ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షం వితండం.. ‘సభల’కు గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధర్మో రక్షితి రక్షితః’ అన్నట్లు పార్లమెంటును మనం కాపాడితే మనల్ని పార్లమెంటు కాపాడుతుంది. కానీ, ఈ వాస్తవాన్ని విస్మరించి కొందరు పార్లమెంటు సభ్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజకీయాల కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించి వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ రెండో విడత మొదటి వారం సమావేశాలను రాజకీయ కారణాలతో విపక్షం స్తంభింపజేయటం క్షమించరాని నేరం. ప్రజల ప్రయోజనాల పరిరక్షణ పేరుతో సభను స్తంభింపజేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. వారం రోజుల పాటు గొడవ, గందరగోళం, పిల్లి అరుపులు, చిత్తశుద్ధి లేని నినాదాలతో పార్లమెంటు పరువును మంట గలిపిన పార్టీలపై ప్రజలు కొరడా ఝులిపిస్తే తప్ప నాయకులు దారికి రారు.
విపక్ష శిబిరంలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, అన్నా డిఎంకె, శివసేన, పరోక్షంగా మద్దతు ఇచ్చే తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు ఉభయ సభలను అడ్డుకోవడాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఈ పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ఇవ్వటం, ప్రభుత్వంపై వ్యంగ్య విమర్శలు గుప్పిస్తూ సభను నిరోధించడం ఆనవాయితీగా మారింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ పోడియం వద్ద గొడవ చేస్తున్న సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించి విఫలం కావటం, ఆ తరువాత వెంటనే సభను వాయిదా వేయటం ప్రతిరోజూ తప్పనిసరి తంతుగా మారిపోయింది. జాతీయ బ్యాంకులకు దాదాపు పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్‌మోదీని స్వదేశానికి తెచ్చి శిక్షించాలన్నది కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాల డిమాండ్. ప్రతిపక్షాలు నీరవ్‌ను ‘చోటా మోదీ’ అంటూ వ్యాఖ్యలు చేయటం వెనక ఉన్న అసలు ఉద్దేశం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించటం, అవమానించటమే. నీరవ్ మోదీని స్వదేశానికి తెచ్చి శిక్షించాలనడం పట్ల ప్రతిపక్షానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సభలో అర్థవంతమైన చర్చ జరపాలి. అందుకు అవసరమైన ప్రశాంత వాతావరణం సభలో ఏర్పడేందుకు తోడ్పడాలి. నీరవ్ మోదీ మోసంపై లోతుగా చర్చించటం ద్వారా ఎన్‌డిఏ ప్రభుత్వం అసమర్థత, ఆశ్రీత పక్షపాతాన్ని ఎండగట్టేందుకు అవకాశం లభిస్తుంది. నీరవ్ మోదీ కుంభకోణంపై సభలో చర్చ జరిగితే- యుపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు కూడా సభ దృష్టికి వస్తాయి. ఇది ప్రతిపక్షాలకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నీరవ్ కుంభకోణంపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని ఒక వైపు చెబుతూ మరో వైపు సభను స్తంభిపజేయటం ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం, పరోక్షంగా మద్దతు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నా డిఎంకె, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా రాజకీయాల కోసం పార్లమెంటును స్తంభింపజేశాయి తప్ప తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని ఎన్‌డిఏ ప్రభుత్వం 2015లోనే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పి, హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ప్యాకేజీ రూపంలో కల్పించేందుకు చర్యలు తీసుకున్నది. పన్ను రాయితీలు కూడా కల్పించింది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోదా అన్ని సమస్యలకూ సంజీవిని కాదని అప్పుడే ప్రకటించారు. హోదాకు బదులు ఇస్తున్న ప్యాకేజీ మూలంగా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాగా, వైకాపా ప్రత్యేక హోదా పేరుతో చేసిన రాజకీయాన్ని తిప్పికొట్టటంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం చివరకు రాజకీయ సుడిగుండంలో పడిపోయింది. ఏపీలో ప్రతిపక్ష నాయకుడైన జగన్‌మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం హోదా పేరుతో ప్రజలను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. ప్రజలు హోదా డిమాండ్‌ను ఆమోదిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని భావించిన చంద్రబాబు చివరకు తన మాట మార్చి తాను కూడా హోదా పోరును భుజాన వేసుకున్నారు. దీంతో హోదా వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లకు సవాలుగా మారింది. ప్రత్యేక హోదా రాదనే వాస్తవం చంద్రబాబు, జగన్‌లకు బా గా తెలుసు, అయినా ‘హో దా’ను భుజాన వేసుకుని బేతాళుడిలా ముందుకు సాగుతూ పార్లమెంటు ఉభ య సభలను గత వారం రోజులుగా స్తంభింపజేసేలా తమ ఎంపీలను ఉసిగొల్పారు.
