డైలీ సీరియల్
జగదేకసుందరి క్లియోపాత్రా--88
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్లియోపాత్రాను ప్రసన్నం చేసుకోనిదే, తన రుూ జన్మకు ఇదే అంతం!
ఆమె తనను చంపుతానని బెదిరించింది. ఒకవేళ తిరిగి ఆలోచించి, తాను బతికి ఉంటే, మనసు మార్చుకొని రోమన్‌లతో కలిసిపోతాడనే భయంకొద్దీ, తనను నిజంగానే చంపేందుకు ప్రయత్నిస్తుందేమో? ఆమె ఎంత సాహసో, ఎంత క్రూరురాలో తనకు అనుభవపూర్వకంగా తెలుసు. హత్య చేయటమనేది చాలా స్వల్ప విషయమామెకు! అనుమానితుల్ని అనేకమందిని తెల్లవారేప్పటికి ఖూనీ చేయించటమేగాక, వారి తాలూకు అస్థికలు కూడా దొరక్కుండా చేయగల సమర్థురాలు! తాను ఎరిగినంతలో తన రెండవ భర్త టాలమీగాణ్ణి ఆమె ఏం చేసిందో ఎవ్వరికీ తెలియదు. బహుశా ఆ పంచభూతాలు కూడా ఎరుగవు!
ఈ కారణంగా ఆమెవల్ల తాను మృత్యువాత పడకుండా తనను రక్షించుకోవటం ఒక విషమ సమస్య. ఐతే, ఆమెనే హతమారుస్తే, తాను భయపడనవసరం లేదు. కాని, ఆమె కనిపించని మరుక్షణంలో ఆమె తాలూకు సేనల్ని తిరుగుబాటుచేసి, ఈజిప్టుకు వెళ్తవి. ఇక్కడ గ్రీస్‌లో రోమన్‌లతో యుద్ధం తప్పుతుంది. ఎందుకంటే క్లియోపాత్రా సేనలే తననూ, తన రోమన్ సైన్యాన్నీ నేలమట్టం చేసి జిల్లేళ్ళూ ఉమ్మెత్తలూ నాటి మరీ వెళ్తవి.
ఈ విధంగా క్లియోపాత్రాను చంపటమంటే తనను తాను చంపుకోవటమే గాక, ఆక్టోవియన్‌కు విజయాన్ని చేకూర్చటవౌతుంది. అందుకని, ఎలాగైనా క్లియోపాత్రాను సుముఖురాల్ని చేసుకోవాలి. ఆమె మనను మారేవరకూ మాత్రం ఆమె చావుదెబ్బల్ని తప్పించుకుంటూ తిరగాలని నిర్ణయించుకున్నాడు.
క్లియోపాత్ర డేరానుంచి భోజనానికి పిలుపు వచ్చింది. ప్రతిరోజూ అతను ఆమెతోపాటే భోజనం చేస్తున్నాడు. కాని, ఈనాడా పిలుపు మృత్యుదేవత పిలుపువలెనే తోచింది. భోజనంలో విషం కలిపి పెడుతుందేమోననే భయం అతన్ని కలవరపెట్టింది. ఆ భోజనం ఇక్కడికే పంపమంటే, తను తన గుడారంలో దిక్కులేని చావు చావాలి. లేక అక్కడికి వెళ్తే, అక్కడా మృత్యువు తప్పనిసరౌతుందేమో?
ఏమైనా సరే అక్కడికి వెళ్తేనే కాని, ఆమె ముఖకళ అర్థంకాదు. దాన్ని బట్టే తాను ప్రవర్తించాలి. ముఖ్యంగా ఆకలి దహించుకొనిపోతున్నప్పటికీ, తన ఏమీ ముట్టరాదు. ప్రతి పదార్థమూ, తన కళ్ళెదుట ముందుగా క్లియోపాత్రా రుచి చూస్తేనే కాని, తాను తినరాదు. ఇంతకన్నా తెలివైన ఊహ మరి ఉండదనుకున్నాడు.
తన ముఖంలోని కలవరాన్ని ఇతరులు తెలుసుకోకుండా ఉండేందుకుగాను, బలవంతంగా నవ్వు తెప్పించుకుంటూ బయలుదేరాడు. కాని తనకు ఎదురైన వారందరూ, తననొక వింత మృగంగానో, లేక హాస్యగాడుగానో చూస్తున్నారు.. ఇవన్నీ లెక్క చేస్తే పుణ్యకాలం కాస్తా జారిపోతుంది. తనను తాను సమాధానపరచుకుంటూ అతను భయపడుతూనే క్లియోపాత్రా డేరాలోకి వెళ్లాడు.
భోజనాల బల్ల దగ్గిర క్లియోపాత్రా తన కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉన్నది. తమ మధ్య అసలేమీ జరగనట్లే ఉన్నదామె ముఖకళ! తనను చంపివెయ్యాలన్నంత కోపాన్ని ఇంత త్వరగా దిగమింగటమే కాక, మామూలుకన్నా ప్రశాంతంగానూ, ఉత్సాహంగానూ ఉండగలిగిందంటే ఏంటనీ ఆశ్చర్యపోయాడు. రోజూ వలెనే చిరునవ్వుతో తనను పలకరించి ఆహ్వానించింది.
