సంపాదకీయం

వత్సర శుభోదయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యామిని ముగిసిన క్షణమున
ఆమని శోభలు మెరిసెను,
సుమ దళముల పరిమళముల
అమలిన సీమలు మురిసెను..
జనగణ మానస వనముల
యుగయుగముల ‘ద్యుతి’కలిగెను,
సమయపథం శుభ ‘వికారి’
విమల రథంతో వెలిగెను....
మళ్లీ ఉగాది వచ్చింది, మన ముంగిట సభను తీర్చింది. అనాదిగా కొనసాగుతున్న జగతి జీవన ప్రస్థానంలో ఉగాది ఆగమనం మరో కొత్త సంవత్సరానికి ఉదయం. సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు విశ్వవ్యవస్థలో నిహితమై ఉన్న ‘కాలగమనానికి కొలమానాలు..’ మానవుల పరిమిత జీవన సమయంలో ‘సంవత్సరం’ విలక్షణమైన గణనీయమైన కొలమానం. అపరిమితమైన- తుది మొదలు లేని- విశ్వవ్యవస్థలో ‘సంవత్సరం’ చాల చిన్నది. కానీ సృష్టిక్రమంలో పునరావృత్తం అవుతున్న పరివర్తన క్రమానికి సమగ్రరూపం ‘సంవత్సరం.’ భూమిమీద భూమిని ఆవహించి ఉన్న ప్రకృతిలోను నిరంతరం సంభవించే మార్పులు ప్రతి ఏడాది వ్యవధిలోను, అంతకు పూర్వం ఏడాదిలో వలెనే పునరావృత్తం అవుతుండడం మానవుని జీవన అనుభవం. ఈ పునరావృత్తికి మానవుడు ప్రత్యక్షంగా దర్శించగల సాక్ష్యం సంవత్సరం. అందువల్లనే సంవత్సరాదికి వంద ఏళ్ల మానవ జీవన ప్రస్థానంలో ప్రాధాన్యం సహజంగానే ఏర్పడి ఉంది. ఉగాది ఉదయంలో చైత్రమాసం ఉదయిస్తుంది. వసంత ఋతువు ఉదయిస్తోంది, కొత్త సంవత్సరం ఉదయిస్తోంది! ఈ శుభారంభం చంద్రునితోను, చంద్రునికీ భూమికీ సూర్యునికీ మధ్య అనాదిగా ఏర్పడిన ఉన్న సంబంధంతోను అనుసంధానమై ఉంది. అందువల్ల ఇది చాంద్రమాన సంవత్సరాది. మన దేశంలో అనాదిగా చాంద్రమాన, సౌరమాన, బృహస్పతి మాన పద్ధతులలో కాలాన్ని లెక్కిస్తున్నారు. ఇంకా ‘నక్షత్ర’మానం వంటి ఇతర కాలగణన పద్ధతులున్నాయి. ‘సాయన’ ‘నిరయన’ ‘సావన’ సంవత్సరాలున్నాయి. ఇవన్నీ అనాదిగా హైందవ జాతీయ జీవనంలోని వైవిధ్యరీతులకు నిదర్శనం. వైవిధ్యాలను పరిరక్షించడం, పెంపొందించడం హైందవ జీవన రీతి. వైవిధ్యాలను నష్టం చేయడం హైందవ ప్రవృత్తికాలేదు, కాబోదు, కాజాలదు. కాలగణనకు సంబంధించిన ఈ వైవిధ్యాలు సృష్టిలో సహజంగా ఏర్పడి ఉన్నాయి. ఎవ్వరూ వీటిని కృత్రిమంగా ఏర్పాటు చేయలేదు, కృత్రిమంగా కల్పించలేదు. సృష్టిగత వాస్తవాలను గుర్తించి సమాజ స్థిత జీవన విధానంగా వాటిని ఆచరించడం అనాదిగా భారతీయుని స్వభావం!
