ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘ఆస్తుల ప్రకటన’.. ఒక వంచన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ, శాసనసభల ఎన్నికల సమయంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తమ ఆస్తులు, అప్పులపై చేస్తున్న ప్రకటనలు ప్రజలను మోసగించే చర్యలుగా కనిపిస్తున్నాయి. ఇదో తప్పనిసరి తంతులా మారిందే తప్ప అభ్యర్థుల నిజాయితీకి ప్రతిబింబంగా కనిపించడం లేదు. నాయకుల ఆస్తుల, అప్పులకు సంబంధించి వారి రాజకీయ ప్రత్యర్థులు అప్పుడప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా, కోర్టుకు వెళ్లినా ఇదంతా కక్ష సాధింపుకోసమే తప్ప వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు కాదని ప్రజలకూ తెలుసు. కోర్టుకు వెళ్లిన వ్యక్తి కూడా తన ఆస్తులు, అప్పులకు సంబంధించి వాస్తవాలను వెల్లడించడు.
అభ్యర్థుల ఆస్తులు, అప్పుల ప్రకటనలో నిజానిజాలను వెలికితీసే ప్రయత్నాలు జరగడం లేదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిఅప్పుల జాబితాను యథావిధిగా ప్రకటించారు. చంద్రబాబుకు ఉన్న ఆస్తి కంటే అతడి మూడేళ్ల మనువడి ఆస్తి నాలుగైదు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. మూడేళ్ల పిల్లవాడి పేరిట ఇంత ఆస్తి ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన నాయకుడికి మూడు కోట్ల ఆస్తి మాత్రమే ఉంటుందా? ఇదెక్కడి చోద్యమని జనం ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. చంద్రబాబుకు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. హైదరాబాదులో ఉన్న ఆయన ఇంటి విలువ వందకోట్లు అయినప్పుడు మొత్తం ఆస్తి విలువ కేవలం మూడు కోట్లేనా?
ఏ నాయకుడికి ఎంత ఆస్తి ఉన్నదనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మరో ముఖ్యమంత్రికి అంబాసిడర్ కారు తప్ప మరే ఆస్తిపాస్తులు లేవట! ఒక ప్రతిపక్ష నాయకుడికి హైదరాబాదు,బెంగళూరుల్లో పెద్దఎత్తున ఆస్తులున్నా అవి స్వంత ఆస్తుల జాబితాలోకి రావు. పెద్దపెద్ద కంపెనీల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నా అవేవీ వ్యక్తిగత ఆస్తుల చిట్టాలోకి ఎక్కవు. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభల ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, అప్పుల వివరాలు పరిశీలిస్తే ఎవరికైనా తల తిరిగిపోతుంది. మెజారిటీ అభ్యర్థులు తమ నిజమైన ఆస్తుల వివరాలు బహిర్గతం చేయలేదన్నది ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది అభ్యర్థులు తప్పుడు వివరాలతో ఎన్నికల సంఘాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించేవారే. తమకున్న ఆస్తుల మార్కెట్ ధరలను ఎప్పుడూ చెప్పరు. ఎప్పుడో తాతల నాటి ధరలను మాత్రమే ప్రకటిస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని లక్షలుగా చూపుతున్నారు. వీరికి బినామీల పేరిట ఉన్న ఆస్తుల గురించి ఎవరికీ తెలియదు. ఎన్నికల ప్రచారానికి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తారు. ఒక్కొక్క ఓటును వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయల వరకూ చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. భారీగా మద్యం పంపిణీ చేస్తారు. ఈ ఖర్చంతా తెరవెనక జరుపుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి లోబడే ప్రచారానికి ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటిస్తారు. పంచాయితీ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుడి వరకూ చాలామంది నేతలు పదవుల్లోకి వచ్చిన తర్వాతే ఆస్తులు సంపాదించడం పరిపాటి. కొద్ది కాలంలోనే వారు ఎలా ఆస్తులు కూడబెట్టారో సామాన్య ప్రజలకు అంతుచిక్కదు. మెజారిటీ అభ్యర్థులు ప్రకటించే ఆస్తులు, అప్పుల వివరాలు ‘్ఫర్స్’ అని ఎన్నికల సంఘానికి తెలిసినా సాక్ష్యాలు లేనందున తామేమీ చేయలేమంటూ చేతులు దులుపుకుంటోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రుజువులు కావాలంటారు. కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు సంస్థ కాదు కాబట్టి అభ్యర్థులు సమర్పించే ఆస్తులు, అప్పుల వివరాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చటం లేదు. వాటిలో వాస్తవాలను తేల్చాల్సిన బాధ్యతను ఆదాయపు పన్ను శాఖకు లేదా మరో స్వతంత్ర సంస్థకు అప్పగించటం మంచిది. వంచనకు పాల్పడుతూ ఎంతోమంది అభ్యర్థులు ప్రజలను, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతోంది.
ఒక అభ్యర్థికి కోట్ల రూపాయల విలు చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే అయినా- రుజువులు లేనందున ఏమీ చేయలేకపోవటం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. చట్టాలను ఉల్లంఘించే వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు, పదవులు చేపట్టి అధికారం చెలాయిస్తున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టేందుకు అక్రమ సంపాదనకు తెగిస్తున్నారు. దీంతో అవినీతి విలయ తాండవం చేస్తోంది. అక్రమ సంపాదనతో అధికార పీఠాలను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిపోతూ ప్రజాస్వామ్యాన్ని తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నారు. పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు.
ఆస్తిపాస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చే అభ్యర్థులను అదుపు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వ యంత్రాంగం తలచుకుంటే తప్పు చేసే వారందరిపైనా చర్య తీసుకోవచ్చు. అభ్యర్థులు సమర్పించే వివరాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం తనంత తాను లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థ లేదా ఐటీ శాఖ ద్వారా దర్యాప్తు జరిపిస్తే నేతల అసలు రంగు బయటపడుతుంది. కానీ, ఫిర్యాదు లేకుండా విచారణ జరిపే పద్ధతి మన దేశంలో లేదు. అభ్యర్థులు నిజాలను దాచకుండా ఆస్తులు, అప్పుల వివరాలు ఇవ్వాలని, అవి తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తుంది తప్ప- ఆ వివరాల జోలికి పోదు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ విషయమై ఎలాంటి చిత్తశుద్ధి లేదు.
ఆదాయపు పన్ను శాఖ వద్ద నాయకుల ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. పలు సందర్భాల్లో అధికార యంత్రాంగం అధికారంలో ఉన్న నేతలతో కుమ్మక్కు కావటంతో అభ్యర్థుల ఆస్తిపాస్తుల్లో వాస్తవాలు నిగ్గు తేలటం లేదు. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అప్పుడప్పుడు కొందరు ఈ వివరాలను తమ స్వార్థ రాజకీయం కోసం దురుపయోగం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. టీఎన్ శేషన్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్నప్పుడు అభ్యర్థుల ఆస్తిపాస్తుల్లో నిజాలను తేల్చేందుకు ప్రయత్నం జరిగింది, ఆ తరువాత ఇదొక తంతుగానే కొనసాగుతోంది తప్ప అవినీతిని, అక్రమాలను అరికట్టేందుకు ఒక వ్యవస్థగా రూపొందలేదు.
*

-కె.కైలాష్ 98115 73262