సంపాదకీయం

‘విభజన’ వారసత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖండ భారత విభజనను జరిపించిన వారి పాపం పాకిస్తాన్‌లోని హిందువులను ఏడు దశాబ్దులకు పైగా బలిగొంటుండడం విచిత్రమైన విషాదం. ఈ వికృత విషాదానికి పాకిస్తాన్‌లోని జిహాదీ మూకలు హిందువులను బలిచేస్తున్నారు. హోలీ పండుగ రోజున- ఫాల్గున పూర్ణిమ నాడు- ఇద్దరు హిందూ యువతులను ‘జిహాదీ’లు అపహరించుకొని పోవడం ఈ వికృత విషాద చరిత్రలో వర్తమాన ఘట్టం. పాకిస్తాన్‌లో ఇలా హిందూ బాలికలను జిహాదీ బీభత్సకారులు అపహరించుకొని పోవడం, వారిని మతం మార్చి ఇస్లాం మతస్థులకిచ్చి బలవంతంగా పెళ్లిచేయడం ఇది మొదటిసారి కాదు. 1947 ఆగస్టు 15వ తేదీనుంచి పాకిస్తాన్‌లో లక్షల మంది హిందూ యువతులు ఇలాంటి పైశాచిక కాండకు బలైపోయారు. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య ఇరవై నాలుగు శాతం. నాలుగు నెలల కాలవ్యవధిలో ‘జిహాదీ’లు, పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు కలసికట్టుగా హిందువులను నిర్మూలించారు. 1948 ఆరంభం నాటికి పాకిస్తాన్‌లోని హిందువుల సంఖ్య కేవలం రెండు శాతం. ఈ అవశేష హిందువులను నిశే్శషం చేయడం ఏడు దశాబ్దులుగా ‘జిహాదీ’ల లక్ష్యం! హోలీ పండుగ నాడు ఇద్దరు బాలికల అపహరణ ఇందులో భాగం. పాకిస్తాన్ దినోత్సవాన్ని మన ప్రభుత్వం బహిష్కరించడానికి ఇదంతా నేపథ్యం.. ఢిల్లీలోని పాక్ రాయబారి కార్యాలయం వారు నిర్వహించిన పాకిస్తాన్ ‘జాతీయ’ దినోత్సవ సమావేశాన్ని మన ప్రభుత్వం బహిష్కరించడం ఆశ్చర్యకరం కాదు. 2014 మే 26వ తేదీ తరువాత మన ‘పాకిస్తాన్ విధానం’లో వికసిస్తున్న విజ్ఞతకు ఇది మరో నిదర్శనం.. ఢిల్లీలో పాకిస్తానీ రాయబారి- హైకమిషనర్- కార్యాలయం కొనసాగుతుండడమే విస్మయకరం. ఈ ‘బీభత్స’ దౌత్య కార్యాలయాన్ని మన ప్రభుత్వం మూసివేసి పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను రద్దుచేసుకోవాలన్నది ఈ తథాకథిత - సోకాల్డ్- పాకిస్తానీ జాతీయ దినోత్సవం జరగడానికి ముందురోజున మన దేశంలోని అనేకమంది మేధావులు వ్యక్తం చేసిన ఆకాంక్ష! మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను సాగిస్తున్న దేశాన్ని ‘బీభత్స వ్యవస్థ’గా ప్రకటించడం మన ప్రభుత్వానికి కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగా మనం బీభత్స పాకిస్తాన్ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలన్నది మన దేశం పట్ల మమకారం ఉన్న మన ప్రజల అభిప్రాయం. జమ్మూ కశ్మీర్‌లోని ‘హురియత్’ ముఠా వారిని తమ జాతీయ దినోత్సవ సభకు రమ్మని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం ఆహ్వానించిందట. ఇందుకు నిరసనగా మన ప్రభుత్వం శుక్రవారం జరిగిన పాకిస్తానీ ఉత్సవాన్ని బహిష్కరించింది...
