ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సయోధ్యతో ‘అయోధ్య’ సమస్యకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు నాలుగు వందల తొంభై సంవత్సరాలుగా కొనసాగుతున్న అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం మధ్యవర్తిత్వం, సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే పరిష్కారం అవుతుంది. హిందూ, ముస్లిం మతాలకు చెందిన నాయకులు పెద్ద మనసుతో వ్యవహరించి ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. సుప్రీం కోర్టు ఎంతో దూరాలోచనతో అయోధ్య వివాదంపై వెంటనే తీర్పు ఇవ్వకుండా మధ్యవర్తిత్వానికి తెర లేపింది. మధ్యవర్తిత్వం కోసం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. మధ్యవర్తులు చర్చలను రహస్యంగా జరపాలని ఆదేశించటంతోపాటు ఇందుకు సంబంధించిన వార్తలను ప్రచురించరాదని మీడియాపై సుప్రీం ఆంక్షలు విధించింది. చర్చలకు సంబంధించిన వార్తలను ప్రచురించకూడదని ఆదేశించటం సమర్థనీయం. చర్చలకు సంబంధించిన వార్తలు ప్రచురితమైతే రెండు మతాల మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది తప్ప సమస్య పరిష్కారానికి దోహదపడదు. మధ్యవర్తిత్వం చర్చలకు కేటాయించిన ఎనిమిది వారాల సమయం సరిపోకపోవచ్చు. ఇరుపక్షాల మధ్య జరిగే చర్చల సరళిని దృష్టిలో పెట్టుకుని అవసరం మేరకు గడువును మరింత పెంచటం ద్వారా కోర్టు తన లక్ష్యాన్ని సాధించవచ్చు. ఎనిమిది వారాల సమయంలో మధ్యవర్తిత్వం సఫలీకృతం కాకపోవచ్చు.
బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదం అత్యంత సున్నితమైంది. ఎవరు ఏ మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరించినా దేశంలో శాంతిభద్రతలకు ప్రమాదం ముంచుకొస్తుంది. సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించినట్టయితే సమస్యలు ఉత్పన్నమయ్యేవి. అన్ని మార్గాలనూ అనే్వషించి తగిన తీర్పు ఇవ్వటం మంచిది. అయోధ్య వివాదం విషయమై సుప్రీం కోర్టు తీర్పు వెలువడినట్లయితే ఇరుపక్షాల మధ్య గొడవలు జరగటం ఖాయం. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా రెండోవర్గం ఆగ్రహం చెందుతుంది, అసంతృప్తికి గురి అవుతుంది. ఏదైనా నిర్ణయం ఒకరికి అనుకూలంగా ఉంటే, మరొకరికి ప్రతికూలంగా ఉండటం సహజం. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీం వెంటనే తీర్పు ఇవ్వకుండా మధ్యవర్తిత్వానికి ప్రయత్నించటం మంచిదే.
మధ్యవర్తిత్వం వల్ల బాబ్రీ మసీదు-రామజన్మభూమి సమస్య పరిష్కారం అవుతుందా? నిజానికి ఇరుపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అయితే దీని కోసం ఒక వర్గం దిగిరాక తప్పదు. పురాతన కట్టడం కూల్చిన చోట బాబ్రీ మసీదును నిర్మించాల్సిందేనని ముస్లింలు, రామాలయం నిర్మించాలని హిందువులు పట్టుపడితే ఈ సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో ఇరు పక్షాల వాదన ఏమిటన్నది తెలిసిందే. శ్రీరాముడు జన్మంచిన స్థలంలో నిర్మించిన రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించారు, కోట్లాది మంది హిందువుల నమ్మకాలు, మనోభావాలను గౌరవిస్తూ అక్కడ భవ్య రామాలయాన్ని నిర్మించేందుకు ముస్లింలు అంగీకరించాలన్నది హిందూ సంస్థల వాదన. ముస్లిం మతపెద్దలు దీన్ని ఆమోదించటం లేదు. తమ వాదనే నిజమంటే తమ వాదనే నిజమంటూ ఇరుపక్షాలు వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు దిగిరాకపోతే సమస్య పరిష్కారం కాదు. ఇరు పక్షాలూ తమ వాదనకు కట్టుబడి ఉంటే పరిష్కారం అసాధ్యం. మరి ఎవరు దిగిరావాలి? ఈ ప్రశ్నకు బదులివ్వటం అసాధ్యం.
