సంపాదకీయం

మరో జన ‘సమరం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యలకు కాక ‘సమీకరణ’లకు ప్రాధాన్యం పెరుగుతుండడం పదిహేడవ లోక్‌సభ ఎన్నికలకు విచిత్రమైన నేపథ్యం. ఏప్రిల్ పదకొండవ తేదీ నుండి మే పంతొమ్మిదవ తేదీ వరకు ‘మత ప్రదానం’-పోలింగ్- ఏడు విడతలుగా జరుగనున్న కొత్త లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాన్ని ఆదివారం ఎన్నికల సంఘం ప్రకటిస్తుండిన సమయంలో ‘సమీకరణ’లను గురించి మాధ్యమాలలో చర్చలు పరాకాష్ఠకు చేరడం సమాంతర పరిణామం. ‘గత ఐదేళ్లలో చేసిన ఈ తప్పులవల్ల ‘అధికారపక్షం’ లోక్‌సభలో సంఖ్యా బాహుళ్యాన్ని కోల్పోతుంది.. గత ఐదేళ్లలో అమలు జరిగిన పథకాల వల్ల అధికార పక్షానికి మళ్లీ లోక్‌సభలో సంఖ్యాబలం లభించబోతోంది!’అన్న చర్చలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ‘ఏ రాజకీయ కూటమిలో ఏయే పక్షాలు చేరుతున్నాయి? ఏ పక్షం చేరినట్టయితే ‘కూటమి’కి ఎన్ని వోట్లు అదనంగా లభిస్తాయి. ఏ పక్షం వైదొలగితే ‘కూటమి’కి ఎన్ని వోట్లు తగ్గిపోతాయి?’.. ఇవీ ప్రధానంగా చర్చలలో గత కొన్ని వారాలుగా వినబడిన ప్రశ్నలు! ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికారపక్షాలు పరస్పరం తిట్టుకుంటున్నాయి. రెండు రాష్ట్రాలలోను అధికార పక్షమూ ప్రతిపక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటుండడం కుమ్ములాటను కుతూహలంగా తిలకిస్తున్న రాజకీయ ఉత్కంఠగ్రస్తులకు దృశ్యమానం అవుతున్న విచిత్రం. అంతర్జాల వ్యవస్థ గోడలకు దొంగలు కన్నాలువేసి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని- డిజిటల్ డేటాను- దోచుకొని పోయారన్నది ఈ ప్రధాన రాజకీయ పక్షాలు కనిపెట్టిన రహస్యం. ‘దొంగలు మీరు.. కాదు మీరే దొంగలు’అన్నది ఎన్నికల కార్యక్రమ ఆవిష్కరణకు పూర్వరంగంగా తెలుగు రాష్ట్రాలలో నడచిన ‘చర్చా రాద్ధాంత’ రణరంగం.. ఏప్రిల్ పదకొండవ తేదీన లోక్‌సభ ఎన్నికల ‘మత ప్రదానం’ జరుగనున్న తెలంగాణలోను, అదే రోజున శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు ‘మత ప్రదానం’ జరుగనున్న ఆంధ్రప్రదేశ్‌లోను ప్రధానమైన చర్చనీయాంశం ఫిరాయింపు రాజకీయం. ఆదివారం వెలువడిన ఎన్నికల క్రియ ప్రకటన కంటే, ‘్ఫలానా ఫలానా ప్రముఖులు తమ స్వపక్షాల నుండి హడావుడిగా బయటకివచ్చి ఇతర పక్షాలలోకి చొఱబడిపోతున్న దృశ్యం’ జనానికి ఎక్కువ మక్కువగా మారింది, మారుతోంది. ఇలా ఫిరాయిస్తున్నవారు ఇంతవరకూ తాము తిట్టిపోసిన ‘పార్టీ’లోకి నూతన గృహప్రవేశం చేస్తున్నంత ‘హుందా’గా నిర్భయంగా నిర్లజ్జగా ప్రవేశిస్తున్నారు. ఈ ఫిరాయింపులవల్ల వీడిన ‘పార్టీ’కి లాభమెంత? నష్టమెంత?? చొఱబడిన పార్టీకి నష్టమెంత? లాభమెంత?? చొఱబాటుదారులకు లేదా ఫిరాయిస్తున్న ప్రముఖులకు సమకూడనున్న లాభమెంత??.. ఇవీ జరుగుతున్న చర్చలు. ఫిరాయింపులతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. సమీకరణలు మారడం వల్ల ప్రాంతాల స్థాయిలోను జాతీయ స్థాయిలోను ఫలితాల పట్ల ఊహాగానాలు మారిపోతున్నాయి.
దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ పరిణతి చెందడం మన ప్రవృత్తికి ప్రత్యక్ష సాక్ష్యం. 1951-1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాటినుంచి ఈ ‘ప్రక్రియ’లో భాగస్వాములవుతున్న వోటర్ల సంఖ్య ప్రతి ఎన్నికలలోను పెరిగింది. ఇది కాదు ప్రధానం. మొత్తం వోటర్ల సంఖ్యలో ‘మత ప్రదాన’-పోలింగ్- ప్రక్రియలో పాల్గొంటున్న వోటరుల ‘శాతం’ పెరగడం ‘పరిణతి’మరింతగా ప్రస్ఫుటిస్తోందనడానికి నిదర్శనం. సగటున డెబ్బయి రెండునుంచి డెబ్బయి ఐదు శాతం వోటర్లు తమ ‘హక్కు’ను వినియోగిస్తుండడం గత ఐదు లోక్‌సభ ఎన్నికల చరిత్ర. తొంబయి కోట్ల వోటర్లున్న మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇది కాదు ఘనత! అమెరికావంటి ప్రజాస్వామ్య దేశాలలో ‘పోలింగ్’ శాతం యాబయి అరవయి శాతాల మధ్య ఊగిసలాడుతోంది. బ్రిటన్ తదితర పెద్ద ఐరోపా దేశాలలో సైతం ఇదే తీరు. ఇదీ తులనాత్మకంగా మన ప్రజాస్వామ్య గరిమ. కానీ ఈ గరిమను కబళించడానికి వివిధ రకాల వికృతులు విరుచుకొని పడుతుండడం నిరాకరింపజాలని నిజం! దొంగవోట్లు వేయడం, వోట్లుకొనడం, మద్యంతో మత్తెక్కించడం, వోటర్లను బెదిరించడం వంటివి ఈ నేరాలలో కొన్ని మాత్రమే! వోటర్లకు ‘గుర్తింపుకార్డుల’ను ఇవ్వడం వల్ల, ‘కాగితం మత పత్రాల’- బాలెట్ పేపర్స్- స్థానంలో యంత్ర వ్యవస్థ- ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్- ఈవిఎమ్-లను ప్రవేశపెట్టడంవల్ల ‘దొంగవోట్ల’-రిగ్గింగ్- అంతరించిపోయిందన్నది జరుగుతున్న ప్రచారం. కానీ అధికార, ప్రతిపక్షాలు పోటీపడి వోటర్లను ‘జాబితా’ల నుంచి తొలగించడం, నకిలీ వోటర్లను జాబితాలలో చేర్చడం వంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నట్టు ప్రచారవౌతోంది. వికాస క్రమంలో నిహితమై ఉన్న ‘వ్యాధి’కి ఇదంతా నిదర్శనం...
