ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చైనాతో చెలిమి.. భారత్‌కు సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌కు పాకిస్తాన్ కంటే చైనా నుండి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. చైనా మన ప్రథమ శత్రువు అని గుర్తించాలని రక్షణశాఖ మాజీ మంత్రి దివంగత జార్జి ఫెర్నాండెజ్ అప్పట్లో హెచ్చరించేవారు. ఆయన అనాలోచితంగా ఈ హెచ్చరిక చేశారని మనం భావించరాదు. ‘హిందీ- చీనీ భారుూ భారుూ’ అంటూ మాయమాటలు చెప్పి, మనం ఆదమరిచి ఉన్న సమయంలో అకస్మాత్తుగా దాడి చేసి అక్సాయిచిన్ ప్రాంతాన్ని కబళించిన దేశం చైనా అని మనం ఎప్పటికీ మరిచిపోరాదు. చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని మహాబలిపురంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అనధికార చర్చలు జరపడం తెలిసిందే. భారత, చైనాల మధ్య ఇలాంటి అనధికార చర్చలు ఇప్పటికి మూడుసార్లు జరిగాయి. ఒకటి చైనాలో జరిగితే మిగతా రెండూ భారత్‌లో జరిగాయి.
మహాబలిపురంలో పురాతన దేవాలయాల సాక్షిగా మోదీ, జింగ్‌పింగ్‌ల మధ్య జరిగిన రెండు రోజుల సమావేశం ఎలాంటి ప్రగతిని సాధించింది? ఇది ఏ మేరకు భారత్‌కు మేలు చేస్తుంది? రెండు దేశాల మధ్య సంబంధాలను ఏ మేరకు పటిష్టం చేస్తుంది? పాకిస్తాన్ కారణంగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఏ మేరకు తగ్గుతుంది? సరిహద్దు సమస్యలను ఏ మేరకు సమాధాన పరుస్తుంది? పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఈ చర్చలు ఏ మేరకు తోడ్పడతాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య జరిగిన రెండు అనధికార సమావేశాల వల్ల ఏ మేరకు మన దేశానికి ప్రయోజనం కలిగింది? ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు ఎంతవరకూ దోహదపడింది? అనేది చెప్పడం కష్టం. జింగ్‌పింగ్ బీజింగ్ నుండి చెన్నైకు వచ్చేలోగా చైనా ప్రభుత్వం- కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దుపై రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసి గందరగోళం సృష్టించింది. చైనా అధ్యక్షుడి చెన్నై ప్రయాణాన్ని ఆఖరి క్షణం వరకు నిర్ధారించకుండా ఈ రెండు ప్రకటనలు చేయటం గమనార్హం. చెన్నైకు వచ్చే రెండు రోజుల ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో బీజింగ్‌లో జింగ్‌పింగ్ సమావేశమైన తరువాత జారీ చేసిన ఒక ప్రకటనలో ‘కశ్మీర్ పరిణామాలపై మేము ఒక కనే్నసి ఉంచాం’ అంటూ మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నది. ఇమ్రాన్ ఖాన్ స్వదేశానికి తిరుగు ప్రయాణం కాగానే కశ్మీర్ సమస్యను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా ప్రతిపాదించింది. చైనా ప్రభుత్వం రెండో ప్రకటన చేసిన తరువాతనే జింగ్‌పింగ్ చెన్నై ప్రయాణాన్ని ఖరారు చేశారు.
కశ్మీర్ విషయంలో చైనా స్పష్టమైన వైఖరిని అవలంబించకుండా ఒక వైపు పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు వ్యవహరిస్తూనే మరోవైపు భారత దేశాన్ని గందరగోళంలో పడవేసేందుకు ప్రయత్నిస్తోంది. చైనా ఇస్తున్న మద్దతు ఆధారంగానే పాకిస్తాన్ మనతో కయ్యానికి కాలు దువ్వుతోం ది. పాకిస్తాన్ పాలకులు సౌదీ అరేబియాతోపాటు చై నా అండదండలు చూసుకునే ఇస్లామిక్ ఉగ్రవాదంతో మనతో గొడవ పడుతోందనేది వాస్తవం. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని చైనా ఏనాడూ ఖండించలేదు. చైనా పాలకులు ఏ రోజు కూడా పాకిస్తాన్ నుండి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను ఖండించలేదు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను మూసివేయాలని డిమాండ్ చేయలేదు. భారత దేశం అభివృద్ధిని కుంటుపరిచేందుకు చైనా పాలకులు పాకిస్తాన్‌ను, అక్కడి నుంచి కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా ఉపయోగించుకుంటున్నారు. భారత్‌ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటున్నట్లే చైనా పాలకులు పాకిస్తాన్ భుజాలపై తుపాకీ పెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు. ఉగ్రవాదం మూలంగా అంతర్జాతీయ స్థాయిలో చిక్కుల్లో పాకిస్తాన్ పడిన ప్రతిసారి చైనా పాలకులే కాపాడుతున్నారు.