వైవిధ్యాల మధ్య సమన్వయం నెలకొని ఉండడం సృష్టి స్వభావం. వైవిధ్యాలు రూపాలు, సమన్వయం ప్రాణం. ఇదీ విశ్వంలోని తుది మొదలు లేని విశ్వవ్యవస్థలోని సహజ వాస్తవం! వైవిధ్యాలు నష్టమైతే సృష్టిలేదు, వైవిధ్యాల మధ్య స్వభావ ఏకత్వం లేకపోతే సృష్టిలేదు. అసంఖ్యాక వైవిధ్య రూపాల విశ్వవ్యవస్థ స్వభావం అద్వితీయం; అసంఖ్యాక వైవిధ్య రూపాల ప్రకృతి స్వభావం ఒక్కటే! సృష్టిగత వాస్తవాలు మానవ జీవన స్థితం కావడం హైందవ జాతీయతత్త్వం లేదా భారత జాతీయ తత్త్వం. యుగయుగాల చరిత్ర ఇందుకు సాక్ష్యం! అందువల్లనే మన దేశంలో అనేక ఇతర రంగాలలో వలెనే ‘కాలగణనం’లో కూడ వైవిధ్యాలు ప్రస్ఫుటించాయి. చంద్రునితో ముడివడ్డ చాంద్రమాన సంవత్సరం ఒక వైవిధ్య రీతి. సూర్యునితో ముడివడిన ‘సౌరమాన సంవత్సరం’ మరో వైవిధ్యం. ‘బృహస్పతి’ గమనంతో ముడిన బార్హస్పత్యమానం. ఇంకా ఉన్నాయి. కానీ ఈ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు, సమన్వయం ఉంది. ఈ సమన్వయం మానవ కల్పితం కాదు, సనాతన-శాశ్వత- ఖగోళ వాస్తవం! భారతీయులు ఈ వాస్తవాన్ని గుర్తించారు. అంతే! ఈ ఖగోళ వాస్తవానికి అనుగుణంగా చాంద్రమాన కాలగణనంలో ప్రతి ముప్పయి మూడు నెలలకు ఒకసారి ‘అధిక మాసం’ ఏర్పడుతోంది. ఫలితంగా మూడువందల అరవై ఐదు రోజుల సౌరమాన- సోలార్- సంవత్సరంతో మూడువందల యాబయిన నాలుగు రోజుల ‘చాంద్రమాన’- లూనార్- సంవత్సరాన్ని సమన్వయం చేసుకుంటున్నారు. ఈ సమన్వయం ఖగోళ వాస్తవం. ఎవరు గుర్తించినప్పటికీ ఎవరు గుర్తించనప్పటికీ వాస్తవం వాస్తవమే! భారతీయులు గుర్తించారు, అందువల్ల ఏ వైవిధ్యాన్ని కూడ తిరస్కరించలేదు, వైవిధ్యాల మధ్య కల సమన్వయాన్ని కూడ గుర్తించారు. ఇదీ ఈ కాలగణన పద్ధతుల ద్వారా అనంత విశ్వంతో భారత జాతీయ సమాజం అనుసంధానమై ఉన్న తీరు. వసంత ఋతువు స్ఫురింపచేస్తున్న వైవిధ్యాల సమాహారం ఇది!
ఈ వాస్తవాన్ని గుర్తించని భారతదేశపు వెలుపలివారు ఒకే ‘కాలగణన’ పద్ధతిని గుర్తించారు. రెండవది వారికి తెలీదు. రెండవ దాన్ని, తమది కాని దాన్ని రెండవ మతాన్ని, రెండవ భాషను, రెండవ కాలగణనాన్ని సహించలేని వైవిధ్య విధ్వంసక ప్రవృత్తికి ‘్భరత్ వెలుపలి’ జాతులలోని అత్యధికులలోని ఈ కాలగణన నిదర్శనం. చంద్రమానం మాత్రమే తెలిసినవారు వంద ఏళ్లను నూటమూడు ఏళ్లుగా లెక్కించారు. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో ఇదీ చరిత్ర. ‘సౌర మానం’ మాత్రమే తెలిసిన ఐరోపా వారు కూడ లెక్క తప్పారు. తప్పులు చేసి దిద్దుకుంటున్నారు.
