సంపాదకీయం

‘సాగుతున్న’ ప్రక్రియ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘంగా ‘మత ప్రదాన’- పోలింగ్- కార్యక్రమం కొనసాగుతుండడం మన ఎన్నికల ప్రక్రియలో నిహితమై ఉన్న ‘స్వరూప’ వైపరీత్యం. పదిహేడవ -కొత్త-లోక్‌సభను ఎన్నుకొనడానికి ‘మత ప్రదాత’- వోటర్-లు సమాయత్తం అవుతున్న తరుణంలో ఈ ‘వైపరీత్య ధ్యాస’ మరోసారి స్ఫురిస్తోంది. మత ప్రదానం ఏడు దశలలో దేశమంతటా జరుగుతుండడం ‘సాగు’తున్న ఎన్నికల ప్రక్రియకు మరో ప్రత్యక్ష నిదర్శనం. ఒకే రోజున కాని రెండు విడతలు కానీ దేశం మొత్తం మీద పోలింగ్‌ను ఎందుకు పూర్తిచేయలేక పోతున్నామన్నది ఈ స్వరూప వైపరీత్యానికి సంబంధించిన సందేహం. స్వభావ వైపరీత్యం కూడ మన ఎన్నికల విధానంలో నిహితమై ఉండడం ‘ప్రజాస్వామ్య స్ఫూర్తి’ సమసిపోతున్న తీరుకు నిదర్శనం. ఈ స్వభావ వైపరీత్యం 1952లో మొదటి లోక్‌సభకు ఎన్నికలు జరిగినప్పటినుంచీ కొనసాగుతోంది. యాబయి శాతం కంటె తక్కువ ‘వోట్లు’ పొందిన అభ్యర్థులు లోక్‌సభ నియోజకవర్గంలో లేదా శాసనసభ నియోజకవర్గంలో విజయం సాధించగలగడం ఈ స్వభావ వైపరీత్యం. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీచేసినట్టయితే, ఎవరికో ఒకరికి యాబయి శాతం కంటె ఎక్కువ ‘వోట్లు’ లభించడం ఖాయం. రెండవ అభ్యర్థికి యాబయి శాతం కంటె తక్కువ వోట్లు లభించడం సహజం. ఇలాంటి స్థితిలో ప్రతి నియోజకవర్గంలోను విజేతకు యాబయి శాతం కంటె కనీసం ఒక్క వోటు అయినా ఎక్కువ లభిస్తుంది. కానీ మన దేశంలో జాతీయ స్థాయిలో కాని ప్రాంతీయ స్థాయిలలో కానీ రాజకీయ పక్షాలు రెండు మాత్రమే లేవు, అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇదికాక స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడ పెరుగుతూనే ఉంది. ఫలితంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలోను అనేక మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడం 1952 నుంచి నడుస్తున్న కథ. ఫలితంగా అత్యధిక నియోజకవర్గాలలో విజేతలకు యాబయి శాతం కాని ఇంకా ఎక్కువగా కాని వోట్లు లభించడం లేదు. వివిధ అభ్యర్థుల మధ్య వోట్లు చీలిపోతుండడం ఇందుకు కారణం. ఫలితంగా దేశమంతటా అత్యధిక స్థానాలలో ముప్పయి నుంచి నలబయి ఐదు శాతం వోట్లు వచ్చినవారు లోక్‌సభకు, శాసనసభలకు ఎన్నికవుతున్నారు. ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కంటె తక్కువ వోట్లు వచ్చిన అభ్యర్థులు సైతం విజేతలు కావడం చరిత్ర. ఎందుకంటే ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్యాబాహుళ్యం వల్ల అందరికీ ఇరవై శాతం కంటె తక్కువ వోట్లు రావడం, వారిలో మొదటి స్థానంలోని అభ్యర్థి విజేత కావడం సహజం. ఒక నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థికి యాబయి శాతం కంటె ఎక్కువ వోట్లు లభించిన, లభిస్తున్న సందర్భాలు చాలా తక్కువ..
