ఫిలిం క్విజ్

దేవత -- ఫ్లాష్‌బ్యాక్ @ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శక నిర్మాత హెచ్‌ఎం రెడ్డి నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్. ఆ సంస్థనుండి విడివడిన బిఎన్ రెడ్డి, మూలా నారాయణస్వామి, దాసు మరి కొందరితో కలిసి స్థాపించిన సంస్థ వాహిని. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం, మలి చిత్రం ‘సుమంగళి’ కాగా 1941లో నాగయ్య, కుమారి కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం ‘దేవత’.
==============
వాహిని పిక్చర్స్ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ రామనాథ్ నిర్వహించేవారు. ఈ చిత్రానికీ కథ, స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ ఆయనే అందించారు. కళ ఏకె శేఖర్. హీరోగా, సంగీత దర్శకుడిగా వి నాగయ్య చేశారు. రచన సముద్రాల (సీనియర్). చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా కెవి రెడ్డి, సహాయ దర్శకులుగా కమలాకర కామేశ్వరరావు, నాగేశ్వరరావు చేశారు. నిర్మాత, దర్శకత్వం బిఎన్ రెడ్డి.
==============
ఇంగ్లాండులో బారిస్టర్ చదువు పూర్తిచేసి తన ఊరొస్తాడు వేణు (నాగయ్య). అతని తల్లి మంగమ్మ (పార్వతీబాయి) దైవభక్తురాలు. సోదరి సీత (టంగుటూరి సూర్యకుమారి). వారింటి పనిమనిషి లక్ష్మి (కుమారి). ఆమె తమ్ముడు రంగన్నతో (సంగీత దర్శకుడు అశ్వద్ధామ) కలిసి అక్కడే ఉంటుంది. ఆమె తండ్రి వెంకన్న (లింగమూర్తి) దగ్గర గ్రామంలో ఉంటాడు. ఇంటిలో పనిపాటలు చేస్తున్న లక్ష్మి అందాన్ని చూసిన వేణు ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. ఒకనాటి రాత్రి తల్లి, చెల్లెలు ఇంటలేని సమయంలో ఆమెను బలవంతంగా వశపర్చుకుంటాడు. జరిగిన దానికి కుమిలిపోతున్న లక్ష్మిని ఓదార్చి, ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు. మద్రాసు మేనమామ ఇంటికెళ్లిన వేణు అక్కడ లాయర్‌గా ప్రాక్టీసు పెడతాడు. మేనమామ తన కుమార్తె విమల (బెజవాడ రాజరత్నం)కు వేణుకు పెళ్ళి ఖాయంచేసి, వేణు తల్లిని, చెల్లిని రప్పిస్తాడు. వారితోపాటు మద్రాస్ వచ్చిన లక్ష్మితో వేణు తాను మాట తప్పానని క్షమించమని కొంత డబ్బు ఇవ్వచూపుతాడు. లక్ష్మి దానిని తిరస్కరించి తండ్రివద్దకు వస్తుంది. తండ్రి ఆమెకు ఆ ఊరివాడైన చెన్నప్ప (గౌరీపతిశాస్ర్తీ)తో వివాహం నిశ్చయిస్తాడు. తాను గర్భవతినని తండ్రికి తెలియచేసి తండ్రి ఆగ్రహాన్ని చవిచూసిన లక్ష్మి, తమ్ముడితో కలిసి దూరంగా వెళ్తుంది.
ఓ హరిదాసు స్వాంతనలో మగబిడ్డను కంటుంది. లక్ష్మి దూరంగా వెళ్ళాక విచారపడిన వేణు, విమలపట్ల నిరాసక్తి చూపటంతో, ఆమె తన స్నేహితుడు రామకృష్ణకుమార్ (సిహెచ్ నారాయణరావు)తో లేచిపోతుంది. లక్ష్మిగురించి తల్లికి నిజం చెపుతాడు వేణు. మంగమ్మ క్షమించి, లక్ష్మిని వెదకితెమ్మని పంపుతుంది. చంటిబిడ్డతో, తమ్మునితో అవస్థలు పడిన లక్ష్మి ఓ వ్యభిచార గృహం చేరుతుంది. తొలుత అక్కడనుంచి బయటపడి, తరువాత బిడ్డడికి అనారోగ్యం కలుగటంతో, తిరిగి ఆమెనే ఆశ్రయిస్తుంది. ఆమె లక్ష్మిని వ్యభిచారానికి దింపటంతో లక్ష్మి ఆమెను గాయపరచి, ఆ ఇంటినుంచి బయటకువస్తూ పోలీసులకు పట్టుబడుతుంది. లక్ష్మిని వెదుకుతూ పోలీస్‌స్టేషన్‌కు వస్తాడు వేణు. వ్యభిచార గృహం యజమానురాలు మరణిస్తూ, లక్ష్మి తప్పేమీలేదని వాంగ్మూలం ఇవ్వటంతో లక్ష్మి నిర్ధోషిగా విడుదలవుతుంది. వేణు, లక్ష్మి ఏకమై ఆనందంగా కుటుంబంతో కలియటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో వేణు మేనమామగా గోచేరు సుబ్బారావు, మేనమామ భార్యగా శేషమాంబ నటించారు. వ్యభిచార గృహంలో విటునిగా కెవి రెడ్డి కనిపిస్తారు. హరిదాసుగా రెంటచింతల సత్యనారాయణ, అతని భార్యగా హేమలత నటించారు.
