సబ్ ఫీచర్

మానవాభివృద్ధి లక్ష్యంగా ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి రేటును పెంచడంలోనూ, జీవ నాణ్యతను పెంచడంలోనూ వెనకబడ్డాయి. కొన్ని దేశాలు అభివృద్ధి రేటు పెంచుకున్నా (ఉదాహరణకు, భారతదేశం) జీవ నాణ్యత విషయంలో బాగా వెనకబడ్డాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డి.పి) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం 2014లో అభివృద్ధి సూచిక విషయంలో మన దేశ స్థానం 130గా వుంది (188 దేశాల సమాచారం సేకరించడం జరిగింది). అంతకుముందు 131గా వుంది. కాస్త మెరుగన్నమాట. 2009-2004 మధ్యకాలంలో మన దేశం కేవలం ఆరు పాయింట్లు మాత్రమే పెరిగింది. బంగ్లాదేశ్ ర్యాంకు 142గా వుంది. ఆడపిల్లలను బడికి పంపడంలో మన దేశంకంటే బంగ్లాదేశ్ ముందుంది. లింగవివక్షత విషయంలోనూ మన దేశం వెనకబడి వుంది. మన దేశ సగటు ఆయుర్ధాయం 68 ఏళ్లు, బంగ్లాదేశ్‌లో ఇది 71.6 ఏళ్లు.
మానవాభివృద్ధి విషయంలో మన దేశం వెనకబడే వుంది. కొన్ని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. దారిద్య్ర నిర్మూలన విషయంలో కొంత ప్రగతి సాధించాం. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశ ర్యాంకు 2014లో 55గా వుంది. అంతకుముందు సంవత్సరం 63గా వుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 200 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.
మన వైద్య రంగంలో పరిస్థితి, ముఖ్యంగా గ్రామాలలో, ఏమాత్రం బాగుండలేదు. వైద్య సదుపాయాలలో మూడవ వంతే గ్రామాలలో వున్నాయి. ప్రాథమిక వైద్య కేంద్రాలలో కనీస సామగ్రి లేదు. సిబ్బంది కొరత వుంది. మన దేశంలో సగటున 1,700 జనాభాకు ఒక వైద్యుడే వున్నాడు. పది వేల ప్రజలకు సగటున ఏడు పడకలు వున్నాయి. శిశు మరణాల రేటు వెయ్యికి 56గా వుంది. సుమారు 38 శాతం పిల్లలలో సరైన పెరుగుదల లేదు, 48 శాతం పిల్లలు తక్కువ బరువుతో వున్నారు. లక్ష జననాలకు 300 తల్లులు ప్రసవంలో చనిపోతున్నారు. వైద్య రంగానికి నిధుల కొరత వుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి 2014-15లో రూ.30,645 కోట్లు కేటాయించింది. ఇది జాతీయ ఆదాయంలో 1.3 శాతం మాత్రమే.
మన విద్యారంగంలో నాణ్యత లోపించింది. బడిలో చేరే వారి సంఖ్య బాగానే పెరిగింది. మధ్యలోనే చదువు మానేసే వారి సంఖ్య ఎక్కువ. ఐదవ తరగతి పూర్తిచేయకుండానే సుమారు 20 శాతం మంది చదువు ఆపేస్తున్నారు. ఇలా చేసే వారికి ఎటువంటి నైపుణ్యత వుండదు. వనరులు దుర్వినియోగం అయినట్లే. అంతేకాదు, ఐదవ తరగతి విద్యార్థులు రెండవ తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేకపోతున్నారు. మన దేశంలో వృత్తి విద్యకు తగు గుర్తింపు లేదు.
మన గ్రామాలలో సుమారు 70 శాతం ప్రజలు నివసిస్తున్నారు. అయితే, వీరికి కనీస అవసరాలు తీర్చుకునే అవకాశం లేదు. వీరికి త్రాగునీరు కూడా కరువయ్యింది. నీటికి సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారు. గ్రామీణ కుటుంబాలలో 45 శాతం మందికి త్రాగునీరు అందుబాటులో లేదు.
దేశంలో అవినీతి పెరుగుతూనే వుంది. అవినీతితో సంపాదించిన డబ్బు ఎలా ఖర్చుచేస్తారో మనకి తెలుసు. అంతేకాదు, దేశంలో ఆదాయ సంపద వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. అందువల్లే దేశంలో వనరుల వినియోగం సరిగాలేదు. మన నాయకులకు ఎన్నికల సమయంలోనే పేదలు గుర్తుకొస్తారు. ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలను మార్చాలి. బడ్జెట్‌లో మానవాభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు వుండాలి. అంతేకాదు, గ్రామీణ అవసరాలను తీర్చడంలో పంచాయతీలకు కీలక పాత్ర వుంది.

- డా.ఇమ్మానేని సత్యసుందరం