అలనాడు ముస్లింల పాలనలో వేలాది దేవాలయాలు నేలమట్టమై మసీదులు వెలిశాయనేది చరిత్ర చెబుతున్న నిజం. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం, మసీదు, కాశీలోని కాశీ విశ్వనాథుని దేవాలయం, దానిని ఆనుకున్న ఉన్న మసీదు వంటివి ఇందుకు ప్రబల నిదర్శనం. శ్రీకృష్ణుడు, శివుడి దేవాలయాలను ఆనుకునే మసీదులు, ఈద్‌గాలు వెలిశాయంటే ఏ పక్షం దౌర్జన్యానికి పాల్పడిందనేది సుస్పష్టం. మధురా నగరం నడిబొడ్డున ఒక అద్భుతమైన దేవాలయం ఉన్నట్లు మహమ్మద్ గజనీ రాతగాడు అల్ కుత్బి తన ‘తారీకి యమిని’ పుస్తకంలో రాశాడు. గజనీ 1017 లేదా 1018లో మథురపై దాడి చేసి మొత్తం నగరాన్ని ధ్వంసం చేసినప్పుడు శ్రీకృష్ణజన్మ స్థానం కూడా ధ్వంసమైందని అందులో రాయటం గమనార్హం. శ్రీకృష్ణుడి దేవాలయాన్ని మానవ మాత్రులు నిర్మంచలేదు, దానిని దేవదూతలు నిర్మించారని స్థానికులు చెబుతారని అల్ కుత్బి తన పుస్తకంలో రాశాడు. మహమ్మద్ గజనీ కూడా శ్రీకృష్ణుడి దేవాలయం గురించి వివరిస్తూ ఇలాంటి ఆలయం నిర్మించాలంటే లక్షలాది దీనార్లు ఖర్చు చేయటంతోపాటు రెండు వందల సంవత్సరాలు కష్టపడవలసి ఉంటుందని రాయటం గమనార్హం. గజనీ ఆదేశాల మేరకే మథురలోని అన్ని దేవాలయాలను ఓ వర్గం వారు ధ్వంసం చేయటంతోపాటు దోపిడీలకు పాల్పడ్డారు. ఔరంగజేబ్ పాలనలో శ్రీకృష్ణ జన్మస్థానం దేవాలయ శిథిలాలపై పెద్ద ఈద్‌గా నిర్మించారు.
వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం విషయంలో కూడా ఇదే జరిగింది. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని ఔరంగజేబ్ ధ్వంసం చేసి మసీదు నిర్మించినట్లు చరిత్ర స్పష్టంగా చెబుతోంది. కాశీ విశ్వనాథుని దేవాలయాన్ని ఇండోర్ రాజధానిగా పాలించిన ధన్‌గర్ (గొర్రెల కాపర్ల కులం) వర్గానికి చెందిన అహల్యా బాయి హోల్కర్ 1780లో నిర్మించారు. ఇలా దేశంలోని పలు దేవాలయాలను ముస్లిం పాలకులు ధ్వంసం చేశారనేది చరిత్ర చెబుతున్న నిజం. ఈ నేపథ్యంలో ఎవరు దిగిరావాలి? ఎవరు ఉదారంగా వ్యవహరిచాలి? అనేది విడి గా చెప్పనక్కర లేదు. మథురలో, కాశీలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను నిర్మించినట్లే అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించి ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, గతంలో ముస్లిం పాలకులు చేసిన తప్పులను కొంతైనా సరిదిద్దేందుకు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేందుకు ఎదుటి పక్షం విశాల హృదయంతో అంగీరించటం మంచిది. మందిరానికి కొంత దూరంలో లేదా వారికి అనుకూలంగా ఉండే స్థలంలో మసీదును నిర్మించుకోవటం ద్వారా గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు చరమగీతం పాడవచ్చు.
రామజన్మ భూమిన్యాస్, ఇతర హిందూ సంస్థలు మధ్యవర్తిత్వానికి అంగీకరించడం లేదు. రామజన్మభూమి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు కాబట్టి మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, సమస్య పరిష్కారం కాదన్నది వారి వాదన. ముస్లిం మత పెద్దలు మాత్రం మధ్యవర్తిత్వానికి అంగీకరించారు. కానీ, మధ్యవర్తిత్వానికి వారు ప్రాతిపదికను చూపించటం లేదు. మధ్యవర్తిత్వం ద్వారా కాలయాపన చేయాలన్నది ముస్లిం మతపెద్దల ప్రయత్నం కాబట్టే తాము దీనికి అంగీకరించటం లేదని హిందూ సంస్థల అధినాయకులు చెబుతున్నారు. ఇరుపక్షాలు తమ వాదనకు కట్టుబడి వ్యవహరిస్తే మసీదు-మందిరం వివాదం ఎప్పటికీ పరిష్కారం కాదు. వివాదాస్పద స్థలంలో సర్వమత ప్రార్థనా కేంద్రం లేదా గ్రంథాలయం, ఉద్యానవనం నిర్మించాలనే ప్రతిపాదనలు పరిష్కారానికి దారి చూపించవు.
మనది లౌకిక దేశం కాబట్టి రెండు ప్రధాన మతాల మధ్య సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వాలను నెలకొల్పేందుకు భవ్య రామాలయంతోపాటు మసీదును పక్కపక్కనే నిర్మించాలి. రామాలయం, మసీదు నిర్మాణం బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. ఇలా చేయటం ద్వారా మందిరం, మసీదు నిర్మాణ విషయంలో రెండు మతాల వారు పోటీ పడకుండా చూడవచ్చు. ఈ నిర్మాణాలు ఏ స్థాయిలో ఉండాలి? ఎంత ఖర్చుతో పూర్తి చేయాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించటం మంచిది. ఈ నిర్మాణాలు మత సామరస్యానికి ప్రతీకలుగా మారాలి. మధ్యవర్తిత్వం సఫలం కాని పక్షంలో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలి.
*