సంపాదకీయం

భాగ్యనగరం వద్దంట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదును ‘భాగ్యనగరం’ అని పిలవడం గొప్ప నేరమన్న ప్రచారం జరిగిపోతోంది. ఇలా ‘నేరమని’ నిర్ధారిస్తున్న వారిలో వారసత్వ పరిరక్షక ఉద్యమకారులు- హెరిటేజ్ యాక్టివిస్టులు- కూడ ఉండడం మరో విచిత్రం. ఈ తథాకథిత ‘వారసత్వ పరిరక్షకుల’కు తెలిసిన ‘గతం’ కేవలం వందల సంవత్సరాలకు పరిమితమై ఉంది. ఈ వందల సంవత్సరాలలో మన దేశం వివిధ రకాల విదేశీయుల దురాక్రమణకు గురి అయింది. 1947 వరకు 1948 వరకు 1956 వరకు 1961వరకు దేశంలోని వివిధ ప్రాంతాలు విదేశీయుల బీభత్సపాలనకు గురికావడం చరిత్ర. ఈ చరిత్ర మాత్రమే తెలిసిన ‘వారసత్వ పరిరక్షకులు’ అమాయకంగాను, అనభిజ్ఞతతోను, దుర్బుద్ధితోను ఈ విదేశీయుల పాలననాటి వారసత్వాన్ని నిలబెట్టాలని, పరిరక్షించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు అమాయకులు, కొందరు అనుభిజ్ఞులు, మరికొందరు దుర్బుద్ధితో విదేశీయుల వారసత్వాన్ని కొనసాగించాలని కోరుతున్నవారు. ఎవరు ఎవరన్నది నిర్ధారించడం కష్టం. కానీ ఇలా కొన్నివందల ఏళ్ల గతానికి మాత్రమే పరిమితమైన బుద్ధికలవారికి అనాదిగా ముచికుంద నదీ తీరంలో నెలకొని ఉండిన భాగ్యలక్ష్మీ దేవాలయం చరిత్ర తెలియదు. ఈ దేవాలయం నెలకొని ఉండిన స్థలంలోనే ఆ తరువాత ‘చార్మినార్’ కట్టడం వెలసిందన్న వాస్తవం తెలియదు. ‘చార్మినార్’ నిర్మాణం అయిన తరువాత శతాబ్దులపాటు ఆ బృహత్ నిర్మాణం పక్కనే నిలబడి ఉండిన భాగ్యలక్ష్మీదేవి రాతి విగ్రహం గురించి తెలియదు. ఈ రాతి విగ్రహం ఆకాశం నీడలో ఏళ్లతరబడి నిలబడడానికి కారణం ‘జిహాదీ’ స్వభావం కలిగిన ప్రభుత్వం వ్యవస్థీకృతం కావడం. స్వజాతీయ కాకతీయ సామ్రాజ్యం క్రీస్తుశకం 1323-1326 సంవత్సరాల మధ్య పతనమైన తరువాత కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న దక్షిణ భారత ప్రాంతంలో ఈ ‘జిహాదీ’ స్వభావం కలిగిన బీభత్స పాలన మొదలైంది. ఇప్పటి తెలంగాణ ప్రాంతంలో ఈ ‘జిహాదీ’ స్వభావం కలిగిన ప్రభుత్వం 1948 సెప్టెంబర్ వరకు కొనసాగింది. ఈ జిహాదీ పాలన నాటి ‘వారసత్వాన్ని’ నిలబెట్టదలచుకున్నవారు మాత్రమే ‘హైదరాబాద్’ను ‘్భగ్యనగరం’ అని పిలువరాదని భావిస్తున్నారు...
ఈ దేశాన్ని మాతృభూమిగా భావించి మాతృభూమి పట్ల మమకారాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే స్వజాతీయులు. ఈ స్వజాతి అనాదిగా ఈ దేశంలో వికసించింది. యుగాలనధిగమించి కొనసాగుతున్న ఈ జాతీయ వికాస క్రమం ప్రతితరంలోను సమకాలీన సమాజానికి వారసత్వం. ఈ నిజమైన వారసత్వ ధ్యాస లేనివారు, విదేశీయులు మన దేశాన్ని దురాక్రమించిన నాటి పరిమిత సమయానికి సంబంధించిన ‘విపరిణామ’ క్రమాన్ని వారసత్వంగా భావిస్తుండడం- భ్రాంతి చెందుతుండడం- భావదాస్య ప్రవృత్తికి నిదర్శనం. ‘ఇక్కడ పుట్టి పెరిగినవారు కావచ్చు, విదేశాల నుంచి శతాబ్దుల తరబడి చొరబడి స్థిరపడినవారు కావచ్చు..’. వీరు ఈ దేశాన్ని మాతృభూమిగా భావించినట్టయితే వారు స్వజాతీయులు, భావించనివారు విజాతీయులు. 1326-1948 సంవత్సరాల మధ్య జిహాదీ స్వభావం కల ఇలాంటి విజాతీయులు తెలంగాణను పాలించారు. భాగ్యనగరం ‘హైదరాబాద్’గాను, ముచికుంద నది ‘మూసీ మురుగు’గాను పరివర్తన చెందడానికి ఇదీ కారణం! సర్వమత సమభావం అనాదిగా భారతీయ పాలనకు భూమిక! ఏకమత ఉన్మాదం ఇస్లామేతర మతాలను ద్వేషించడం, ధ్వంసం చేయడం ‘జిహాద్’ స్వభావం. ఇలాంటి జిహాదీ స్వభావం 1326- 1948 సంవత్సరాల మధ్య తెలంగాణను ‘పాలించిన’ అత్యధికుల విధానం.. ఈ జిహాదీ వారసత్వాన్ని నిలబెట్టదలచినవారు మాత్రమే ‘భాగ్యనగరం’ అన్న పేరును వ్యతిరేకిస్తున్నారు! 1326కు పూర్వం అనాదిగా తెలంగాణ గడ్డపై పరిఢవిల్లిన సర్వమత సమభావ సాంస్కృతిక వారసత్వాన్ని 1948వ సంవత్సరం తరువాత పునరుద్ధరింప తలచినవారు ‘భాగ్యనగరాన్ని’ పునరుద్ధరించాలని కోరడం సహజం.. తెలంగాణ ప్రభుత్వం వారు తమ ప్రగతి సమీక్షా ప్రకటనలలో ‘అనధికారికం’గానైనా ఇలా ‘భాగ్యనగరం’ అని ‘హైదరాబాదు’ను పేర్కొనడం ఈ సహజత్వానికి అద్దం!
కానీ ‘భాగ్యనగరం’ అన్న పేరును వాడడం పట్ల నిరసనలు వ్యక్తవౌతున్నాయట! ప్రచారం అవుతోంది. అత్యధిక శాతం ప్రజలు నిజానికి ఈ ప్రభుత్వ ‘స్థావర ప్రకటన’-హోర్డింగ్-లలో ‘‘భాగ్యనగరం’’ ఉండడం పట్ల ఆమోదం తెలియచేస్తున్నారు, హర్షం ప్రకటించారు. కోట్ల మంది ప్రజల ఈ ‘ఆమోదానికి’ ప్రచారం లేదు... ‘‘భాగ్యనగరాన్ని వ్యతిరేకిస్తున్న’’ వందల మంది ‘రుసరుసల’కు మాత్రం గొప్ప ప్రచారం లభించింది. ప్రభుత్వం వారు సైతం ఈ వందల మంది రుసరుసలను కోట్లమంది తెలంగాణ ప్రజల, భారతీయుల సమష్టి అభిప్రాయంగా భావిస్తుండడం విచిత్రమైన వ్యవహారం. నిజానికి రజాకార్ బీభత్సవాలు నడిపించిన చివరి నిజాం ‘‘పాలన’’ నుంచి ‘‘హైదరాబాద్ సంస్థానం’’ విమోచనం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వారు ‘హైదరాబాద్’ను రద్దుచేసి ఉండాలి. ప్రాచీన నామమైన ‘భాగ్యనగరము’ను పునరుద్ధరించి ఉండాలి. ఆ తరువాతనైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాని, తెలంగాణ ప్రభుత్వం కాని ఆధికారికంగా రాజధాని నగరం పేరును ‘భాగ్యనగరం’గా ప్రకటించి ఉండాలి, ఇప్పుడు అసలుకే ఎసరుపెట్టిన రీతిలో ‘భాగ్యనగరం’ అన్న పేరున్న ‘హోర్డింగ్’లను కిందికి లాగి పారేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందట..! ‘భాగ్యనగరం’ ప్రభుత్వ ‘ప్రకటన’లలోకి ఎలా చొరబడిందన్న విషయమై పరిశోధిస్తారట! పరిశోధన జరగవలసింది జిహాదీలు శతాబ్దులపాటు హత్యచేసిన ‘‘భాగ్యనగరం’’ ఎలా మళ్లీ చొరబడిందన్న విషయం గురించి కాదు.. అనాదిగా జనజీవన వాస్తవమైన ‘భాగ్యనగరం’ ఆధికారికంగా ఎలా అంతరించిపోయిందన్న విషయమై దర్యాప్తుజరగాలి, పరిశోధన జరగాలి. 