పాకిస్తాన్ రాయబారి కార్యాలయం ప్రతి ఏటా ఇలా తమ జాతీయ దినోత్సవాన్ని జరుపుతూనే ఉంది. ‘హురియత్’ ముఠాలోని ‘మెతక వర్గం’ వారిని, ‘ముదురు వర్గం’ వారిని విందులకు ఆహ్వానిస్తూనే ఉంది. గతంలో ‘నిరసన’లతో సరిపెట్టిన మన ప్రభుత్వం ఈ ఏడాది ఇలా పాకిస్తానీ ఉత్సవాన్ని బహిష్కరించడం మన విధానంలో వచ్చిన అభిలషణీయమైన పరివర్తన. ‘హురియత్’లోని ‘మెతక’ముఠా ఒమర్ ఫరూక్ ఆధ్వర్యంలో నడుస్తోంది. హురియత్‌లోని ‘ముదురు’ ముఠాకు సయ్యద్ అలీషా జిలానీ నాయకుడు. ఈ రెండు ముఠాలవారు కూడ పాకిస్తాన్‌ను బహిరంగంగా సమర్ధిస్తుండడం దశాబ్దుల వైపరీత్యం. ఈ ముఠాల నాయకులను మన ప్రభుత్వం దశాబ్దుల క్రితం నిర్బంధించి న్యాయస్థానం ముందు నిలబెట్టి ఉండాలి. కానీ వీరంతా స్వేచ్ఛగా తిరుగుతూ కశ్మీర్‌లోయలోని స్థానిక, పాకిస్తానీ జిహాదీలను రెచ్చగొడుతున్నారు. మన సైనికులపై, పోలీసులపై రాళ్లు రువ్వుతున్న జిహాదీ మూకలను జిలానీ ‘పిల్లలు’ - బాయ్స్- అని సంబోధిస్తుండడం నడచిపోతున్న దుస్థితి. హురియత్ నాయకులు పాకిస్తాన్‌కు వెళ్లిరావడానికి 2014 మే 26వ తేదీకి ముందు మన ప్రభుత్వం అనుమతించింది. పాకిస్తాన్ మంత్రులు, అధికారులు మన దేశానికి వచ్చినపుడల్లా వారు జిలానీని కలసి చర్చలు జరుపడం మన ప్రభుత్వం అనుసరించిన దశాబ్దుల మెతక విధానానికి ఫలితం.. ‘గత ఐదేళ్లుగా మన ప్రభుత్వం ఈ ‘హురియత్’ ముఠావారితో పాకిస్తానీలను చర్చలు జరుపునివ్వడం లేదు. 2014 ఆగస్టు 25న మన దేశానికీ పాకిస్తాన్‌కూ మధ్య జరుగవలసి ఉండిన ‘కార్యదర్శుల స్థాయి’ చర్చలను మన ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు కారణం ఈ చర్చలకు వారం రోజుల ముందు అప్పటి పాకిస్తానీ రాయబారి అబ్దుల్ బాసిత్ ‘హురియత్’ జిలానీని ఢిల్లీలోకి పిలిపించుకొని చర్చలు జరపడం! అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య కథాకథిత ‘సమగ్ర సంభాషణ’- కాంపోజిట్ డయిలాగ్- మొదలుకాలేదు. ‘హురియత్’ నాయకులు పాకిస్తాన్‌కూ, బీభత్సకారులకు మధ్య ఆర్థిక అనుసంధానకర్తలుగా మారి ఉన్నారు.
