ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పాక్‌ను చిత్తుచేసే వ్యూహం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ ఉగ్రవాదానికి అప్రకటిత కేంద్రమైన పాకిస్తాన్ దారికి రాదనేది మరోసారి రుజువైంది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరగాల్సిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీని భారత్ రద్దు చేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించిన తీరు గర్హనీయం. విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ అహంకారంతో రద్దు చేసిందంటూ ఇమ్రాన్ చేసిన ఆరోపణ పాక్ పాలకుల నియంతృత్వ ఆలోచనలకు అద్దం పడుతోంది. మన ప్రధాని మోదీ అల్పుడంటూ పరోక్ష ఆరోపణలు చేసిన ఇమ్రాన్ నాయకత్వంలోని పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరపడం భారత్ ప్రయోజనాలు, సార్వభౌమాధికారానికి విరుద్దం. ఒకవైపు ఉగ్రవాదాన్ని పోషిస్తూ మరోవైపు శాంతిచర్చలను కొనసాగించేందుకు పాకిస్తాన్ పాలకులు మొదటి నుండీ ప్రయత్నిస్తున్నారు.
ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో అసాధ్యం అన్న విధానాన్ని మన పాలకులు కూడా ఏ రోజూ కచ్చితంగా పాటించలేదు. ఒకసారి అమెరికా వత్తిడి, ఇంకోసారి మరో దేశం వత్తిడికి లొంగుతూ వచ్చిన మన పాలకులు ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో సాధ్యం కాదనే విధానాన్ని పలుమార్లు పక్కన పెట్టి పాకిస్తాన్‌తో చర్చలు జరిపారు. మన పాలకుల పట్టువిడుపు విధానాన్ని పాక్ పాలకులు పలుమార్పు దుర్వినియోగం చేశారు. వారు ఇప్పుడు కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో పాక్ పాలకులు మొదటి నుండి ఒక స్పష్టమైన కుట్ర విధానాన్ని అనుసరిస్తున్నారు. కశ్మీర్‌తోపాటు భారత్‌లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలను విడగొట్టి తమ దేశంలో కలుపుకోవాలన్నది వారి వ్యూహం. ఈ వ్యూ హంలో మొదటి మెట్టు కశ్మీర్‌ను విడ గొట్టటం. ఈ లక్ష్యసాధన కోసం పాకిస్తాన్ పాలకులు 1947 నుండి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పోషిస్తూశాంతి చర్చలను కొనసాగించాలంటున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే విదేశాంగ మంత్రుల సమావేశం జరగాలని ప్రతిపాదించారు.ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్‌ను అభినందిస్తూ మోదీ దౌత్య నీతిలో భాగంగా అభినందన లేఖ రాశారు. ఇమ్రాన్ దానికి స్పందిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం, సార్క్ మంత్రుల సమావేశం జరగాలని ప్రతిపాదన చేశారు. పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మైన ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ గూడచార సంస్థ ఐఎస్‌ఐ సలహా మేరకే విదేశాంగ మంత్రుల సమావేశం ప్రతిపాదన చేశారనేది జగద్విదితం. విదేశాంగ మంత్రుల సమావేశం పేరుతో మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ వేసిన మొదటి బంతికి మోదీ ప్రభుత్వం ‘క్లీన్ బౌల్డ్’ అయ్యిందని చెప్పక తప్పదు. విదేశాంగ మంత్రుల సమావేశానికి అంగీకరించేందుకు ఒకరోజు ముందే పాకిస్తాన్ రేంజర్లు కశ్మీర్ సరిహద్దులో మన జవానును దారుణంగా హత్యచేశారు. ఈ నేపథ్యంలో మన పాలకులు విదేశాంగ మంత్రుల సమావేశానికి అంగీకరించి ఉండాల్సింది కాదు. మోదీ, ఆయన వ్యూహకర్తలు ఏం ఆలోచించారో కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించిన మేరకు విదేశాంగ మంత్రుల సమావేశానికి అంగీకరిస్తున్నామంటూ మన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీష్‌కుమార్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
పాకిస్తాన్ విషయంలో పరస్పర విరుద్ధ విధానాలను అవలంబించడం మన పాలకులకు మొదటి నుండి అలవాటుగా మారింది. మోదీ ప్రభుత్వం కూడా ఈ అలవాటుకు దూరం కాలేదు. ఉగ్రవాదంపైన, కశ్మీర్‌పైన పాక్ పాలకులకు ఉన్నంత స్పష్టత మన పాలకులకు లేదు. అందుకే బిఎస్‌ఎఫ్ జవాను హత్యకు గురైన తరువాత కూడా విదేశాంగ మంత్రుల సమావేశానికి అంగీకరించి తమ బలహీనతను మన పాలకులు మరోసారి బైట పెట్టుకున్నారు. దీంతో పాకిస్తాన్ సైన్యం ఆ మరునాడే ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా కశ్మీర్‌లో ముగ్గురు పోలీసు అధికారులను హత్య చేయించింది. న్యూయార్క్‌లో రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగాలని పాకిస్తాన్ పాలకులు, అక్కడి సైనికాధికారులు ఏ రోజూ కోరుకోలేదు. చర్చలు జరిపేందుకు భారత్ ముందుకు రావటం లేదని ఆరోపించేందుకే ఇలాంటి ప్రతిపాదనలు చేసి, ఆ తరువాత ఉగ్రవాద చర్యల ద్వారా ఎలాంటి సమావేశం జరుగకుండా చేస్తారు. పాకిస్తాన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా కశ్మీర్‌లో ముగ్గురు పోలీసు అధికారులను హత్య చేయించేది కాదు. విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం ఇష్టం లేదు కాబట్టే ఒక వైపు సమావేశానికి ప్రతిపాదన చేస్తూనే మరోవైపు ఉగ్రవాదుల ద్వారా భయోత్పాతం సృష్టించింది. పాకిస్తాన్ ఉచ్చులో పడిపోయిన మన పాలకులు కశ్మీర్‌లో పోలీసులు హత్యకు గురి కాగానే విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాలకుల వ్యూహం విజయవంతమైంది.
