ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్‌కు ముందు నుయ్యి.. వెనక గొయ్యి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 133 ఏళ్ల క్రితం స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇపుడు ప్రశ్నార్థకమైంది. వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘో రంగా ఓడిపోవటం, తాజా ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యం, ఆశించిన స్థాయిలో ప్రియాంకా గాంధీ ప్రభావం చూపలేక పోవడం వంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ భవితవ్యం గందరగోళంలో పడింది. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, తమిళనాడు సీనియర్ నేత పి.చిదంబరం వల్లనే కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతిన్నాయని రాహుల్ ఆరోపించిటం అర్థరహితం. ఆ ముగ్గురు నేతలూ పార్టీ అధిష్ఠానవర్గంపై వత్తిడి తెచ్చి తమ పుత్రరత్నాలకు ఎంపీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అశోక్ గెహ్లాట్ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోగా, కమల్‌నాథ్, చిదంబరం వారసులు ఎంపీలుగా గెలిచారు.
ఈ ముగ్గురు నాయకులు తమ కుమారులను గెలిపించుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప పార్టీ కోసం కృషి చేయలేదన్నది రాహుల్ ప్రధాన ఆరోపణ. వారసులకు టిక్కెట్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే అప్పుడే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పి, రాహుల్ తన అంతరంగాన్ని బహిర్గతం చేసి ఉండాల్సింది. సీనియర్ నేతలంతా పార్టీ విజయం కోసం కృషిచేయాలే తప్ప, వారసులకు టిక్కెట్లు అడగరాదని షరతు విధించినట్లయితే ఫలితాలు మరోలా ఉండేవి. కాని రాహుల్ అలా చేయకుండా, ఎన్నికల్లో పార్టీ ఓటమి, అందునా అమేథీలో తాను స్వయంగా పరాజయం పాలైన తర్వాత- ముగ్గురు సీనియర్ నాయకులపై ఇలా ఆరోపణలు చేయటం పార్టీ అధ్యక్షుడి హోదాలో రాహుల్‌కు తగదు. రాజస్థాన్‌లో మొత్తం 25 ఎంపీ సీట్లలో భాజపా గెలిస్తే అందుకు అశోక్ గెహ్లాట్ కారణం ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు మధ్య విభేదాలు, ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించటం, రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం వంటి కారణాలతో రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. రాజస్థాన్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమికి ప్రధాన కారణం అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై జనంలో ఉన్న అసంతృప్తి. ఆమె ఏకపక్ష పాలన, మొండితనం వల్ల ప్రజలకు భాజపా దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము వసుంధరకు వ్యతిరేకంగాను, లోక్‌సభ ఎన్నికల్లో మోదీని సమర్థిస్తామని రాజస్థాన్ ప్రజలు అప్పుడే చెప్పారనేది రాహుల్‌కి తెలియదా? రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు, వారి విశ్వాసం సంపాదించేందుకు రాహుల్ చేసిన ప్రయత్నమేదీ లేదు?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతతో అధికారాన్ని దక్కించుకుంది. భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల తేడా దాదాపు ఐదు శాతం మాత్రమే. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ నాయకులు అధినాయకత్వం ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల కోసం డబ్బు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు తప్ప ప్రజల విశ్వాసం పొందేలా ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు భాజపా బాగా శ్రమించింది. పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగింది. మోదీ పటిష్ట నాయకత్వం, కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలు, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడి తదితర అంశాలు భాజపాకు బాగా కలిసి వచ్చాయి.
ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి ప్రధాన కారణం స్వయంగా రాహుల్ గాంధీయే. మోదీని అప్రతిష్టపాలు చేయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రాహుల్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ. ముప్పై వేల కోట్ల కుంభకోణం జరిగిందని, చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ చేసిన ప్రచారాన్ని ప్రజలు ఏ కోశానా విశ్వసించలేదు. మోదీ పట్ల ప్రజల్లో ఉన్న మద్దతును అంచనా వేయడంలో రాహుల్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తదితర నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం, ఆ తరువాత ఉపసంహరించుకోవటం కాంగ్రెస్ సంప్రదాయం. ఓటమి ఎదురైన ప్రతిసారీ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం, సీనియర్ నాయకులు సర్దిచెప్పటం లేదా రాజీనామాను తిరస్కరించటంతో ఆ నాటకం ముగుస్తుంది. కానీ ఈ సారి రాహుల్ తన రాజీనామా విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ఆయన నిజంగానే పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటే కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డట్టే. దీనికి ప్రబల కారణం కాంగ్రెస్ అనేది గాంధీ కుటుంబానికి చెందిన పార్టీ. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి నాయకత్వం నుండి తప్పుకున్న మరుక్షణం కాంగ్రెస్ కుప్పకూలుతుందనేది కాదనలేని నిజం. రాహుల్ నిజంగానే అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటే కాంగ్రెస్ నిలదొక్కుకోలేదు. ఆయనకు బదులు సోనియా లేదా ప్రియాంక అధ్యక్ష పదవి చేపడితేనే కాం గ్రెస్ ప్రాణంతో ఉండగలుగుతుంది. మరే ఇతర నాయకుడు అధ్యక్ష పదవిని చేపట్టినా కాంగ్రెస్ అనతి కాలంలో చీలికలు, పీలికలు కావడం ఖాయం.
కాంగ్రెస్ ఇప్పుడు ఎంతటి దురదృష్టకరమైన పరిస్థితిలో పడిపోయిందంటే గాంధీ కుటుంబ సభ్యులు నాయకత్వం వహించినా, వహించకపోయినా కనుమరుగైపోయే ప్రమాదంలో పడిపోయింది. వయోభారం, అనారోగ్యం వల్ల సోనియా మరోసారి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ముందుకు నడిపించే పరిస్థితి లేదు. అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని ముందుకు నడిపించగలిగే శక్తిసామర్థ్యాలు ప్రియాంకా గాంధీకి లేవనేది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇక, రాహుల్ నాయకత్వ పటిమ గురించి విడిగా చెప్పనవసరం లేదు. ఎన్నికల్లో కేవలం 52 సీట్లు రావడానికి రాహుల్ అనుసరించిన తప్పుడు వ్యూహమే కారణం. ఆయన ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్లతో సంప్రదించలేదు. సీనియర్ నాయకులు సైతం ఎన్నికల ప్రచారానికి, పార్టీ బాధ్యతలకు దూరం కావటంతో సోనియా జోక్యం చేసుకుని వారందరికీ నచ్చజెప్పవలసిన పరిస్థితి వచ్చింది. రాహుల్ ఈ లోపాలను అర్థం చేసుకోకుండా సీనియర్ నాయకులు తన మాట వినలేదు గనుక అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నానని చెప్పడం- ఆయన అపరిపక్వ మనస్తత్వానికి ఉదాహరణ. ఆయన తన రాజీనామా ప్రహసనాన్ని తెగేంత వరకు లాగుతున్నారు. దీనివల్ల పార్టీకి ఊహించనంత నష్టం జరుగుతోంది. తమ కుటుంబ సభ్యులెవరూ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరని రాహుల్ ప్రకటించటం తీవ్రమైన విషయం. తమ కుటుంబానికి ఆ పదవి పట్ల ఆసక్తి లేదనే సంకేతాన్ని రాహుల్ ఇస్తున్నారు. మరో వ్యక్తిని చూసుకోండని ఆయన ప్రకటించడం కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. కాగా, సోనియా మరోసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు కొంత ఊరట కలిగిస్తుంది. అయితే లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకత్వాన్ని రాహుల్ చేపడతారా? లేదా? అనేది స్పష్టం కావటం లేదు. అందుకు ఆయన నిరాకరించినా కాంగ్రెస్‌కు గడ్డుకాలమే. ప్రస్తుతం ఆ పార్టీకి ఎటు చూసినా దారి కనిపించడం లేదన్నది సుస్పష్టం. *

-కె.కైలాష్ 98115 73262