు ఆయనను నిందించడం తగదు, అసలు సూత్రధారి అప్పటి కేంద్ర ప్రభుత్వం! అయినప్పటికీ పగపట్టడం, శపించడం వంటి ప్రవృత్తి భారతీయతకు వ్యతిరేకం! ద్వాపరయుగంలో అశ్వత్థామ అనే గురుపుత్రుడు ఐదుగురు ‘ఉప పాండవుల’ను హత్యచేశాడు. చీకటిలో నిద్రిస్తున్నవారిని అంతమొందించాడు. ఇలా చీకటిలో నిద్రిస్తున్నవారిని, నిరాయుధులను హత్యచేయడం ఆతతాయితనం, బీభత్స పైశాచిక ప్రవృత్తి! అయినప్పటికీ ఉప పాండవుల తల్లి, పాండవ పత్ని అయిన ద్రౌపదీదేవి అశ్వత్థామను క్షమించింది! చారిత్రక మహాపురుషుల, మహాసాధ్వీమణుల ప్రవర్తన తరతరాల ప్రజలకు అనుసరణీయం, ఆచరణీయం! కనీసం ప్రజ్ఞాసింగ్ వంటి ప్రతిష్ఠితులు, ధార్మిక ఆధ్యాత్మిక జీవనులు ద్రౌపదీదేవి చూపిన సంయమనాన్ని అనుసరించ గలగాలి. శపించడం ఋషి లక్షణం కాదు, క్షమించడం ఆర్షధర్మం!
అశోక చక్రపతక ప్రదానం పొందిన అమరవీరుడు హేమంత్ కర్కరేకు వ్యతిరేకంగా ప్రజ్ఞ్ఠాకూర్ సాధ్వి చేసిన వ్యాఖ్యలు భారతీయ సంస్కార పరంపరకు విరుద్ధం! మురికిపట్టిన శరీరాలపై ఎంత కొత్త ‘మురికి’పడినప్పటికీ ఎవరూ పట్టించుకోరు. అమలిన స్వరూపంపై చిన్న మురికి మచ్చపడినప్పటికీ అది ‘పెద్దగా’ కనిపిస్తుంది. ‘మచ్చ’ గురించి ఆర్భాటం జరుగుతుంది, వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. దిగ్విజయ్ సింగ్ వంటి, నవజ్యోత్‌సింగ్ సిద్ధూ వంటి కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్‌కు, జిహాదీ బీభత్సకారులకు అనుకూలమైన ప్రకటనలు ఏళ్లతరబడి చేస్తున్నారు. ఇలాంటివారు మరింత దేశ వ్యతిరేక దుర్గంధం వెదజల్లినప్పటికీ జనం పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు జారడం లేదు, నోళ్లు పారేసుకున్నారు, పారేసుకుంటున్నారు. వీళ్లు నోళ్లుతెరిచిన వెంటనే ‘ఆ నోళ్లలో వాళ్ల కాళ్లు పెట్టుకుంటారన్నది’ కాంగ్రెస్ కార్యకర్తల భయం! వీళ్లు ఇలా నోళ్లు పారేసుకున్నప్పుడల్లా వీరి తరఫున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమార్పణ చెప్పాలని ‘్భరతీయ జనతాపార్టీ’వారు హెచ్చరికలను జారీచేస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ హెచ్చరికలను రాజకీయ విదూషక శిరోమణి రాహుల్ అసలు పట్టించుకోవడం లేదు. ‘‘అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న’’ అని అన్నట్టుగా ఈ దిగ్విజయసింగాదుల కంటె మించిన రీతిలో రాహుల్ జిహాదీ బీభత్సకారులను ‘‘గౌరవిస్తున్నాడు’’. పాకిస్తాన్‌లోని జిహాదీలను ‘‘గారు’’ అని సంబోధించిన రాహుల్ గాంధీ- సిద్ధూ వంటివారి తరఫున ఎలా క్షమార్పణ చెప్పగలడు? హేమంత్ కర్కరేకు వ్యతిరేకంగా నోరుజారిన ప్రజ్ఞాసాధ్వి వెంటనే క్షమార్పణ చెప్పింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ‘భాజపా’ నాయకులు వివరణలు ఇచ్చుకున్నారు. హేమంత కర్కరే 2008 నవంబర్‌లో పాకిస్తానీ జిహాదీలతో ముంబయిలో పోరాడుతూ అమరుడయ్యాడు. అప్పుడు ఆయన మహారాష్ట్ర ‘ఏటిఎస్’ అధిపతి! ప్రజ్ఞాసాధ్వి అనుభవించిన చిత్రహింసలు వైయక్తికం! ఈ వ్యవహారం మొత్తం మన దేశానికి చెందిన అంతర్గత సమస్య! ఈ అంతర్గత సమస్య కర్కరేను, సాధ్విని ప్రత్యర్థులుగా నిలబెట్టి ఉండవచ్చు! కానీ 2008 నవంబర్‌లో కర్కరే పాకిస్తాన్ జిహాదీలతో పోరాడి అమరుడయ్యాడు. బాహ్య శత్రువులతో పోరాడినప్పుడు దేశ ప్రజలందరూ ఒక్కటే! ఈ ప్రజలలో ప్రజ్ఞాసాధ్వి ఉంది, ఆమెను ‘‘హింసించిన’’ హేమంత కర్కరే కూడ ఉన్నాడు! ఇదీ జాతీయ తత్త్వం..ఈ తత్త్వం తరతరాలుగా మానవీయ మార్గదర్శక సూత్రం. ‘మాలో మేము కలహించే సమయంలో మేము ఐదుగురం, వారు నూరు మంది..’