ఒక నెలలో రెండుసార్లు పున్నమి వస్తుందన్న భ్రాంతిని పొందుతున్నారు. ఈ ‘అనభిజ్ఞత’ వల్లనే వారు ‘బ్లూమూన్’ గొప్ప చారిత్ర ఘట్టమని భావిస్తున్నారు. పున్నమినాడు పుట్టినవారు అమావాస్యనాడు జన్మదినం జరుపుకోవడం కూడ ఐరోపా వారికి ‘‘సౌరమాన, చాంద్రమాన’’ కాలగణనల మధ్యకల సమన్వయం గురించి తెలియకపోవడం! తెలిసిన భారతీయులు అనాదిగా ‘ఒక్క క్షణం’కూడ లెక్క తప్పకుండా కాలాన్ని లెక్కిస్తున్నారు. దాక్షిణాత్య భారతీయుల చాంద్రమాన సంవత్సరం ఇలా చైత్రమాసం శుక్లపాడ్యమి నాడు ఆరంభవౌతోంది. హిమాలయాలలో ఉన్న ‘త్రివిష్టప’- టిబెట్-లో కూడ ఇదే పద్ధతి! మన దేశపు సాంస్కృతిక జాతీయతలో టిబెట్ అనాదిగా భాగమనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! చైత్ర శుక్లపాడ్యమి నాడు వసంత ఋతువుఆరంభవౌతోంది. ఇది దక్షిణ భారతదేశపు చాంద్రమాన పద్ధతి శుక్లపాడ్యమి నుండి అమావాస్య వరకు నెల! ఉత్తర భారతంలో ‘బృహస్పతి’ మానం పాటించేవారు బహుళ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు నెలను లెక్కిస్తారు. ఇవన్నీ వసంత కాలపు వైవిధ్యాలు! మళ్లీ ఈ ఉత్తర, దక్షిణ కాలమాన రీతులు సమన్వయం అయి ఉన్నాయి.
ఈ వైవిధ్యాల భారతీయుల వసంతం ప్రపంచ చరిత్రలో సహిష్ణుతకు మాత్రమే కాదు శాస్ర్తియతకు అద్దం. చంద్రుడు ప్రతిరోజూ ఒక నక్షత్రంతో కలసి ఉదయిస్తాడు. ఇలా కలసి ఉదయించడం భూమిమీద ఆవిష్కృతమయ్యే సాపేక్ష- రిలెటవ్ - దృశ్యం- ఇలా చంద్రుడు పౌర్ణమి నాడు ‘చిత్ర’నక్షత్రంతో కలసి ఉదయించినట్టయితే ఆ పౌర్ణమి ఉన్న నెలకు ‘చైత్రమాసం’ అని భారతీయులు పేరుపెట్టారు. ‘విశాఖ’తో కలిసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించిన నెల వైశాఖ మాసం.. ‘జ్యేష్ఠ’-జ్యేష్ఠమాసం. ఇలా పనె్నండు నెలలకు భారతీయులు పెట్టిన పేర్లు ఖగోళ విజ్ఞాన వాస్తవాలు! పౌర్ణమినాడు చంద్రుడు పూర్వ ఫల్గుని లేదా ఉత్తర ఫల్గుని నక్షత్రాలతో కలసినప్పుడు అది ఫాల్గున మాసం! ఇలా మన ఉగాదికి, వసంతాది ఋతువులకు, చైత్రం వంటి నెలలకు సశాస్ర్తియ ఖగోళ ప్రాతిపదిక ఉంది. వసంతం ఆహ్లాదకరం.. స్వభావాత్మక ప్రవర్తన కల సకల జీవం వసంత ఋతువులలో ఆనందంతో కేరింతలు కొడుతున్నాయి.! మానవులు కూడ వసంత ఋతువులో సంవత్సరాన్ని మొదలుపెట్టాలి. చలితో బిగుసుకొనిపోయే హేమంతంలో సంవత్సరాన్ని మొదలుపెట్టడం సృష్టిక్రమానికి అపవాదం. విశ్వస్వభావానికి వ్యతిరేకం!
చిగురాకుల ఇంటిలోన
చిలుక కులుకులొలుకుతోంది,
ఎల కోయిల కొమ్మలెక్కి
మధుగీతం పలుకుతోంది,
జలజల పారే వాగుల
జలం ‘శ్రుతి’ని కలుపుతోంది,
మిలమిల కిరణాల వెలుగు
వత్సరాది వెలసినది...