సంపాదకీయం

తీరుమారని ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘బీభత్స వ్యవస్థ’- టెర్రిరిస్ట్ రిజీమ్-గా ప్రకటించడం మన ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యం. జమ్మూ కశ్మీర్‌లోని ‘జమ్మూ-శ్రీనగర్’ రహదారిలో ఉన్న అవన్తిపురా వద్ద పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ముష్కరులు మన పోలీసులపై జరిపిన పైశాచిక బీభత్సకాండ ఇందుకు నేపథ్యం. దక్షిణ కశ్మీర్‌లో పుల్వామా జిల్లాలోని అవన్తిపురా సమీపంలోని లేథ్‌పురా గ్రామం సమీపంలోని జాతీయ మహాపథంపై పయనిస్తుండిన కేంద్ర రిజర్వ్ పోలీసుల వాహనంపై ‘జాయిష్ ఏ మొహమ్మద్’ జిహాదీ హంతకులు గురువారం విరుచుకొనిపడడం మన భద్రతా వ్యవస్థలో నిహితమై ఉన్న ‘ప్రమత్తత’కు నిదర్శనం. ఈ దాడిలో దాదాపు నలబయి మంది పోలీసులు అమరులు కావడం ‘్భద్రత’ను భంగపరచిన విపరిణామం! మన కేంద్ర ప్రభుత్వ అనుబంధ సైనిక దళాల- కేంద్ర రిజర్వ్ పోలీసు దళం- సీఆర్‌పీఎఫ్-పై జమ్మూ కశ్మీర్‌లో ‘జిహాదీల’ దాడులు దశాబ్దుల చరిత్ర! దాడి చేయడం తోడేలు స్వభావం, పొంచి ఉండడం తోడేలు స్వభావం. ఊహించని స్థలంలో ఆవులపై దూకడం తోడేలు స్వభావం. పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ‘జిహాదీలు’ ఇలాంటి భయంకరమైన ‘మెకాలు’! మానవ రూపంలో పిశాచాలు! 1947 నుంచి కూడ పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న జిహాదీలు, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరణతో జమ్మూ కశ్మీర్‌లోనే పొటమరించిన జిహాదీలు మన ప్రజలపై, సైనికులపై, అనుబంధ సైనికులపై, పోలీసులపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. మన భద్రతాదళాల వారు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. దాడి చేసిన జిహాదీ మూకలను మన జవానులు, రక్షక భటులు తిప్పికొట్టిన ఘటనలు కోకొల్లలు. అసంఖ్యాకంగా ఈ ఘటనలు కొనసాగాయి. ఇదంతా మన సైనికుల, పోలీసుల అప్రమత్తతకు చిహ్నం. ఈ భారత సమాజ రక్షకులు, సరిహద్దుల్లోని కాపలాదారులు, జాతీయ సార్వభౌమ అధికార పరిరక్షణకై పాటుపడుతున్న భరతమాత వజ్రాల బిడ్డలు నిరంతర కృతజ్ఞులులైన దేశ ప్రజల అభినందనకు పాత్రులు. వారు ‘నిరంతర నిర్ నిద్రులై’ రక్షిస్తున్నారు గనుకనే మనమందరం, ప్రజలమందరం నిశ్చింతగా నిద్రపోగలగుతున్నాము. మాతృదేశ అంతర్గత భద్రతకు, సరిహద్దుల సంరక్షణకు వారు చేస్తున్న త్యాగమయ కృషి అద్వితీయం, నిరుపమానం! అక్షరాలకు అందని అమరచరిత్ర వారిది. భావానికి పట్టుబడని సమర చరిత్ర వారిది. మన సైనికులు, సరిహద్దు భద్రతా దళాలు- బిఎస్‌ఎఫ్- భారత టిబెట్ సరిహద్దు పోలీసులు- ఐటీబీపీ- అస్సాం రైఫిల్స్, కేంద్ర రిజర్వ్ పోలీసులు వంటి అనుబంధ సైనికులు, వివిధ ప్రాంతీయ విభాగాల రక్షకులు- వీరందరూ వివిధ రకాల బీభత్సకారులను ప్రధానంగా ‘జిహాదీ’లను దశాబ్దులుగా ప్రతిఘటిస్తున్నారు. ఈ మన వీరులలో...
ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపిన దినకరుడు,
ఒకడు నిశాచర బుద్ధిని
మసి చేసిన నిటలాక్షుడు,
ఒకడు దనుజరీతి కూల్చి
ధర్మం నిలిపిన రాముండు...
ఒక్కొక్కడు మాతృభూమి
యశో విభవ రక్షకుడు!
ఇదంతా అప్రమత్తత, మన వీరుల, రక్షకుల అవిరళ జాగరూకత.. అయినప్పటికీ అప్పుడప్పుడు ‘ప్రమత్తత’ ఆవహించడం జాతీయ వైపరీత్యం! డెబ్బయికి పైగా వాహనాలలో జమ్మూ ప్రాంతం నుంచి కశ్మీర్ లోయ వైపు కదలుతుండిన రెండువేల ఐదువందల మంది పోలీసులు భద్రతా విశ్వాసంతో ఉండడం సహజం. మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిముషాల సమయంలో దుండగులు దాడి చేయగలగడం ఊహించని విష పరిణామం. ఊహించని సమయంలో ఊహించని చోట దెబ్బతీయడం తోడేళ్ల స్వభావం, జిహాదీల స్వభావం! సౌదీ అరేబియా వంటి విదేశాల నుంచి చొరబడిన జిహాదీ బీభత్సకారులు, మన దేశంలోనే పుట్టపగిలిన జిహాదీ హంతకులు ఇలా దొంగదెబ్బ తీయడం శతాబ్దుల చరిత్ర! ఆత్మాహుతి దళాలుగా జిహాదీలు రూపొందిన తర్వాత ఇలా దొంగదెబ్బ తీయడం మరీ సులభమైపోయింది. ఒకరిద్దరు ‘జిహాదీలు’ తమ వాహనాన్ని పోలీసుల వాహనశ్రేణిలోకి నడిపేయడం, ఒక వాహనాన్ని బాంబులతో పేల్చివేయడం.. తాము ఒకరిద్దరు చస్తారు కానీ పదుల సంఖ్యలో పోలీసులను, సైనికులను బలితీసుకుంటున్నారు. ఈ జిహాదీ ఆత్మాహుతి బీభత్సదళాల దాడులకు గురువారం నాటి అవిన్తిపురా వద్ద జరిగిన పైశాచిక ఘటన మరో పునరావృత్తి.. అమరులైన మన జవానులకు అశ్రునయనాలతో కోట్లమంది దేశప్రజలు అంజలి ఘటిస్తున్నారు. జిహాదీలను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా ‘బీభత్సవ్యవస్థ’గా ప్రకటించాలని కోరుతున్నారు!
