డైలీ సీరియల్

విలువల లోగిలి (కొత్త సీరియల్ ప్రారంభం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపురం నుంచీ గుంటూరు వెళ్ళే ప్యాసింజరు మరికొద్ది నిముషాలలో బయలుదేరటానికి సిద్ధంగా ఉంది అన్న అనౌన్స్‌మెంట్ వినిపించేటప్పటికి స్టేషన్‌కి ఆమడదూరంలో ఉంది విశ్వప్రియ.
ఎంత పరుగెత్తినా ఆమె వచ్చేటప్పటికి రైలు వెళ్లిపోయింది. కళ్ళముందే కనుమరుగవుతున్నదాన్ని చూస్తుంటే తన అదృష్టమే అలా వెళ్లిపోతోందేమో అనిపించింది.
రెండు క్షణాల ముందు వచ్చినా చివరి పెట్టెలో ‘గార్డ్’ని బ్రతిమాలో, బామాలో రైలును ఆపగలిగేదేమో! అదే ఏ మంత్రో వస్తున్నారంటే ఎంతసేపయినా రైలును ఆపేస్తారు. కానీ తనలాంటి వాళ్ళకోసం ఎవరూ అలాంటి పనిచేయరు. కనీసం ప్రయత్నించరు కూడా. అయినా ఆలస్యంగా రావడం తన తప్పేగా!
‘ఇప్పటికైనా గుర్తించావు’ అంతరంగం అననే అంది. నీరసం ఆమె అణువణువునా ఆవహించింది. అప్పటిదాకా పెళ్లికూతురిలా కళకళలాడిన స్టేషను అత్తవారింటికి పంపేసిన అమ్మాయి ఇంటిలా తయారైంది. అదేమీ గమనించే స్థితిలో లేదామె. ఏం చెయ్యాలి? తన దగ్గర వున్న కాస్త డబ్బుతో ఎలా వెళ్లాలి? బస్సు టిక్కెట్టుకి సరిపడా డబ్బు కూడా లేదు. ఆలోచిస్తూనే స్టేషన్ బయటకు వచ్చింది.
అప్పుడే ‘లూనా’ స్టార్ట్ చేస్తున్న ఒకతను కనిపించాడు. రైతులా ఉన్నాడు. ముఖాన బొట్టు ఉంది. మంచివాడేనేమో!
‘ఎటువైపు వెళ్తున్నారు?’ అని అడిగింది అప్రయత్నంగానే.
‘విజయవాడ’ అన్నాడను ఆమెనే నిశితంగా చూస్తూ.
‘‘అర్జంట్‌గా నేనూ అక్కడికే వెళ్లాలి. కాస్త మీ బండిమీద నన్నూ తీసుకువెళ్ళగలరా?’’ ఏమంటాడో అని ఆ క్షణంలో ఆమె పడ్డ ఆవేదన ముగియకముందే.
‘‘ఎక్కండి, తీసుకెళ్తాను’’ అన్నాడు.
‘‘అమ్మయ్యా!’’’ అనుకుని మనసులో 'థాంక్సండీ’ అంటూ అతని వెనక బండిమీద కూర్చుంది ఆమె. ఇక ఆలోచనలు తోడుగా ప్రయాణించడం ప్రారంభించాయి.
గుడివాడ స్టేషన్‌లో ఘంటసాలగారికి ‘అక్కినేని’ కనిపించకుండా ఉంటే అతనికి ఇంత కీర్తిప్రతిష్ఠలు వచ్చేవి కావేమో అన్న మాటలు పదే పదే తనను వెన్నాడాయి.
తనకూ అలా ఎవరన్నా చేయూత ఇస్తారా? అతను ఇతనేనా? ఏమో?
జీవితం ఓ తెల్లని కాగితం. దానిపైన పువ్వులే పడతాయో, రాళ్ళే పడతాయో! కష్టమో, సుఖమో ముందుగా తెలియదుగా. రోజు గడిచాకగానీ ఏం జరిగిందో అందులో రాసుకోలేం. వర్తమానంలో ఊహించటం తప్ప.
