ధనం మూలం

సంకల్ప బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘35 ఏళ్ల వయసులో మిలియనీర్ అవుతాను. లేదంటే నగరంలోని పెద్ద భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ’
పేదరికాన్ని తట్టుకోలేక ఒక పిల్లవాడు తనకు తాను చెప్పుకున్న మాట ఇది. సరైన తిండి కూడా లేక పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక చిన్న కుర్రాడు మహా అయితే బిర్యానీ తింటున్నట్టు కలలు కనొచ్చు. లేదా ఈ పూట కడుపు నిండితే చాలు అనుకోవచ్చు. కానీ అలా అనుకుంటే ఆ కుర్రాడి జీవితం కూడా అందరి జీవితంలానే సీదాసాదాగా ముగిసిపోయేది. కానీ ఆకలితో నకనకలాడుతూ పేదరికాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడా తన మెదడులోకి పేదరికం ఛాయలు చేరకుండా ఏదో ఒకనాడు సంపన్నుడిని అవుతాను అని తనకు తాను చెప్పుకోవడమే కాదు ప్రపంచంలోని పది అత్యంత సంపన్నుల జాబితాలో ఎప్పుడూ చోటు కోల్పోకుండా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
తెలుగు సినిమా కథనో, నవలలో హీరోనో అనిపించవచ్చు. కానీ కాదు జీవితంలో సినిమాను మించిన నాటకీయత ఉంటుందని నిరూపించిన వారెన్‌బఫెట్ జీవిత కథ ఇది.
తెలుగు నాట సాహిత్యంలో, పాత సినిమాల్లో పేదరికాన్ని అదేదో పెద్ద ఘన కార్యం సాధించినట్టుగా చూపిస్తారు. ధనానికి పేదవాళ్లం కానీ గుణానికి కాదు అంటూ భారీ డైలాగులు చెప్పిస్తుంటారు. పేదలుగా ఉండడమే వారు సాధించిన ఘన విజయం అన్నట్టుగా, సంపన్నులైతే దుర్మార్గులు అన్నట్టుగా చూపిస్తుంటారు. ఐతే ఇలా కథలు రాసేవారు, సినిమాలు తీసేవారు కూడా సంపద కోసమే ఆ పని చేస్తారు అది వేరేవిషయం. కానీ పేదరికంలో సాహిత్యంలో చూపినట్టు, సినిమాల్లో చూపిస్తున్నట్టు అంత గ్లామరేమీ ఉండదు.
ఆ సంగతి తెలియని వాళ్లు పేదరికం తమ పూర్వజన్మ సుకృతం అని మురిసిపోతుంటే బఫెట్ లాంటి వాళ్లు కసిగా పేదరికం నుంచి బయటపడి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆరేడేళ్ల వయసులోనే తన భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఏదో ఒకనాడు సంపన్నుడిని అవుతాను తనను తాను ప్రోత్సహించుకోవడం అంటే సామాన్యవిషయం కాదు.
బఫెట్ పదేళ్ల వయసులోనే ఇంటింటికి న్యూస్ పేపర్లు వేశారు. వస్తువులు అమ్మాడు. సంపాదించడం మొదలు పెట్టాడు. బాల్యంలో తమ ఇంటి సమీపంలో ఉన్న ఒక షాప్‌లో కూల్ డ్రింక్స్ మూతలు లెక్కపెట్టేవాడు. కోకా కోలా కూల్ డ్రింక్స్ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయని అతని లెక్కలో తేలింది. స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత ఈ జ్ఞానం అతనికి ఉపయోగపడింది. కోకాకోలా కంపెనీలోనే పెద్ద మొత్తంలో ఇనె్వస్ట్ చేశాడు. 1930 ప్రాంతంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. బఫెట్ తండ్రి పూర్తిగా దివాళా తీశాడు. వారి కుటుంబం ఖాతా ఉన్న బ్యాంకు దివాళీ తీయడంతో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది.
ఒక పూట తింటే మరో పూట తినలేని పరిస్థితి. ఒక్కోసారి తల్లి బఫెట్‌కు ఒక పూట తిండిపెట్టేది కాదు. ఆ పూట తండ్రి కోసం బఫెట్ త్యాగం చేయాల్సి వచ్చేది. ఆకలిని చూసిన బఫెట్ అందరిలా నిరుత్సాహపడలేదు. బాగా సంపాదించాలి అని ఆ వయసులోనే నిర్ణయం తీసుకున్నాడు.
