ధనం మూలం

ఈ కాలపు బానిసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినోద్‌కు తన జీవితం మీద విరక్తి కలుగుతోంది. బాస్ రోజురోజుకూ వేధిస్తుండడంతో ఉద్యోగం మానాలనిపిస్తోంది కానీ మానలేని పరిస్థితి. ఛీ..్ఛ.. ఇదేం జీవితం అని తనపై తానే జాలిపడుతున్నాడు. ఈ క్షణమే ఉద్యోగం వదిలిపెట్టాలని ఉంది కానీ వదల లేని పరిస్థితి. మన కన్నా బానిసలకు ఎంతో కొంత ఎక్కువ స్వేచ్ఛ ఉండేట్టుగా ఉంది అని మిత్రుల వద్ద వాపోయాడు. వినోద్ లాంటి వారు మనకు ప్రతిచోట కనిపిస్తారు. ప్రతి చోట కాదు. చాలా ఎక్కువ మంది ఎప్పుడో ఒకప్పుడు ఇలా ఆవేదన చెందుతున్న వాళ్లే.
బానిసత్వంపై చట్టబద్ధంగా నిషేధం ఉంది. కానీ మనకు తెలియకుండానే మనం బానిసత్వంలో కూరుకుపోతున్నాం. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తం గా అనేక దేశాల్లో బానిసత్వం ఉండేది. పశువుల సంతలు చూసే ఉంటారు. ఒకప్పుడు ఇదే విధంగా మనుషులను కూడా సంతల్లో అమ్మేవారు. బానిసలను కొనుక్కున్న వారు వారితో తమ ఇష్టం వచ్చిన పని చేయించుకునే వారు. క్రమంగా బానిసత్వాన్ని నిషేధించారు. కానీ మనం ఇప్పుడు మేం బానిసలుగా ఉంటాం, మా జీవితాలను మీకు తాకట్టుపెడతాం అని మనకు మనమే ఆహ్వానిస్తున్నాం. పాత కాలంలో మాదిరిగా బానిసత్వం కృరంగా ఉండక పోవచ్చు, కానీ మానసికంగా అంత కన్నా బయంకరంగా ఉంటుంది. నాటి బానిసత్వానికి నేటి బానిసత్వానికి ఒకటే తేడా! అప్పుడు బానిసలకు ఇష్టం ఉన్నా, లేకున్నా, అరిచి గీపెట్టినా వదలకుండా బానిసలను వస్తువుల్లా అమ్మేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికి వారు తమ ఇష్టంతోనే బానిసలుగా మారడానికి ముందుకు వస్తారు.
కొత్త బానిసత్వానికి కారణం అప్పు. ఔను నిజం. మనకు వింతగా ఆనిపించవచ్చు. ఒప్పుకోవడానికి మనసు అంగీకరించక పోవచ్చు. కానీ అప్పు మనుషులను బానిసులుగా మారుస్తోంది.
నెల జీతం ఇంత అని గొప్పగా చెప్పుకోవడానికే తప్ప నిజంగా బ్యాంకు ఖాతాలో మిగిలేదేమీ ఉండదు. నెల నెల ఈఐఎంలు చెల్లించిన తరువాత మిగిలేదేమీ ఉండదు. వడ్డీ లేని అప్పు అనో, క్రెడిట్ కార్డు అనో ఏదో ఒక పేరుతో అప్పులు ఊబిలోకి లాగి ఉద్యోగులను కోలుకోలేకుండా చేసి జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
భారతీయ రైతులు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో మరణిస్తున్నారనే మాట గతంలో బాగా వినిపించేది. ఆర్థిక వ్యవహారాల గురించి సరైన అవగాహన లేకుంటే రైతులే కాదు ఉద్యోగులు సైతం ఇదే విధంగా అప్పుల్లో మునిగిపోతారు.