1947 ప్రాంతంలో ‘రజాకారులు’ మరింతగా చెలరేగే వరకు శతాబ్దుల తరబడి చార్మినార్ కట్టడం పక్కనే ప్రతిష్ఠ అయి ఉండిన భాగ్యలక్ష్మీదేవి రాతి విగ్రహం ఏమైంది? ఈ భాగ్యలక్ష్మీమాత పేరుతోనే ‘గోలకొండ’ సమీపంలోని అలనాటి ఈ ‘చిన్ని’ పట్టణానికి ‘భాగ్యనగరం’ అన్న పేరు స్థిరపడింది. డాక్టర్ బి.మాణిక్యాచారి అన్న సామాజిక సాంస్కృతిక ఉద్యమకారుడు, సాహిత్యవేత్త వెల్లడించిన వాస్తవాల ప్రకారం 1947 వరకు ‘చార్మినార్’ పక్కన ఉండిన భాగ్యలక్ష్మీ శిలావిగ్రహానికి పూజలు జరిగేవి. భక్తులు ప్రధానంగా మాతృమూర్తులు ఈ విగ్రహానికి పూజలు చేసేవారు. 1947 ప్రాంతంలో ఏడెనిమిదేళ్ల వయసులోని బాలుడైన డాక్టర్ మాణిక్యాచారి వాళ్ల అమ్మ వెంట, నాయనమ్మ వెంట వెళ్లి ఈ శిలావిగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. మాణిక్యాచారి వంటి అప్పటి కొందరు వ్యక్తులు ఇప్పుడు భాగ్యనగరంలోను, తెలంగాణలోను జీవిస్తున్నారు. ఇలాంటి వయోవృద్ధులనడిగి ప్రభుత్వం వారు వాస్తవాలను ఎందుకని సేకరించరాదు? ఆ భాగ్యలక్ష్మీదేవి శిలావిగ్రహాన్ని 1947లో ‘రజాకార్లు’ పెకలించి ముక్కలు చేసి పారేశారు. 1948లో తెలంగాణ విముక్తమైన తరువాత ఆ శిలావిగ్రహం ఉండినచోట మళ్లీ చిన్ని గుడిని నిర్మించడం చరిత్ర!
విదేశీయుల దురాక్రమణ నుంచి విముక్తమైన దేశాల ప్రభుత్వాలు, తమ దేశాలకు ప్రదేశాలకు పట్టణాలకు పల్లెలకు విదేశీయులు పెట్టిన పేర్లు మార్చుకున్నారు, స్వజాతీయమైన ప్రాచీన నామాలను పునరుద్ధరించుకుంటున్నారు. ‘రొడీషియా’ అన్న పేరు ‘జింబాబ్వే’గా మారడం ఒక ఉదాహరణ మాత్రమే. సింహళ ద్వీపాన్ని బ్రిటన్ దొంగలు ‘సిలోన్’ అని పిలిచారు. కానీ ‘సిలోన్’ను మళ్లీ ‘శ్రీలంక’గా మార్చుకోవడం స్వాభిమాన నిదర్శనం. మన దేశంలో సైతం వివిధ ప్రాంతాలలో ప్రభుత్వాలు విదేశీయ దురాక్రమణ వారసత్వాన్ని తొలగించి, స్వజాతీయ వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నాయి. ముంబయిలోని ‘విక్టోరియా టెర్మినెస్’.. ‘ఛత్రపతి శివాజీ రైలుస్టేషన్’గా మారడం మరో ఉదాహరణ. కానీ హైదరాబాదు-భాగ్యనగరం-లోని ‘ఎల్‌బి నగర్’ మెట్రో రైలుస్టేషన్ సమీపంలో ఇప్పుడు ‘విక్టోరియా మెమోరియల్’ స్టేషన్ ఏర్పడింది. ఈ దేశాన్ని శతాబ్దులపాటు దమనకాండకు గురిచేసిన రాజకీయ ఆర్థిక బీభత్స దేశం బ్రిటన్! బ్రిటన్‌కు ఒకప్పటి రాణి విక్టోరియా! ఆ దురాక్రమణ వారసత్వాన్ని మళ్లీ తగిలించుకోవడం దేశద్రోహం, జాతి వ్యతిరేకం! ‘విక్టోరియా’ ఎలా చొరబడిపోయిందన్నది తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేయదగిన అంశం..