ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

జాతీయ పార్టీల దుస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019సంవత్సరంలో ప్రాంతీయ ప్రార్టీలు అందలం ఎక్కితే జాతీయ పార్టీలు గడ్డుపరిస్థితుల్లో పడిపోయాయి. బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు గత సంవత్సరం తమ, తమ లక్ష్యాలను సాధించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. కేంద్రంలో గత ఆరు సంవత్సరాల నుండి అధికారంలో ఉండటంతోపాటు దేశం దశ, దిశను మార్చివేసే కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న బి.జె.పి. ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలోని బి.జె.పి కేవలం హర్యానాలో ప్రాంతీయ పార్టీ మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌లో స్వయం శక్తితో అధికారంలోకి రాగలిగినా మహారాష్ట్ర, జార్కండ్‌లో ప్రాంతీయ పార్టీలకు తాబేదారులుగా జీవించవలసి వస్తోంది. దేశాన్ని దాదాపు అరవై సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ మనుగడ రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతుంటే రాష్ట్రాల్లో సునాయాసంగా విజయం సాధించవలసిన బి.జె.పి. ఓటమిని ఒటమిని చవి చూస్తోంది. నరేంద్ర మోదీ, అమిత్ షా యుద్ధ ప్రాతిపదికపై ఎన్నికల ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాందీ ఎన్నికల ప్రచారం చేయకపోయినా కాంగ్రెస్‌కు పలు చోట్ల కలిసి రావటం 2019 రాజకీయ వైచిత్రం. 2019లో బి.జె.పి., కాంగ్రెస్‌ల పరిస్థితి ఎందుకిలా తయారయ్యాయనేది ఆలోచించవలసిన విషయం. మొదట కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి. విషయం పరిశీలిద్దాం. కేంద్రంలో 2014 నుండి అధికారంలో ఉన్న బి.జె.పి. గత పదమూడు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, జార్కండ్‌లో అధికారాన్ని కోల్పోయింది. హర్యానాలో చౌతాలా నాయకత్వంలోని రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. మధ్యప్రదేశలో అతి తక్కువ మెజారిటీతో అధికారాన్ని కోల్పోయింది. మహారాష్టల్రో శివసేన వెన్నుపోటు మూలంగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. జార్కండ్‌లో బి.జె.పి చిత్తుగా ఓడిపోయింది. ఈ ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం బి.జె.పి. అధినాయకత్వం వ్యవహరించిన తీరు. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి విజయరాజె సింధియా ఏకపక్ష పరిపాలనా విధానాన్ని నిలువరించటంలో బి.జె.పి. అధినాయకత్వం ఘోరంగా విఫలమైంది. దీనికి తోడు శాసన సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో బి.జె.పి. అధినాయకత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. స్థానిక నాయకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అభ్యర్థులను ఎంపిక చేయటం వల్లనే బి.జె.పి. ఓటమిపాలయ్యింది. రాజస్తాన్‌లో బి.జె.పి. ఓటమికి అప్పటి ముఖ్యమంత్రి విజయరాజె సింధియా ఎంత కారణమో పార్టీ అధినాయకత్వం కూడా అంతే కారణం. తమకు అంతా తెలుసు, తాము తీసుకునే నిర్ణయాలకు ఎదురుండదనే పద్ధతిలో ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యవహరించటం వల్లనే రాజస్థాన్‌లో ఓటమి ఎదురయ్యింది. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ అభిప్రాయాలకు కొంతైనా విలువ ఇచ్చి ఉంటే బి.జె.పి. మరోసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చేది. మధ్యప్రదేశ్‌లో పది, పదిహేను సీట్ల వ్యత్యాసం మూలంగానే బి.జె.పి. అధికారంలోకి రాలేదు. చత్తీస్‌గడ్‌లో కూడా స్థానిక నాయకులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వటంలో బి.జె.పి. అధినాయకత్వం విఫలమైంది. అమిత్ షా బృందం ఢిల్లీలో కూర్చోని పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయకుండా రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించి ఉంటే ఇక్కడ కూడా బి.జె.పి. అధికారంలోకి రాగలిగేది. ఢిల్లీలో కూర్చున్న పెద్దలు రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన ఇక్కడ భారీ అపజయాన్ని ఎదుర్కొనక తప్పలేదు. మహారాష్టల్రో శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. రాష్ట్ర ప్రజలు బి.జె.పి.-శివసేన కూడమిని గెలిపించినా శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం తన సిద్ధాంతాలను గాలికి వదిలివేసి ఆగర్భ శతృవులతో చేతులు కలిపింది. చిరకాల మిత్ర పక్షం వెన్నుపోటు పొడిచిన అనంతరం బి.జె.పి. ప్రతిపక్షంలో కూర్చుంటే ఎంతో బాగుండేది. విలువలకు ప్రాధాన్యత కట్టుబడి ఉంటామని చెప్పుకునే బి.జె.పి. అధికారం కోసం విలువలను తుంగలో తొక్కి ఎన్.సి.పి. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అజీత్ పవార్‌తో చేతులు కలిపింది. ఇది రాజకీయంగా క్షమించరాని నేరం. అధికారం కోసం తాము ఎంతకైనా తెగిస్తాము, ఈ విషయంలో తమకు కాంగ్రెస్‌కు మధ్య ఎలాంటి తేడా లేదని నిరూపించుకోవటం ద్వారా బి.జె.పి తన ప్రతిష్టను తానే దిగజార్చుకున్నది. బి.జె.పి ఇప్పుడు కాంగ్రెస్ లక్షణాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్నది. మొత్తం అధికారాన్ని తమ చేతుల్లో కేంద్రీకరించుకున్న మోదీ, అమిత్ షాలు బి.జె.పి.ని కాంగ్రెస్ స్థాయికి దిగజార్చటంలో దాదాపుగా విజయం సాధించారని చెప్పక తప్పదు.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అది పూర్తి స్తాయి అగమ్యగోచర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కాంగ్రెస్ గత పదమూడు నెలల కాలంలో ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సుస్థిర నాయకత్వాన్ని అందజేయలేకపోతోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో స్వయం శక్తితోప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహారాష్ట్ర, జార్కండ్‌లో ప్రాంతీయ పార్టీల ఆదేశాల మేరకు నడుచుకునే దుస్థితిలో పడిపోయింది. మహారాష్ట్రంలో తమ సిద్ధాంతపరమైన శతృవు శివసేనతో చెతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ద్వారా వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్ చేజేతుల చంపుకున్నది. హిందూమత సిద్ధాంతాల మేరకు నడుచుకునే శివసేన నాయకత్వంలో పని చేయటం పట్ల కాంగ్రెస్‌కు లేశమంత కూడా సిగ్గు అనిపించటం లేదు. సోనియా గాంధీ మొదట్లో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించినా బి.జె.పి.ని దెబ్బ కొట్టేందుకు తమ సిద్ధాంతాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. శివసేన అధినాయకుడు ఉద్దావ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఆయన నీడలో కాంగ్రెస్ తలదాచుకోవటం రాజకీయ నీచత్వానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు. లౌకికవాదం గురించి కోడై కూసే కాంగ్రెస్ చివరకు మతతత్వ పార్టీలతో చేతులు కలిపి ముందుకు సాగటం 2019లో జరిగిన వినూత్న రాజకీయ ప్రయోగమని చెప్పక తప్పదు. అధికారం కోసం మతం, గితం జాన్తానై అనే విధానానికి కాంగ్రెస్ తెరెత్తింది. జార్కండ్‌లో స్థానిక ప్రాంతీయ పార్టీ జె.ఎం.ఎం నాయకత్వంలోకాంగ్రెస్ పని చేయవలసి వస్తోంది. జార్కండ్‌లో జె.ఎం.ఎం మంచి మెజారిటీ సంపాదిస్తే కాంగ్రెస్ అత్తెసరు సీట్లతో సర్దుకపోవలసి వస్తోంది. ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల మాదిరిగా మహారాష్ట్ర, జార్కండ్‌లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయినా అధినాయకత్వం పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఇష్టపడకపోవటంతోపాటు లోకసభలో పార్టీ పక్షాన్ని ముందుండి నడిపించేందుకు వెనుకంజ వేసే రాహుల్ గాంధీ అనునిత్యం ట్వీట్‌ల ద్వారా కాంగ్రెస్‌ను నడిపించటం ఈ సంవత్సరం ప్రత్యేకత. సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎంత కాలం కొనసాగుతారు? కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకుంటారు? రాహుల్ గాంధీ ఎంత కాలం బాధ్యతలు తీసుకోకుండా ట్వీట్‌లు, ప్రకటనల ద్వారా రాజకీయం నడిపిస్తారు? అనే ప్రశ్నలకు పార్టీలో జవాబులు లభించవు. ఇటీవలి కాలంలో ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాడ్రా కూడా ట్వీట్‌ల ద్వారా రాజకీయం నడిపిస్తున్నారు. ఆమెకు ఉత్తర ప్రదేశ్ రాజకీయం తప్ప మరో అంశం పట్టదు. రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపకుండానే పార్టీ విధానాలను ప్రకటిస్తుంటారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి క్యాప్టెన్ అమరీందర్ సింగ్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవరిస్తుంటే అధినాయకత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది తప్ప పట్టించుకోదు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథకు సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా మధ్య అనునిత్యం రాజకీయ పోరాటం జరుగుతున్నా సోనియా గాంధీ జోక్యం చేసుకోలేదు. కాంగ్రెస్ పరిస్థితి మేడి పండు మాదిరగా తయారవుతోంది. మేడిపండు బైటికి బాగానే కనిపించినా పొట్ట విప్పిచూస్తే ఏముంటుందనేది అందరికి తెలిసిందే.
కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. పార్టీ బైటికి బాగానే కనిపించినా లోపల అధినాయకత్వం అనాలోచిత విధానాలు, ప్రకటనలు, బాధ్యతారాహిత్యం, అంతర్గత కలహాలు, సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఇతర సీనియర్ నాయకులకు మధ్య పెరుగుతన్న దూరం అనతికాలంలోనే పార్టీని నిండా ముంచినా ఆశ్చర్యపోకూడదు. అధికార, ప్రతిపక్షంలో రెండు జాతీయ పార్టీలు బి.జె.పి., కాంగ్రెస్‌లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాయి.

కె.కైలాష్ 98115 73262