సంపాదకీయం

‘వాగ్దాన’ ప్రాధాన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత తాము ‘అమలు జరుప తలపెట్టిన’ ప్రగతి పథకాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివిధ రాజకీయ పక్షాలవారు తమ వాగ్దాన పత్రాలలో వివరించారు. వివరిస్తున్నారు! ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో గెలవదలచుకున్న ప్రధాన పక్షాలవారు కూడ తమ వాగ్దాన ప్రణాళికలను ఇదివరకే ఆవిష్కరించారు. ‘జాతీయతానిష్ఠ’ భారతీయ జనతాపార్టీవారు సోమవారం ఆవిష్కరించిన ‘సంకల్ప పత్రం’లోని ప్రధాన అంశం! దేశ సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రత ‘జాతీయతానిష్ఠ’ వౌలిక లక్షణం. అంతర్గత భద్రత భౌతిక ఆర్థిక సాంస్కృతిక అంశాలతో ముడివడి ఉంది. ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు బీభత్సపు విస్ఫోటనాలు జరుగక పోవడం భౌతికమైన భద్రత! ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకులను గడుపవలసిన దుస్థితి దాపురించక పోవడం భౌతిక భద్రత! ప్రజలు నిశ్చింతగా నిద్రపోగల సామాజిక వ్యవస్థ నెలకొని ఉండడం భౌతిక భద్రత! ఈ భౌతిక భద్రత ఆర్థిక ప్రగతిని, సాంస్కృతిక సుగతిని సాధించడానికి వౌలికమైన ప్రాతిపదిక.. ‘జాతీయతానిష్ఠ’ ఇలా విస్తృతమైన సమగ్రమైన పరిపాలన సూత్రం! ఆర్థిక భద్రత తాత్కాలిక సంక్షేమంతోను, దీర్ఘకాల అభ్యుదయంతోను ముడివడి ఉంది. సాంస్కృతిక సుగతి ‘ఉత్సవ ప్రవృత్తి’తో మాత్రమేకాక ఈ ‘ఉత్సవ’బుద్ధిని ప్రచోదనం చేయగల వౌలికతత్త్వంపై ఆధారపడి ఉంది. ఈ వౌలికతత్త్వం జాతీయ జీవన స్వభావం! జాతీయ జీవన తత్త్వం ఉత్సవాల ద్వారా, ఉద్యమాల ద్వారా, కార్యక్రమాల ద్వారా, పథకాల ద్వారా పద్ధతుల ద్వారా ప్రస్ఫుటించడం చతుర్ముఖ వికాసం, సర్వతోముఖ ప్రగతి! ఈ జాతీయ జీవన వౌలిక తత్త్వపు ధ్యాస లేని ఉత్సవాలు, ఉద్యమాలు, కార్యక్రమాలు, పథకాలు, పద్ధతులు ‘ భూమిలోకి వేళ్లు దిగని మొక్కల’ వంటివి! భూమిలోకి వేళ్లు దిగని మొక్కలు వృక్షాలుగా ఎదగడం అసంభవం. అందువల్ల తాత్కాలికమైన ఐదేళ్ల ‘అధికార స్థితి’కి లేదా ఐదేళ్ల ‘అధికారచ్యుతి’కి పరిమితమైన ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్న వాగ్దానాలు శాశ్వతమైన వౌలికమైన ప్రభావం కలిగిన జాతీయ తత్త్వానికి అనుగుణంగా ఉన్నాయా? అన్నది ‘నిర్ణాయకులు’ నిర్ధారించదగిన మహావిషయం. నిర్ణాయకులు ‘మతప్రదాతలు’-వోటర్‌లు-! ఈ ఎన్నికలలో మాత్రమే కాదు ప్రతి ఎన్నికలోను నిర్ణాయకులు నిర్ధారించవలసిన అంశం ఇది. ఇదే ‘జనాదేశం’.. ‘వోటరు’లు- రాజకీయ పక్షాలకు ఇచ్చే ఆదేశం! ఒక రాజకీయ పక్షం ‘వాచ్యం’గా ఈ జాతీయతానిష్ఠను ‘వాగ్దాన పత్రం’లో పేర్కొనవచ్చు! మరొక రాజకీయ పక్షం వారు ఇలా ‘వాచ్యం’గా ఈ ‘జాతీయతానిష్ఠ’ను తమ ‘వాగ్దాన పత్రం’లో పేర్కొని ఉండకపోవచ్చు! పేర్కొనక పోయినంత మాత్రాన అలా పేర్కొనని రాజకీయ పక్షాలకు ‘జాతీయతా నిష్ఠ’ లేదనడం సరికాదు! కానీ ఆయా రాజకీయ పక్షాల వాగ్దాన పత్రాలలో ఈ ‘జాతీయతానిష్ఠ’ నిహితమై ఉందా? ధ్వనిస్తోందా? అన్నది ప్రధానమైన అంశం.. గత ఐదేళ్లలో పాలకపక్షం వారి, ప్రతిపక్షం వారి ప్రవర్తన తీరు ప్రాతిపదికగా‘మత ప్రదాతలు’ ఈ ఎన్నికలలో ఈ సంగతిని నిర్ధారిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు అన్వయించే ఈ ప్రాతిపదిక శాసనసభ ఎన్నికలకు సైతం వర్తించనుంది..