అమెరికాలో కాంగ్రెస్-పార్లమెంట్ - ఉభయ సభలకు రెండేళ్లకోసారి నియతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్‌లో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు దేశమంతటా ఒకే రోజున ‘మత ప్రదానం’ జరుపగలుగుతున్నారు. అధ్యక్ష పదవికి కూడ ఇదే ‘మంగళవారం’ నాడు దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు తీరంలోని న్యూయార్క్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాలకు పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్ వంటి రాష్ట్రాలకు మధ్య కాలగణనంలో మూడుగంటలకు పైగా వ్యత్యాసం ఏర్పడి ఉంది. కాలిఫోర్నియాలో ఉదయం తొమ్మిది గంటలైతే న్యూయర్క్‌లో మిట్టమధ్యాహ్నం పనె్నండు గంటలై ఉంటోంది. లాస్ ఏంజెల్స్ నగరంలో ఉదయం అల్పాహారం తింటున్న సమయంలో న్యూయార్క్ నగరంలో మధ్యాహ్న భోజనాలు జరుగుతాయన్నది అమెరికా జీవన వ్యవహారంలో వినబడే చతురోక్తి. అమెరికా వైశాల్యానికి ఇదంతా నిదర్శనం, వైశాల్యంలో మన దేశం కంటె అమెరికా దాదాపు మూడురెట్లు పెద్దది. ఇలా పెద్ద అమెరికాలోను, చిన్న ఇజ్రాయిల్‌లోను కూడ ఒకేరోజున చట్టసభల ఎన్నికలు జరిగిపోతున్నాయి. మన దేశంలో మాత్రం ఎందుకని ఒకే రోజున- లేదా రెండు విడతలలో- ఎందుకని లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను పూర్తిచేసుకోలేకపోతున్నాము? ప్రస్తుతం వేసవిలో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ హేమంత, శిశిర ఋతువులలో ఎన్నికలు జరిగినప్పుడు ‘లడక్’లో ఎన్నికను వేసవి వరకు వాయిదా వేయడం దశాబ్దుల అనుభవం. హేమంత ఋతువులో- నవంబర్, డిసెంబర్‌ల్లో- మన ‘లడక్’లో కంటె కూడ అమెరికాలో చలి తీవ్రత రెండురెట్లు ఉంటోంది. ప్రధాన భూమికి దూరంగా, కెనడాకు పశ్చిమంగా విస్తరించిన ‘అలాస్కా’-అమెరికాలోని ఒక ప్రాంతం-రాష్ట్రంలో ఈ చలి తీవ్రత నవంబర్‌లో మరింత ఎక్కువ. అయినప్పటికీ అలాస్కాలో సైతం మిగిలిన అమెరికాలో జరిగిన రోజుననే మత ప్రదానం జరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే వోట్లలెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తుండడం అమెరికాలో మాత్రమే కాదు, అనేక ఇతర ప్రజాస్వామ్య దేశాలలో నెలకొని ఉన్న వ్యవస్థ. అమెరికాలోని పడమటి-పసిఫిక్- తీర రాష్ట్రాలలో ‘మత ప్రదాన ప్రక్రియ’ ముగియడానికి మూడుగంటల ముందుగానే తూర్పు-అట్లాంటిక్ సముద్ర- తీర రాష్ట్రాల్లో ‘మత ప్రదానం’ ముగిసిపోయి ఫలితాలు వెలువడడం మొదలైపోతోంది... ఈ ‘తూర్పు’ ఫలితాల ప్రభావం ఆ ‘పడమటి’ మతప్రదాత- వోటర్-లపై ఉండదట. కానీ మన దేశంలో ఉంటోందట. అమెరికాను చూసి మనం అన్నీ నేర్చుకొననక్కరలేదు. కానీ ఒకేరోజున అక్కడ ‘మత ప్రదానం’ సాధ్యమైనప్పుడు మన దేశంలో మాత్రం ఎందుకు సాధ్యం కారాదు?
