సంపాదకీయం

నిగ్గుతేలిన నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసీమానందస్వామి ‘బీభత్సకారుడు’ కాదని న్యాయస్థానాలు ధ్రువీకరించడం వాస్తవాలకు అనుగుణమైన పరిణామం. బీభత్స ఘటనలకు సంబంధించిన అభియోగాలలో ఇలాంటి ధర్మాచార్యులను ఇరికించడానికి జరిగిన రాజకీయ షడ్యంత్రం భగ్నం కావడం ముదావహం. ‘సంఝౌతా’ రైలులో 2007 ఫిబ్రవరి 18న జరిగిన బాంబుపేలుళ్లతో అసీమానందస్వామికి ఎలాంటి ప్రమేయం లేదన్నది ‘హరియాణా’లోని ‘పంచకుల’ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం చేసిన నిర్ధారణ! అసీమానందస్వామితోపాటు అభియోగగ్రస్తులైన కమల్ చౌహాన్, రాజేంద్ర చౌదురి, లోకేశ్ శర్మ అన్న మరో ముగ్గురు నిందితులు కూడా నిర్దోషులన్నది ‘పంచకుల’ పట్టణంలోని ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పు. దీంతో మూడు బీభత్స ఘటనలలో అసీమానందను ఇరికించడానికి దశాబ్దికి పైగా జరిగిన కుట్ర భగ్నమైంది. ‘‘హిందూ బీభత్సకాండ’’ అన్న పదజాలాన్ని ప్రచారం చేసి స్వజాతిని, స్వదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో అప్రతిష్ఠపాలు చేయడానికి దుర్బుద్ధి పూర్వకంగా ‘కృషి’ చేసిన రాజకీయ జీవుల పన్నాగం వమ్మయిపోయింది. ఈ రాజకీయ జీవులలో కొందరు 2004- 2014 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు. 2007 మే 18వ తేదీన హైదరాబాద్‌లోని ‘మక్కామసీదు’లో జరిగిన పేలుళ్లకు ‘‘సూత్రధారుడన్న’’ అభియోగంపై 2010 నవంబర్ 19న అసీమానందస్వామిని ‘కేంద్ర నేర పరిశోధక మండలి’- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్-సిబిఐ-వారు అరెస్టు చేయడం ‘‘ఇరికించే’’ కుట్రకు ఆరంభం. మక్కామసీదులో జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ పైశాచిక కాండను నిర్వహించిన నేరస్థులను వదలిపెట్టి, అసీమానందను ఇతర జాతీయ సంస్థలకు చెందిన నిరపరాధులను ‘‘శిక్షించడానికి’’ దర్యాప్తు సంస్థలు పూనుకొనడం ‘‘హిందూ బీభత్సం- హిందూ టెర్రర్’’ గురించి ప్రచారం చేయడానికి కొనసాగిన రాజకీయవాదుల కుట్రలో భాగం. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ఒక ‘దర్గా’లో 2007 అక్టోబర్ 11వ తేదీన జరిగిన పేలుడు ఫలితంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం మరో బీభత్స ఘటన! ఈ నేరంలో కూడ అసీమానందను మరో ఆరుమందిని ఇరికించే ప్రయత్నాన్ని జయపూర్ ప్రత్యేక న్యాయస్థానం వమ్ము చేసింది. ఈ బీభత్సకాండతో కూడ అసీమానందకు ఎలాంటి సంబంధం లేదని ధ్రువపడింది. అసీమానందస్వామి, మరో ఆరుగురు నిందితులు నిర్దోషులని 2017 మార్చి ఎనిమిదవ తేదీన రాజస్థాన్ రాజధానిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. భాగ్యనగరంలోని మక్కామసీదులో జరిగిన బీభత్సకాండ ఘటనతో అసీమానందకు కాని మరో నలుగురు నిందితులకు కాని ఎలాంటి సంబంధం లేదన్నది 2018 ఏప్రిల్ 16న ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పు. ‘సంఝౌతా’ రైలులో జరిగిన పేలుళ్లతో కానీ దగ్ధకాండతో కానీ అసీమానందకు కానీ మిగిలిన ముగ్గురు నిందితులకు కానీ ప్రమేయం లేదన్నది ఇపుడు బుధవారం నాడు ‘పంచకుల’ న్యాయస్థానం చేసిన నిర్ధారణ...
‘‘హిందూ బీభత్సకారులు- హిందూ టెర్రరిస్టులు- కూడ ఉన్నారు’’ అని ప్రచారం చేయడానికి జరిగిన రాజకీయ కుట్ర ఇలా ఈ మూడు న్యాయ నిర్ధారణల ద్వారా భగ్నం కావడం వాస్తవాలకు అనుగుణంగా జరిగిన పరిణామం. ‘హరియాణ’ రాష్ట్రంలోని పానిపట్టు వద్ద 2007 ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ‘సంఝౌతా’ ఎక్స్‌ప్రెస్ రైలు పెట్టెలలో పేలుళ్లు జరిగాయి. మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి పాకిస్తాన్ సరిహద్దులోని ‘అత్తారి’ స్టేషన్‌కు వెడుతుండిన ఈ రైలులో జరిగిన ఘోర బీభత్సకాండకు అరవై ఎనిమిది మంది బలైపోయారు. వరుసగా ఒకే సంవత్సరంలో జరిగిన ఈ మూడు బీభత్స ఘటనలను - ‘సంఝౌతా’, మక్కామసీదు, అజ్మీరు దర్గాలలో జరిగిన హత్యాకాండలను- పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు నిర్వహించారన్నది ‘‘ధ్రువపడని’’ వాస్తవం. ‘సంఝౌతా’ రైలులో పథకం ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘లష్కర్ ఏ తయ్యబా’ ముఠావారు ప్రధాన పాత్ర పోషించినట్టు 2017 జూలైలో సఫ్దార్ నాగోరి అనే ‘టెర్రరిస్టు’ వెల్లడించాడు. ఈ వెల్లడికి సంబంధించిన కథనాన్ని ఒక ప్రముఖ ‘దృశ్యమాధ్యమ స్రవంతి’- టెలివిజన్ ఛానల్- వారు ప్రచారం చేశారు. ‘లష్కర్’ జిహాదీ ముఠావారు ‘సిమి’ ముఠాకు బాంబులను ఇతర మారణాయుధాలను సరఫరా చేసినట్టు ‘నాగోరి’ వెల్లడించాడు. ఇలా పాకిస్తాన్‌కు చెందిన ‘జిహాదీ’లు ‘సంఝౌతా’ బీభత్సకాండను నిర్వహించారన్నదానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. ఈ ప్రాథమిక సాక్ష్యాధారాలు పదేళ్లవరకు వెల్లడికాకపోవడం విచిత్రం. 2007లో రైలులో బాంబులు పేలితే 2017 వరకు దర్యాప్తుసంస్థలు సరైన దిశలో దర్యాప్తునకు పూనుకోలేదు. ‘‘హిందూ టెర్రరిస్టుల’’ను - లేని హిందూ బీభ్సకారులను- ‘‘కనిపెట్టడానికి’’ 2014వరకు జరిగిన రాజకీయ ‘షడ్యంత్రం’ ఈ జాప్యానికి కారణం. ‘సిమి’- స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా- నిషిద్ధ జిహాదీ ముఠాకు చెందిన ‘అబ్దుల్ రజ్జాక్’ అనేవాడు ‘సంఝౌతా’ బీభత్సకాండను నిర్వహించాడన్నది దర్యాప్తుబృందాలకు సఫ్ధార్ నాగోరి చెప్పిన వాస్తవం...
