సంపాదకీయం

అవతరించిన ‘లోక్‌పాల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లోక్‌పాల్’ వ్యవస్థ ఏర్పడడం చారిత్రక శుభ పరిణామం. ఉన్నతోన్నత స్థాయి ‘ప్రభుత్వ అవినీతి’ని నిరోధించడానికి దశాబ్దుల తరబడి జరిగిన సంఘర్షణకు పరాకాష్ఠ లోక్‌పాల్ నియామకం. సర్వోన్నత విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ మంగళవారం మొట్టమొదటి ‘లోక్‌పాల్’గా నియుక్తుడు కావడం అవినీతి నిరోధక విచారణ ప్రక్రియ వేగవంతం కావడానికి దోహదం చేసిన చారిత్రక ఘట్టం. 2013 డిసెంబర్ 18వ తేదీన పార్లమెంటు ‘లోక్‌పాల్’ బిల్లును ఆమోదించిన తరువాత దాదాపు ఐదున్నర ఏళ్లు గడచిపోవడం రాజకీయ విలంబనకు, ప్రభుత్వ వ్యవస్థలో నిహితమై ఉన్న అలసత్వానికి నిదర్శనం. సర్వోన్నత న్యాయస్థానం వారు పదే పదే అదలించినప్పటికీ ప్రభుత్వంలో కదలిక రావడానికి ఇనే్నళ్లు పట్టింది. ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించక పోవడం ఈ విలంబనకు మరో కారణం! ప్రధానమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు, ఉన్నత అధికారులకు వ్యతిరేకంగా వచ్చే అవినీతి ఆరోపణలను సత్వరం విచారించి ప్రాథమికంగా నిజానిజాలను నిర్ధారించడానికి ‘లోక్‌పాల్’ వ్యవస్థ దోహదం చేయగలదు. లోక్‌పాల్‌తోపాటు ఎనిమిది మంది సభ్యులు కూడ ‘లోక్‌పాల్ సంస్థ’లో పనిచేయాలన్నది 2014 జనవరి 16వ తేదీ నుండి అమలులోకి వచ్చిన చట్టంలోని నిబంధన. వీరిలో నలుగురు న్యాయవ్యవస్థకు చెందినవారు, మిగిలినవారు వివిధ ప్రభుత్వ రంగాలకు చెందినవారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ లోక్‌పాల్‌తోపాటు సభ్యులను కూడ నియమించడంతో 1968లో తొలిసారిగా మొదలైన ‘లోక్‌పాల్’ ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది. రాష్ట్రాల స్థాయిలో ‘లోకాయుక్త’లను నియమించాలని కూడ 2014 నాటి లోక్‌పాల్ చట్టంలో నిర్దేశించారు! దీంతో ‘ఘరానా’ అవినీతిపరులను ‘‘సత్వర విచారణ జరిపి శిక్షించే న్యాయప్రక్రియ’’కు సరికొత్త శ్రీకారం చుట్టినట్టయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత అధికారుల, రాజకీయ నిర్వాహకుల అవినీతిని విచారించడానికి ఏర్పాటవుతున్న ప్రత్యేక న్యాయస్థానాల తీర్పులు వెలువడడానికి ఏళ్లతరబడి కాలయాపన జరుగుతుండడం నడుస్తున్న కథ. ఎన్నిక అవుతున్న ప్రజాప్రతినిధుల ‘అవినీతి’ని- వారికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు దాఖలయ్యే సందర్భాలలో- విచారించి తీర్పుచెప్పే ప్రక్రియ ఏడాది కాలంలో పూర్తికావాలన్న 2014 నాటి సర్వోన్నత న్యాయ నిర్ణయానికి ఈ ‘విలంబనం’ నేపథ్యం. రాజకీయ అవినీతిని విచారించే న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని 2017 నవంబర్‌లో కూడ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దాఖలయి ఉన్న దాదాపు పదహార వందల అవినీతి, ఇతర నేరాలను విచారించడానికి వీలుగా పనె్నండు ప్రత్యేక న్యాయస్థానాలను నెలకొల్పుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబర్‌లో ప్రకటించింది. ఈ అభియోగాలను ఏడాదిలోగా విచారించి తీర్పులు చెప్పాలన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ. ఏడాది గడిచిపోయింది. ఎన్ని అభియోగాలపై విచారణ పూర్తయింది? ఎంత మంది ప్రజాప్రతినిధులు నేరస్థులుగా ధ్రువపడినారు? ఎంతమంది నిర్దోషులుగా నిగ్గుతేలారు? అన్న వివరాలు వెల్లడయిన దాఖలా లేదు. తొలి ‘లోక్‌పాల్’ నియామకానికి ఇదంతా నేపథ్యం. ఆరోపణలు- ఉన్నత స్థాయి సార్వజన సేవకుల- పబ్లిక్ సర్వెంట్స్-కు వ్యతిరేకంగా- వెలువడిన తరువాత సంవత్సరంలోగా విచారణ పూర్తికావడానికి ‘లోక్‌పాల్’ వ్యవస్థ చేసే దర్యాప్తు దోహదం చేయగలదా? అన్నది వేచి చూడదగిన అంశం! కనీసం రెండుమూడు ఏళ్లలోనైనా మొత్తం న్యాయ ప్రక్రియ పూర్తి అయితే జనం సంతోషిస్తారు, న్యాయ దేవత సంతోషిస్తుంది..
ప్రత్యేక న్యాయస్థానాలు విచారించి చెపుతున్న తీర్పులపై ఉన్నత న్యాయస్థానాలకు, సర్వోన్నత న్యాయస్థానానికి ‘అప్పీలు’ చేయడానికి వీలుంది. దీనివల్ల నిజానిజాలు నిగ్గుతేలడంలో జాప్యం ఏర్పడుతోంది. ‘లోక్‌పాల్’ ఏర్పాటుతో ఈ జాప్యం తగ్గిపోగలదు. ఎందుకంటె ‘లోక్‌పాల్’ నిర్ణయాల ప్రాతిపదికగా, ‘లోకాయుక్త’ దర్యాప్తు ప్రాతిపదికగా దాఖలయ్యే అభియోగాలకు వివిధ స్థాయిలలో ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. లోక్‌పాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినట్టయితే, ఈ దర్యాప్తు ప్రాతిపదికగా అభియోగాలు దాఖలు చేయడానికి ఏ ఇతర రాజ్యాంగ వ్యవస్థల అనుమతి అవసరం లేదు. దర్యాప్తు ప్రారంభించడానికి సైతం ‘లోక్‌పాల్’ నిర్ధారించడమే తుది నిర్ణయం. ఉదాహరణకు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కాని మంత్రులకు వ్యతిరేకంగా కాని ‘‘రాష్టప్రతి ఆమోదం లేకుండానే’’ దర్యాప్తును ప్రారంభించడానికి వీలుంది. ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు వ్యతిరేకంగా ‘లోక్‌పాల్’ తనంత తాముగా నేర విచారణ జరుపవచ్చు. ఇతరులు దాఖలు చేసే ఆరోపణల ప్రాతిపదికగా కూడ ‘లోక్‌పాల్’ నేర పరిశోధన కొనసాగించగలదు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా దాఖలయ్యే ఆరోపణలను మాత్రం మూడింట రెండువంతుల సభ్యుల ఆమోదంతో మాత్రమే లోక్‌పాల్ దర్యాప్తును జరపడానికి వీలుంది. అంటే ‘లోక్‌పాల్’ సంస్థలోని అధ్యక్షుడు, ఎనిమిది మంది సభ్యులతో ఆరుగురు అంగీకరించాలి! విదేశాల నుంచి పది లక్షల రూపాయలు అంతకంటె ఎక్కువ విరాళాలను పొందే స్వచ్ఛంద సంస్థల అవినీతిని మాత్రమే ‘లోక్‌పాల్’ విచారించగలదు..