ఒక క్షణం క్రితం తను ఊహించిందంతా ఇలా తన ప్రయాణం కొనసాగుతుందని. ఓటమిని తోడుగా ఇంటికి తీసుకువెళ్తున్నాననుకుంది. తెలియని వ్యక్తులను ‘లిఫ్ట్’ అడగద్దని, ఎక్కవద్దని అమ్మ పదే పదే చెబుతూ ఉంటుంది. ఈ రోజు అదే తనకు తప్పని పరిస్థితి అయింది. సాహసం చెయ్యకపోతే ఇక్కడే ఆగిపోయేది.
‘‘ఆగిపోతే ఏం, ఇంకోటి దొరకదా? రోజులు ఎలా ఉన్నాయో తెలిసి కూడా ఓ తెలియని వ్యక్తితో బయలుదేరటమా? తప్పు చేస్తున్నావు.. దిగిపో. ఇంకా ఊరు దాటలేదు’’ అంతరంగం పదే పదే హెచ్చరిస్తోంది.
‘‘ఏమీ అవదు. పదిమంది తిరిగే చోట అతనితో ప్రయాణిస్తున్నావు. ఏవౌతుంది? ఏమీ అవదులే. కొన్ని సమయాలలో ధైర్యం చెయ్యాలి. ఇంట్లో ఏదో ఒకటి చెప్పవచ్చులే’’ మనసు రెండు మూడు సార్లు నొక్కి చెప్పడంతో అప్పటిదాకా భయం భయంగా ఉన్న ప్రాణం కాస్త కుదుటపడింది.
ఇలా ఇతనితో వెళ్లటం ఈపాటికే ఎవరన్నా చూసేసి అమ్మకు చెబితే నేను వెళ్లి వచ్చేవరకూ భయపడుతూనే ఉంటుంది. దేముడా! నువ్వే నన్ను కాపాడాలి. నిన్నే నమ్ముకున్నాను అని మనసులో ఆయనకు ఓ అప్లికేషన్ పెట్టేసింది. ఆది ఆమెకు కొండంత ధైర్యానిస్తుంది.
అలా అనుకున్నక్షణం ప్రశాంతంగా ఉన్నా మరుక్షణంలో రకరకాల ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి.
రోజులు అసలే బాగోలేవు. ఎక్కడ చూసినా అమ్మాయిలపై అత్యాచారాలు. రైలులో తండ్రి తన కూతుర్ని, మనవరాళ్ళను ఎక్కిస్తే వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలియదు. ఇపుడు తనకేమైనా అయితే కూడా అంతేగా. అనవసరంగా ఎక్కానేమో. ఇది కాకపోతే ఇంకోటి. ఎందుకిలా చేసాను?
అసహనంగా అటూ ఇటూ కదిలింది.
సమయానికి వెళ్లలేనని ఆదుర్దా పడుతున్నాననుకున్నాడేమో- ‘స్పీడుగా వెళుతున్నాను కదండీ. వెళ్లిపోతాం. కంగారు పడకండి’ అన్నాడు.
మర్యాదస్తుడిలాగే ఉన్నాడు అనుకుంది మనసులో.
‘‘మీరేం చేస్తుంటారు?’’ అడిగింది ఖాళీగా కూర్చోలేక.
‘‘ముఠామేస్ర్తిని’’’
‘‘అలాగా!’’ అంది సాలోచనగా.
పనిని బట్టి సంస్కారం ఉండదుగా అని మనసుకు సర్ది చెప్పుకుంటూ.
ముందునుంచే ఎందుకు తప్పుగా ఆలోచించుకోవటం. అసలు అతను తీసికెళ్ళనంటే తన ప్రయాణం ఇక్కడే ఆగిపోయేదిగా.
‘‘ఆగిపోతే ఆగిపోయేది కొంపలంటుకుపోవటం లేదుగా. దానికోసం అపాయాన్ని కొని
తెచ్చుకుంటావా? ఇప్పుడేమన్నా జరగరానిది జరిగితే!’’ అంతరంగం మాత్రం ఆమెను పదే పదే హెచ్చరిస్తూనే వుంది.
‘‘ఇప్పటికైనా మంచిపోయింది లేదు. దిగి వెనక్కి వెళ్లిపో’’ అంటూ సతాయిస్తూనే వుంది.
వాటిని ఆలకిస్తూనే ప్రక్కకు తోసేస్తోంది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206