దర్శకులు బిఎన్ రెడ్డి సన్నివేశాలను రూపొందించిన తీరు ప్రశంసనీయం. లక్ష్మి పట్ల వేణు ఆకర్షితుడవటాన్ని, ఆమె చేసే ఇంటి పనులు గమనించటం నుంచి ఆమెపట్ల గల కోరికను ఓ ఇంగ్లీషు జంట బొమ్మనూ, ఎక్స్‌పిరీయన్స్ అనే ఇంగ్లీషు మ్యాగ్‌జైన్ ముఖ చిత్రంపై కిస్సింగ్ దృశ్యం చూపటంలో అద్భుతంగా పండించారు. మెట్లువేగంగా దిగటం, కోరిక తీరాక ఏం జరుగుతుందోనన్న జంకుతో నిద్రలేకుండా హీరో గడపటం, తెల్లవారటం కోసం ఎదురుచూపు, విమలతో పెళ్ళికి అంగీకరించాక లక్ష్మిని చూసి మధన, చేతిలోని పుస్తకంలో మేనక విశ్వామిత్రుల చిత్రం చూడడం, విమల చేత పియానోమీద సుకుమార్ వ్రాసిన గీతం పాడించటం, దానికి హీరో రియాక్షన్ అద్భుతంగా చూపించారు. ‘రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా..’ గీతంలో ‘వాంఛ కొనసాగునందాకనే ఈ ప్రేమానుబంధాలు’ లాంటి సందర్భోచిత చరణాలు, సార్వజనీకంగా మిగలటం (గానం బెజవాడ రాజరత్నం) విశేషం. లక్ష్మికి డబ్బు ఇవ్వజూపే సన్నివేశంలో ఆమెచేత పలికించిన ఉదాత్తమైన సంభాషణలు (మిమ్మల్ని పెళ్ళిచేసుకోమని నేనడిగానా), ఇక కుల మతభేదాలు, అంతస్తుల తేడాలులేకుండా మంగమ్మ పాత్ర లక్ష్మిని కోడలిగా అంగీకరించటం (అభ్యుదయ భావాలకి బీజంవేయటం), మొదట రామాయణంలోని పద్యం ‘పూర్వపుణ్యంబు వలన పురుషుడు’ సీత పాడిన పాట లక్ష్మికి పదేపదే స్ఫురణకు రావటం, వ్యభిచార గృహంలో అది తలపుకువచ్చి బయటపడటం లాంటి సన్నివేశాలు దర్శకుని విశే్లషణ, ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. ఆ తరువాత ఎందరికో మార్గదర్శకమైనాయి. (ఎడ్లబండికి కారు కట్టి లాగించటం వంటివి).
ఇక సముద్రాల సమయోచిత సంభాషణలు సరసంగా, సరళంగా అలరించాయి. సీత, అన్నకోసం వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టాలా? అని బీరువాలోని చీరలన్ని కుప్పపోసి ‘అంచు బాగుంటే, రంగు బాగోదు’ అని తల్లివద్ద విశే్లషణ.. నాటినుంచి నేటివరకూ మహిళల మనోగతాన్ని ఎంతో సహజంగా చూపటం, రాతలో, చిత్రీకరణలో అలరింపు.
రాత్రిపూట సన్నివేశాలు, చంద్రుడూ ఆకాసం వంటివి ఎంతో చక్కని ఎఫెక్ట్‌తో రామ్‌నాథ్ తన ఫొటోగ్రఫీతో చిత్రీకరించారు. నటీనటులందరు ఎంతో సహజంగా, స్వాభావికంగా నటించి మెప్పించారు. బెజవాడ రాజరత్నం ఆధునిక యువతిగా చురుకు, ధైర్యం, వివేకంతో మెలగటం, సమయోచితంగా మెలిగే ఆషాడభూతి వంటి పాత్రను సిహెచ్ నారాయణరావు ఒప్పించగా, సాత్వికంగా కొద్దిపాటి అల్లరి గడుసుదనం వున్న సోదరిగా టంగుటూరి సూర్యకుమారి, ఇక హీరోయిన్ కుమారి ఆ పాత్రకు తగ్గ నెమ్మది, వ్యక్తిత్వం, ఆలోచనా, ప్రేమ, అభిమానం ఎంతో ప్రశంసనీయంగా నటించింది. హీరో నాగయ్య సూటు బూటుతో వెరైటీనీ, లక్ష్మి దూరమయాక కొంత వివేకంతో మెలగటం, విమలపట్ల విముఖత, ఆ వయసుకుతగ్గ హీరోగా సందర్భోచితంగా నటించారు. లింగమూర్తి తాగుబోతు తండ్రిగా వైవిధ్యంగా పెళ్ళికిముందు సెక్స్ అనుభవాన్ని సబ్జెక్టుగా తీసుకుని చిత్రం తీయటం ఆరోజుల్లో సాహసం కావటమయితే, నాగయ్య నిజజీవితంలో ఈ సంఘటన చోటుచేసుకోవటం, వారింటగల జయలక్ష్మి అనే యువతిని, బిఎన్ రెడ్డి ఆశీస్సులతో వివాహం చేసుకోవటం జరిగింది.