అందువల్ల మక్కామసీదులోను, అజ్మీర్ దర్గాలోను హత్యాకాండ జరిపించినది పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’ ముష్కరులేనన్నది స్పష్టం. ‘నాగోరి’ వెల్లడించిన వాస్తవం ఆధారంగా ‘సంఝౌతా’ రైలులోను, ఇతర రెండుచోట్ల హత్యాకాండ జరిపించిన అసలు నేరస్థులను పసికట్టడానికి ఇప్పుడు మళ్లీ పరిశోధన జరగాలి. హంతకులను పట్టుకొని న్యాయస్థానాల ముందు నిలబెట్టడానికి ప్రయత్నం జరగాలి. ఈ నేరస్థులు మన దేశంలోనే నక్కి ఉండవచ్చు లేదా పాకిస్తాన్‌లో సురక్షితంగా తిష్ఠవేసుకొని మన దేశాన్ని వెక్కిరిస్తూ ఉండవచ్చు. ‘సంఝౌతా’ రైలు పాకిస్తానీలు మన దేశానికి వచ్చిపోవడానికి ప్రధానంగా ఉపకరించింది. వ్యాపారుల పేరుతో, విహార యాత్రికుల పేరుతో, ఇతర యాత్రికుల పేరుతో ఎంతమంది పాకిస్తానీ బీభత్సకారులు ‘నకిలీ పత్రాల’తో ఈ రైలులో ప్రయాణించారన్నది ఎప్పటికీ వెల్లడికాదు. కానీ 2007లో జరిగిన పేలుళ్లకు రైలులో ప్రయాణిస్తుండిన పాకిస్తాన్ పౌరులు ఎక్కువమంది బలైపోయారు. మిగిలిన అభాగ్యులు మన దేశానికి చెందినవారు. ఇలా హతులలో ఎక్కువమంది పాకిస్తానీ పౌరులు కావడం వల్ల దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి ఆనాటి ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు వీలు కలిగింది. ‘‘పాకిస్తానీ జిహాదీలు పాకిస్తాన్ పౌరులను ఎందుకు చంపుతారు? జిహాదీలు ఇస్లాం మతస్థులు. అందువల్ల వారు ఇస్లాం మతస్థులను ఎందుకు హత్యచేస్తారు?’’ అన్న వాదం వినిపించడానికి వీలయింది. ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’’-ఐఎస్‌ఐ-వారి ఎత్తుగడలో భాగం. ‘జిహాదీ’ల నుంచి దృష్టిని మళ్లించడమేకాక మన దేశంలో మత వైరుధ్యాలను సృష్టించడం ఈ ఎత్తుగడ. ‘జిహాదీ’లు పాకిస్తాన్‌లో ఇరాక్‌లో సిరియాలో అఫ్ఘానిస్థాన్‌లో ఇతర ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాలలో భయంకర బీభత్సకాండను జరుపుతున్నారు. అందువల్ల ‘జిహాదీ’లు ఇస్లాం మతస్థులయినంత మాత్రాన ఇస్లాం మతానికి చెందిన సాధారణ ప్రజలకు వారితో సంబంధం లేదు. మన దేశంలోని సాధారణ ముస్లింలలో అత్యధిక శాతం ‘జిహాదీ’లను నిరసిస్తున్నారు, అసహ్యించుకొంటున్నారు, అభిశంసిస్తున్నారు. అందువల్ల ‘సంఝౌతా’, ‘మక్కామసీదు’, ‘అజ్మీర్ దర్గా’లలో జరిగిన హత్యాకాండను పాకిస్తానీ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు నిర్వహించిన వాస్తవం న్యాయస్థానాలలో నిగ్గుతేలితే ఈ దేశంలోని మిగిలిన మతాలవారితోపాటు ఇస్లాం మతస్థులు కూడ సంతోషిస్తారు...
కానీ రాజకీయ అవకాశాదులు ఈ వాస్తవం వెల్లడికాకుండా 2014 మే 25వ తేదీవరకు అడ్డుకోవడం చరిత్ర. ‘‘హిందూ టెర్రరిస్టుల’’ను కవ్వించినట్టయితే ఈ దేశంలోని ఇస్లాం మతస్థులు, సంతోషిస్తారని మూకుమ్మడిగా ఎన్నికలలో తమకు వోట్లువేస్తారని ఈ రాజకీయ అవకాశవాదులు కలలు కన్నారు, భ్రాంతి చెందారు. కానీ ‘జిహాదీ’ బీభత్సకారులను సమర్ధించబోమన్నది ఈ దేశంలోని అన్ని మతాలవారు రాజకీయ అవకాశవాదులకు పదే పదే నేర్పుతున్న గుణపాఠం. ‘పంచకుల’ న్యాయస్థాన నిర్ణయం ఈ పాఠానికి అనుగుణం!!