ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పార్లమెంటు సజావుగా సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ గుణపాఠం నేర్పించిన ప్రతిపక్షం విజయగర్వంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయకూడదు. ఈ నెల 26 తేదీ నుండి ప్రారంభమవుతున్న శీతాకాల సమావేశాలలోనైనా దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేతుబద్దమైన చర్చ జరిపి పరిష్కారాలు కనుగొనేందుకు అధికార, ప్రతిపక్షాలు చిత్తశుద్దితో ప్రయత్నించాలి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి తమ సత్తా చాటుకున్న ప్రతిపక్షం జాతి ప్రయోజనాల దృష్టా పార్లమెంటు శీతాకాల సమావేశాల విషయంలో విశాల దృక్పధంతో వ్యవహరించాలి. ఎన్.డి.ఏను ఇరకాటంలో పడవేసేందుకు ‘ అసహనం’ పేరుతో పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయకూడదు.
గత మూడు,నాలుగు సంవత్సరాల నుండి పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగటం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన బడ్జెట్ సమావేశాలు, ఆ తరువాత వచ్చిన వర్షాకాల సమావేశాల సమయమంతా అధికార, ప్రతిపక్షం గొడవలు, గందరగోళంలో కొట్టుకుపోయాయి. బడ్జెట్ సమావేశాల్లో వివిధ శాఖల పద్దులపై పెద్దగా చర్చ జరగలేదు. వివిధ శాఖల పద్దులపై చర్చ జరగకపోవటం అనేది కూడా ఒక ఆనవాయితీగా మారటం దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం పార్టీ రాజకీయాలకు బలైపోతోంది. ఈ దురాగతానికి ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా బాధ్యత వహించకతప్పదు. అధికార, ప్రతిపక్షం మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మాత్రం సజావుగా నడవనివ్వాలని ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చినా ఈ ఆంగీకారాన్ని ఇరుపక్షాలు ఏనాడూ గౌరవించలేదు. అధికార, ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఖూనీ చేస్తున్నాయి. ఉభయ సభలు సమావేశం కాగానే పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం, ఏదోఒక అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి దానిపై చర్చ జరిపేందుకు గొడవ చేయటం, ప్రభుత్వం చర్చకు సిద్దమైనా ప్రతిపక్షం పట్టించుకోకపోవటం, ప్రతిపక్షం దిగివచ్చి చర్చకు అంగీకరిస్తే ఆఖరు క్షణంలో ప్రభుత్వం మొండికి వేయటం ద్వారా పార్లమెంటు సమావేశాలను నిర్వీర్యం చేస్తున్నారు.
ఇక మీదటనైనా అధికార, ప్రతిపక్షాలు దేశం, ప్రజల పట్ల తమకున్న గురుతర బాద్యతను గుర్తించి పార్లమెంటును బలి తీసుకోవటం మానివేయాలి. పార్లమెంటును బజారు స్థాయికి దిగజార్చటం ఇకనైనా మానివేయాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల చాలా మందికి విశ్వాసం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా యువతకు పార్లమెంటుపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇది ఎంత మాత్రం మంచి పరిణాణం కాదు. పార్లమెంటు ఉభయ సభలు గత ఐదారు సంవత్సరాల నుండి అధికార, ప్రతిపక్షం సృష్టిస్తున్న రాజకీయ దుమారంలో కొట్టుకుపోవటం విదితమే. మొదది యు.పి.ఏ ప్రభుత్వ కాలంలో పార్లమెంటు మొదట కొంత సజావుగా జరిగినా ఆ తరువాత ప్రతిపక్షం ఆరోపణల వెల్లువలో కొట్టుకుపోయింది. ఇక యు.పి.ఏ రెండో సారి అధికారంలోకి వచ్చిన అనంతరం పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు కూడా సజావుగా జరగలేదు. స్పెక్ట్రం గొడవ, కామన్‌వెల్త్ క్రీడల అవినీతి, కొందరు మంత్రుల అవినీతి, ఆంధ్రప్రదేశ్ విభజన వివాదం తదితర కారణాల మూలంగా పార్లమెంటు సమావేశాలు గందగోళంలో పడిపోయాయి. ప్రధానంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం అధికార, ప్రతిపక్షం పార్టీ రాజకీయలకు బలైపోతోంది. పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కాగానే ప్రతిపక్షం పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం ఒక పరిపాటిగా మారింది.
నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్.డి.ఏ భారీ మెజారిటీతో అధికారంలోకి చవ్చిన తరువాత పార్లమెంటు మొదటి సమావేశం సజావుగా జరిగింది. ప్రజల సమస్యలపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం హుందగాగా జరగటంతోపాటు కొన్ని సందర్భాల్లో ఒక గంట ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పదిహేను ప్రశ్నలపై చర్చ జరిగింది. అయితే ఆ తరువాత పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయింది. గత సంవత్సరం నుండి పార్లమెంటు ఉభయ సభలు అధికార, ప్రతిపక్షం గొడవలకు బలైపోతున్నాయి. భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించే పేరుతో ప్రతిపక్షం రాజ్యసభను దాదాపుగా హైజాక్ చేసింది. రాజ్యసభలో ప్రతిపక్షం మెజారిటీలో ఉండటంతో లోక్‌సభ ఆమోదించిన బిల్లులు సైతం పెద్దల సభలో వీగిపోతున్నాయనేందుకు భూసేకరణ సవరణ బిల్లు తాజా ఉదాహరణ. రాజ్యసభలోప్రతిపక్షం మెజారిటీని ఎదుర్కొనటం సాధ్యం కాని ప్రభుత్వం చివరకు భూసేకరణ సవరణ బిల్లును ఉపసంహరించుకోవలసి వచ్చింది. అన్ని పక్షాలు ఆమోదించిన జి.ఎస్.టి బిల్లుకు సైతం ఇంత వరకు మోక్షం లభించలేదు.
అతివృష్టి, అనావృష్టి మూలంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశయానం చేయటంతో బీదా,బక్కి జనం తల్లడిల్లిపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోకపోవటంతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయి దేశాభివృద్ధితోపాటు సగటు మనిషి అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటోంది. మరోవైపు ఇస్లామిక్ తీవ్రవాదం ప్రపంచానికే సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను తమ పార్టీ రాజకీయాలకు బలి చేయకుండా దేశ ప్రజల సమస్యల పరిష్కార కేంద్రంగా తీర్చి దిద్దాలి. పార్లమెంటు ఉభయ సభలకు గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేయాలి.