డైలీ సీరియల్
జగదేకసుందరి క్లియోపాత్రా--87
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాని అంతకన్నా ముందుగా రుూ ప్రపంచమే మనను దుమ్ము చేస్తుందిగాక! ప్రపంచ చరిత్ర మనిద్దరివల్లా కలుషితం కాకుండా చూసుకుంటుందిగాక!’’ అన్నాడు ఏంటనీ.
క్లియోపాత్రా రత్నాలు పొదిగిన పిడి వున్న బాకు తీసింది. సూర్యరశ్మిలో రత్నాలవలెనే,, బాకు కూడా తళతళమెరుస్తోంది. కుడిచేత్తో దాన్ని ఏంటనీ రొమ్ములకు గురిగా ఎత్తిపెట్టి, ఎడమ చేతితో బైటికివెళ్ళే ద్వారాన్ని చూపుతూ- ‘‘అదీ దారి ఏంటనీ! నేను రేపు వెళ్లిపోతున్నాను.. మాట్లాడేందుకు ప్రయత్నించకు. విను- రేపు నేను నా సేనల్తో ఈజిప్టు వెళ్తున్నాను. ఇక్కడ నీ చావు నీవు చావు! వీరునివలె చావు! ఇప్పుడు ఆడదాన్ని అవమానించి ఛస్తే కీర్తి రాదు. ఐతే మనిద్దరం తగులాడి విడిపోయామని ఎవ్వరికీ తెలియనివ్వను. ఉభయులం గౌరవం కాపాడుకుందాం. నాకు ఆరోగ్యం సరిగా లేదనే మిషతో నేను వెళ్తాను. నీకది ఇష్టం కాకుంటే, నేను వెళ్లిన కారణాన్ని నీ ఇష్టానుసారంగా చిత్రించుకో. రోమన్‌వైన నీవంటే నాకిప్పుడొక రోమంతో సమానం- ఇక ఫో!’’ అని గద్దించిందామె.
ఏంటనీలోని మహావీరుడు వౌనం వహించాడు. అతనిలోని విజ్ఞాని తనను చూసి, తాను నవ్వుకున్నాడు. అతనిలోని బతుకుమీది తీపి, అతన్ని తొందరపెట్టింది. ఆత్మగౌరవం మెదలలేదు. క్లియోపాత్రాను చూసి, మృత్యుదేవతేనని భయపడిపొయ్యాడు. తానేం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేకుండా, వెనక్కు తిరిగి చూసే దైర్యం కూడా లేని స్థితిలో తన గుడారానికి పరుగెత్తాడు ఏంటనీ!
అక్కడ తన గుడారంలో ముందు మధువు సేవించాడు. అతనికేమీ తెలియటంలేదు. కాస్సేపటిదాకా తన శక్తుల్ని కూడదీసుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేశాడు. మరికొంతసేపటికి నిద్రపట్టింది.
సూర్యాస్తమయ సమయానికి మెలకువ వచ్చిందతనికి. పీడకలలోంచి బతికి బైటపడినంత సంతోషం కలిగింది. కాని, ఆ కలంతా సత్యమేనని గుర్తుకొచ్చి, చాలా కలవరపడ్డాడు. ఇక ఈ సత్యాన్ని తప్పించుకొని తిరిగేందుకు వీల్లేదు కనుక, జరిగిన సంఘటనల్ని ఏర్చి కూర్చుకుంటూ ఆలోచించసాగాడు. ఇప్పుడు బుర్ర కాస్త ఆలోచించగలుగుతోంది. క్లియోపాత్రా ఇనుప హస్తాలనుంచి తాను విముక్తి పొందగలిగినట్లు తోచింది.
ఇప్పుడు తన గతేమిటి? ఒకటి రెండు రోజుల్లో నౌకాయుద్ధం ఆరంభమవక తప్పదు. కొన్ని వారాలుగా ఉభయపక్షాలవారూ ఒక మైలు దూరంలో సర్వసన్నాహాలు చేసుకున్నారు. యుద్ధం ఏ క్షణానైనా ఆరంభం కావచ్చు. నౌకాయుద్ధంలో తనకు అపజయం తప్పకున్నా, ఆశ్చర్యం లేదు. అందునా క్లియోపాత్రా- తాను, మర్నాడు తన నౌకాబలంతోనూ, సైనికబలంతోనూ తిరిగి వెళ్లిపోతానని హెచ్చరిక చేసింది కూడా! ఇక ఇక్కడ మిగిలేదేమిటి? దివాంతాల వరకూ పరుగెత్తి, ప్రాణాల్ని రక్షించుకునేందుకు భూదేవి కూడా నిరాదరణ చూపుతుంది!
క్లియోపాత్రా! పదేళ్ళకుపైగా ఆమెతో తాను ఏకశరీరుడుగా ప్రవర్తించాడు. ఐతే, ఆమె రుూనాటికీ తనకు పరిపూర్ణంగా అర్థమైందని అనుకోలేడు. ఆమె ఎంత సాహసవంతురాలు! మనుషులకు మత్తుమందు చల్లటంలోనైతేనేమి, అబద్ధాలనే నిజాలుగా అందరిచేతా నమ్మించటంలోనైతేనేమి ఆమెను మించినవారెవరున్నారు? ఈ ప్రపంచమే మాయ అని వేదాంతులు చెప్పినపుడు తాను నమ్మలేదు. కాని క్లియోపాత్రా ఎంత మాయావో తానిప్పుడు తెలుసుకున్నాక, నమ్మక తప్పటమూ లేదు.
