ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అహంభావం వీడితే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో మెజారిటీ సాధించిన భాజపా ఇక పాలనలో ఒదిగి పని చేయాల్సి ఉంది. మెజారిటీని అడ్డం పెట్టుకుని విర్రవీగితే ముందు ముందు అనర్థాలు ఎదురవుతాయి. ఎన్నికల్లో ఏకపక్ష విజయం ప్రధాని నరేంద్ర మోదీని అహంభావిగా మార్చిన దాఖలాలు కనిపించటం లేదు. కానీ, ఒకరిద్దరు మంత్రులు అపుడే తమకిక ఎదురు లేదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. వివిధ మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటులో చోటు చేసుకున్న గందరగోళం అహంభావంతో కూడిన ఆధిపత్య పోరుకు సంకేతంగా కనిపిస్తోంది. ఓటర్లు ఇచ్చిన అధికారాన్ని ప్రజాసమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి తప్ప ఆధిపత్యం చెలాయించేందుకు దుర్వినియోగం చేయరాదు.
మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటులో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సముచిత స్థానం కల్పించకుండా అవమానించటం కొందరు మంత్రుల అహంభావానికి అద్దం పడుతోంది. పార్టీపరంగా గందరగోళం నెలకొనడంతో రాజ్‌నాథ్‌ను ఆరు కమిటీలకు అధ్యక్షుడిగా నియమించి తప్పును సరిదిద్దుకోవటం మోదీ పరిపక్వతను చాటుతోంది. హోం మంత్రి అమిత్ షాను ఎనిమిది మంత్రివర్గ ఉపసంఘాలకు అధ్యక్షుడిగా నియమించి సీనియర్ నాయకుడైన రాజ్‌నాథ్‌ను మొదట రెండు కమిటీలకు మాత్రమే నియమించటం అహంభావ వ్యవహారానికి నిదర్శనం. రాజ్‌నాథ్‌ను కాదని అమిత్ షాను ఏకంగా ఎనిమిది కమిటీలకు అధ్యక్షుడిగా నియమించడం భాజపాలో పెద్ద దుమారం రేపింది. అధికారం కొందరి చేతుల్లో కేంద్రీకృతమవుతోందనే సంకేతాలు తొలుత వెళ్లాయి. ఇది మంచి పరిణామం కాదు.
భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు హోం శాఖను కేటాయించినప్పుడే మోదీ తరువాతి స్థానం ఆయనదే అనే సంకేతాలు వెళ్లాయి. ఇది ఊహించిందే కాబట్టి ఇతర మంత్రులెవ్వరూ వ్యతిరేకించలేదు. అయితే మంత్రివర్గ ఉపసంఘాల అధ్యక్షుల ఎంపికలో జరిగిన తప్పిదం భాజపాను కుదిపి వేసింది. అమిత్ షాను ఎనిమిది మంత్రివర్గ ఉపసంఘాలకు అధ్యక్షుడుగా నియమించడంతో అధికారం అంతా అతని చేతుల్లో కేంద్రీకృతమవుతోందనే భావన కలిగింది. అమిత్ షా అంతకుముందు మంత్రులందరినీ తన చాంబర్‌లోకి పిలిపించుకుని సమీక్షా సమావేశాలు జరపటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాల అధ్యక్షుల నియామకం వివాదాస్పదమైంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పట్ల ఇలా వ్యవహరించిన వారెవరనేది ఆరా తీయవలసిన బాధ్యత మోదీపై ఉన్నది. తనకు జరిగిన అవమానానికి కలత చెందిన రాజ్‌నాథ్ ఒక దశలో మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారనే వార్తలు వచ్చాయి. ఆయన ని జంగా రాజీనామా చేస్తే దాని ప్రభావం ఎన్డీఏ ప్రభుత్వంపైన, భాజపా పైన తీవ్రంగా పడేది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన వా రం, పది రోజులకే ఒక సీనియర్ మంత్రి రాజీనామా చేస్తే అది తీవ్రమైన సంక్షోభం కాకతప్పదు. అందుకే మోదీ క్షణాల్లో పరిస్థితిని చక్కదిద్ది రాజ్‌నాథ్‌ను ఆరు మంత్రివర్గ ఉపసంఘాలకు అధ్యక్షుడిగా నియమించారు. ఇలాంటి తప్పులు ఇకపై జరగకుండా చూడవలసిన బాధ్యత కేవలం మోదీపైనే కాదు, అమిత్ షాతోపాటు ఇతర సీనియర్ మంత్రులపైనా ఉంది. భాజపాకు సొంతంగా మెజారిటీ లభించినా, ఎన్డీఏలోని మిత్రపక్షాలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించి సహకార సమాఖ్య విధానానికి పెద్దపీట వేసిన మోదీ జేడీయూను కూడా కలుపుకొని ఉంటే బాగుండేది. అధికారాన్ని వికేంద్రీకరించటంపై దృష్టి సారించటం ద్వారా కొద్దిమంది మంత్రులు, అధికారులకు పగ్గాలు అప్పగించకుండా చూడాలి. అధికారం కేంద్రీకృతమైతే చెడు పరిణామాలే ఉంటాయి.
