ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీ వౌనం.. విపక్షాల సందిగ్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. అయితే- లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా? విడివిడిగా జరుగుతాయా? అన్న విషయాన్ని స్పష్టం చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను అయోమయంలో పడేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎంత స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఎన్నికల విషయంలో అధికారంలో ఉన్న వారి మాట కొంతైనా నెగ్గుతుంది. మోదీ లాంటి ప్రజాకర్షక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా వ్యవహరించలేదు.
అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరపాలని ప్రతిపాదించిన మోదీ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది విపక్షాలకు అర్థం కావటం లేదు. మోదీ మాత్రం తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు. తనకు ఏది అనుకూలంగా ఉంటే ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారు. మోదీ తీసుకునే నిర్ణయానికి తమ వద్ద ఉన్న విరుగుడు ఏమిటని ఆలోచించే సమయం ప్రతిపక్షానికి లభిస్తుందా? అనేది మరో ప్రశ్న. ఈ సంవత్సరాంతంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో లోక్‌సభతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు ఎన్నికలు జరగవలసి ఉన్నది. అయితే, ఈ సంవత్సరాంతంలో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ, ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు విడివిడిగా జరుగుతాయా? ‘మినీ జమిలి’ పేరుతో వీటన్నింటినీ కలిపి ఒకేసారి ఫిబ్రవరిలో జరుపుతారా? అనేది స్పష్టం కావటం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌లోగా నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిపేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా మాత్రం రాష్ట్రాలు, లోక్‌సభ ఎన్నికల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. ఎన్నికల ఖర్చును తగ్గించటంతోపాటు ప్రజలెన్నుకునే ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం ఉండాలని మోదీ కొన్నాళ్లుగా ‘జమిలి మంత్రం’ పఠిస్తున్నారు. దీని వెనక ప్రజా ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయనేది కాదనలేని నిజం.
మోదీ, అమిత్ షాలు చెబుతున్నట్టు ఐదు సంవత్సరాలకు ఒకేసారి అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలను ముగించేసి, ఆ తరువాత పూర్తి సమయాన్ని దేశాభివృద్ధికి కేటాయించవచ్చు. ఇది ఎంతో మంచి ఆలోచన. ప్రతి సంవత్సరం దేశంలో ఏదోఒక మూల ఎన్నికలు జరగటం వలన అభివృద్ది కుంటుపడుతోందన్న మాట వాస్తవం. ఈ సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార భాజపాకు ఎదురుగాలి వీస్తున్నట్లు వార్తలు రావటం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు కష్టాలు తప్పవంటూ సర్వేలు వెలువడుతున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలపై ఏ మాత్రం ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే.
అయితే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమి ఎదురైతే ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. మూడు రాష్ట్రాల్లో భాజపాకు గడ్డుకాలం తప్పదని భావిస్తున్న విపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి సమైక్యంగా దిగేందుకు మహాకూటమిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైన పక్షంలో ఇక లోక్‌సభ ఎన్నికల్లో భాజపా సత్తా చాటాలనుకోవడం అంత సులభం కాదు. రాజకీయ పరిపక్వత ఉన్న నాయకులెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల పరిణామాలు వస్తే- లోక్‌సభ ఎన్నికలకు ధైర్యంగా వెళ్లరు. మోదీ లాంటి పట్టుదల ఉన్న నాయకుడు దీనికి ససేమిరా అంగీకరించడు. నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరిపించి అటోఇటో తేల్చుకునేందుకే ఏ రాజకీయ నాయకుడైనా ఇష్టపడతాడు. నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు విడివిడిగా జరిపించేందుకు మోదీ, అమిత్ షాలు ఎంతమాత్రం ఇష్టపడకపోవచ్చు.
ఈ నేపథ్యంలో మోదీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే అంశంపై దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మోదీ, అమిత్ షాలు ఏం చేస్తారనేది అంచనా వేసేందుకు ప్రతిపక్షాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనవలసి రావటం అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి నిజంగానే జటిలమైన సమస్యే. దీన్ని భాజపా అధినాయకులు ఎలా ఎదుర్కొంటారన్నది ప్రశ్న. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలుంటే విడివిడి ఎన్నికలకు ఒప్పుకోవటంలో అర్థం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిమి పాలయ్యే అవకాశాలున్నాయని తెలిసి ఎన్నికలకు వెళ్లటం రాజకీయంగా ఆత్మహత్యా సదృశమే. జమిలి ఎన్నికల పేరుతో అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహిస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే భాజపా నాయకులే అదంతా పుకారు అని కొట్టిపారేశారు. నాలుగు రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయంటూ కొత్త వార్త ముందుకు వచ్చింది.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని సవరించవలసి ఉంటుంది, ప్రజాప్రతినిధ్య చట్టాన్ని కూడా సవరించాలి. ఇలా జరిగినప్పుడే జమిలి ఎన్నికలు సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. లోక్‌సభతో పాటు అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికల జరిపించాలంటే ఇదంతా చేయవలసి ఉంటుంది. దీనికి బదులు డిసెంబర్‌లో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఫిబ్రవరికి వాయిదా వేసి, అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలను కాస్త ముందుకు అంటే- ఫిబ్రవరికి మార్చటం ద్వారా ‘మినీ జమిలి’ నిర్వహించాలని భాజపా నాయకులు కొత్త ప్రతిపాదన చేశారు. 2019 ఆఖరున జరగాల్సిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపితే, ‘జమిలి ఎన్నికలు’ జరిగే రాష్ట్రాల సంఖ్యను పధ్నాలుగుకు పెంచవచ్చునని కూడా కొందరు సూచిస్తున్నారు. జమిలి ఎన్నికల వల్ల ఖర్చును తగ్గించడమే గాక, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి కేంద్రీకరించటం మంచిదంటూ అమిత్ షా ఇటీవల ‘లా కమిషన్’కు లేఖ రాయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. అమిత్ షా లేఖ రాజకీయంగా కొంత అలజడి సృష్టించింది. మోదీ, అమిత్ షాలు జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు భావించే పరిస్థితి నెలకొనటంతో భాజపా నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ‘లా కమిషన్’కు అమిత్ షా రాసిన లేఖ తమ పార్టీ విధానానికి అద్దం పడుతోంది తప్ప అదే తుది నిర్ణయం కాదంటూ వివరణ ఇచ్చారు. ఇదాంతా చూస్తుంటే భాజపా నాయకులు పథకం ప్రకారం ఎన్నికల నిర్వహణపై గందరగోళం సృష్టిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ప్రతిపక్షాలను ఇలా సందిగ్ధంలో పడవేసి, తమకు అనువైన సమయంలో ఎన్నికల గురించి స్పష్టత ఇవ్వాలనే ఆలోచనతో భాజపా నాయకులు ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది.
కాంగ్రెస్, ఎస్.పి, బిఎస్‌పిల మధ్య రాష్ట్రాల వారీ ఎన్నికల పొత్తుపై పెద్దగా స్పష్టత లేకున్నా, లోక్‌సభ ఎన్నికల విషయంలో ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేయటం ద్వారా భాజపాను మట్టికరిపించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. భాజపాను ఓడించేందుకు కాంగ్రెస్ 80 లోకసభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్ లాంటి అది పెద్ద రాష్ట్రంలో పది,పదిహేను సీట్లతో సరిపెట్టుకునేందుకు సిద్ధమైపోయింది. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి జరిగే పక్షంలో ప్రతిపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరగటం కష్టమే. ఇలాంటి పరిస్థితి వల్ల తమకు అంతా అనుకూలంగా ఉంటుందని భాజపా అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.
*

- కె. కైలాష్, 9811573262