సబ్ ఫీచర్

సిద్ధాంతాలను తుంగలో తొక్కి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల కోసం పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కటం సిగ్గు చేటు. కాంగ్రెస్, వామపక్షాలు పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్, వామపక్షాలు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒకరినొకరు ఛెడామడా తిట్టుకుంటూ తమ సిగ్గు లేని ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు వామపక్షాలు, కాంగ్రెస్‌లు అపవిత్ర సీట్ల సర్దుబాటు చేసుకోవటంతోపాటు రెండు పార్టీల నాయకులు వేదికలెక్కి ప్రసంగాలు దంచుతున్నారు. మమతా బెనర్జీది అవినీతి, అసమర్థ, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారంటూ ఆరోపణలు కురిపిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం దుష్టపరిపాలన మూలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడి పోతున్నదనేది వివరిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడిస్తే తప్ప రాష్ట్ర బాగుపడదని వాదిస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బడుగు,బలహీన వర్గాలు, మైనారిటీలు ఏ విధంగా బాగుపడతారనేది వివరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ నాయకులు కేరళలో మాత్రం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేరళలోని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, దుష్టపరిపాలన గురించి వామపక్షాల నాయకులు ఏకరవు పెడుతున్నారు. వామపక్షాల నాయకులు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీపై చేస్తున్న ఆరోపణలనే కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై కుమ్మరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా వామపక్షాన్ని కడిగి పారేస్తున్నారు. వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ప్రజలను ఎలా పీడించుకుతిన్నారు, ఏ కారణం చేత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందనేది వివరిస్తూ ఓటర్లను ఆకర్షించి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు ఎంత అవినీతి పరులనేది వామపక్షాలు వివరిస్తుంటే వామపక్షం అధికారంలోకి వస్తే ఎలాంటి భయానక పరిస్థితులు నెలకొంటాయనేది కాంగ్రెస్ నాయకులు ప్రజల ముందు పెడుతున్నారు.
పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఒకరినొకరు మెచ్చుకుంటూ కేరళలో మాత్రం ఒకరిపైమరొకరు బురద చల్లుకుంటున్నారు. అధికారం కోసం కాంగ్రెస్, వామపక్షాలు సిద్ధాంతపరమైన వ్యభిచారానికి పాల్పడటం దురదృష్టకరమం. రెండు పార్టీలు ఇలా నైతిక పతనావస్థకు చేరుకోవటం సిగ్గు చేటు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఒకరిపట్ల మరొకరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది పశ్చిమ బెంగాల్ ప్రజలు గ్రహించలేరా? లేక పశ్చిమ బెంగాల్‌లో రెండుపార్టీలు ఏ విధంగా కలిసిపోయాయనేది కేరళ ప్రజలు గుర్తించలేరా? రెండు రాష్ట్రాల ప్రజలకు తెలివి లేదని కాంగ్రెస్, వామపక్షాలు ఎందుకు భావిస్తున్నాయి? రెండు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కాంగ్రెస్, వామపక్షాల అనైతిక కలయిక, కలహాలను గుర్తిస్తున్నారు. శత్రువు కు శత్రువు తమకు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని రెండు పార్టీల నాయకులు తుచతప్పకుండా ఆచరిసరిస్తూ తమ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలివ్వటం అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ఇలాంటి అపవిత్ర రాజకీయాల మూలంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుంది. అంతే కాక రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందనేది ఈ నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
కాంగ్రెస్, వామపక్షాల అపవిత్ర కలయిక, కలహాల రాజకీయంపై మేధావులు ఎందుకు స్పందించటం లేదు. ఇది మంచి పద్ధతి కాదని ఎందుకు విమర్శించటం లేదు? అవకాశవాద రాజకీయాలు ఆచరించటం మంచిది కాదని మేధావులు ప్రకటించలేరా? ప్రతి చిన్న గొడవను గోరంతను కొండంతలు చేసే మేధావులు కాంగ్రెస్, వామపక్షాల అవకాశవాద రాజకీయాను ఎందుకు విమర్శించటం లేదు? తాము చేస్తే రాజకీయం ఇతరులు చేస్తే అవకాశవాదం అన్నట్లు కాంగ్రెస్, వామపక్షాలు వ్యవహరించటం సిగ్గు చేటు. అవకాశవాద రాజకీయాల మూలంగానే దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతిమయంగా తయారైంది.
కాంగ్రెస్ మొదటి నుండి అవకాశ వాద రాజకీయానికి పెద్ద పీట వేస్తోంది. తాము అధికారంలోకి వచ్చేందుకు లేదా కొనసాగేందుకు కాంగ్రెస్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుంది. ఎవరితోనైనా చేతులు కలిపి సీట్ల సర్దుబాటు చేసుకుంటుంది. అధికారం కోసం కాంగ్రెస్ మతతత్వ శక్తులతో సైతం చేతులు కలిపిన దాఖలాలు కోకొల్లలు. ఇప్పుడు వామపక్షాలు సైతం రాజకీయాధికారం కోసం అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయటం ఘోరం. పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు కాంగ్రెస్ హవా నడిచేది. అప్పట్లో వామపక్షాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తిట్టిన తిట్టుతిట్టకుండా తిట్టేవారు. ఆ తరువాత వామపక్షాలు పద్దెనిమిది సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా పాలన చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు వామపక్షాల ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయని రోజు లేదు. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఒకప్పటి బద్ధ శత్రువులు ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కేరళలో మాత్రం తమ శత్రుత్వాన్ని కొనసాగించటం రాజకీయ నయవంచనకు పరాకాష్ట.