‘సమీకరణ’ల రాజకీయం వెనుక ‘సంకీర్ణ’వైపరీత్యం నక్కి ఉంది. సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలో ‘సంక్షేమం’ కంటె ‘అభ్యుదయం’కంటె ‘అస్థిరత’, ‘అవినీతి’ ప్రధానాంశాలు కావడం దశాబ్దుల అనుభవం. 1984 తరువాత 1989-2009 సంవత్సరాల మధ్యకాలంలో ఏ రాజకీయ పక్షానికీ లోక్‌సభలో ‘సంఖ్యా బాహుళ్యం’ సంభవించకపోవడం చరిత్ర. బహుళ పక్ష ప్రజాస్వామ్యం ద్విపక్ష ప్రజాస్వామ్యం కంటె మరింత వైవిధ్యవంతమైంది. కావచ్చు.. కానీ ఈ వైవిధ్యాల తార్కికమైన జాతీయ ప్రయోజనకరమైన సైద్ధాంతిక, విధాన సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం అవుతుంది. మన దేశంలో సంకీర్ణ రాజకీయం, మిశ్రమ మంత్రివర్గాలు ‘అవకాశవాదం’ ప్రాతిపదికగా ఏర్పడడం చరిత్ర. ఈ చరిత్ర 2014లో పరిసమాప్తమైంది. ముప్పయి ఏళ్ల తరువాత మళ్లీ లోక్‌సభలో ఒక జాతీయ పక్షానికి స్పష్టమైన ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- లభించింది. విధాన విషయంలోను కార్యక్రమాల విషయంలోను భారతీయ జనతాపార్టీతో విభేదించేవారు సైతం ‘సుస్థిరత్వం’ విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలులేదు. ఈ ‘సుస్థిరత్వం’ప్రభుత్వానికి అవినీతి ఆవహించకపోవడానికి ఒక కారణం. ఇతర కారణాలు కూడ ఉండవచ్చు. గత ఐదేళ్లలో అధికార రాజకీయ అవినీతి కలాపాలు జరిగిన దాఖలాలేదు. వాణిజ్య రంగంలో అవినీతి పుట్టలు పెరిగి ఉండవచ్చుగాక! ‘చిన్నపార్టీలు, చిల్లర పార్టీలు, ‘తోక’పార్టీలు, ‘ఈక’పార్టీలు ప్రధాన రాజకీయ పక్షాన్ని బెదిరించడం, భయపెట్టడం అధికార కూటమి నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని కూల్చివేయడం..’- ఇదంతా’ సంకీర్ణ రాజకీయంలో భాగం. 1998లో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ‘భాజపా’ కూటమి ప్రభుత్వం సంవత్సరం తరువాత కూలిపోవడం సంకీర్ణ రాజకీయ వైషమ్యానికి చారిత్రక నిదర్శనం! 1990లో విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రభుత్వం, 1991లో చంద్రశేఖర్ మంత్రివర్గం, 1997లో హెచ్.డి.దేవగౌడ ప్రభుత్వం, ఐకే గుజ్రాల్ మంత్రివర్గం అర్ధాంతరంగా కుప్పకూలిపోవడానికి కారణం ‘సమీకరణల’ప్రాతిపదిక ఏర్పడిన రాజకీయ సాంకర్యం..
అందువల్ల జాతీయ రాజకీయం ‘సంకీర్ణ శకం’ వైపు తిరోగమనం చెందకుండా నిరోధించవలసిన బాధ్యత ఈ ఎన్నికలలో ఐదేళ్ల రాజ్యాంగ గతిని నిర్ధారించనున్న వోటర్లది. 1951నుంచి 1977వరకు దేశంలో ప్రధాన పక్షం కాంగ్రెస్! కాంగ్రెస్ కంటె మెరుగైన ప్రత్యామ్నాయం వోటర్లకు అంతవరకు లభించలేదు. ఇప్పుడు దేశంలో ప్రధాన జాతీయ పక్షం ‘భాజపా’. భాజపాతో సమఉజ్జీ అయిన మరో రాజకీయ పక్షం ఇప్పుడు దేశంలో లేదు. అందువల్ల ‘భాజపా’కు మాత్రమే తనంత తానుగా లోక్‌సభలో ‘సంఖ్యాబాహుళ్యం’ సాధించగల అవకాశం ఉందన్నది ‘‘ముంజేతి కంకణం’’.. అందువల్ల ఎన్నికల సమరంలో ‘భాజపా’ ఒకవైపున, ‘సంకీర్ణ రాజకీయం’ మరోవైపున మోహరించి ఉండడం ప్రస్తుత రాజకీయ దృశ్యం.. సరికొత్త జనాదేశానికి ఇదీ ప్రాతిపదిక!