చాలా కుటుంబాల్లో పిల్లలకు ఆసలు ఆర్థిక వ్యవహార గురించే చెప్పరు. ఇక అప్పుల గురించి చెప్పే అవకాశమే లేదు. అప్పుల్లో మునిగిపోతే కలిగే ప్రమాదం గురించి పిల్లలకు చెప్పాలి. అప్పులు అంటే అన్నీ ప్రమాదకరమైనవి అని కాదు. అప్పు చేయవచ్చు తప్పు లేదు. ఐతే ఆ అప్పు ఎంత శాతం వడ్డీకి తీసుకుంటున్నాం, దేని కోసం తీసుకుంటున్నాం అనేది ముఖ్యం.
ఉన్నత చదువుల కోసం చేసే అప్పు, గృహ రుణం వంటి వాటిని మినహాయిస్తే మిగిలిన అప్పులన్నీ ప్రమాదంలో పడేస్తాయి. గృహ రుణం వల్ల ఆదాయం పన్ను ఆదాకు ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బ్యాంకు వడ్డీ రేటును మించి ఇంటి ధరలు పెరుగుతున్నాయి. దీని వల్ల ఇంటి కోసం తీసుకునే రుణం ప్రమాదకరమైమీ కాదు. విద్యారుణాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి కూడా అంత ప్రమాదకరమైనవేమీ కాదు. ఇక క్రెడిట్ కార్డుపై అప్పులు అన్నింటి కన్నా అత్యంత ప్రమాదకరమైన అప్పులు. గతంలో క్రెడిట్ కార్డు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.
విలువ పెరిగే ఆస్తిని కొనుగోలు చేసేందుకు అప్పు చేస్తున్నామా? విలువ తగ్గే వస్తువులను కొనేందుకు అప్పు చేస్తున్నామా? అనే అవగాహన అవసరం. అప్పు అంటే రేపు సంపాదించే డబ్బును చెల్లించి ఇప్పుడే కొనుగోలు చేయడం. రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం రేపటి సంపాదనను చెల్లిస్తామని చెప్పి ఇప్పుడే కావలసిన వస్తువులు కొంటున్నాం.
ఉదాహరణకు పది లక్షల అప్పు చేసి కారు కొంటే రెండు మూడేళ్ల తరువాత పరిస్థితులు తలక్రిందుల అయ్యాయి అనుకుందాం. కారు అమ్మితే సగం ధర వస్తే గొప్పే . నెల నెల చెల్లించిన ఈఐఎంల తరువాత కారు అమ్మేసినా అప్పు తీరదు. అలానే ఇంట్లో ఖరీదైన టీవిలు, గృహవోపకరణాల వంటి వాటిని అప్పు చేసి కొనడం మంచిది కాదు. కొందరు ఏకంగా విదేశీ పర్యాటనకు, దేశంలో వివిధ ప్రాంతాల్లో తిరగేందుకు అప్పు చేస్తారు. దీని కోసం బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. జీవితం ఇప్పుడే అనుభవించండి అంటూ వీరు అప్పు కోసం చేసే ప్రకటనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. తప్పు లేదు అది వారి వ్యాపారం. అప్పులు ఇవ్వడమే వారి వ్యాపారం. అప్పులు ఇస్తేనే బ్యాంకుల కార్యకలాపాలు నడుస్తాయి. లాభాలు వస్తాయి. కానీ అప్పు చేయడం మనకు అవసరమా? అని ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఒకప్పుడు అప్పును తప్పుగా భావించే వారు కానీ ఈ కాలంలో కొందరు అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు అప్పు చేయడం గొప్పగా భావిస్తున్నారు.
నిండా అప్పుల్లో మునిగిపోయినప్పుడు మానసిక ప్రశాంతత ఉండదు. జీవితంలో ఏ నిర్ణయం తీసుకోలేరు. చేస్తున్న ఉద్యోగం వదిలి మంచి అవకాశం కోసం చూడాలి అనుకున్నా అప్పులు ఆ సాహసం చేయనివ్వవు. ఈఐఎంలు కట్టేందుకే జీవితం పరిమితం అవుతుంది. ఖర్చు చేసేప్పుడే కాదు అప్పు చేసేప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ అప్పు దేని కోసం, అప్పు అవసరమా? అని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేక పోతే బానిసత్వాన్ని మనమే చేజేతులా ఆహ్వానించినట్టు అవుతుంది.

-బి.మురళి