భారీ ఆధిక్యతతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం నుండి ప్రజలు ఎన్నో మంచి పనులు ఆశిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో జనం ఆకాంక్షలను నెరవేర్చగలిగితే ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాగలుగుతుంది. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మోదీ దృష్టి సారించాలి. ‘సంకల్పిత భారత దేశం, సశక్త్ భారత దేశం’ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన 67 ముఖ్యమైన హామీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల పట్ల శూన్య సహనం అనేది ఎన్డీఏ మేనిఫెస్టోలో కీలక హామీ. అందుకే ప్రభుత్వం దీనిని పకడ్బందీగా అమలు చేస్తోంది. కశ్మీర్‌లో భద్రతా దళాలు జరుపుతున్న ఎన్‌కౌంటర్లలో మూసా లాంటి కరడుకట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. ఇక మేనిఫెస్టోలో రెండో హామీ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370, 35ఏ ఆర్టికల్స్‌ను రద్దు చేయడం. ఇది అత్యంత వివాదాస్పద హామీ. ఎన్టీఏకు ప్రస్తుతం లోక్‌సభలో ఆధిక్యత ఉండగా, వచ్చే ఏడాది నాటికి రాజ్యసభలోనూ ఆధిక్యత సాధించే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ బిల్లులను ఆమోదించే వీలుంది. మోదీ తన మొదటి ఐదేళ్ల పాలనలో రాజ్యసభలో మెజారిటీ లేనందున పలు సమస్యలను ఎదుర్కొన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. రాజ్యసభలో తిరుగులేని ఆధిక్యత వచ్చే పరిస్థితి ఉన్నందున కశ్మీర్‌కు సంబంధించిన హా మీలను అమలు చేసేందుకు మోదీ దీక్ష వహించాలి. పౌ రుల జాతీయ రిజిష్ట్రేషన్ (ఎన్.ఆర్.సి)ను దశల వారీ గా దేశమంతా అమలు చే యాలి. పౌరుల జాతీయ రిజిష్ట్రేషన్ లేనందున పొరుగు దేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చివరకు స్థానికులు అల్పసంఖ్యాకులైపోతుంటే బయటి నుండి వస్తున్న వారు అధిక సంఖ్యాకులై అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.
అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారు అధిక సంఖ్యాకులవుతుంటే స్థానికులు మైనారిటీలుగా మారిపోతున్నారు. జమ్మూలో మైన్మార్ నుండి వచ్చిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి చేజారిపోయే ప్రమాదం నెలకొంటుంది. పొరుగు దేశాల నుండి కొనసాగుతున్న అక్రమ వలసలను అదుపు చేసేందుకు ఉద్దేశించిన పౌరసత్వం సవరణ బిల్లును త్వరగా పార్లమెంటులో ఆమోదించవలసిన బాధ్యత మోదీ సర్కారుపై ఉంది. మోదీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు మోదీ ఇచ్చిన చాలా హామీలు ఇంకా అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పనపై హామీ కలగానే మిగిలిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. ఉపాధి కల్పనను వేగవంతం చేసేందుకు, వృత్తి నైపుణ్యంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు తగిన సిఫారసుల కోసం రెండు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించడం హర్షణీయం. అయితే ఇది ప్రకటనల వరకే పరిమితం కాకూడదు. ఎన్ని కమిటీలకు తాము అధ్యక్షులమనే ఆలోచనతో మంత్రులు కాలయాపన చేస్తే లక్ష్యాలను సాధించటం అసాధ్యం. మంత్రులంతా సమష్టి బాధ్యతతో ముందుకు సాగాలే తప్ప ఎవరికి వారు తాము అధికులమనే అహంభావంతో పని చేస్తే మొదటికే మోసం వస్తుంది. *

-కె.కైలాష్ 98115 73262