ధనం మూలం
ఉద్యోగమా.. వ్యాపారమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రతి ఒక్కరూ సంపన్నులు కావాలని కోరుకుంటారు. ప్రశాంతమైన జీవితం, ఆర్థిక భద్రత అందరూ కొరుకుంటారు. దీనికి ఉద్యోగం బెటరా? వ్యాపారమా? అంటే మనలో ఎక్కువ మంది ఉద్యోగమే బెటర్ అంటారు. వ్యాపారం అంటే ఎన్నో సమస్యలు. ఎంతో రిస్క్. కానీ ఉద్యోగం అయితే నెల నెలా జీతం వస్తుంది. ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటారు. చిన్నప్పటి నుంచే మనలో ఇలాంటి ఆలోచనలు ఏర్పడతాయి. డబ్బు, చదువు, ఉద్యోగం, జీవితంపై భద్రత వంటి అంశాలపై చిన్నప్పుడే మనలో కొన్ని అభిప్రాయాలు బలంగా ఏర్పడతాయి. తల్లిదండ్రులు, బంధువులు, ఇంట్లో వాళ్లు చెప్పే మాటల వల్ల ఇలాంటి అభిప్రాయాలు బలంగా ఏర్పడతాయి. చిన్నప్పుడే బలంగా ఏర్పడిన ఈ అభిప్రాయాలు అంత త్వరగా మారవు. ఎవరెన్ని చెప్పినా ఈ అభిప్రాయాలను మార్చుకోవడం అంత ఈజీ కాదు.
దేశంలో ఏ మూలకు వెళ్లినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడ ఉభయ రాష్ట్రాలకు చెందిన తెలుగువారు కనిపిస్తారు. అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో మన వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు చేయడానికి మన తెలుగు వారు సిద్ధంగా ఉంటారు. అదే గుజరాత్ విషయానికి వస్తే దేశంలో ఏ ప్రాంతంలోనైనా వాళ్లు వ్యాపారాల్లో కనిపిస్తారు. హైదరాబాద్ శివార్లలో ఏ కాలనీలో చూసినా మర్వాడి, గుజరాతీ వ్యాపారులు కనిపిస్తారు. చివరకు అమెరికాలో సైతం గుజరాతీలు ముందున్నారు. అమెరికాలో ఐటి ఉద్యోగాల్లో మన వాళ్లు దూసుకువెళుతుంటే, వ్యాపారాల్లో గుజరాతీలు ముందున్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. ఉద్యోగం కోసం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లేందుకు మనం సిద్ధంగా ఉంటే, ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపార అవకాశాలు వెతుక్కోవడానికి గుజరాతీలు ముందున్నారు.
ఉద్యోగం చేయాలా? వ్యాపారం చేయాలా? అనేది ఎవరి అభిరుచి మేరకు వారు నిర్ణయం తీసుకోవచ్చు. ఒకరికి వ్యాపారం చేసే లక్షణాలు బలంగా ఉంటే మరొకరికి ఉద్యోగం చేయడానికి అవసరమైన నైపుణ్యం ఉండవచ్చు.
ప్రయత్నించి విఫలం అయినా పరవాలేదు కానీ అసలు ప్రయత్నించక పోవడం సరైన నిర్ణయం కాదు.
నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివి, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారు. దాని కన్నా ఏదైనా వ్యాపారం చేసుకుందాం. స్వయం ఉపాధి పొందుదాం అనే ఆలోచన చేయడం లేదు.
ఉద్యోగంలో అంత సౌలభ్యం ఉందా? వ్యాపారం అనేది మనం భయపడేంత రిస్క్‌తో కూడుకున్నదా?