ఆమె వెళ్లిపోతే తనేవౌతాడు? ప్రాణంలేని శరీరానికన్నా ఎక్కువ విలువ తనకు ఉండబోదు. ఈ నట్టనడి సముద్రంలో తాను ఏం చేయాలి? తాను గొప్ప సేనాని కనుక, తన పతాకం కింద పోరాడాలనే ఉత్సాహంతో సైనికుల రాలేదు. మేరు పర్వతం లాంటి క్లియోపాత్రా వేతనాలు సక్రమంగా ముట్టజెపుతోందనే ఆశకొద్దీ వారు పోరాటానికి సిద్ధపడుచున్నారు. అలాటి మేరుపర్వతమే ఈజిప్టువైపు కదులుతే, ఇక ఇక్కడ ఒక పురుగన్నా ఉండదు. తానొక్కడూ గాలిలో కత్తియుద్ధం చేయాలి! లేదా, తన ఒక్కడి రక్తంతోనూ రుూ భూదేవి దాహం తీరాలి! తానెంత ఒంటరిగాడో, గడ్డిపోచంత విలువ కూడా లేకుండా ఎలా తయరయ్యాడో అతను గ్రహించుకున్నాడు.
ముఖ్యంగా ఈ సమయంలో తనకూ, క్లియోపాత్రాకు మనస్ఫర్థలొచ్చి తాము విడిపోయినారని తెలిస్తే శత్రువుకు తనను ఓడించటం చాలా తేలికవుతుంది. ఐతే, తాను కలత చెంది మనఃస్థితిలో క్లియోపాత్రాను అవమానించే విధంగా మాట్లాడాడు! వొళ్ళు తెలియని కోపంలో అదంతా జరిగిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తాను వెళ్లి ఆమె కాళ్ళా వేళ్ళాపడితే ప్రయోజనం ఉండొచ్చు... పరిస్థితులు తనను భూమిమీద పడేస్తే, తనకు తానుగా అథోలోకాల్లోకి దిగజారాడు!
క్లియోపాత్రాలాంటి స్ర్తితో స్నేహం నాగుబాముతో చెర్లాటం లాంటిదని తాను ముందుగానే గ్రహించి ఉండవలసింది. పాము శరీరంలోని విషం దానే్నమీ చేయదు. కాని, ఇతరులకు ఎంతో ప్రమాదంగా పరిణమిస్తుంది. తాను కూడా ఎంతో తెలివిగా, అసలేమీ జరగనట్లే ప్రవర్తించి ఉంటే, ఇంత దూరం వచ్చేది కాదు.
ఆమెను కష్టపెట్టటంవల్ల తనకు అపకారమే జరిగింది కాని, ఉపకారమేం ఊడిపడింది? ఇదివరకన్నా హీన స్థితిలో ఆమెను ఆశ్రయించవలసిన దుర్గతి పట్టింది. నిజానికి కష్టమో, సుఖమో, జయమో, అపజయమో తనతోపాటు పాలు పంచుకొని, తనకెంతో సానుభూతి చూపగలిగే స్థితిలో వున్న క్లియోపాత్రా విరోధం తెచ్చుకుని ఇదివరకు ఆక్టోవియన్ ఒకడే శత్రువేతే, ఇప్పుడీమెను కూడా శత్రువుగా చేసుకున్నాడు. ఈ విధంగా తనకు అటు ప్రాచ్య దేశాలలోనూ, ఇటు పశ్చిమ దేశాల్లోనూ స్థానమే లేకుండా ఉభయభ్రష్టత్వాన్ని కోరితెచ్చుకున్నట్లయింది.
చివరకు ఆమెను ప్రాధేయపడి, క్షమించమంటే తప్ప, తనకు ఆశలే వుండవు. ఈ రభస వేరెవ్వరికీ తెలియదు కనుక, ఎంత రహస్యంగా చీలికలు ఏర్పడినవో, అంత రహస్యంగా తన స్నేహాన్నీ, ప్రేమనూ పునరుద్ధరించుకోవటం జరుగుతుంది. ముందు ఇప్పటికిప్పుడే వచ్చిపడే ప్రమాదాన్ని దాటవచ్చు. అయితే, ఆమెను తిరిగి తన ప్రియురాలుగా చేసుకోవటం అంత తేలిగ్గా కనిపించటంలేదు.
తానేదో వెధవ ఉద్రేకంతో ఆమెను అనరాని మాటలని నిష్కారణంగా బాధపెట్టాడనిపిస్తోందిప్పుడు. తనమీదనే ఆశలన్నీ మోపుకున్న క్లియోపాత్రా, తనను హత్య చేసేటంత దూరం వెళ్లిందంటే తానామెను ఎంత దూరందాకా తరిమి, ఆమె ఓర్పును హరించి ఉంటాడో అర్థవౌతోంది. ఆమెకూడా తనను నాలుగు చీవాట్లతోనూ కడిగింది. ఇప్పు రోషపడి లాభం లేదు కాని, మరొక సమయంలో అయితే ఆత్మహత్య చేసుకొనేవాడే ఆమె మాటల్లో- అవి ఎంత కఠినంగా తోచినా- సత్యం లేకపోలేదు. అందుకనే ఆమె తన దారిన పోతానంటే ఏకాకిగా బతికేందుకు దిగులు పడిపోతున్నాడు!
అయినదేదో ఐంది. అవబొయ్యేదాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి. తాను చేసిన పొరపాట్లను దిద్దుకునేందుకు కాలచక్రం వెనక్కు తిరగదు కదా! పోతే, ఈ కాలచక్రం ముందుకు తిరగటంలో, దాని ఇనుప పళ్ళమధ్య తాను పడకుండా కాపాడుకోవాలి.
- ఇంకాఉంది