మోదీ ప్రభుత్వం విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేయగానే ఇమ్రాన్ ఖాన్, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన ఆరోపణలు వారి కుట్ర పూరిత మనస్తత్వాన్ని బైట పెట్టాయి. సమావేశాన్ని రద్దు చేయటం ద్వారా భారత పాలకులు తమ అహంకారం, ప్రతికూల విధానాన్ని బైటపెట్టారంటూ ఇమ్రాన్ ఆరోపణలు కురిపించారు. తన జీవితంలో ‘అల్పులు ఉన్నత పదవులను అధిరోహించటం చూశానం’టూ ఆయన నరేంద్ర మోదీని అల్పుడని అవమానించారు. ఉన్నత పదవులను అధిరోహించే అల్పులకు దూరదృష్టితో ఆలోచించే శక్తి ఉండదంటూ ఆయన చర్చల ప్రక్రియకు చరమ గీతం పాడారని చెప్పక తప్పదు. పొరుగు దేశం ప్రధానిని అల్పుడని అవమానించటం చిన్న విషయం కాదు. అవమానకరంగా వ్యాఖ్యానించిన పాకిస్తాన్ పాలకులతో ఇకమీదట ఎప్పుడు కూడా ఎలాంటి చర్చలు జరపకూడదు. వారితో స్నేహం చేయటం, సత్సంబంధాలు కొనసాగించటం సరైన విధానం కాదు. అంతేగాక, కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు సిక్కులు వచ్చేందుకు సరిహద్దులను తెరుస్తామని ఇమ్రాన్ చెప్పటం గమనార్హం. కశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్తాన్ సైన్యం మరోసారి సిక్కు ఉగ్రవాదాన్ని మేల్కొలిపేందుకు కుట్ర చేస్తోందని వారి వైఖరి చెబుతోంది. ఈ కుట్రలో భాగంగానే తమ దేశంలోని కర్తార్‌పూర్ గురుద్వారాకు సిక్కు భక్తులను అనుమతిస్తామంటూ పాక్ కొత్తపాట పాడుతోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఉసిగొల్పడమే కాకుండా, పాకిస్తాన్ సైన్యం తమ వద్ద అణ్వాయుధాలనున్నాయని పదే పదే ప్రకటించటం ద్వారా మన పాలకులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ముఖాముఖి యుద్ధంలో పలుమార్లు ఓటమి పాలైన పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తోంది. పాక్ కొనసాగిస్తున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి భారత్ సరైన గుణపాఠం చెప్పకుండా చూసేందుకే పాకిస్తాన్ పాలకులు తమ అణ్వాయుధాల గురించి ప్రకటనలు చేస్తుంటారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రధాన సమస్య కశ్మీర్. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలు లేదా యుద్ధం అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి చెప్పటం గమనార్హం. రెండు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నందున యుద్ధం ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం కాదు. తమ ముందున్న ఒకే ఒక దారి- చర్చలు జరపడం. భారత్ ఇందుకు అంగీకరించటం లేదంటూ ఫవాద్ చౌదరి ఆరోపణలు కురిపించారు. ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూనే చర్చల ప్రక్రియ అంటూ హడావుడి చేయడం పాకిస్తాన్ వ్యూహం అని మరోసారి స్పష్టమైంది. మన పాలకులు ఎటువంటి పరిస్థితిలో కూడా ఉగ్రవాదం, చర్చల ప్రక్రియ ఒకేసారి కొనసాగేందుకు అంగీకరించకూడదు. పాక్ పాలకులు ఎన్ని నక్కజిత్తులు వేసినా భారత్ స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలి. అయితే, దురదృష్టం కొద్దీ పాకిస్తాన్ విషయంలో మన పాలకులు స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలకులు కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించడం లేదు.
*

-కె.కైలాష్ 98115 73262