సంపాదకీయం

మళ్లీ వంచన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ‘ప్రభుత్వం’ వారి వంచన క్రీడలో మరో ‘ఆవృత్తం’- రౌండ్- మొదలైపోయింది. ‘జమాత్ ఉద్ దావా’, ‘ఫలారుూ ఇన్‌సానియత్ ఫౌండేషన్’ అన్న జిహాదీ బీభత్స సంస్థలను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది-అట-! ‘‘ఇంకెన్నిసార్లు చెంపలేసుకుంటారు?’’ అని పాకిస్తాన్‌లోని ‘జిహాదీ’ సిద్ధాంత ప్రవర్థకులు పాకిస్తానీ ‘పాలకుల’ను యద్దేవా చేస్తున్నారట! ఎందుకంటె పాకిస్తాన్ పాలకులు అంతర్జాతీయ అభిప్రాయానికి, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు తలఒగ్గి బీభత్స జిహాదీ సంస్థలను నిషేధిస్తూనే ఉన్నారు. రెండు దశాబ్దులుగా ఈ నిషేధాల పరంపర కొనసాగుతున్నప్పటికీ తథాకథిత- సోకాల్డ్- నిషిద్ధ సంస్థలు యథావిధిగా వికృత రూపాలతో విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ ముఠాలను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించినట్టు ప్రకటించినప్పుడల్లా కొత్త జిహాదీ ముఠాలు పుట్టుకొస్తున్నాయి. అంటే ‘‘నిషిద్ధ సంస్థలు’’ పేరుమార్చుకొని ‘‘కొత్త సంస్థలు’’గా అవతరిస్తున్నాయి. కొన్నాళ్ల తరువాత నిషేధానికి గురి అయినట్టు పాకిస్తాన్ పాలకులు ప్రచారం చేసిన పాత సంస్థలు కూడ యథావిధిగా విషకీటకాల వలె బీభత్సపు పుట్టలలో నుంచి బయటికి వస్తున్నాయి. పరమ జుగుప్సాకరమైన ఈ ‘జిహాదీ’ వికృత ‘వదనాల’ సంఖ్య నిషేధం విధించిన ప్రతిసారీ రెట్టింపుగా అనేక రెట్లుగా పెరుగుతోంది. ‘నిషేధాల’ పేరుతో పాకిస్తాన్ పాలకులు అంతర్జాతీయ సమాజాన్ని వంచన చేస్తూ ఉండడం దశాబ్దులుగా అమెరికా ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు, ఐక్యరాజ్యసమితికి తెలుసు. తెలిసినప్పటికీ పాకిస్తాన్‌ను ‘గట్టిగా’, ‘ఇంకా గట్టిగా’ అభిశంసించడం తప్ప శిక్షించిన జాడ కాని, శిక్షించడానికి యత్నించిన జాడకాని లేదు. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ ప్రభుత్వం నడిపిస్తున్న జిహాదీలు మన దేశంలోను, మన దేశానికి వ్యతిరేకంగాను బీభత్స పైశాచిక కాండను కొనసాగించారు, కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్‌ను స్వయంగాను అంతర్జాతీయ చర్యల ద్వారాను శిక్షించవలసింది, శిక్షింప చేయవలసింది మన ప్రభుత్వం. పాకిస్తాన్ 1947 నుంచి మన దేశంతో నిరంతరం శత్రుత్వం వహించి ఉంది, మన దేశాన్ని బద్దలుకొట్టడానికై ఎడతెగకుండా ‘జిహాదీ’లను ఉసిగొల్పుతోంది. కానీ మన ప్రభుత్వం మాత్రం ‘‘పునరపి సఖ్యం, పునరపి వైరమ్’’- మళ్లీ మళ్లీ స్నేహం, మళ్లీ మళ్లీ వైరం- అన్న విధానాన్ని పాటిస్తోంది!