లోక్‌పాల్ వ్యవస్థీకృతం కావడానికి నాలుగు దశాబ్దులకు పైగా జాప్యం జరగడానికి ప్రధాన కారణం అధికాధిక రాజకీయ పక్షాలకు ఈ వ్యవస్థ ఏర్పడడం పట్ల ఇష్టం లేకపోవడం. ఎందుకంటె రాజ్యాంగ ప్రక్రియలో ‘రాజకీయ అవినీతి’ వికృతంగా తిష్ఠవేసి ఉంది. తమపై ‘అంకుశం’ ఎత్తగల వ్యవస్థల్లో నిబంధనలు ఏర్పడక పోవడం అత్యధిక ప్రజాప్రతినిధులకు ఇష్టం. ‘సమాచారం పొందగల హక్కు’ పరిధిలోకి రాజకీయ పక్షాలు పొందే విరాళాల వివరాలను చేర్చరాదన్న విషయంలో దాదాపు అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరి ఉండడం చరిత్ర. అందువల్లనే 1968లో రూపొందిన ‘లోక్‌పాల్’ బిల్లులో ప్రధానమంత్రిని ‘లోక్‌పాల్’ దర్యాప్తు పరిధి నుంచి మినహాయించడంతో వివాదం మొదలైంది. బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ, రాజ్యసభలో చర్చ జరగలేదు. 1971-1977 సంవత్సరాల మధ్య కాంగ్రెస్‌కు పార్లమెంటు ఉభయ సభలలో భారీ ‘సంఖ్యాబాహుళ్యం’ -మెజారిటీ- ఉన్నప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘లోక్‌పాల్’ ఏర్పాటుకు పూనుకోలేదు. 2011వరకూ ఏ ప్రధాన రాజకీయ పక్షానికి కాని ‘లోక్‌పాల్’ గురించి పట్టకపోవడం చరిత్ర. మహారాష్టల్రోని ‘రాలేగన్ సింధీ’ గ్రామాన్ని దేశంలోనే అత్యంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలిగిన అన్నాసాహెబ్ హజారే 2011లో ఉద్యమించిన తరువాత మాత్రమే ‘లోక్‌పాల్’ సంగతి పాలకులకు ప్రతిపక్షాలకు మళ్లీ గుర్తునకు వచ్చింది. అన్నాహజారే ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రజాదరణ లభించడం, రామ్‌దేవ్ బాబా వంటి ధర్మాచార్యులు ఉద్యమానికి మద్దతు పలకడం రెండేళ్లపాటు జరిగిన ‘లోక్‌పాల్’ పరిణామక్రమంలో భాగం. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ‘నిరశనలు’, నిరసనలు, ప్రదర్శనలు రాజుకొనడం ఇందుకు కారణం. మళ్లీ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా దర్యాప్తుజరిపే అధికారం ‘లోక్‌పాల్’కు ఉండాలా? వద్దా? అన్న మీమాంస.. చివరికి ‘బిల్లు’ పార్లమెంటులో ఆమోదం పొందడం! ఆ తరువాత కూడ ఈ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయడం.. ఇలా వివిధ దశలను దాటి ‘లోక్‌పాల్’ అవతరించడం చారిత్రక శుభ ఘట్టం. తాను చేపట్టిన దర్యాప్తునకు ‘సిబిఐ’ సహా ఏ పరిశోధక సంస్థనైనా వినియోగించగల అధికారం ‘లోక్‌పాల్’కు ఉంది. అందువల్ల దర్యాప్తు సంస్థలను రాజకీయవేత్తలు నిర్దేశించడం కాని, నిర్దేశిస్తున్నట్టు ప్రత్యర్థులు ఆరోపించడం కాని ఇకపై ఉండకపోవచ్చు. దర్యాప్తుల ప్రాతిపదికగా అభియోగాలను రూపొందించి దాఖలు చేయడానికి ‘లోక్‌పాల్’ పరిధిలో ప్రత్యేక వ్యవస్థ-ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్- ఏర్పడనుంది. ఈ అభియోగాలను విచారించడానికై ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పడనున్నాయి.
‘లోక్‌పాల్’ను రాజకీయం చేయడం ఆరంభం నుండీ సమాంతర ప్రక్రియ. ఈ ప్రక్రియను ఇప్పుడు ‘కాంగ్రెస్’ కొనసాగిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లోక్‌పాల్‌ను ఎంపికచేసే ‘సంఘం’లో సభ్యుడు. కానీ ప్రస్తుత లోక్‌సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్షం లేదు. అయినప్పటికీ ప్రధాని నాయకత్వంలోని ‘ఎంపిక సంఘం’ వారు కాంగ్రెస్ నాయకుడిని ‘‘ప్రత్యేకంగా’’ సమావేశాలకు ఆహ్వానించారు. ప్రతి సమావేశాన్నీ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే బహిష్కరించాడు! ‘లోక్‌పాల్’ కోసం హజారే జరిపిన ఉద్యమాన్ని అరవింద్ కేజరీవాల్ వంటివారు రాజకీయాలకు ఉపయోగించుకోవడం మరో విపరిణామం. కేజరీవాల్ ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’ని స్థాపించాడు. ఢిల్లీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాగలిగాడు! ఇకనైనా ‘లోక్‌పాల్’ వ్యవస్థ రాజకీయాల ‘దాడి’కి గురికాకుండా ఉండాలన్నది జనం ఆకాంక్ష..