ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

గుజరాత్‌ను కాపాడుకోగలుగుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లో ఐదోసారి అధికారంలోకి వచ్చేందుకు భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలు, కొత్తగా తెర మీదికి వచ్చిన కులతత్వం, పటేల్ వర్గం రిజర్వేషన్ల రాజకీయం, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాద యాత్రలు గుజరాత్‌లో బి.జె.పి విజయావకాశాలను దెబ్బతీయవచ్చుననే మాట వినిపిస్తోంది. గుజరాత్‌లో మెజారిటీ ప్రజలు వ్యాపారం చేసే వారే. షేర్ల వ్యాపారం గుజరాతీలకు అత్యంత ఇష్టమైన వ్యాపకం. పెద్ద నోట్ల రద్దు మూలంగా వీరంతా దెబ్బతిన్నారు. గుజరాత్‌లోని ప్రతి వ్యాపారస్తుడు జి.ఎస్.టిని వ్యతిరేకిస్తున్నారు. డబ్బు సంపాదనకు అలవాటు పడిన గుజరాతీలకు పన్ను చెల్లించటం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. చిన్న వ్యాపారస్తులైతే పన్ను చెల్లించేందుకు ససేమిరా ఇష్టపడరు. జి.ఎస్.టి మూలంగా వీరంతా ఇప్పుడు పన్ను చెల్లించవలసి వస్తోంది. అందుకే వీరంతా బి.జె.పి పట్ల మండిపడుతున్నారు. గుజరాత్‌లో చిన్న వ్యాపారస్తులకు కోపం వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లిపై వత్తిడి తెచ్చి జి.ఎస్.టిని సులభతరం చేయించారు. జి.ఎస్.టిలో ఇటీవల చేసిన మార్పులు, చేర్పులు కూడా గుజరాత్‌లోని చిన్న వ్యాపారస్తుల కోపాన్ని తగ్గించలేకపోయింది. నరేంద్ర మోదీ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని పెద్ద నోట్లను రద్దు చేశారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా పడుతున్న ప్రతికూల ప్రభావం గుజరాత్‌లో అత్యధికంగా ఉన్నది. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి పట్ల గుజరాత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న వ్యతిరేకత నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు పలు రాయితీలు, తాయిలాలు ప్రకటించారు. ఈ రాయితీలు, తాయిలాల ప్రకటన కోసం ఆయన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపై వత్తిడి తెచ్చి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకుండా ఆపారనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించటం తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు గుజరాత్ శాసనసభ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించవలసి ఉండింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆఖరు క్షణంలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు మాత్రమే ప్రకటించి గుజరాత్ ఎన్నికల తేదీలను తరువాత ప్రకటిస్తామని చెప్పింది. గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ పద్దెనిమిదో తేదీలోగా ముగిస్తామని అదే రోజు ప్రకటించటం ద్వారా వివాదాలు కొని తెచ్చుకున్నది. హిమాచల్ ప్రదేశ్‌తోపాటు గుజరాత్ శాసన సభ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించి ఉంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి రెండు రాష్ట్రాల్లో వెంటనే అమలులోకి వచ్చేది. నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించ వలసిన ర్యాలీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీల ప్రకటనను వాయిదా వేసుకున్నదంటూ వచ్చిన ఆరోపణలలో నిజం లేకపోలేదు. నరేంద్ర మోదీ, అమిత్ షా తెచ్చిన వత్తిడి మూలంగానే కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటించలేదని చెప్పకతప్పదు. నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండు దఫాలుగా పర్యటించి ఆయా ర్యాలీలలో రాష్ట్ర ప్రజలపై కురిపించిన వరాల జల్లు బి.జె.పికి కలిసి వస్తుందా? పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి పట్ల రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఈ వరాల జల్లు తొలగించలేకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి సృష్టించిన సమస్యలు ఒక ఎతె్తైతే రాష్ట్రంలో తలెత్తుతున్న కుల రాజకీయం బి.జె.పికి ఊపిరాడనివ్వటం లేదు. గుజరాత్‌లో కుల రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు. అయితే 2013లో పటేల్ వర్గం బి.సి రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమం గుజరాత్ రాజకీయాలను ‘కులం’ రంగు పులిమింది. హార్దిక్ పటేల్ రిజర్వేషన్ల రాజకీయం గుజరాత్‌ను కుల, వర్గ పోరాటంలోకి నెట్టివేసింది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న పటేల్ వర్గం బి.సి రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమం గుజరాత్ రాజకీయాన్ని పూర్తిగా మార్చివేసిన సూచనలు కనిపిస్తున్నాయి. పటేల్ వర్గానికి చెందిన ప్రజలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చి రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ యువ నాయకుడు హార్దిక్ పటేల్ గుజరాత్‌లో పెద్ద ఉద్యమం లేవదీయటం తెలిసిందే. పటేల్ వర్గం బి.సి జాబితాలో స్థానం కోసం ప్రారంభించిన పోరాటం ఇతర బి.సి, ఎస్.సి.ఎస్.టి వర్గాలను ఆలోచనలో పడవేసింది. హార్దిక్ పటేల్ పటేల్ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆల్పేష్ థాకుర్ అనే యువ నాయకుడు బి.సి. ఎస్.సి, ఎస్.టిలకు నాయకత్వం వహిస్తున్నారు. జిగ్నేష్ మెవానీ రాష్ట్రంలోని దళితులకు నాయకత్వం వహిస్తున్నారు. పటిదార్ ఆనామత్ ఆందోళన్ సమితికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ ఆదేశాలు పటేల్ వర్గానికి శిలాశాసనంగా మారాయి. హార్దిక్ పటేల్ ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాగా సన్నిహితుడయ్యాడు. రాహుల్ గాంధీ ఇటీవల సౌరాష్ట్రంలో పర్యటించినప్పుడు హార్దిక్ పటేల్ ఆయన వెంట ఉండి అన్ని చూసుకున్నారు. సౌరాష్టల్రో పటేల్ వర్గం ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.