బీభత్స రాజ్యాంగ వ్యవస్థగా మారి ఉన్న పాకిస్తాన్ ‘ప్రభుత్వాన్ని’ మన దేశం శిక్షించలేక పోవడానికి, శిక్షింపచేయలేక పోవడానికి ఇదీ వౌలిక కారణం. 2014 మే 26వ తేదీ తరువాత మన ప్రభుత్వం విధానంలో విప్లవాత్మక పరివర్తన వచ్చింది. ఫలితంగా మన సైనికులు జమ్మూ కశ్మీర్‌లోని అధీన రేఖను దాటి వెళ్లి పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోను, పాకిస్తాన్‌లోను నక్కి ఉన్న జిహాదీ బీభత్సకారుల స్థావరాలను ధ్వంసం చేశారు. ఇలా మూడుసార్లు ‘సాయుధ చికిత్స’ద్వారా మన రక్షణ దళాల వారు బీభత్సపు బట్టీలను బద్దలుకొట్టినప్పటికీ పాకిస్తాన్‌లో వేల మంది జిహాదీలు పొంచి ఉన్నారు, పుట్టలు పగులుతూనే ఉన్నారు. ఎందుకంటె పాకిస్తాన్ ప్రభుత్వం ఈ జిహాదీ హత్యాకాండను స్వయంగా నిర్వహిస్తోంది. పాకిస్తాన్‌లో ‘ప్రభుత్వం’ అంటే ప్రధానంగా సైనిక దళాలు! సైనిక దళాల వారు కొన్నాళ్లపాటు స్వయంగా ‘‘పాలిస్తున్నారు’’, మరికొనే్నళ్లు ‘పౌర ప్రభుత్వాన్ని’ నెలకొల్పి ‘‘పాలింప చేస్తున్నారు’’. ఎన్ని వందల వేల ‘జిహాదీ’ తోడేళ్లను వధించినప్పటికీ, పాకిస్తాన్ ‘‘ప్రభుత్వ’’ విధానంలో మార్పురానంతవరకూ మన దేశానికి జిహాదీల బెడద తీరదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ నాయకత్వంలోని బీభత్స వ్యవస్థను, అఫ్ఘానిస్థాన్‌లో ‘తాలిబన్’ల జిహాదీల ప్రభుత్వాన్ని అమెరికా కూల్చివేయగలిగింది. దీనివల్ల ఈ దేశాలలో జిహాదీ బీభత్సకారులు సమూలంగా నిర్మూలన కాలేదు. కానీ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సం తుదముట్టిపోయింది. అందువల్ల అంతర్జాతీయ సహకారంతో మన దేశం కూడ పాకిస్తాన్‌లో ప్రభుత్వం పేరుతో నెలకొని ఉన్న ‘జిహాదీ’ ‘మతోన్మాద బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’ను తుదముట్టించడానికి కృషిచేయడం. ఇందుకు వౌలిక చర్య పాకిస్తాన్‌ను ‘బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’- టెర్రరిస్ట్ రిజీమ్-గా ప్రకటించడం, బీభత్సకాండను వ్యతిరేకించే, చిత్తశుద్ధితో నిర్మూలించే రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడేవరకు ఆ దేశంలో సకలవిధ సంబంధాలను తెగతెంపులు చేసుకోవడం..