చిత్ర గీతాలు
పార్వతీబాయి, సూర్యకుమారి చిత్ర ప్రారంభంలో శ్రీరాముని పూజిస్తూ పాడే గీతం, ఈ పాటలో పనులుచేస్తూ కుమారిపై చిత్రీకరణ -రామా భజనే మోద జనకమురా నీ భజనే (పార్వతీబాయి, సూర్యకుమారి). రామాయణం చదువుతూ సూర్యకుమారి పాడే (సీతకు జనకమహారాజు చెప్పే నీతులు) పాట -శాంత సహనమ్ములును తోడిజనుల మీద ఆదరంబును (సూర్యకుమారి). రైతులు పనిపాటలు చేస్తుండగా సూర్యకుమారి పాడే గీతం -రైతు జనములా పండుగ దినమిదిరా (సూర్యకుమారి). ఆరుబయట జాబిల్లిని చూపుతూ సూర్యకుమారి, కుమారిలపై చిత్రీకరణ -వెండికంచాలలో వేడి బువ్వుందోయి/ తిందాము రావోయి జాబిల్లి, పండువెనె్నల పిండి పానకం తేవోయి’, ‘అన్నను తేవోయి జాబిల్లి’ ముచ్చటైన ప్రయోగం (సూర్యకుమారి). రామాయణంలోని నీతిని తెలిపే మరో పద్యం -పూర్వపుణ్యంబుకొలది పురుషుడనెదరు (సూర్యకుమారి). విమలపై చిత్రీకరించిన గీతం -అదిగో అందియల రవళి/ జయమే రాపాడిపోయే (బెజవాడ రాజరత్నం). విమలపై మరో గీతం -జాగేల వెరపేల/ త్రాగుము రాగసుధారసమూ (బెజవాడ రాజరత్నం). ఊయల ఊగుతూ సూర్యకుమారి గానంచేసిన గీతం -ఊగెదా ఉయ్యాలా తూగుటూయెలా పూదీ గెలూయోలా. నాగయ్య, కుమారిపై ఆశపడే సన్నివేశంలో వచ్చే నేపథ్యగీతం -ఈ వసంతము నిత్యము కాదో (ఎంఎస్ రామారావు).
విమల, సిహెచ్ నారాయణరావులపై కారులో ఆరుబయట చిత్రీకరించిన గీతం -ఎవరు మాకింకసాటి/ వేరెవరు మాకింకసాటి యిలసాటి లేని జంట మాది (బెజవాడ రాజరత్నం). మంగమ్మపై చిత్రీకరించిన తత్వగీతం -ఎన్నో నోములు నోచినగాని ఈ నరజన్మము దొరకదురా (పార్వతీబాయి). నాగయ్యపై చిత్రీకరించిన గీతం -ఎన్నాళ్ళుండెద వివాసుఖములో (నాగయ్య). రంగడిపై గీతం -లోకమంతా లోభూలా కానరే నిరుపేదలా (అశ్వద్ధామ). దేవతలోని అన్ని గీతాలు హిట్‌అయ్యాయి. లోకమంతా లోభులా ఎందరో ఆశ్రీతుల గీతంగా ప్రశస్తిపొందింది.
దేవత చిత్రం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. రజతోత్సవాలు జరుపుకుంది. తమిళనాట కూడా చిత్రం విజయం సాధించింది. పాటల పుస్తకాలు తమిళంలోనూ ముద్రించబడ్డాయి. ‘దేవత’ దక్షిణ భారతదేశంలో విజయవంతమైన చిత్రంగా గ్రహించి దర్శకులు బిఎన్ రెడ్డి కృషిని ప్రశంసిస్తూ ఎన్నో పత్రికలు అభినందనలు తెలిపాయి.
దేవత టైటిల్ పవర్‌ఫుల్ కావటంవల్లనేమో ఆ పేరుతో ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్‌లో 1965లో వచ్చిన చిత్రం, శోభన్‌బాబు, జయప్రద, శ్రీదేవిల కాంబినేషన్‌లో 1982లో వచ్చిన చిత్రం కూడా విజయాలు సాధించాయి. మహిళల ఆదరాన్ని పొందాయి.
75 ఏళ్లు పూర్తిచేసుకున్న వాహినీవారి ‘దేవత’ చిత్రం ఆ రోజుల్లోనే చూపిన అభ్యుదయాన్ని అభినందించదగ్గ అంశంగా గుర్తుచేసుకోవాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి