సంపాదకీయం

చైనాకు విరుగుడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిబెట్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడం మన సరిహద్దుల భద్రతను, వ్యూహాత్మక భద్రతను పెంపొందించుకొనడానికి దోహదం చేయగల పరిణామం. ఈ చారిత్రక భౌగోళిక వాస్తవాన్ని మన ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించగలగాలి. అఝార్ మసూద్ అనే పేరుమోసిన పాకిస్తానీ బీభత్సకారుడిని ఐక్యరాజ్యసమితిలో చైనా నిర్లజ్జగా సమర్ధిస్తూ ఉండడం ఇందుకు తక్షణ నేపథ్యం. మన దేశానికి వ్యతిరేకంగా చైనా దశాబ్దుల తరబడి భౌతిక, ఆర్థిక, వ్యూహాత్మక, దౌత్యదౌర్జన్యాన్ని కొనసాగిస్తుండడం సుదీర్ఘ పూర్వరంగం. ఈ దౌర్జన్యం, ఈ దురాక్రమణ 1949నుండి కొనసాగుతోంది. 1949వ, 1959వ సంవత్సరాల మధ్య చైనా టిబెట్‌ను దురాక్రమించడం, దిగమింగడం మన దేశానికి వ్యతిరేకంగా చైనా దురాక్రమణ మొదలుకావడానికి ఏకైక ప్రాతిపదిక.. 1949కి పూర్వం వలె టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండినట్టయితే చైనాతో మనకు సుదీర్ఘమైన సరిహద్దు ఏర్పడి ఉండేది కాదు. చైనా మన దేశంపై 1962లో దురాక్రమించడానికి 1959నుంచి మన లడక్‌లోకి చొరబడడానికి ఏకైక కారణం టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించుకొనడం. టిబెట్ మన దేశానికి ఉత్తరంగాను, చైనాకు దక్షిణంగాను 1959వరకు నెలకొని ఉండిన స్వతంత్ర దేశం. 1959 తరువాత కూడ యథాపూర్వంగా ఈ భౌగోళిక స్థితి కొనసాగి ఉండినట్టయితే టిబెట్‌ను- దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంకల సువిశాల టిబెట్‌ను- దాటుకొని వచ్చి చైనా 1962లో మన దేశంలోకి చొఱబడి ఉండేది కాదు, మన జమ్మూకశ్మీర్‌లోని ఈశాన్య ప్రాంతంగుండా టిబెట్‌నూ తమ అధీనంలో ఉన్న ‘సింకియాంగ్’నూ కలుపుతూ రహదారులను నిర్మించి ఉండేది కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం తన దురాక్రమణలో ఉన్న మన కశ్మీర్ ఉత్తర భాగంలో చైనాకు దాదాపు ఆరువేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పగించి ఉండేది కాదు. ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్’లో చైనా పారిశ్రామిక పథకాలను ప్రారంభించగలిగి ఉండేది కాదు. టిబెట్‌ను చైనా దురాక్రమించిన తరువాతనే ఇవన్నీ జరిగిపోయాయి. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ‘గ్వాడార్’ ఓడరేవును ‘సింకియాంగ్’లోని వాణిజ్య కేంద్రమైన ‘కస్‌గఢ్’తో అనుసంధానం చేస్తూ చైనా పాకిస్తాన్ పొడవునా ‘ఆర్థిక వాణిజ్య’ పధాన్ని- ఎకనామిక్ కారిడార్-ను నిర్మిస్తోంది. ఇలా పాకిస్తాన్ చైనాల మధ్య ఆర్థిక, రక్షణ, వ్యూహాత్మక, దౌత్య సంబంధాలు పెంపొందడం అఝార్ మసూద్ వంటి భారత వ్యతిరేక బీభత్సకారులను చైనా ప్రభుత్వం నిర్లజ్జగా ఐక్యరాజ్యసమితిలోను, భద్రతా మండలిలోను, అంతర్జాతీయ మేధను సమర్ధించడానికి కారణం. టిబెట్ స్వాతంత్య్ర హననం ఈ వైపరీత్యానికి దశాబ్దుల పూర్వ రంగం....
చైనా మనకు వ్యతిరేకంగా దుర్మార్గం సాగిస్తుండడం జగమెరిగిన వాస్తవం. మన ప్రభుత్వం మరింతగా గ్రహించిన వాస్తవం! పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండను చైనా నిర్లజ్జగా ప్రోత్సహిస్తోంది. అఝార్ మసూద్ నడుపుతున్న జాయిష్ ఏ మొహమ్మద్ ముఠావారు 2001లో మన పార్లమెంటు భవనంపై దాడి చేయగలిగారు. ఆ తరువాత అంతకు పూర్వం కూడ ఈ పాకిస్తానీ జిహాదీ ముఠావారు మన దేశంలో బీభత్సకాండ సాగించారు, సాగిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవన్తీపుర సమీపంలో గత నెలలో నలబయి మంది మన రక్షకులను పాశవికంగా హత్యచేయడం పరాకాష్ఠ. చైనా ప్రభుత్వం ఇలాంటి పైశాచిక ముఠాను సమర్ధించడం, అఝార్ మసూద్‌ను అంతర్జాతీయ బీభత్సకారుడు- గ్లోబల్ టెర్రరిస్ట్-గా ‘ఐక్యరాజ్యసమితి’ ప్రకటించకుండా అడ్డుకోవడం మన దేశం పట్ల చైనాకుగల శత్రుత్వానికి ఒక నిదర్శనం. గతంలో మూడుసార్లు ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని చైనా నిరోధించింది. ప్రస్తుతం బుధవారంనాడు అఝార్ వ్యతిరేక ‘జాయిష్ ఏ మొహమ్మద్’ వ్యతిరేక తీర్మానాన్ని భద్రతా మండలిలో చర్చించడాన్ని సైతం నిరోధించింది. ఆరునెలలపాటు వాయిదా వేయించింది. ఆ తరువాత మరో మూడు నెలలపాటు ఈ తీర్మానం అమలుజరుగకుండా వాయిదా వేయవచ్చునట..