హార్దిక్ పటేల్ రాజకీయం కారణంగా సౌరాష్టల్రోని పటేల్ వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 54 శాతం ఉన్న వెనుకబడిన కులాల ప్రజలు అల్పేష్ థాకుర్ ప్రభావంలో ఉన్నారు. అల్పేష్ థాకుర్ గత మూడు సంవత్సరాల నుండి బి.జె.పి ప్రభుత్వంపై యుద్దం కొనసాగిస్తున్నారు.
యువతకు ఉపాధి కల్పన, రైతులకు గిట్టుబాటు ధరల లభ్యత పేరుతో ముఖ్యమంత్రి రూపాణి ప్రభుత్వంపై ఉద్యమం నడిపిస్తున్నారు. మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్న అల్పేష్ థాకుర్ శాసన సభ ఎన్నికల్లో బి.జె.పికి మద్దతు ఇవ్వలేరు. బి.జె.పికి మద్దతు ఇవ్వటం సాధ్యం కాని పక్షంలో థాకుర్ కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపక తప్పదు. హార్దిక్ పటేల్, అల్పేష్ థాకుర్ మంచి స్నేహితులు కావటం కూడా కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది. హార్దిక్ పటేల్ సలహా మేరకు అల్పేష్ థాకుర్ కాంగ్రెస్‌కు మద్దతు పలికినా ఆశ్చర్యపోకూడదు.
జిగ్నేష్ మెవానీ నాయకత్వంలోని ఎస్.టి ఏక్తామంచ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలే అధికంగా ఉన్నాయి. హార్దిక్ పటేల్, అల్పేష్ థాకుర్, జిగ్నేష్ మెవానీల కలయిక బి.జె.పి అధినాయకులను ఆందోళనకు గురి చేస్తోంది.
హార్దిక్ పటేల్, అల్పేష్ థాకుర్, జిగ్నేష్ మెవానీలు 54 శాతం మంది బి.సి.లు, 18 శాతం ఉన్న పటేల్ వర్గం, ఏడు శాతం ఉన్న ఎస్.టి వర్గం ఓట్లను ప్రభావితం చేయగలిగితే బి.జె.పి ఐదోసారి అధికారంలోకి రావటం కష్టం అవుతుంది. శాసనసభలో 182 నియోజకవర్గాలుంటే ఇందులో నుండి దాదాపు 120 నియోజకవర్గాలను తాము ప్రభావితం చేయగలుగుతామని ఈ ముగ్గురు యువ నాయకులు చెబుతున్నారు. ఇదే నిజమైతే బి.జె.పి నాయకులు మరోసారి తమ విజయావకాశాలను బేరీజు వేసుకోవలసి ఉంటుంది. ఈ ముగ్గురు యువ నాయకుల రాజకీయం మూలంగా గుజరాత్ ఓటర్లు ఈరోజు కులాల వారీగా చీలిపోయారు. పటేల్ వర్గం రిజర్వేషన్ల డిమాండ్ తమ రిజర్వేషన్లను దెబ్బ తీస్తుందని బి.సిలు ఆందోళన చెందుతున్నారు. పటేల్ వర్గాన్ని ఎదుర్కొనకపోతే తమ రిజర్వేషన్లకు ప్రమాదం వస్తుందన్నది వారి భయం. అందుకే వారు తమ రిజర్వేషన్లను కాపాడే వారికే ఓటు వేస్తామని బాహాటంగా చెబుతున్నారు.
2012లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బి.జె.పికి 47.9 శాతం ఓట్లు పడితే కాంగ్రెస్‌కు 38.9 శాతం ఓట్లు పడ్డాయి. గుజరాత్‌లో కొత్తగా ఊపందుకున్న కుల రాజకీయాలు, పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి మూలంగా బి.జె.పి ఓట్ల శాతం 48 నుండి 38 శాతానికి పడిపోయే ప్రమాదం నెలకొన్నదని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ తక్కువ మెజారిటీతోనైనా అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలోని మెజారిటీ సీట్లలో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు బి.జె.పి ఓట్లను చీలుస్తారని, అది కాంగ్రెస్‌కు బాగా కలిసివస్తుందని భావిస్తున్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ పోటాపోటీగా పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ ఇప్పటికి రెండుసార్లు గుజరాత్‌లో పర్యటించి పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐదోసారి అధికారంలోకి వచ్చేందుకు బి.జె.పి చేస్తున్న ప్రయత్నం ఫలించకపోతే దాని ప్రభావం 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో పడుతుందనేది నిర్వివాదాంశం.

కె కైలాష్