సమస్యలు అనేవి రెండింటిలోనూ ఉంటాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మించిన టర్నోవర్‌తో ఉన్న నోకియా కంపెనీ చివరకు అడ్రెస్ లేకుండా పోయింది. మరి అందులో పని చేసే ఉద్యోగుల పరిస్థితి. గతంలో ఒక వెలుగు వెలిగిన ఎన్నో కంపెనీలు మారిన టెక్నాలజీతో తెరమరుగయ్యాయి. హమారా బజాజ్ అంటూ వచ్చే ప్రకటన గుర్తుందా? 90వ దశకంలో బజాజ్ స్కూటర్ కావాలంటే దాదాపు ఏడెనిమిదేళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చేది. బైక్‌లు రాజ్యమేలడంతో స్కూటర్ కొనేవారు లేక తయారీ నిలిపివేశారు. ఇవన్నీ ప్రైవేటు సంస్థలు. ఇక బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ ఉండడం అంటే ఒకప్పుడు సోషల్ స్టేటస్. మధ్యతరగతి వారింట్లో కూడా ఫోన్ కనిపించేది కాదు. దాదాపు పదేళ్లపాటు నిరీక్షిస్తే కానీ ఫోన్ కనెక్షన్ వచ్చేది కాదు. ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం పేరు నమోదు చేయించుకుంటే పదేళ్లకు ఇంట్లో ఫోన్ మోగేది. దాదాపు 90వ దశకం చివరి వరకు ఇదే పరిస్థితి. అలాంటి బిఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు తీసుకోండి అంటూ రోడ్డు మీద ఉద్యోగులు ర్యాలీ తీస్తుంటే చూసేందుకే బాధేసింది. ల్యాండ్ లైన్ ఫోన్ షిఫ్టింగ్ అనేది ఉద్యోగుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం అంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. అలాంటి బిఎస్‌ఎన్‌లో కూడా ఇప్పుడు ఉద్యోగాలు అంత భరోసాగా ఏమీ లేదు. టెక్నాలజీ పెరగడం, ప్రైవేటు సంస్థలు దూసుకు వెళ్లడంతో సంస్థకు ఉద్యోగులు భారంగా మారారు. సంస్థ ఉంటుందా? ఉండదా? అనే సందేహం. ప్రైవేటు రంగంలోనే కాదు ఈ రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం ఉద్యోగం గ్యారంటీ లేదు.
ఐటి కంపెనీలో ఉద్యోగం అంటే రాజాలాంటి బతుకు అనుకుంటారు. పీతకష్టాలు పీతవి అన్నట్టు వారికుండే కష్టాలు వారికున్నాయి. ఏ ఐటి కంపెనీలో ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదు. వ్యాపారంలో రిస్క్ ఉన్నట్టుగానే ఈ రోజుల్లో ఉద్యోగాల్లో సైతం రిస్క్ ఉంది. వ్యాపారంలో రిస్క్ ఉన్నా ఎదిగే అవకాశం ఉంటుంది. సొంత పని కాబట్టి శ్రద్ధగా చేస్తే శక్తిసామర్థ్యాల మేరకు ఎదిగే అవకాశం ఉంటుంది.
ఐతే హాయిగా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగం చేసుకునే వారిని హఠాత్తుగా తీసుకు వచ్చి వ్యాపారంలో కూర్చోబెడితే రెంటికీ కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది.
జీవించేందుకు ఉద్యోగంలో చేరినా ఆర్థికంగా కొంచెం మెరుగైన స్థితికి చేరుకున్న తరువాత వ్యాపార రంగంలో స్థిరపడి ఎదిగిన వారు ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఆ రంగం గురించి తెలుసుకోకుండా ప్రవేశించవద్దు. ముందు ఆ రంగం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అవకాశం ఉంటే ఏ వ్యాపార రంగంలోకి ప్రవేశించాలి అనుకుంటున్నారో ఆ రంగంలో తొలుత ఉద్యోగంలో చేరడం వల్ల మంచి అనుభవం వస్తుంది. మెళకువలు తెలుస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన వారు తొలుత చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ట్యూషన్లు చెప్పడం ద్వారా అనుభవం గడించిన వారే. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారంలో ఎక్కడికో వెళ్లిన వారు ఒకప్పుడు బట్టల దుకాణాల్లో సాధారణ ఉద్యోగులే.
ఉద్యోగం, వ్యాపారం ఎవరికి ఏది ఆసక్తి ఉంటే ఆ రంగంలోకి వెళ్లవచ్చు. ఐతే ఉద్యోగం అంటే భద్రత ఉంటుంది, వ్యాపారం ఐతే భద్రత ఉండదు అనే భావన తప్పు. చిన్నప్పటి నుంచి మనలో ఏర్పడిన ఈ భావన మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. రెండింటిలోనూ సమస్యలున్నాయి, రెండింటిలోనూ ఎదుగుదలకు అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ఓర్పు, ఆశావాహ దృక్పథం, శ్రమించే తత్వం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉంటే వ్యాపారానికే మొగ్గు చూపవచ్చు. ఎంత చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టినా ఎంత ఉన్నత స్థాయికైనా వెళ్లే అవకాశం వ్యాపార రంగంలో ఉంటుంది.