ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ మూత పడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటీష్ పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు ఊపిరి పోసుకున్న కాంగ్రెస్ తన లక్ష్యాన్ని సాధించింది కాబట్టి మూసివేయాలన్న జాతిపిత మహత్మా గాంధీ కలలను రాహుల్ గాంధీ ఇప్పుడు సార్థకం చేస్తున్నాడా? మహాత్మా గాంధీ తన హత్యకు మూడు రోజుల ముందు అంటే 1948 జనవరి 27 తేదీనాడు ఒక నోట్ రాశాడు. ‘స్వాతంత్య్ర సముపార్జన లక్ష్యాన్ని సాధించినందున కాంగ్రెస్ ఇక ప్రస్తుత స్థితిలో కొనసాగకూడదు, ప్రస్తుత కాంగ్రెస్‌ను మూసివేసి ‘లోక సేవక సంఘ్‌గా రూపాంతరం చేయాలి’ అని మహాత్మాగాంధీ రాసిన ఈ నోట్ ఆయన హత్యానంతరం ఫిబ్రవరి రెండో తేదీనాడు హరిజన్ పత్రికలో ‘మహాత్మాగాంధీ ఆఖరు వీలునామా, టెస్టిమెంట్’ అనే పేరుతో అచ్చయ్యింది. బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల దీనిని ఉదహరిస్తూ కాంగ్రెస్‌ను ఇక మూసుకోవటం మంచిదని సలహా ఇవ్వటం తెలిసిందే. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ పార్టీని భ్రష్టు పట్టించటం ద్వారా కాంగ్రెస్‌ను రద్దు చేయాలన్న మహాత్మాగాంధీ సూచనను అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దేశానికి స్వాతంత్య్రం సంపాదించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ను రద్దు చేసి దేశం సర్వతోముఖాభివృద్ధిని సాధించగలిగే కాంగ్రెస్‌ను రూపొందించుకోవాలన్న మహాత్మాగాంధీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధినాయకులు పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేయటం ఆ తరువాత అందరు వద్దువద్దంటూ విజ్ఞప్తులు చేయటంతో రాజీనామాను ఉపసంహరించుకోవటం పరిపాటి. రాహుల్ గాంధీ కూడా ఐదారు రోజుల అనంతరం అందరి విజఞప్తులతో రాజీనామాను ఉపసంహరించుకుంటారని అనుకున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఈ పరిపాటిని పాటించకుండా కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగే ప్రసక్తే లేదని పలుమార్లు స్పష్టం చేయటంతో పాటు తన మాటకు కట్టుబడి ఉంటున్నారు. గాంధీ (సోనియాగాంధీ) కుటుంబానికి చెందని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకుని పార్టీని పటిష్టం చేసుకోవాలని ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ రాజీనామా మూలంగా కాంగ్రెస్‌లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు మొత్తం సీనియర్ నాయకత్వమంతా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కాంగ్రెస్ యంత్రాంగం చచ్చుపడిపోయింది. కాంగ్రెస్ కమిటీలు నిస్తేజమైపోయాయి. ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది? అనే అలోచన కాంగ్రెస్ లో ఇప్పుడు రాజ్యమేలుతోంది. కాంగ్రెస్ ఎం.పిలు, శాసన సభ్యులు కొత్త గూటికోసం వెతుక్కుంటున్నారు. రాహుల్ గాంధీ తన మనసు మార్చుకునేందుకు అంగీకరించకపోవటంతో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించుకునే ప్రయత్నాలు తెరవెనక జరుగుతున్నాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్షుడైతే కాంగ్రెస్ కుప్పకూలుతుందనేది సీనియర్ నాయకుల భయం. కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొనసాగేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఈ పదవిని చేపట్టరని ప్రకటించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, మహారాష్టక్రు చెందిన సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపిక చేసుకునే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సోనియా గాంధీకి రాజకీయాలు పెద్దగా తెలియకపోయినా గుంభనంగా వ్యవహరిస్తూ పది సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ను అధికారంలో ఉంచగలిగింది. అనారోగ్యానికి గురి కాకపోతే ఆమె మరి కొంతకాలం కాంగ్రెస్‌ను ముందుకు నడిపించే వారే. ఆమె స్థానంలో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ రాజకీయాలు నడిపిస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆయన నాయకత్వం పటిమను ప్రదర్శించలేకపోయారు. మొదట రాజకీయాలలోకి వచ్చేందుకు ఇష్టపడని రాహుల్ గాంధీ ఆ తరువాత రాజకీయాన్ని ఒంటపట్టించుకున్నట్లు కనిపించినా అది తాత్కాలికమేనని పదిహేడవ లోక్‌సభ ఎన్నికలు రుజువు చేశాయి. ప్రియాంకా గాంధీ కూడా రాజకీయాలకు పనికి రాదనే వాస్తవం లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమయ్యింది. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం గాంధీ కుటుంబాన్ని కూకటివేళ్లతో కుదిపివేసింది. అందుకే గాంధీ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గాంధీ కుటుంబానికి చెందిన వారెవ్వరు కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టరని రాహుల్ గాంధీ ప్రకటించటం వెనక బహుశా ఇదే నిర్ణయం ఉండి ఉంటుంది. కాంగ్రెస్ నాయకత్వం బాధ్యతల నుండి విముక్తి కలిగిన తరువాత కొంత కాలానికి గాంధీ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండటంతోపాటు విదేశాలకు వెళ్లిపోయినా ఆశ్చర్య పోకూడదనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్‌ను ముందుకు నడిపించలేని రాహుల్ గాంధీ రాజకీయాలకు దూరం కావటమే మంచిది. అసమర్థనాయకత్వం మూలంగా కాంగ్రెస్ రోజుకింద చొప్పున చచ్చుపడే బదులు గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని అధ్యక్షుడుగా ఎన్నుకుని ముందుకు సాగటం మంచిది. కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం, గాంధీ అంటే కాంగ్రెస్ అనే పరిస్థితిని సృష్టించుకోవటం వల్లనే పార్టీకి నేడీ గతి పట్టింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి నాయకత్వంలో ముందుకు సాగేందుకు నడుము బిగించటం మంచిది. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అధ్యక్ష పదవి చేపడితే కాంగ్రెస్ ముక్కలైపోతోంది, మూతపడుతుందనే భయం నుండి బైటపడటం మంచిది. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష పదవి నుండి తప్పుకోవటం ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు మేలు చేస్తున్నారు. గాంధీ కుటుంబం వెలుపలి నుండి నాయకత్వం ఎదిగివచ్చేందుకు ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నారు. రాహుల్ గాంధీ కల్పిస్తున్న ఈ సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ నాయకులు సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్‌లో కుటుంబపాలనకు స్వస్తిపలికి ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త నాయకుడిని ఎన్నుకుని ముందుకు సాగాలి.
మహాత్మా గాంధీ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని చెప్పటం నూటికి నూరు పాళ్లు నిజమే. అయితే ఆయన అక్కడితో ఆగిపోలేదు. స్వాతంత్య్ర సముపార్జన లక్ష్యాన్ని సాధించిన కాంగ్రెస్‌ను మూసివేసి దేశాన్ని సర్వతోముఖానివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌కు కొత్త రూపం ఇవ్వాలనే ప్రతిపాదన చేయటం మరిచిపోరాదు. 1948 ఫిబ్రవరి రెండో తేదీనాడు హరిజన్ పత్రికలో కాంగ్రెస్‌ను రద్దు చేయాలనే ఆర్టికల్‌తో పాటు మహాత్మా గాంధీ రాసిన మరో ఆర్టికల్ కూడా అచ్చయ్యింది. ‘అత్యంత పురాతన జాతీయ రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ అహింసా ఆయుధంతోదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించింది, ఇలాంటి పార్టీని చచ్చిపోనివ్వకూడదు, ఇది దేశం ఉన్నంత కాలం ఉంటుంది’ అని మహాత్మా గాంధీ తన రెండవ ఆర్టికల్‌లో రాశారు. దేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ ఉంటుందంటూ మహాత్మా గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సార్థకం చేయవలసిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఉన్నది. పాత కాంగ్రెస్‌ను రద్దు చేసి దేశ అవసరాల దృష్ట్యా కొత్త కాంగ్రెస్‌ను తయారు చేసుకోవాలంటూ మహాత్మా గాంధీ 1948లో చూపించిన బాటలో కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగిపోవటం మంచిది. గాంధీ కుటుంబం దూరమైనంత మాత్రాన కాంగ్రెస్ రద్దు కావలసిన అవసరం, మూతపడవలసిన అగత్యం ఎంత మాత్రం లేదు. కాంగ్రెస్ మనుగడకు ఏ మాత్రం దెబ్బతగిలినా దాని వలన భారత రాజకీయాలకు తీరని లోటు వాటిల్లుతుంది. కాంగ్రెస్ లేకపోవటం వలన ఏర్పడే ఖాళీని ఏ ఇతర పార్టీ నింపలేదనే నిజాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించటం మంచిది. కాంగ్రెస్ ఒక్కటే గ్రామ స్థాయి వరకు కార్యకర్తలున్న ఏకైక పార్టీ. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉన్నది. తమను గెలిపించి అధికారంలోకి తెచ్చే గాంధీ కుటుంబం లేకపోతే ఎలా అని బెంబేలు పడే బదులు తామే గెలుపు గుర్రాలుగా మారాలి, కాంగ్రెస్‌ను ఒక స్వతంత్ర రాజకీయ సంస్థగా రూపొందించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటనేది మహాత్మాగాంధీ ఎంతో స్పష్టంగా వివరించారు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కూడిందే తప్ప ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులకు చెందింది ఎంత మాత్రం కాదని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు. కాంగ్రెస్‌ను నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీల కుటుంబ పార్టీ చేయటం వల్లనే అది చచ్చుపడిపోతోంది. రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్‌కు తమ కుటుంబం నుండి స్వతంత్రం కల్పిస్తానంటున్నాడు. కాంగ్రెస్ నాయకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన బాటలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసుకునేందుకు నడుము బిగించాలి.

-కె.కైలాష్ 98115 73262