ఏప్రిల్ 6వ తేదీలోగా ప్రత్యేక హోదా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ జగన్ చేసిన ప్రకటనను తిప్పికొట్టేందుకే చంద్రబాబు తన పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించారు. చంద్రబాబు ఇటీవల తనకు తాను కితాబు ఇచ్చుకున్నట్లు నిజంగానే ఆయన దేశంలోని సీనియర్ నాయకుల్లో మొదటి వరుసలో ఉంటే- జగన్ రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టాల్సి ఉంది. అంతే తప్ప మోదీ మంత్రివర్గం నుంచి తన వారిని బయటకు సాగనంపడం కాదు. హోదా స్థానంలో తాను సాధించిన ఫలితాలను ప్రజల ముందు పెట్టి ఉండాల్సి ఉంది. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది? ప్యాకేజీ ఇస్తే ఎంత మేలు జరుగుతుంది? అనే విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసు. అయినప్పటికీ ఆయన ‘స్టేట్స్‌మెన్’గా వ్యవహరించకుండా ఓటు బ్యాంకు రాజకీయం కోసం పార్లమెంటును చేపల మార్కెట్ వలే చేయించారు. ఆయన నిజంగానే సీనియర్ నాయకుడైతే ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. నిజాయితీ, నిబద్దత ప్రదర్శించటం ద్వారా యువ నాయకులకు,ప్రజలకు ఆదర్శం కావాలి తప్ప నాటకీయ, రాజకీయ ఎత్తుగడలకు పెద్దపీట వేయరు. పార్లమెంటు ఉభయ సభల్లో గత వారం రోజులుగా తెలుగుదేశం ఎంపీలు వ్యవహరించిన తీరు గర్హనీయం.
తెలంగాణలోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగం ఓప్పుకోదనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలియనిది కాదు. తృతీయ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాలకు ఒక అర్థవంతమైన మలుపు ఇవ్వాలనుకుంటున్న ఆయన కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకే పెద్దపీట వేశారు. తెరాస ఎంపీలు తెలుగుదేశం ఎంపీలు వ్యవహరించినంత దురుసుగా వ్యవహరించకపోయినా వారు కూడా పార్లమెంటు ప్రతిష్టంభనలో తమ వంతు విధ్వంసక రాజకీయానికి పాల్పడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనవలసిన పార్లమెంటులో రభస చేయటం ఎంత వరకు సమర్థనీయం. నిరసన తెలపటం ప్రజాస్వామ్యం పునాది కావచ్చు కానీ అదే నిరసన పార్లమెంటు పునాదులను పెకిలించి వేస్తే ఎలా? వారం రోజుల పాటు పార్లమెంటును స్తంభింపజేయటం వలన రాజకీయ పార్టీలు ఏం సాధించాయి? పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం వలన మన ప్రజాస్వామ్యం, వ్యవస్థ మరింత పలుచనైంది, ప్రతిష్ఠను కోల్పోయింది. ‘గోవిందా..గోవిందా’ అనే నినాదానికి భక్తితోపాటు ఇపుడు ప్రతికూల అర్థం కూడా వస్తోంది. తెలుగుదేశం సభ్యులు ‘గోవిందా.. గోవిందా’ అని నినదించటం ద్వారా పార్లమెంటును నవ్వుల పాలు చేశారు.

- కె.కైలాష్ సెల్: 98115 73262