ఈమెను చూస్తే- జీవితాన్ని అనుభవించటం ఒక కళే ఐతే, ఆ కళారాధనలో ఈమెది అందెవేసిన చేయి అనక తప్పదు. గుండె గల మొగాడు తానే నీరైపొయ్యాడు! కాని, మృదుత్వానికి మారుపేరైన క్లియోపాత్రా హృదయం ఏ లోహంతో చేయబడిందో కాని, అనుభవాలకు అది చలించి చెడదు సరికదా, ఆమె కోరిన విధంగా, మారుతూంటుంది కాబోలు!
ఐతే, ఆమె చిరునవ్వు ఏంటనీకే మరింత భయంకరంగా తోచింది. కనుబొమలు ముడివేసి, అసహ్యంతో తనను చూస్తున్నట్లయితే, ఆమె కోపాన్ని చల్లార్చేందుకు తాను ప్రయత్నించే అవకాశం వుండేది. తనను తాను సంభాళించుకొని, మరికొన్ని అవాంతరాలను ఎదుర్కొనేందుకు తగిన మనోబలంతో సిద్ధంగా ఉన్నానని ఆమె హావభావాలు తెలియచెబుతూన్నట్లే తోచి ఏంటనీ ఆశ్చర్యపడ్డాడు.
ఏంటనీకి చప్పున గుర్తొచ్చింది- ఆమె నవ్వు ముఖం చూస్తూనే తాను విషం కూడా మింగవలసి వుంటుందేమోనని! ఎందుకంటే అనేక సందర్భాలలో ఆమె ఎదుట తనకు మతిపోయింది! పశువుకన్నా హీనంగా ప్రవర్తించాడు. అలాంటి ప్రమాదం జరక్కుండా ప్రాణరక్షణ చేసుకోవాలని అతని మనస్సు పదే పదే అతన్ని హెచ్చరించసాగింది.
అతను మాట్లాడుతాడేమోనని క్లియోపాత్రా ఆశగా చూసింది. కాని, అతను తనలో తానే మాట్లాడుకొంటున్నాడు. క్లియోపాత్రా ముఖంలోకి కనె్నత్తి చూడగల ధైర్యం కూడా లేదు. దొంగచూపులు చూస్తూ, ఆ ముద్దు మొహం వెనుక తన హత్యకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నవేమోనని ఆలోచిస్తున్నాడతను.
క్లియోపాత్రా నిజంగా ఎంత అందమైనదో, ఈనాడే ఆ కొత్తదనాన్ని తాను గ్రహిస్తున్నట్లు తోస్తూన్నదతనికి. అతని బుద్ధి హెచ్చరికలు చేస్తూంటే, అతని మనస్సు తిరిగి ఆమె సౌందర్యానికి లోబడిపొమ్మని ఆజ్ఞాపిస్తోంది.
తలారా స్నానం చేసి తలలో గులాబీలు ముడిచిందామె. తలమీది కిరీటాన్ని ధరించకపోయినా, గులాబీలే కిరీటంవలె కన్పట్టి ఆమెను చూడగానే పరమ మూర్ఖుడు కూడా రాణి అని ఇట్టే గ్రహిస్తాడు.
ఈ అందాల రాశితో తను ఎందుకు పేచీపడినట్లు? ఆమె ధరించిన ఆభరణాల విలువలను కట్టేందుకు ప్రపంచంలోని రత్నాల వ్యాపారుల్లో హేమాహేమీలు ఉండవలసిందే! ధరించిన వ్యక్తికి ఆభరణాలు సౌందర్యాన్నివ్వటం తనకు తెలుసు! కాని, క్లియోపాత్రాను చూస్తే ఆభరణాలకే ఆమె అందం వనె్న పెడుతోందని అర్థవౌతోంది.
తను మళ్లీ పిచ్చిలో పడిపోతున్నాడు! ముందు ప్రాణరక్షణ చేసుకొని, ఆ తరువాత ఎలాగైనా ఆమెతో రాజీపడాలి. ఇది కష్టమైనా తనకు మరి దారి లేదు.
ఇంతలో రకరకాల భోజన పదార్థాలూ బల్లమీదికి వచ్చినవి.
వడ్డనకు వచ్చిన బానిసతో ‘‘ప్రతి పదార్థమూ ముందు రాణికి వడ్డించు. ఆమె తిన్నాక నాకు వడ్డించు!’’ అన్నాడు ఏంటనీ, నిర్మొహమాటంగా.
దీని అర్థమేమిటో ఆమె గ్రహించింది. కాని ఆగ్రహించలేదు. ‘ఇంతేకదా’ అన్నట్లు తనకు లెక్కలేనట్లుగా నవ్వి ఊరుకున్నది.
ప్రతి పదార్థమూ ఆమె ఆలోచించకుండానే తింటున్నది. ఆమె తిన్నాక, ఏంటనీ కూడా ఆమెమీద ఒక కన్నుంచే తింటున్నాడు. తాను ఆమెను అనుమానించినట్టు, తనను ఆమె అనుమానించటం లేదు. వెధవ భయం కొద్దీ తానామెను అవమానపరుస్తున్నానే బాధ కూడా కలిగిందతనికి.
ఎన్ని రకాలుగా తాను చవటని రుజూ చేయాలో, అన్ని విధాలుగానూ క్లియోపాత్రా తను తాను గుర్తించేట్లు చేస్తూ వాజమ్మగా గుర్తించేట్లు చేస్తూ వున్నది. ఆమె అందానికి పరవశుడైపోయాడు. ఆమె అనుగ్రహానికి తబ్బిబ్బయ్యాడు.
- ఇంకాఉంది