అధికార ‘భారతీయ జనతాపార్టీ’- భాజపా-కి ప్రధాన ప్రత్యర్థిగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈనెల రెండవ తేదీన తన వాగ్దాన పత్రాల్ని విడుదల చేసింది. కాంగ్రెస్ కానీ, ‘్భజపా’కాని లేని కూటమి ఒకటి ఎన్నికల తరువాత ఏర్పడి ఆ ‘కూటమి’ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కూడ మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఈ తథాకథిత కూటమిలో దేశంలోని ఏయే ప్రాంతీయ, ‘జాతీయ’పక్షాలు చేరుతాయన్నది ఇంకా తేలలేదు. ఒక ప్రాంతానికి, రెండు ప్రాంతాలకు పరిమిత పక్షాలు కొన్ని ‘జాతీయ రాజకీయ పక్షా’లుగా చెలామణి అవుతున్నాయి. ఈ ‘‘స్వయం ప్రకటిత’’ జాతీయ పక్షాలు, అనేక ప్రాంతీయ పక్షాలు కూడ తమ వాగ్దాన పత్రాలను ఇదివరకు ఆవిష్కరించి ఉన్నాయి. అందువల్ల ఏప్రిల్ పదకొండవ తేదీ నుండి మొదలుకానున్న ‘మత ప్రదానం’- పోలింగ్- ఈ వాగ్దాన పత్రాలలోని వౌలిక ప్రాతిపదిక- జాతీయతా నిష్ఠ-ను నిగ్గుతేల్చనుంది. కాంగ్రెస్ వాగ్దాన పత్రంలో ‘నకిలీ జాతీయతా నిష్ఠ’- సూడో నేషనలిజమ్-ను యద్దేవా చేశారు. అందువల్ల ప్రధాన రాజకీయ పక్షాలలో నిజమైన ‘జాతీయతా నిష్ఠ’ ఏ పార్టీకి ఉందన్నది కూడ ఈ ఎన్నికలలో ‘వోటర్’లు నిగ్గుతేల్చనున్నారు. ఇదే ‘నిగ్గు’ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర శాసనసభ ఎన్నికలలో కూడ తేలనుంది. ఎందుకంటే ‘జాతీయతానిష్ఠ’- నేషనలిజమ్-. ‘్భరత రాజ్యాంగ నిష్ఠ’ లోక్‌సభ ప్రతినిధులకూ, శాసనసభ ప్రతినిధులకూ సమానం! అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పక్షాల వాగ్దాన పత్రాలలో నిహితమై ఉన్న ‘జాతీయతానిష్ఠ’ను సైతం ఈ శాసనసభ ఎన్నికలలో ‘వోటర్’లు నిగ్గుతేల్చనున్నారు. ‘జాతీయతా నిష్ఠ’లో వివిధ మతాల వారి, ప్రాంతాల వారి, భాషా జన సముదాయాల, వర్గాల, కులాల, గిరివాసుల, పురవాసుల, గ్రామవాసుల సర్వ సమగ్ర వికాసం భాగం. అందువల్ల ఎన్నికలు ఏ స్థాయి ‘సభ’కు జరుగుతున్నప్పటికీ దేశం, రాజ్యాంగం, జాతీయత ఒక్కటే..