బ్రిటన్ దురాక్రమణనుండి విముక్తి జరిగిన తరువాత మొదటిసారి 1951-1952లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరంభమైంది. 1951 అక్టోబర్ చివరిలో మొదలైన ఈ ప్రక్రియ నాలుగునెలలపాటు- ఫిబ్రవరి చివరి వారం వరకు కొనసాగడం చరిత్ర. శతాబ్దుల విదేశీయ బీభత్స దురాక్రమణ కారణంగా మన దేశం అప్పటికి ఆర్థిక వైజ్ఞానిక శాస్తస్రాంకేతిక సాంస్కృతిక రంగాలలో దివాలాతీసి ఉండడం చరిత్ర. అందువల్ల మొదటి దశాబ్దులలో మనం లోక్‌సభకు ఒకేరోజున ‘పోలింగ్’ను జరుపుకొని లేకపోయి ఉండవచ్చు. కానీ ఆ తరువాత మన దేశం క్రమంగా ‘విదేశీయ దురాక్రమణ’ పూర్వం నాటి సముత్కర్ష భౌతిక ఆర్థిక వైజ్ఞానిక సాంస్కృతిక గరిమను తిరిగి సాధించేందుకు కృషిచేస్తోంది. అవని చుట్టూ అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలు ఈ ప్రగతికి పతాకలు. మన రక్షణ శాస్తవ్రేత్తలు రూపొందించి ప్రయోగించిన ‘దూర లక్ష్యవిచ్ఛేదక క్షిపణులు’ మన శాస్తస్రాంకేతిక విజ్ఞాన ప్రతీకలు. మన దేశపు సరిహద్దులు దురాక్రమణ ప్రతిఘటన పాటవకుడ్యాలుగా మారి ఉండడం అంతర్జాతీయ సమాజం గుర్తించిన రక్షణ వాస్తవం. ప్రపంచంలో ఐదవ ఆర్థికశక్తి స్థాయికి ఎదగడం మన భౌతిక ప్రగతికి ప్రత్యక్ష ప్రమాణం. దేశంలో అనుసంధాన వ్యవస్థ- రహదారులు, రైలుమార్గాలు- విప్లవాత్మకంగా విస్తరించి ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ, ఇన్ని విజయాలను సాధించినప్పటికీ ఒకే రోజున మనం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను మాత్రం ఎందుకని నిర్వహించుకొనలేకపోతున్నాము. 1967లో ఫిబ్రవరి 15నుంచి 28వ తేదీ వరకూ ఐదు దశలలో- పదునాలుగు రోజులలో పోలింగ్ పూర్తయింది. 1971 మార్చిలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హఠాత్తుగా- 1970 డిసెంబర్‌లో - లోక్‌సభను రద్దుచేయించిన తరువాత లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో కూడ పదమూడు రోజులలో ఐదు దశలలో ‘పోలింగ్’ పూర్తయింది. 1977 మార్చిలో ‘అత్యవసర దుస్థితి’- ఎమర్జెన్సీ- చివరి రోజులలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ‘పోలింగ్’ ఐదు దశలలో ఐదు రోజులలో- మార్చి 16నుంచి 20వ తేదీ వరకు- ముగిసిపోయింది. 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కేవలం రెండు విడతలలో-జనవరి మూడవ, ఆరవ తేదీలలో- మతప్రదానం జరిగిపోవడం ‘అద్భుతం’.. కానీ ఆ తరువాత క్రమంగా ‘పోలింగ్’ విడతలు మాత్రమేకాక, ఒక ‘విడత’కూ మరో ‘విడత’కూ మధ్య కాలవ్యవధి కూడ పెరగడం చరిత్ర. 2014నాటి ఎన్నికలలో తొమ్మిది విడతలకు ఈ ప్రక్రియ విస్తరించడం పరాకాష్ఠ.
రాబోయే పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో ‘విడత’ల సంఖ్య ‘ఏడు’కు తగ్గినప్పటికీ పోలింగ్ సమయ వ్యవధి మాత్రం పెరిగింది. గత ఎన్నికలలో ఏప్రిల్ ఏడవ తేదీనుంచి మే పనె్నండు వరకు ముప్పయి ఆరు రోజులపాటు పోలింగ్ కార్యక్రమం కొనసాగింది. ప్రస్తుతపు ఎన్నికలలో ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిదవ తేదీ వరకూ ‘పోలింగ్’ ముప్పయి తొమ్మిది రోజులకు విస్తరించింది. శాంతి భద్రతలు గతంలో కంటె క్రమంగా మెరుగవుతున్నాయి. దౌర్జన్యకాండను నిరోధించగల భద్రతా బలగాల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ ఇలా పోలింగ్‌ను ఎందుకని వారాల తరబడి ‘సాగ’దీస్తున్నారు?