ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘కమల దళం’లో అసమ్మతి గళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలుత శాసనసభలకు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న భారతీయ జనతాపార్టీ వైఖరి చూస్తుంటే నేల విడిచి సాము చేస్తున్నట్టు ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను గ్రహించి ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుందనే వాస్తవాన్ని భాజపా అధినాయకత్వం అంగీకరించడం మంచిది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారీటీ సాధించి, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసుకున్న భాజపా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జరిగిన తప్పులను గుర్తించి లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సి ఉంది.
ఈ ఏడాది చివరిలో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని భాజపా అధినాయకత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలు ముగిసేవరకూ పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షాను కొనసాగించాలని కార్యవర్గం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంలో, అమిత్ షా నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటం రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అమిత్ షాను అధ్యక్ష పదవిలో కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో ఇక రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితిపై దృష్టి కేంద్రీకరించటం మంచిది. తమ నాయకత్వంలో పార్టీకి గెలుపు తథ్యమని భావిస్తున్న మోదీ, అమిత్ షాలు పార్టీలో ఇతర నాయకుల పట్ల ఈ విశ్వాసాన్ని ఎందుకు చూపడం లేదు. తమ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుంది తప్ప, కొందరు నాయకుల ప్రతిష్ట ప్రాతిపదికగా కాదని చెప్పుకునే వారు- కిందిస్థాయి నాయకులను, కార్యకర్తల ను ఎందుకు విస్మరించారనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కోసం అహరహం కృషి చేసిన నా యకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకుండా ఎందుకు విస్మరించారో మోదీ, అమిత్ షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అధికారంలోకి రాగానే పార్టీ విజయం కోసం కృషి చేసిన వారిని సముచిత పదవుల్లో నియమించాలనుకున్నారు. ఇందుకు రాష్ట్రాల వారీగా మూడు లేదా నాలుగుసార్లు జాబితాలు సిద్ధం చేసినా ఎవరినీ ఎలాంటి పదవుల్లో నియమించలేదు. అధినాయకులకు ఇష్టమైన కొద్దిమందికి పదవులు లభించాయి తప్ప సామాన్య కార్యకర్తకు గుర్తింపు రాలేదు. ‘పని చేసేది మేము, పదవులను అనుభవించేది మీరు.’ అనే అభిప్రాయం సామాన్య కార్యకర్తల్లో ఉంది. మోదీ ప్రభావంతోనే భాజపా అధికారంలోకి వచ్చింది తప్ప పార్టీ సిద్ధాంతాల వల్ల కాదనే అభిప్రాయం ఇంకా కొనసాగుతోంది.
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలో క్షేత్ర స్థాయి కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆశించిన ఫలితాలు రావటం కష్టం. మోదీ ప్రభుత్వం అమలు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే ఓట్లు సంపాదించవలసి ఉంటుం ది. ఈ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోయే కార్యకర్తలు అసంతృప్తితో ఉంటే ఆశించిన లక్ష్యాలు ఎలా సాధ్యమవుతాయి? తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా, శత్రు ఘ్న సిన్హా లాంటి వారు ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసే సభలకు ఎందుకు హాజరవుతున్నారనేది భాజపా అధినాయకత్వం విశే్లషించుకోవాలి. కొంతమంది సీనియర్ నేతల్లో అసంతృప్తికి గల కారణాలను అర్థం చేసుకోవాలి. అధినాయకత్వం ఒంటెత్తు పోకడల వల్లే యశ్వంత్ సిన్హా లాంటి నాయకులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ లాంటి అత్యంత సీనియర్ నాయకుడికి సైతం భాజపాలో సముచిత స్థానం లభించటం లేదు. అద్వానీ కృషి ఫలితంగానే భాజపా మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందనేది కాదనలేని నిజం. ఆయన జరిపిన రథయాత్ర వల్లనే పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. వాజపేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లాంటి సీనియర్ నాయకులు వేసిన పునాదుల పైనే భాజపా నిలబడింది. పునాదులను విస్మరించి, పైకి కనిపించే భవనాన్ని తామే నిర్మించామని ఎవరైనా భావిస్తే పప్పులో కాలు వేసినట్టే.
నేతి బీరకాయలో నెయ్యి మాదిరి భాజపాలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉత్తమాటగా కనిపిస్తోంది. ఎన్‌డిఏ ప్రభుత్వంలోనూ కేంద్రీకృత అధికారం శాతమే ఎక్కువ. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు గుర్తింపు లేనట్లే కేంద్ర మంత్రివర్గంలో మంత్రులకు స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కొరవడింది. అధినాయకుడు అప్పగించే పని చేయటం మినహా వారికి మరో దారి లేకుండా పోయింది. మోదీ రెండోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టటం భాజపాలోని కొంతమంది నేతలకు, కేంద్ర మంత్రులకు ఇష్టం లేదంటూ ఎన్‌డిఏ భాగస్వామ్య పార్టీ ఆర్‌ఎల్‌ఎస్‌పి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ చేసిన ప్రకటన అసత్యం కాదు. మోదీ, అమిత్ షా తమను తొక్కిపెడుతున్నారని పలువురు కేంద్ర మంత్రులు భావిస్తూ, తమ ఆవేదనను మిత్రపక్షాల నాయకుల వద్ద వెళ్లగక్కుతున్నారు.
తన నాయకత్వం పట్ల కొందరు మంత్రులకు వ్యతిరేక భావం ఉన్నదనే వాస్తవం మోదీతోపాటు అమిత్ షాకు కూడా తెలుసు. ఈ భావనకు తెరదించేందుకు మాత్రం వారు ప్రయత్నించడం లేదు. ఈ ఇద్దరు నేతలు సహకార ధోరణితో వ్యవహరించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. కార్యకర్తలు, మంత్రులే కాదు... ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు సైతం మోదీ తీరుపట్ల అసహనంగా ఉన్నారు. శివసేన, తెలుగుదేశం పార్టీలు ఎన్‌డీఏ నుంచి తప్పుకోగా, అకాలీదళ్ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని తన అధీనంలో ఉంచుకునేందుకు మోదీ అవసరమైన దానికంటే ఎక్కువ కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. అమిత్ షా కూడా పార్టీని అదుపులో పెట్టుకునేందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీనియర్లతో, మంత్రులతో మోదీకి మంచి సంబంధాలు లేవు. పార్టీని గెలిపించేది తాను కాబట్టి తాను చెప్పినట్లు వ్యవహరించాలనే ధోరణి మోదీలో కనిపిస్తోంది. ప్రధాని పదవిని మోదీ చేపట్టిన తొలినాళ్లలో- ఆయన కనీసం రెండు, మూడు సార్లయినా అధికారంలో కొనసాగుతాడనే అభిప్రాయం చాలామందిలో కలిగింది. ప్రతిపక్ష నాయకులు సైతం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. అయితే, నాలుగున్నర సంవత్సరాల పాలన ముగిసే సమయానికి ఈ అభిప్రాయం కాస్తా మారిపోయి, వచ్చే ఎన్నికల్లో మోదీ భాజపాను గెలిపించగలడా? అనే చర్చ ఇపుడు చోటుచేసుకుంది. ఈ పరిణామాలను భాజపా కార్యవర్గ సమావేశంలో చర్చించకపోవటం విడ్డూరం. తాము ‘మేక్ ఇన్ ఇండియా’ అని చెబుతుంటే, ప్రతిపక్షం ‘బ్రేక్ ఇన్ ఇండియా’ అంటోందని మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. *

-కె.కైలాష్ 98115 73262