ఇలా పాకిస్తాన్ మతోన్మాద జిహాదీ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం ‘బీభత్స వ్యవస్థ’గా ప్రకటించడం పాకిస్తాన్‌ను ‘దారికి తేవడానికి’ జరుగవలసిన దౌత్య కృషిలో వౌలికమైన అంశం. ఇలా మొదట మన ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ‘పాకిస్తాన్‌ను బీభత్సవ్యవస్థగా మీరు కూడా ప్రకటించండి..’ అని ఇతర దేశాల ప్రభుత్వాలను మన ప్రభుత్వం కోరవచ్చు. ఐక్యరాజ్య సమితిలో సైతం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్సవ్యవస్థగా ప్రకటింపచేయడానికి కృషి చేయవచ్చు. ఈ కృషిని ఎప్పటికప్పుడు చైనా ప్రభుత్వం అటకాయించడం కూడ సంభవించగల సమాంతర విపరిణామం. పాకిస్తాన్‌లో నక్కి ఉన్న ‘జైష్ ఏ మొహమ్మద్’ ఉగ్రవాద ముఠాలోని మొదటి హంతకుడు అఝార్ మసూద్‌ను అంతర్జాతీయ బీభత్సకారుడు- గ్లోబల్ టెర్రరిస్ట్-గా ప్రకటింపచేయడానికి ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్న ప్రయత్నాలను చైనా అనేక ఏళ్లుగా అడ్డుకుంటోంది. అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ‘్భద్రతామండలి’లో శాశ్వత సభ్య దేశాలు మసూద్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని కోరుతున్నప్పటికీ చైనా మాత్రం నిర్లజ్జగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. అవన్తిపురాలో మరోసారి ఈ ‘జైష్ ఏ మొహమ్మద్’ ముఠా దాడి చేయడాన్ని ఇలా చైనా ప్రభుత్వం పరోక్షంగా సమర్ధించినట్టు అయింది. అవన్తిపురా దుర్ఘటనను ఐక్యరాజ్య సమితి, అనేక దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా నిరసించడం పాక్, చైనా ప్రభుత్వాలకు ఉమ్మడి అభిశంసన.. పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా అభిశంసింప చేసి, ఒంటరిని చేయడానికి మన ప్రభుత్వం కృషిని, దౌత్యనీతిని ముమ్మరం చేయాలి. పాకిస్తాన్‌లోని ‘ముఠాల’ను, ముఠాల్లోని హంతకులను ఐక్యరాజ్య సమితిలో అభిశంసించడానికి సైతం అంగీకరించని చైనా ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ‘సమితి’లో అభిశంసించడానికి అసలు అంగీకరించదు. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం చైనాను సైతం అంతర్జాతీయ వేదికపై నిలదీయవలసిన సమయం ఇది! సింకియాంగ్ ప్రాంతంలో బీభత్సకాండను సృష్టించిన జిహాదీలను చైనా ప్రభుత్వం భయంకరంగా అణచివేసింది. ‘తేలు కుట్టిన దొంగ వలె’ పాకిస్తాన్ ప్రభుత్వం నోరు మెదపలేదు. కానీ మన దేశంలో మాత్రం జిహాదీ బీభత్సకారుల హత్యాకాండ కొనసాగించడానికి చైనా నియంతలకు అభ్యంతరం లేదు!!
అమెరికా ప్రభుత్వం తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న ఆరోపణలపై అనేక దేశాలకు వ్యతిరేకంగా ఆర్థికపరమైన ఆంక్షలను విధిస్తోంది. చైనా కూడ ఇలాంటి ఆంక్షలను విధించడానికి వెనుకాడడం లేదు. ఇదంతా మన ప్రభుత్వానికి గుణపాఠం కావాలి! మన దేశంలోకి జిహాదీలను ఉసిగొల్పడం ఆపనంతవరకూ, మన దేశంలో హత్యాకాండను జరపడం మాననంత వరకూ పాకిస్తాన్ వస్తువులను దిగుమతి చేసుకోరాదని మన ప్రభుత్వం నిర్ణయించాలి. మసూద్ వంటి ముష్కర బీభత్స మూకలను సమర్ధించడం మాననంత వరకూ చైనా నుంచి కూడ మనం అన్ని రకాల దిగుమతులను ఆపివేయాలి. అప్పుడు అంతర్జాతీయ సమాజానికి సైతం ఈ రెండు దేశాల బీభత్స స్వభావం పట్ల అవగాహన పెరుగుతుంది.. పాకిస్తాన్‌ది ప్రత్యక్ష బీభత్సం, చైనాది ప్రచ్ఛన్న బీభత్సం...