భద్రతా మండలిలో చైనా సాగిస్తున్న ఈ దౌత్య బీభత్సకాండకు కారణం చైనాకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లభించిన శాశ్వత సభ్యత్వం. ‘సమితి’లో చైనాకు సభ్యత్వం లభించకపోయి ఉండినట్టయితే, లభించినప్పటికీ ‘శాశ్వత’ సభ్యత్వం లభించకపోయి ఉండినట్టయితే పాకిస్తాన్ బీభత్స చర్యలను నిరోధించే ‘సమితి’ ప్రయత్నాలకు అవరోధం ఏర్పడి ఉండేది కాదు.... చైనాకు ఈ సభ్యత్వం కట్టబెట్టడానికి 1949వ 1962వ సంవత్సరాల మధ్య అప్పటి మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అవిరళ కృషి చేయడం చరిత్ర. ఇందుకు ‘‘కృతజ్ఞత’’ను చైనా 1962లో మన దేశంలోకి దురాక్రమించడం ద్వారా చాటుకుంది. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిననాటికి మన దేశం బ్రిటన్‌వారి దురాక్రమణలో ఉంది. ఈ యుద్ధం తరువాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనాలకు ఆధిపత్యం లభించింది. ఈ ఐదు దేశాలకు ‘సమితి’ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించింది. ‘మండలి’లోని మిగిలిన పది స్థానాలను రెండేళ్లకోసారి ఇతర సభ్య దేశాలకు ‘ఎన్నిక’ద్వారా కేటాయిస్తున్నారు. శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు ఆధిపత్య దేశాలకు ‘మండలి’లో నిరోధక నిర్ణయ- వీటో- అధికారం ఏర్పడి ఉంది. అందువల్ల ఈ ఐదు దేశాలూ అంగీకరించనిదే ‘మండలి’ ఎలాంటి నిర్ణయం చేయజాలదు. ఈ ఐదింటిలో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినప్పటికీ ‘భద్రతా మండలి’లో ఏ తీర్మానం కూడ నెగ్గదు. అందువల్ల ‘కమ్యూనిస్టు’ ‘నవ’చైనా పాకిస్తాన్ బీభత్స చర్యలను అభిశంసించే తీర్మానాలు ‘మండలి’ ఆమోదాన్ని పొందకుండా పదే పదే అడ్డుతగులుతోంది. 1945లో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఐదు ఆధిపత్య దేశాలు ‘మిత్రరాజ్యాలు’- అల్లీడ్ పవర్స్-గా ఏర్పడి జర్మనీ, జపాన్‌ల నాయకత్వంలోని ‘అక్షరాజ్యాల’-ను యాక్సిస్ పవర్స్-కు వ్యతిరేకంగా విజయం సాధించాయి. అందువల్లనే ‘సమితి’ మండలిలో ఈ ఐదు దేశాలకూ శాశ్వత సభ్యత్వం లభించింది. 1949లో చైనా రెండుగా చీలింది. మావో సేటుంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీవారు ప్రధాన భూభాగంపై ఆధిపత్యం సాధించారు. అందువల్ల చాంగ్ కయ్ షేక్ నాయకత్వంలోని జాతీయ పక్షాలవారు ప్రధాన భూభాగానికి తూర్పున సముద్రంలో నెలకొని ఉన్న ‘తైవాన్’కు తరలిపోయారు. ఇలా కమ్యూనిస్టుల ‘నవ’చైనా, జాతీయ చైనాలు ఏర్పడినాయి. ఐక్యరాజ్యసమితి ‘జాతీయ చైనా-తైవాన్-ను నిజమైన చైనాగా గుర్తించింది. అందువల్ల 1972వరకు చిన్నదేశమైన జాతీయ చైనా- తైవాన్-కు మాత్రమే సమితిలోను మండలిలోను సభ్యత్వం ఉండేది. ఈ సమయంలోనే 1962వరకు జవహర్‌లాల్ నెహ్రూ ఈ ‘పెద్ద’ కమ్యూనిస్టు చైనాకు సభ్యత్వం ఇవ్వాలని ప్రచారం చేశాడు. చైనాకు 1972లో ఈ శాశ్వత సభ్యత్వం దక్కడానికి ప్రధాన కారణం అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు చైనా పట్ల కలిగిన అవ్యాజ ప్రేమ... ఫలితంగా మండలినుంచి సమితినుంచి జాతీయ చైనాను వెళ్లగొట్టారు, ఈ కమ్యూనిస్టు చైనాను చేర్చుకున్నారు! ‘‘అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు....’’ అన్న చందాన చైనా అప్పటినుంచి భారత వ్యతిరేక విషాన్ని మరింతగా కక్కుతోంది!
చైనా మన దేశంపై మరో దురాక్రమణ చేయడం అసాధ్యం. ఎందుకంటే తిప్పికొట్టగల రక్షణ పటిమ మనకు ఏర్పడి ఉంది. అందువల్ల చైనాతో సకల విధ వాణిజ్య సంబంధాలను మనం తెగతెంపులు చేసుకోవాలి. దీనివల్ల సగటున ఏటా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మన ‘వినిమయ ద్రవ్యం’ చైనాకు తరలిపోకుండా నిరోధించవచ్చు. టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని స్వతంత్ర టిబెట్ ప్రభుత్వంగా గుర్తించడం చైనా బీభత్స దౌత్యాన్ని వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించగల శుభపరిణామం కాగలదు.