ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ కల నెరవేరేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు అలకగానే పండుగ కాదు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే వచ్చే సంవత్సరం లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం భావించే పక్షంలో పప్పులో కాలేసినట్లే. కాంగ్రెస్ దాదాపు 120 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటే తప్ప రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టలేరు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నై సమావేశంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించినా మిగతా మిత్రపక్షాల నాయకులు ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో పాగా వేసిన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, మరికొందరు రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సుముఖంగా లేరు. ఉత్తరప్రదేశ్ (80), పశ్చిమ బెంగాల్ (42) రాష్ట్రాల్లో మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 122. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరం. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు కలిసి రాకపోతే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలనే కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించటం వలన కాంగ్రెస్‌లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. నాయకులతో పాటు కార్యకర్తల మనోధైర్యం బాగా పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమకు విజయం సాధించిపెట్టగలరనే విశ్వాసం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కలుగుతోందనటంలో ఎలాంటి అనుమానం లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి ఒక సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంలో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించటం పార్టీకి శుభసూచకమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం నలభై నాలుగు సీట్లు మాత్రమే గెలిచి ఆ తరువాత జరిగిన దాదాపు అన్ని శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లటం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలో కాంగ్రెస్ విజయం సాధించటం పార్టీకి ఎంతో కలిసి వస్తుంది. కనుమరుగైపోతుందనుకున్న పార్టీ మళ్లీ తన స్వంత కాళ్లపై నిలబడే పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే మూడు రాష్ట్రాల్లో ఓడిపోయినంత మాత్రాన బీజేపీ దెబ్బతినిపోయింది, ఆ పార్టీకి పుట్టగతులు లేవనే విధంగా కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించకూడదు. కాంగ్రెస్ కేవలం చత్తీస్‌గఢ్‌ను మాత్రమే మంచి మెజారిటీతో గెలుచుకున్నది. మిగతా రెండు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ అధికారం కోల్పోయినా తన బలాన్ని నిలబెట్టుకోగలిగింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బీజేపీకి కాంగ్రెస్ కంటే అర్ధ శాతం ఓట్లు అధికంగా రావటం గమనార్హం. బీజేపీ కేవలం ఐదారు సీట్లతో అధికారాన్ని కోల్పోయింది కాబట్టి ఆ పార్టీని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సునాయాసంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు భావించటంతోపాటు వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. అయితే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. భారీ మెజారిటీతో ఓడిపోతుందుకున్న బీజేపీ గట్టి పోటీ ఇవ్వగా, భారీ మెజారిటీతో విజయం సాధించవలసిన కాంగ్రెస్ మూములు మెజారిటీతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకునేందుకు చాలా కష్టపడవలసి వస్తుంది. మధ్యప్రదేశ్‌లో 29, రాజస్తాన్‌లో 25, చత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ, ఈ మూడు కలిపి మొత్తం సీట్లు 65 సీట్లున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఈ మూడు రాష్ట్రాల్లోనే మెజారిటీ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ కూడా మంచి స్థితిలో ఉన్నందున పోటీ గట్టిగా ఉంటుంది. కాంగ్రెస్ ఈ మూడు రాష్ట్రాలతోపాటు పంజాబ్, పాండిచ్చేరిలో స్వంతంగా అధికారంలో ఉండగా కర్నాటకలో మిత్రపక్షంతో కలిసి అధికారంలో ఉన్నది. పంజాబ్‌లోని 13, పాండిచ్చేరిలోని ఒక సీటును కలుపుకుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోక్‌సభ సీట్ల సంఖ్య 79. దీనికి కర్నాటకలోని 28 సీట్లు కూడా కలిపితే 107 సీట్లు అవుతాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వీటిలో నుండి ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుందనేది ప్రశ్న. దక్షిణాదిలోని మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్ (25)లో కాంగ్రెస్ కనుమరుగైపోయే పరిస్థితిలో ఉన్నది. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసినా ఆశించిన ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. తెలంగాణా (17)లో కాంగ్రెస్‌కు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయింది. టీఆర్‌ఎస్, ఎం.ఐ.ఎం కలిసి 17కు 17 లోక్‌సభ సీట్లు గెలుచుకునే పరిస్థితి తెలంగాణాలో నెలకొన్నది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన డీఎంకే అధినేత స్టాలిన్ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లలో నుండి కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ఇష్టపడతాడనేది అనుమానమే. జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు కేరళ (20 లోక్‌సభ సీట్లు)లో హోరాహోరీగా పోటీపడతారనేది అందరికీ తెలిసిందే.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళలోని మొత్తం 223 సీట్లలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తాము, తమ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకోవటంతోపాటు మాయావతి, అఖిలేష్ యదవ్, మమతా బెనర్జీతో సఖ్యత బాగా పెంచుకోవలసి ఉంటుంది. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు రాహుల్ గాంధీ పట్ల ఎంతో సానుభూతి ఉన్నది. అందుకే ఆయన మిత్రపక్షాల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నిలబెట్టేందుకు తీవ్రంగా కృషిచేసి విఫలమయ్యారు. మాయావతి, మమతా బెనర్జీలు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ససేమిరా అంగీకరించటం లేదు. అందుకే ఈ ముగ్గురు నాయకులు మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మహా కూటమికి కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఖరారు చేసే లక్ష్యంతోనే మూడు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి బీజేపీయేతర ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ రాజకీయాన్ని పసిగట్టిన అఖిలేష్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీలు వీటికి దూరంగా ఉండిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర మిత్రపక్షాల ముఖ్యమంత్రులు, నాయకులు తమ రాజకీయ అవసరాల దృష్ట్యా ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాక తప్పలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు కూడా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అసంతృప్తి ఉన్నది. రాహుల్ గాంధీ ఏకపక్ష వ్యవహారం మూలంగా తాము మిత్రపక్షాల కూటమికి దూరంగా ఉండవలసి రావచ్చుననే సంకేతాలు ఆమ్‌ఆద్మీ పార్టీ నుండి వస్తున్నాయి. నలభై లోక్‌సభ సీట్లున్న బిహార్‌లో కూడా కాంగ్రెస్ లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జేడీ చాటు పార్టీగా వ్యవహరించవలసి వస్తోంది.
మొత్తం 118 లోక్‌సభ సీట్లున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పార్టీగా కొనసాగుతోంది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు చాటు పార్టీగా పని చేయవలసి వస్తోంది. ఎన్నో సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో సైతం దేవెగౌడ నాయకత్వంలోని జేడీయూకు కాంగ్రెస్ వంత పాడవలసి వస్తోంది. రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను పటిష్టం చేసి ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగుపరుచుకుంటే తప్ప ప్రధాన మంత్రి పదవిని సంపాదించలేరు. కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు రాహుల్ గాంధీని దూరంగా పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు నాయకుల సహకారం ఉంటే తప్ప రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాలేరు.

-కె.కైలాష్ 98115 73262