‘జమాత్ ఉద్ దావా’ ముఠాను ఇప్పుడు నిషేధించారట! అంటే గత పదకొండు ఏళ్లుగా ఈ ముఠాను నిషేధించలేదని ధ్రువపడింది. కానీ ఈ కాలవ్యవధి కనీసం ఐదుసార్లు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ‘జమాత్’ను నిషేధించినట్టు ఆధికారిక ప్రకటనలు వెలువడడం చరిత్ర. ‘లష్కర్ ఏ తయ్యబా’ జిహాదీ ముఠా 1990వ దశకంలోను, ఈ శతాబ్ది ఆరంభంలోను మన దేశంలో భయంకర హత్యాకాండ జరిపించింది. కశ్మీర్‌లోనే ‘పుట్ట పగిలిన’ హిజ్‌బుల్ ముజాహిదీన్, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, దేశమంతటా విస్తరించిన ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’వంటి సంస్థలతో పాకిస్తాన్ లష్కర్‌లకు అనుసంధానం ఏర్పడింది. ఏర్పరచిన అనుసంధానకర్త పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ సైనిక బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ- ఈ జిహాదీ బీభత్సముఠాలను ‘‘ఒకే తాటి’’పై నడిపిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో తన బీభత్స చర్యల గుట్టురట్టు అవుతోందన్న భయం కలిగినప్పుడల్లా పాకిస్తాన్ ఏదో ‘ఒక బీభత్స సంస్థ’ను నిషేధిస్తున్నట్టు ప్రకటించడం మూడు దశాబ్దుల చరిత్ర. తమది బీభత్స ప్రభుత్వం- టెర్రర్ రిజీమ్- కాదని తాము బీభత్సకారులను శిక్షిస్తున్న ప్రభుత్వ నిర్వాహకులమని చాటుకొనడానికి అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా మాత్రమే పాకిస్తాన్ పాలకులు ఈ ‘నిషేధాల’ను అభినయిస్తున్నారు. ఇలా ‘ఉత్తుత్తి’ నిషేధానికి గురి అయిన జిహాదీ ముఠాలు సైతం భయాన్ని అభినయిస్తున్నాయి. ఫలితంగా ‘‘నిషిద్ధ సంస్థ’’ నిర్వాహకులు కొత్త పేరుతో మరో జిహాదీ ముఠాను ‘‘చట్టం’’ ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద నమోదు చేస్తున్నారు. ఈ కొత్త ముఠాలను మతనిష్ఠ గల సేవాసంస్థలుగా విద్యాసంస్థలుగా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమేకాక సౌదీ అరేబియా వంటి ఇస్లామీ మత రాజ్యాలు సైతం గుర్తించడం చరిత్ర.. ఈ దేశాల ప్రభుత్వాలు, ఈ దేశాలలోని సంపన్నులు భారీగా ఈ ‘‘కొత్త పాకిస్తానీ సంస్థల’’కు విరాళాలు, నిధులు సమకూర్చడం చరిత్ర! కొన్ని నెలల తరువాత పాత ముఠాలు కూడ మళ్లీ కలాపాలను ప్రారంభిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పాత ‘ముఠా’లను అసలు నిషేధించలేదని అప్పుడు బయటపడుతుంది! అనేకసార్లు ఇలా జరిగింది. 2001లో అఫ్ఘానీ జిహాదీలు అమెరికాలోని న్యూయార్క్‌లోని ‘ప్రపంచ వాణిజ్య కేంద్రం’ భవనాన్ని కూల్చిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా పాకిస్తాన్ ప్రభుత్వం ‘లష్కర్ ఏ తయ్యబా’ను ‘‘నిషేధించింది..’’. ‘లష్కర్ ఏ తయ్యబా’ ముఠా నాయకుడు హఫీజ్ సరుూద్ ఆ తరువాత ‘జమాత్ ఉద్ దావా’ను స్థాపించాడు. నిజానికి ‘లష్కర్ ఏ తయ్యబా’అన్న ముఠా ‘‘మర్కజ్ ఉద్ దావా- వల్- ఇషార్ద్’’అన్న మరో ముఠానుంచి పుట్టుకొచ్చింది. ‘మర్కజ్’ను నిషేధించడంతో ‘లష్కర్’, ‘లష్కర్’ను నిషేధించడంతో ‘జమాత్’... ఇలా జిహాదీ ముఠాల సంఖ్య విస్తరిస్తూనే ఉంది.. ఈ మూడు ‘ముఠా’లు కూడ పాకిస్తాన్‌లో కొనసాగుతున్నాయి!
ముంబయిపై జిహాదీలు భయంకరమైన దాడి జరిపిన నేపథ్యంలో ‘జమాత్ ఉద్ దావా’ను నిషేధించాలని, హఫీజ్ సరుూద్‌ని నిర్బంధించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అమలు జరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ‘జమాత్’ను నిషేధించలేదని 2009లో లాహోర్ హైకోర్టులో పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది! అప్పటినుంచి ఇప్పటివరకూ ‘జమాత్ ఉద్ దావా’ను నిషేధించినట్టు మరో మూడుసార్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. నిషేధించలేదని ఇప్పుడు స్పష్టమైంది! ఇప్పుడు మరోసారి ‘జమాత్’ను నిషేధించింది- అట-! ఇదీ వంచన వ్యూహాన్ని పాకిస్తాన్ అమలు జరుపుతున్న తీరు..