- వయం పంచ, శతన్తుతే-అన్నది పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు తమ దాయాదులైన కౌరవుల గురించి ద్వాపరయుగంలో చెప్పిన మాట. ధర్మరాజు అతని తమ్ములైన పాండవులు ఐదుగురు. దాయాదులైన దుర్యోధనాదులు వందమంది. కానీ ఉమ్మడి శత్రువులతో పోరాడే సమయంలో ‘‘కౌరవ పాండవులమైన మేము నూట ఐదుమంది..’’- వయం పంచాధిక శతం- అన్నది ధర్మరాజు చేసిన స్పష్టీకరణ! సామాన్యులకు సైతం ఈ సమైక్య సూత్రం మార్గదర్శకం కావాలి, జాతీయ సమైక్య సంరక్షణకు, ప్రాదేశిక సార్వభౌమ అధికార పరిరక్షణకు ఈ సూత్రం ప్రాతిపదిక. దిగ్విజయ్ సింగ్, ఏఆర్ అంతూలే వంటివారు ఈ సూత్రాన్ని పాటించలేదు, జాతి వ్యతిరేక విషం వెళ్లకక్కారు. ‘‘తనకు హిందూ తీవ్రవాదుల వల్ల ప్రమాదం ఉందని’’ హేమంత కర్కరే 2008 నవంబర్ 26నాటి బీభత్సకాండకు ముందు తనకు చెప్పినట్టు 2010లో దిగ్విజయ్ సింగ్ ప్రకటించాడు. కర్కరే పాకిస్తానీ బీభత్సకారులతో పోరాడుతూ అమరుడయ్యాడు. కానీ దిగ్విజయ్ ధ్రువపడిన పాకిస్తానీ పాపాన్ని కల్పితమైన ‘హిందూ బీభత్సకారుల’పై పెట్టడానికి నిర్లజ్జగా యత్నించాడు, నిర్భయంగా పాకిస్తాన్‌ను సమర్ధించాడు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ భోపాల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నాడు. ప్రజ్ఞాసాధ్వి ఇక్కడ ‘భాజపా’ అభ్యర్థి! 2008లో కేంద్ర మంత్రిగా ఉండిన ఏఆర్ అంతూలే ‘‘హేమంత్ కర్కరే హత్యకు పాకిస్తాన్ జిహాదీలు ‘కారణం కాదన్న’ భావం స్ఫురించేలా వ్యాఖ్యలు చేశాడు, ఫలితంగా పదవిని కోల్పోయాడు!
దిగ్విజయ్ సింగ్ వంటివారు ఇలా పాకిస్తాన్ అనుకూల ప్రకటనలు చేయడం దశాబ్దుల వైపరీత్యం. కానీ ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ వంటి ‘ధర్మప్రచారిక’లు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం తగదు. ఎందుకంటె దిగ్విజయ్ వంటివారిని కాంగ్రెస్ కార్యకర్తలే నిరసిస్తున్నారు, ప్రజలు పట్టించుకోరు. కానీ ప్రజ్ఞాసాధ్వి వంటి ‘ధర్మప్రచారికల’ మాటలను జనం పట్టించుకుంటున్నారు. ‘శ్రేష్ఠుడైనవాడు ఎలా ప్రవర్తిస్తాడో, ఇతరులు కూడా అలానే ప్రవర్తించగలరు..’ అన్నది యదుకుల కృష్ణుడు ద్వాపరంలో పాండవ అర్జునునికి చేసిన గీతాబోధ! ‘శ్రేష్ఠుడు ప్రమాణంగా స్వీకరించిన దానిని ప్రజలు ప్రమాణంగా స్వీకరిస్తారు..’- సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే-! అందువల్ల ప్రజ్ఞాసాధ్వి మాత్రమే కాదు, ఈ దేశంలోని ధర్మాచార్యులందరూ శ్రేష్ఠులు. ఇలాంటి శ్రేష్ఠులు రాజకీయవేత్తలకు మార్గదర్శనం చేయాలి, ప్రజాహిత సాధనలో సహకరించాలి. అంతేకాని ఋషులుగా సంన్యాసులుగా పరివ్రాజకులుగా పరమ హంసలుగా జీవనప్రస్థానం సాగించవలసిన ధర్మాచార్యులు తామే రాజకీయవేత్తలుగా మారకూడదు. ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగానికి, రాజకీయ రంగానికి మధ్య ఉన్న ‘రేఖ’ చెఱగిపోరాదు. ‘చెఱగిపోతే తప్పులేదని చెప్పడం కేవలం’’ప్రజ్ఞావాదం..’ అది ప్రామాణిక వాదం కాజాలదు. ‘ప్రజ్ఞావాదాంశ్చ భాషనే’’- ప్రజ్ఞావాదంతో మాట్లాడుతున్నావు- అని కృష్ణుడు అర్జునుడిని మందలించడం చరిత్ర! అందువల్ల వైయక్తిక ప్రజ్ఞ ప్రాతిపదికగాకాక స్వజాతీయ సాంస్కృతిక తత్త్వం ప్రాతిపదికగా నిర్ధారణ జరగాలి. తరతరాల ఈ నిర్ధారణ ధర్మక్షేత్రం, రాజకీయ క్షేత్రం- వీటి మధ్య సరిహద్దు రేఖ స్పష్టంగా ఉండాలి! వసిష్ఠుడు, విద్యారణ్యుడు సమర్థరామదాస స్వామి వంటి వారు రాజకీయవేత్తలను ‘నడిపించారు’.. తాము స్వయంగా రాజకీయవేత్తలు కాలేదు!