ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఎందుకీ వృథా ప్రయాస?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంతో స్నేహం చేయటం,సత్సంబంధాలు నెలకొల్పుకోవటం పాకిస్తాన్‌కు ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యానికి ఎంత మాత్రం ఇష్టం లేదనేది మరోసారి రుజువైంది. పాకిస్తాన్ ఏకపక్షంగా శాంతి ప్రక్రియను నిలిపివేయటం ఇందుకు తాజా ఉదాహరణ. ఇష్టం లేనివారితో స్నేహం చేసేందుకు ప్రయత్నించటం వృధా ప్రయాసే అవుతుంది. పఠాన్‌కోట్ దాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ పాకిస్తాన్‌లోపర్యటించేందుకు అనుమతిచ్చే ప్రసక్తే లేదంటూ భారత దేశంలో పాకిస్తాన్ రాయబారి బాసిత్ చేసిన ప్రకటన ఆ దేశం నాయకుల ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. పఠాన్‌కోట్‌పై దర్యాప్తు చేస్తున్న పాకిస్తాన్ బృందం భారత దేశంలో పర్యటించి వెళ్లిన అనంతరం బాసిత్ ఈ ప్రకటన చేయటం గమనార్హం.
రెండు దేశాల మధ్య ముందు కుదిరిన ఒప్పందం మేరకు పఠాన్‌కోట్ దాడిపై మొదట పాకిస్తాన్ బృందం ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసిన అనంతరం భారత దేశం దర్యాప్తు బృందం అక్కడికి వెళ్లాలి. భారత జాతీయ దర్యాప్తు సంస్థ బృందం పాకిస్తాన్ పర్యటనలో భాగంగా జైషె మహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను విచారించ వలసి ఉండింది. నయవంచనకు పేరు గాంచిన పాకిస్తాన్ పాలకులు తమ బృందం భారత దేశంలో పర్యటించి వెళ్లన వెంటనే మాట మార్చారు. పాకిస్తాన్ బృందాన్ని అనుమతించినందుకు ప్రతిగా భారత దర్యాప్తు బృం దాన్ని పాకిస్తాన్‌లోకి అనుమతించాలనే నియమం ఏదీ లేదంటూ బాసిత్ మాట మార్చారు. ఆయన అంతటితో ఆగకుండా భారత దేశంతోశాంతి ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
వాస్తవానికి పాకిస్తాన్‌లో ప్రజలెన్నుకున్న ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు సైన్యాధ్యక్షుడు రాహిల్ షరీఫ్‌కు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. భారత దేశంతో శాంతి నెలకొల్పుకోవాలని ప్రధాని నవాజ్ షరీఫ్ కోరుకుంటున్నారు అందుకే ఆయన నరేంద్ర మోదీని లాహోర్‌లోని తన నివాసానికి ఆహ్వానించారు. భారత దేశం ప్రధాన మంత్రిని తన నివాసానికి ఆహ్వానించటం ద్వారా నవాజ్ షరీఫ్ ధైర్యాన్ని ప్రదర్శించారని చెప్పకతప్పదు. మోదీ లాహోర్ ఆకస్మిక పర్యటన నిర్వహించటం ద్వారా నవాజ్ షరీప్ కు మద్దతు ప్రకటించారని భావించాలి. నరేంద్ర మోదీ పాకిస్తాన్‌లోని పౌర సమాజానికి ప్రాధాన్యత ఇవ్వటం పాక్ సైన్యానికి, ఐ.ఎస్.ఐకి ఎంత మాత్రం రుచించలేదు. అందుకే పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి చేయించటం ద్వారా పాక్ సైన్యం తన మనోగతాన్ని స్పష్టం చేయటంతోపాటు నవాజ్ షరీఫ్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటనేది ప్రకటించింది.
పాకిస్తాన్ పౌరసమాజం భారత దేశంతో స్నేహన్ని కోరుకుంటుండవచ్చు కానీ పాక్ సైన్యం ఆలోచనా విధా నం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. ఆందుకే భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పుడు నెలకొన్నా పాక్ సైన్యం దానిని ధ్వంసం చేసింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు పరిధిని దాటి ప్రయత్నించారు. ఆయన కూడా బస్సులోలాహోర్ వెళ్లి రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కూడా చిత్తశుద్దితో రెండు దేశాల సంబంధాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. అయితే పాక్ సైన్యం అప్పుడు కూడా ఇదే పద్దతిలో వ్యవహరించింది. కార్గిల్ దురాగతం, పార్లమెంటుపై ఇస్లామిక్ ముష్కర ఉగ్రవాదుల దాడి జరిగింది. దాంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనటంతోపాటు పరిస్థితి యుద్ధానికి దారి తీసింది. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో కూడా గతంలో జరిగినట్లే జరుగుతోంది. పాకిస్తాన్‌తోసత్సంబంధాలు నెలకొల్పేందుకు మోదీ లాహోర్ వెళ్లి నవాజ్ షరీఫ్ ఇంటి ఆతిథ్యం స్వీకరించి రాగానే పఠాన్‌కోట్ దాడి జరిగింది.
భారత దేశంతో స్నేహం చేయటం పాక్ సైన్యానికి ఎంత మాత్రం ఇష్టం లేదనేది ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పాక్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు శాం తి ప్రక్రియను కొనసాగించినా తామందుకు అంగీకరించే ప్రసక్తే లేదనేది సైన్యం మనోగతం. పాకిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వాల మాట చెల్లుబాటయ్యే పరిస్థితులు నెలకొనంత వరకు రెండు దేశాల మధ్య శాంతి నెలకొనటం అసాధ్యం. పాకిస్తాన్‌లోసైన్యం ఇష్టారాజ్యం కొనసాగినంత కాలం శాంతి ప్రయత్నాలు వృధా ప్రయాసే అవుతాయనేది పచ్చి నిజం. పాకిస్తాన్ సైన్యం భారత్‌ను శతృ దేశంగా పరిగణిస్తూ దానికి అనుగుణంగానే వ్యవహరిస్తోంది. భారత దేశం విధానం ఇందుకు విరుద్ధంగా ఉన్నది. పాకిస్తాన్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు భారత్ ప్రాధాన్యత ఇస్తోంది కాబట్టే అడపాదడపా చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పాకిస్తాన్ ఏకపక్షంగా శాంతి ప్రక్రియను నిలిపవేసిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ప్రశ్న. ఇష్టం లేని కాపురం ఎక్కువ కాలం కొనసాగదనేది పలుమార్లు రుజువైంది కాబట్టి శతృవును శతృవుగాపరిగణించటం ద్వారా పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహ రచన చేయటం మోదీ ప్రధాన బాధ్యత.

చిత్రం అబ్దుల్ బాసిత్