సంపాదకీయం

అగ్నికి ఆజ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏ షరతుల మీదైతే కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమయ్యిందో ఆ షరతులు నెరవేరనందున మా ప్రాంతం ఈ దేశం నుంచి కచ్చితంగా విడిపోతుంది.. అప్పుడు మరింత తీవ్రరూపంలో పోరాటం తప్పదు.. ఆ పోరాటానికి నేనే నాయకత్వం వహిస్తా.. రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణలను రద్దు చేస్తే జమ్మూ కశ్మీర్ భారత్ నుంచి విడిపోవడం ఖాయం.. 2020 సంవత్సరం నాటికి మేం కోరుకొనే స్వయం ప్రతిపత్తి ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. భారత్‌కు కశ్మీర్ విధించే ‘డెడ్‌లైన్’ ఇదే.. ఈ విషయాన్ని భాజపా నేతలతో పాటు అందరూ గుర్తుంచుకోవాలి..’- అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆవేశంతో మరోసారి ‘వేర్పాటు గళం’ వినిపించారు. సార్వత్రిక ఎన్నికల సమరం ఊపందుకొంటున్న కొద్దీ మెహబూబాతో పాటు మరికొందరు కశ్మీరీ నేతలు ధిక్కార స్వరం పెంచుతున్నారు. కశ్మీర్‌లోని పలు ప్రాంతీయ పార్టీల నేతలు భారత్ నుంచి విడిపోతామని ఇలా బహిరంగంగా హెచ్చరికలు చేస్తుండడం మునుపెన్నడూ లేని విపరిణామం. జాతీయ వాదాన్ని ప్రధానాంశంగా చేసుకొని భాజపా నేతలు ఎన్నికల సమయంలో తమ స్వరం పెంచడంతో వేర్పాటువాద నేతలు ఇలా తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. కశ్మీర్ లోయలోని అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ వేసిన సందర్భంగా- ‘్భరత్ నుంచి మేం విడిపోతాం..’ అంటూ మెహబూబా వ్యూహాత్మకంగానే ‘వేర్పాటు వాదానికి’ కొత్త పల్లవి అందుకొన్నారు. గతంలో భాజపా మద్దతు ఉపసంహరించడంతో జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఆమె కొన్నాళ్లుగా ‘స్వతంత్ర కశ్మీర్’ కోసం తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తాను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదే సమయంలో భాజపా అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు- ‘కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదన్న’ట్టు మెహబూబా మాటల తూటాలు పేల్చుతున్నారు. ‘2020 సంవత్సరం నాటికి 370, 35ఏ అధికరణలను రద్దు చేస్తామని భాజపా అధ్యక్షుడు అమిత్ షా పదే పదే చెబుతున్నారు. అదే జరిగితే ప్రత్యేక కశ్మీర్ దేశం ఆవిర్భవించడం అనివార్యం..’ అంటూ ఆమె పేర్కొన్నారు. హత్యలు, హింస, మారణకాండలకు పాల్పడేవారిని ఘనంగా సత్కరించే నూతన భారతావని తమకు వద్దని ఆమె పరోక్షంగా ప్రధాని మోదీ చెబుతున్న ‘న్యూ ఇండియా’ నినాదాన్ని అవహేళన చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కొనసాగించకుంటే ఎంతకైనా తెగిస్తామని ఆమె వినిపిస్తున్న నిరసన గళానికి మరికొందరు కశ్మీరీ నేతలు శ్రుతి కలిపారు.
భారత్ నుంచి విడిపోవడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని పీడీపీ అధినేత్రి హెచ్చరించగా, మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాని, రాష్టప్రతి ఉండాలని ఆయన గళమెత్తారు. ‘కశ్మీరీల ఆత్మాభిమానాన్ని హరించేలా చర్యలు తీసుకుంటున్నపుడు, వారి ప్రత్యేకతను గుర్తించనపుడు- ఏభై ఏళ్లు వెనక్కి వెళ్లడమే ఉత్తమం.. 1965 వరకూ కశ్మీర్‌కు ప్రత్యేకంగా ప్రధాని ఉండేవారు.. ఇదేం కొత్త విషయం కాదు.. మాపై రుద్దిన వాటిని తీసివేయాలని మాత్రమే మేం కోరుకొంటున్నాం.. భాజపా అగ్రనేతలు చరిత్రను తెలుసుకోవాలి.. ఏ ప్రత్యేక పరిస్థితుల్లో కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమైందో గమనించాలి.. భారత రాజ్యాంగంలో ఏముందో అవగాహన పెంచుకోవాలి..’ అని ఆయన తన మనసులోని మాటలు వెళ్లగక్కారు. ‘కశ్మీర్ మిగతా రాష్ట్రాల మాదిరి కాదు.. మిగతా రాష్ట్రాలు ఎలాంటి షరతులు లేకుండానే భారత్‌లో విలీనం అయ్యాయి.. కానీ మేం అలా కాదు.. మేం షరతులతో కలిశాం.. ఉచితంగా రాలేదు..’ అని కూడా ఆయన పేర్కొన్నారు. కశ్మీరీలకు ప్రత్యేక గుర్తింపు ఉండి తీరాలని, ఈ ఉద్దేశంతోనే భారత రాజ్యాంగంలో కొన్ని అధికరణలు పొందుపరిచారన్నారు. గతంలో తమకు ప్రత్యేకంగా ప్రధాని, రాష్టప్రతి ఉండేవారని, స్వయం ప్రతిపత్తికి అవకాశం కల్పించే ఆ పరిస్థితిని తిరిగి తాము తెచ్చుకొంటామని ఒమర్ స్పష్టం చేశారు. షరతులతో కలిసిన వారికి ఆ షరతులను అమలు చేయాల్సిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలు కశ్మీరీ ప్రజల్లో సహజంగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సైతం భారత్ వల్ల కశ్మీరీ ప్రజలకు ఏ మాత్రం న్యాయం జరగలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల వేళ ఇలా మాట్లాడడం వేర్పాటువాదానికి పరోక్షంగా మద్దతు తెలిపినట్టయ్యింది. ‘మా ప్రజలకు న్యాయం జరిగి ఉంటే కశ్మీర్‌లో పరిస్థితి ఇలా ఉండేది కాదు.. మేం కోరేది ఒక్కటే.. మా ప్రజలకు న్యాయం చేయండి.. మా హక్కులను తప్ప మేం ఇంకేమీ అడగడం లేదు.. ఇతరులకు చెందిన వాటిని మేం కోరడం లేదు..’ అని ఫరూక్ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘మా హక్కులను మీరు హరించి వేశారు.. వాటిని ఏదో ఒక రోజున తిరిగి మాకు ఇచ్చేయక తప్పదు.. సైనిక బలగాలతో కశ్మీరీ ప్రజలను అణచివేయాలని ప్రయత్నించవద్దు..’ అని కూడా ఆయన స్పష్టం చేయడం... ఎన్నికల్లో లబ్ధి కోసమేనా? వేర్పాటువాదాన్ని మరింత రాజేయడానికా? ‘1953కి పూర్వపు పరిస్థితి వస్తేనే కశ్మీర్ శాంతిస్తుంది..’ అని ఆయన అనడం దేనికి సంకేతం?
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని, రాష్టప్రతి ఉండాలంటూ అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలు చేస్తున్న వాదనలు జాతీయ పార్టీల్లోనూ చర్చకు తెర లేపాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలంటున్న ఒమర్ అబ్దుల్లా వాదన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇకనైనా వౌనం వీడాలని భాజపా అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని ఆయన నిలదీశారు. వేర్పాటువాద పార్టీలతో కాంగ్రెస్ అంటకాగుతోందని అమిత్ షా విమర్శలు గుప్పించారు. వేర్పాటువాద, జాతి వ్యతిరేక శక్తుల డిమాండ్లను తాము ఖండిస్తున్నామని, ‘న్యూ ఇండియా’లో ఇలాంటి వారికి స్థానం లేదని, వీరి ప్రయత్నాలను తాము సాగనివ్వమని భాజపా నేతలు తిప్పికొడుతున్నారు.
కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలు ‘వేర్పాటు గళం’ వినిపిస్తుండగా, జాతీయవాదానికి తాము ప్రతిరూపమని చెప్పుకొంటున్న ‘కమలనాథులు’ కశ్మీర్‌పై తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేస్తున్నారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370, 35ఏ అధికరణాలను తొలగించాల్సిందేనని భాజపా నేతలు తేల్చి చెబుతున్నారు. ఆ అధికరణలను తొలగించే వరకూ తమ పార్టీ ఎజెండాలో కశ్మీర్ అంశం ఉంటుందని పేర్కొంటున్నారు. కశ్మీర్ సమస్య, అయోధ్య రామమందిరం, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు రాజ్యసభలో ప్రస్తుతం తమ పార్టీకి తగినంత బలం లేదని, 2020 నాటికి తమకు ‘పెద్దల సభ’లో పూర్తిస్థాయి మెజారిటీ తథ్యమని, అప్పుడు ఈ వివాదాలన్నింటికీ తప్పక మోక్షం లభిస్తుందని అమిత్ షా చెబుతున్నారు. అప్పటి వరకూ భాజపా మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ ఉంటాయన్నారు. దశాబ్దాల తరబడి కశ్మీర్ సమస్యను గాలికొదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘హిందూ తీవ్రవాదం’ అంటూ దేశ ప్రజలను విభజిస్తోందంటున్నారు. ఇన్నాళ్లూ కశ్మీరీలను అలక్ష్యం చేసింది, ఇపుడు హిందువులను అవమానపరుస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా నాయకులు చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో మరింత వేడిని రగిలిస్తోంది. కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులను కాంగ్రెస్ పార్టీ బిర్యానీ పెట్టి పోషిస్తే, ‘మోదీ సేన’ ( భారత సైన్యం) మాత్రం ఉగ్రవాదులకు బాంబులు, బుల్లెట్లతో దీటైన సమాధానం ఇస్తోందని భాజపా నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో వివాదాన్ని రాజేశాయి. కశ్మీర్‌లో రెండు కుటుంబాలకు పరిమితమైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఓట్ల రాజకీయంతో మరోసారి వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు కశ్మీర్ ప్రజల్లో భావోద్వేగాలను రగిలించడం అగ్నికి ఆజ్యం పోయడం గాక మరేమిటి?