జిలానీ వద్ద ఆదాయం పన్ను అధికారులు ఏడు లక్షల రూపాయల అక్రమ విదేశీయ వినిమయ ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఈ ‘ఆర్థిక అనుసంధానానికి’ చిన్న ఉదాహరణ మాత్రమే. హురియత్ మాధ్యమంగా కశ్మీర్‌లోయలోని జిహాదీలకు లభిస్తున్న వందల కోట్ల విదేశీయ, స్వదేశీయ ద్రవ్యం గురించి దర్యాప్తుకొనసాగుతూనే ఉంది. ఈ పాకిస్తానీ దినోత్సవం రోజుననే ఆదాయం పన్నుశాఖవారు పదునాలుగు లక్షల రూపాయల జరిమానాను జిలానీకి విధించడం మరో సమాంతర పరిణామం! కానీ భారత రాజ్యాంగానికి తాము విధేయులం కామని మాటిమాటికీ ప్రకటిస్తున్న ఈ హురియత్ ముష్కరులు స్వేచ్ఛగా తిరుగుతుండడం దేశంలోను, పాకిస్తాన్‌లోను కొనసాగుతున్న భారత వ్యతిరేక బీభత్సకాండకు నైతిక బలం. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో హోలీ పండుగ జరుపుకుంటున్న అతి తక్కువ సంఖ్యలోని హిందువులపై జిహాదీలు దాడులు చేయడం కొనసాగుతున్న బీభత్సకాండలో భాగం. పదహైదు ఏళ్ల ‘రీనా’అన్న హిందూ బాలికను, ఆమె చెల్లెలు పదమూడేళ్ల ‘రవీనా’ను జిహాదీ దుండగులు అపహరించుకొనిపోయారు. ఈ దురాగతం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఈ ఆడపిల్లల తండ్రిని, అన్నను పోలీసులు బెదిరించడం దూషించడం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండలో భాగం. పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించనందుకు నిరసనగా ఈ పిల్లల తండ్రి, అన్న పోలీస్‌స్టేషన్ ఎదుట ‘నిరశన’ దీక్ష జరుపడం సామాజిక మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. మన విదేశాంగశాఖ మంత్రి సుషమా స్వరాజ్ జోక్యం చేసుకున్న తరువాత కాని పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించలేదు. ఈ హిందూ బాలికల అపహరణ గురించి పాకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందట. కానీ ఈ బాలికలను ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చినట్టు కూడ ప్రచారమైంది. ఈ బాలికలు తమను వదలిపెట్టవలసిందిగా జిహాదీలను వేడుకుంటున్న దృశ్యాలు కూడ సామాజిక మాధ్యమాలకెక్కాయి. పాకిస్తాన్ జనాభాలో కేవలం ఒక శాతం ఉన్న హిందువులను భయభ్రాంతులకు గురిచేయడానికై ‘జిహాదీ’లు ఇలా నిర్భయంగా నిర్లజ్జగా ఈ బాలికలు రోదించిన దృశ్యాలను, వారిని మతం మార్చిన దృశ్యాలను ప్రచారం చేస్తున్నారు. గత అనుభవాల ప్రాతిపదికగా ఈ దుండగులు బలవంతంగా ఆ బాలికలను ఇస్లాం మతస్థులకిచ్చి పెళ్లిచేయగలరన్నది ధ్రువపడని భయం. గతంలో ఇలాంటి వందలాది బీభత్స ఘటనలు బయటపడినాయి. పోలీసులు రాజకీయవేత్తలు మాత్రమేకాక పాకిస్తాన్‌లోని న్యాయస్థానాలు సైతం ‘జిహాదీ’లకు మద్దతు పలకడం పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న బీభత్స రాజ్యాంగ వ్యవస్థకు అద్దం. ఐదారు ఏళ్ల హిందూ బాలిక వైజయంతిపై సైతం జిహాదీ రాక్షసులు 2012 డిసెంబర్‌లో అత్యాచారం జరిపారు. అంతకుముందు ముగ్గురు యువతులను జిహాదీలు బలవంతంగా ఎత్తుకొనిపోయి మతం మార్చి పెళ్లిచేసుకున్నారు. ఈ ఘోరాన్ని విచారించిన పాకిస్తానీ సర్వోన్నత న్యాయస్థానం 2012లో వికృతమైన తీర్పు చెప్పింది. ‘‘ఈ యువతులు తమ జిహాదీ భర్తలతో కాపురం చేయవచ్చు. లేదా మళ్లీ హిందువులుగా మారి తమ తల్లిదండ్రులవద్దకు వెళ్లవచ్చు...’’ అంతేకానీ రాక్షస కృత్యం జరిపిన జిహాదీలకు న్యాయస్థానం శిక్ష విధంచలేదు!
పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన హిందువులకు మన దేశం పౌరసత్వం ప్రసాదించడానికై మన ప్రభుత్వం ‘బిల్లు’ను రూపొందించడానికి ఇదంతా నేపథ్యం. కానీ ఈ ‘బిల్లు’ను వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలవారు ఎవరికి మేలు చేస్తున్నారు? ఎవరిని సమర్ధిస్తున్నారు?? నవజ్యోత్‌సింగ్ సిద్ధు, శామ్ పిట్రోడా, దిగ్విజయ్ సింగ్ వంటివారు పాకిస్తాన్‌కు అనుకూలంగాను మన దేశానికి వ్యతిరేకంగాను ఎందుకని ప్రకటనలు చేస్తున్నారు? వీరిని శిక్షించడం ఎప్పుడు?