అన్ని రాజకీయ పక్షాల వాగ్దాన పత్రాలలోను వ్యవసాయ రంగం అత్యధిక ప్రాధాన్యం సముపార్జించుకొనడం హర్షణీయం. భూమి జాతికి సర్వస్వం. అందువల్లనే భూమి మాతృభూమి అయింది. ‘‘న మాతుః పరదైవతమ్’’- తల్లిని మించిన దేవత కాని దేవుడు కాని లేడు- ఇదీ జాతీయతానిష్ఠకు ఆధార భూమిక. భూమి నుండి మానవులతో సహా సమస్త ప్రాణుల ‘అస్తిత్వం’ ఆవిర్భవిస్తోంది. కానీ దశాబ్దుల తరబడి రాజకీయ పక్షాలవారు భూ ఆధార ప్రగతిని పట్టించుకోలేదు. పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్య సంస్థలు, ఉద్యోగాలు, వాటాలు, వాణిజ్యపు వాటాల వినిమయ కేంద్రాలు- స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు.. ఇలా కృత్రిమ ప్రగతి ప్రాతిపదికగా ఆర్థిక వ్యవస్థ సౌష్టవాన్ని నిర్ధారిస్తున్నారు. వాణిజ్యపు వాటాల వినిమయ సూచిక పెరిగితే ప్రగతి.. తగ్గితే ఆర్థిక మాంద్యం! ఇలా పదిహేను శాతం ప్రజల ప్రగతి దేశ ప్రజల మొత్తం ప్రగతికి ‘సూచిక’గా, సంకేతంగా కొనసాగడం అంతర్జాతీయ ఆర్థిక వైపరీత్యం! కొన్ని దేశాలు ‘దళారీ’లు మారాయి. ఆ ‘దళారీ’లు మన ఆర్థిక వ్యవస్థను శాసించడం నడుస్తున్న చరిత్ర! అందువల్ల అత్యధిక శాతం ప్రజలకు జీవన ఆధారమైన ‘వ్యవసాయం’ ‘గ్రామీణ వ్యవస్థ’ల పట్ల ఇప్పుడైన అన్ని రాజకీయ పక్షాలకు శ్రద్ధకలగడం శుభ పరిణామం! ‘‘దేశం ప్రగతిని సాధించాలంటే వ్యవసాయ ఉత్పత్తులు’’ పెరగాలన్నది తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ చెప్పిన మాట! కేంద్ర ప్రభుత్వం ‘కిసాన్ సమ్మాన్’ పేరుతో రైతులకు ఏటా ఆరువేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పదినుండి పదిహేను వేల రూపాయల సాలుసరి సహాయం రైతులకు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగాను, జాతీయస్థాయిలోను వివిధ పక్షాలు ఇప్పుడు మరిన్ని రైతు సంక్షేమ పథకాలను వాగ్దాన పత్రాలలో చేర్చాయి. ‘కిసాన్ సమ్మాన్’ పథకానికి ‘భాజపా’ వాగ్దాన పత్రంలో - సంకల్ప పత్రంలో- రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు! కాంగ్రెస్ పార్టీ అట్టడుగువర్గాల వారికి ఏటా డెబ్బయి రెండు వేల రూపాయలను చెల్లించనుందట! ఈ పథకాలన్నింటికీ స్ఫూర్తి తెలంగాణ ప్రభుత్వం అమలుజరుపుతున్న ‘రైతుబంధు’ పథకమన్నది ’తెలంగాణ రాష్టస్రమితి’ చెబుతున్న మాట! రాజకీయ ప్రత్యర్థులు అంగీకరించినా, అంగీకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వ పథకం దిశానిర్దేశకంగా మారడం ఆవిష్కృతవౌతున్న దృశ్యం..
అన్నిపక్షాలు ఇలా పోటాపోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. చాలా పార్టీలకు వీటిని అమలు జరిపే అవకాశం రానే లేదు. అందువల్ల ‘‘స్వర్గాన్ని’’ కిందికి దించుతామని ప్రతి పార్టీవారు చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాస్తవ భూమికపై నిలబడి ఆలోచించేవారికి మాత్రం స్ఫురిస్తున్నది ఒక్కటే! ‘వాగ్దాన పత్రం’లోని అంశాలను అమలు జరిపే అవకాశం జాతీయ స్థాయిలో ‘్భజపా’కు మాత్రమే ఉంది! ‘భాజపా’ మళ్లీ గెలిచినట్టయితే ఆ పార్టీ ఈ వాగ్దానాలను అమలు జరుపుతుందా?? అన్నది ప్రశ్న.. అయోధ్య రామజన్మభూమి మందిరం, జమ్మూ కశ్మీర్‌కు లభిస్తున్న ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి రద్దు, మహిళలకు చట్టసభలలో అరక్షణలు వంటి అంశాలకు సంబంధించి ‘సంకల్ప పత్రం’లో పొందుపరచిన వాగ్దానాలను ‘భాజపా’ప్రభుత్వం నెరవేర్చగలదా?? ఒకవేళ ‘భాజపా’ ఈ ఎన్నికలలో ఓడినట్టయితే, ఏ ఇతర పార్టీ కూడ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయని స్థితి ఏర్పడుతుంది. కొత్తగా ఏర్పడే ‘కూటమి’వారు కొత్త కార్యక్రమాన్ని ఉమ్మడిగా రూపొందించుకోవాలి. అందువల్ల జాతీయ స్థాయిలో ‘భాజపా’ ప్రత్యర్థులు చేస్తున్న వాగ్దానాలకు ప్రస్తుత ఎన్నికలలో ప్రాధాన్యం సున్న..