ఉగ్రవాద సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా వ్యవహరాల కమిటీ ద్వారా నిషేధించేందుకు భారత్ చేసే ప్రతి ప్రయత్నాన్ని చైనా పాలకులు వమ్ము చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించకపోవటం వెనక చైనా హస్తం ఉన్నదనేది జగద్విదితం. వాస్తవానికి ఐక్యరాజ్య సమితి దాదాపు యాభై సంవత్సరాల క్రితమే భారత దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు సమ్మతించింది. అయితే అప్పటి మన ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అందుకు సమ్మతించలేదు. భారత్‌తో పాటు చైనాకు కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం కల్పించాలని ఆయన వాదించారు. దీంతో ఐక్యరాజ్యసమితి కొంతకాలం ఈ అంశాన్ని పక్కన పెట్టిన అనంతరం మారిన పరిస్థితుల ఆధారంగా చైనాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చి మన దేశాన్ని వదిలివేసింది. మన దేశం అప్పటి నుండి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలను చైనా పాలకులు అడ్డుకుంటున్నారు. చైనా వైఖరి మూలంగానే భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం లభించటం లేదు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సభ్యత్వం విషయంలో కూడా చైనా మన దేశాన్ని అడ్డుకుంటోంది. అభివృద్ధి చెందిన దేశంగా, సూపర్ పవర్‌గా అడుగులు వేస్తున్న చైనా భారత్‌ను తొక్కిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్‌ను అక్కున చేర్చుకుని ఆడిస్తున్న చైనా పాలకులు మన దేశం చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, మాల్‌దీవులు తదితర దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. తద్వారా మన దేశాన్ని ఏకాకి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక రోడ్డు- ఒక బెల్ట్ పథకం పేరుతో ఆసియా ఖండంపై ఆధిపత్యం సంపాదించేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చైనా చేస్తోంది.
ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో చైనా పాలకులు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తే గనుక- పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఊపిరి కూడా తీసుకోలేవు. తమ దేశంలోని ముస్లింలను నోరెత్తకుండా చేసిన చైనా పాలకులు కశ్మీర్ విషయంలో అందుకు భిన్నమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న చైనా పాలకులు బలూచిస్తాన్‌పై కనే్నసి ఉంచారు. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌ను అభివృద్ధి పేరుతో హస్తగతం చేసుకున్న చైనా పాలకులు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. రుణాల ఊబిలోకి దించటం ద్వారా పాకిస్తాన్‌ను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నారు. చైనా నుండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా గ్వాదర్ నౌకాశ్రయం వరకు పటిష్టమైన రోడ్డును నిర్మించి తమ ఆధిపత్యం కొనసాగించేందుకు చైనా పాలకులు శీఘ్రగతిన ముందుకు సాగుతున్నారు. సైనికశక్తి పరంగా ఎంతో ఎదిగిపోయిన చైనా ప్రస్తుతానికి భారత్‌ను అదుపుచేసేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అనతికాలంలోనే చైనా భారత్‌ను శాసించేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యపోకూడదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం జింగ్‌పింగ్‌తో చర్చల సమయంలో ఇలాంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. స్నేహగీతం ఆలపిస్తున్నట్టు అభినయిస్తూనే- 1962లో మనపై ఏకపక్షంగా యుద్ధానికి దిగిన చైనా పాలకులు మరోసారి అలాగే వ్యవహరించరనే గ్యారంటీ లేదు.
చైనా సైనిక శక్తితో పోలిస్తే మన సైన్యం కొంత వెనకబడి ఉన్నదనేది నిజం. చైనాను ఎదుర్కొవాలంటే సైనికపరంగా మనం ఎంతో ఎదగవలసి ఉంటుంది. డోక్లాంలో చైనా సైనికులను రెండు నెలల పాటు నిలువరించినంత మాత్రాన మనం ఎదో సాధించేశామనే భ్రమల్లో ఉండకూడదు. చైనాను నిలువరించాలంటే భారత దేశం కూడా సైనికంగా ఎంతో బలోపేతం కావాలి. సైనికశక్తిని పెంచుకోకుండా చైనాతో సమాన స్థాయిలో వ్యవహరించలేమనేది మన పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1962 నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిణామాలకు ఎంతో తేడా ఉండవచ్చు. మన దేశం కూడా సైనికంగా ఎదిగినా, చైనాతో పోలిస్తే మన సైనిక శక్తి గొప్పది కాదు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధితోపాటు సైనిక పరంగా ఎదిగితే తప్ప చైనాను మనం నిలువరించలేమన్నది వాస్తవం. *

-కె.కైలాష్ 98115 73262