సంకల్ప బలం అంటే ఇదేనేమో 35ఏళ్ల వయసులో మిలియనీర్లు అవుతాను. లేదా ఆత్మహత్య చేసుకుంటాను అని నిర్ణయించుకుని సంపాదన మొదలు పెట్టాడు. 32ఏళ్ల వయసులోనే మిలియనీర్ అయ్యాడు బఫెట్. 35ఏళ్ల వయసులో మిలియనీర్ కాకపోయి ఉంటే నిజంగా ఆత్మహత్య చేసుకునే వాడే అనేది కాదు చర్చ. ఒక వ్యక్తి సంకల్పబలంతో పని చేస్తే పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉంటే 35 ఏళ్ల వయసు నాటికి మిలియనీర్ కాకపోయేవాడేమో కానీ ఆ తరువాత ఐనా అయి తీరేవాడు. మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే కాస్త ముందో వెనుకనో దాన్ని సాధించి తీరుతాం.
నా వల్ల కాదు. జీతం రాళ్ల కోసం పని చేస్తాను. నా జీవితం ఇలానే ముగిసిపోతుంది అని మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటే నిజంగా మన జీవితం అలానే ముగుస్తుంది. బఫెట్ అంత సంపన్నులం కాకపోవచ్చు కానీ మనకేం తక్కువ ఇతరుల మాదిరిగానే నేనూ సంపన్నుడిని అవుతాను అని మనకు మనం ప్రోత్సహించుకుంటే సాధ్యం అయి తీరుతుంది.
బఫెట్‌తో కలిసి భోజనం చేయమని మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌ను వాళ్ల తండ్రి తరుచుగా చెప్పేవాడు. కానీ బిల్‌గేట్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. బఫెట్ స్టాక్‌మార్కెట్‌లో భారీ మొత్తంలో ఇనె్వస్ట్ చేస్తాడు. ప్రపంచంలోని సంపన్నుల్లో ఆయనొకరు అంతకు మించి ఆసక్తి కలిగించే అంశం ఏముంటుంది అన్నట్టు ఆసక్తి చూపలేదు. చివరకు తండ్రి అనేకసార్లు అడగడంతో ఒకసారి కలిశారు.
అప్పటి వరకు బఫెట్ గురించి తాను అనుకుంటున్నది వేరు, ఇప్పుడు తాను స్వయంగా చూస్తున్నది వేరు అనుకున్నారు అతనితో మాట్లాడిన తరువాత.
కేవలం డబ్బు సంపాదనే నా లక్ష్యం కాదు. డబ్బు సంపాదన ఒక ఆట ఆ ఆటను ఆడేందుకు నేను ఇష్టపడతాను అని బఫెట్ చెప్పిన మాటలు బిల్‌గేట్స్‌పై బాగా ప్రభావం చూపాయి. కేవలం డబ్బునే ప్రేమిస్తే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని అన్నారట! ఒక మధ్యతరగతి కుటుంబంలానే బఫెట్ జీవిస్తారు. డబ్బు సంపాదన ఆట తనకు అత్యంత ఇష్టమైన ఆట అని చెప్పారు. నిజంగా ఆదో ఆటగా భావించారు కాబట్టి ఆ ఆటలో బఫెట్ రోజు రోజుకు ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ప్రపంచంలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనుకున్నది సాధించవచ్చు అనే పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఒక మిలియన్ డాలర్లు సంపాదించాలి అని లక్ష్యంగా పెట్టుకున్న బఫెట్ సంపాదన ఇప్పుడు 85బిలియన్ డాలర్లు. తన సంపాదనలో 99శాతం తన తదనంతరం బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు చెందుతుందని వీలునామా రాశారు. పిల్లలకు సంపాదించడం నేర్పించాలి, జీవించడం నేర్పించాలి. బోలెడు సంపాదించి ఇవ్వడం కాదు అంటారాయన. అనడమే కాదు వీలునామా కూడా అలానే రాశారు.
వెయ్యి డాలర్లు సంపాదించేందుకు వెయ్యి మార్గాలు అంటూ చిన్నప్పుడు చదివిన ఒక పుస్తకం బఫెట్‌కు బాగా నచ్చింది. ఆ వెయ్యి మార్గాల్లో ఒకటి వేయింగ్ మిషన్ ఏర్పాటు చేయడం. అది నచ్చి చిన్నప్పుడే బఫెట్ ఒక వేయింగ్ మిషన్ కొని షాపులో పెట్టాడు. అక్కడి నుంచి సంపాదన మొదలైంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచిస్తే సంపాదన కోసం మనకు మార్గాలు దొరకవా? సంకల్పబలం ఉండాలి.

-బి.మురళి