డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటనీ ముఖం ఈ ఆలోచనలతో జేవురించింది.
తన పాచిక పారలేదని క్లియోపాత్రా వెంటనే గ్రహించింది.
‘రాణీ! నేను దీనికి ఒప్పుకోను. చివరకు ఆత్మహత్యన్నా చేసుకుంటానేమో కానీ, అక్టోవియాకు విడాకులివ్వలేను. ఆమె స్ర్తిజాతికే ఆదర్శం. ఆమెకు విడాకులిస్తే నా అంత కర్కోటకుడు, నీచుడు మరి ఉండడని రోమన్‌లందరూ అనుకొంటారు. ఎవరో దేనికి - నన్ను నేనే ఆ మాటలనుకొని, ఆ అవమానాన్ని భరించవలసి ఉంటుంది. ఇది ఆత్మద్రోహం చేసుకున్నట్లు. నాకు అక్టోవియస్ బద్ధ విరోధే అవుగాక! కానీ అక్టోవియా ఏ నేరమూ చేయని అసమర్థురాలు. అమాయకపు జీవి. ఆమె గొంతు కొయ్యలేను. నేనీమాటల్ని సహించను. నాకేమీ చెప్పవద్దు. అని ఏంటనీ క్లియోపాత్రా ఏం చెప్పబోతోందో వినేందుక్కూడా నిరాకరించి, చకచకా వెళ్లి పొయ్యాడు.
చివరిదాకా లాగిన తాడు తెగిపోయినందుకు క్లియోపాత్రా చాలా పశ్చాత్తాపపడింది. ఈ చివరి అస్త్రాన్ని సకాలంలో ప్రయోగించాననుకున్నదామె. మరొక సమయమంటూ రాకపోతుందా? అని కూడా సమాధానపడింది.
ఇలాంటి ఆలోచనలతోనే తనను తాను ఉద్రిక్తపరచుకుని ఆమె వేగిపోసాగింది. వేరొకచోట ఏంటనీ కూడా పాపిష్ఠి ప్రపంచాన్ని కాస్సేపన్నా మరిచిపోదామనే సద్దుదేశంతో మధుసేవలో నిమగ్నుడయ్యాడు. కొన్నాళ్లు వరకు క్లియోపాత్రా ను కలుసుకోకుండా తప్పించుకుని తిరుగుతే తప్ప తన హృదయంలోని ఈ మంటలకు శాంతి ఉండదని కూడా అనుకొన్నాడు. కానీ, మంటలకు తన భస్మమై పోవలసి ఉంటుందనే ఆలోచన అతనికి రాలేదు.
అక్టోవియా గుర్తుకు రాగానే అతని హృదయంలో మధ్యదరా సముద్రమంత దుఃఖం పొంగి పొర్లింది. అలెగ్జాండ్రియాలోని విలాసయుత జీవితంలో ఆమెను తాత్కాలికంగా మరిచిపొయ్యేందుకు ప్రయత్నించాడు తను. కానీ ఇప్పుడు క్లియోపాతా తీక్షణ వీక్షణాలకు అక్టోవియా మీది మమత, అభిమానం , సానుభూతి ఒక్కుమ్మడిగా తనకు ఊపిరిరాడనివ్వలేదు. తాను ఎంత నీచుడై పొయ్యాడో తలుచుకుని పశ్చాత్తాపడసాగాడు. మనసులో అక్టోవియాను అనేక విధాలుగా తనను క్షమించమని, మన్నించమనీ ప్రాధేయపడ్డాడు. ఒక్కసారి గా శిఖరాగ్రం నుంచిలోయలోకి పడిపోయిన నిర్భాగ్యుని వలె విచార సాగరంలో మునిగిపోయాడు.
కొన్ని వారాలపాటు ఏంటనీ ఏకాంతంలో కాలం గడిపాడు. అతి ముఖ్యమైన పనులుంటే కానీ అతను ఎవరికీ దర్శనమివ్వడంలేదు. చివరకు పూర్వంవలె అలెగ్జాండ్రియాలోని తన పిల్లలతో ఆడుకోవడం కూడా మానేశాడు.
గదిలో కూర్చుని అతను చేసే ఆలోచనలేమిటో, వాటి పరిణామాలు ఎలా ఉండగలవో, ఎవరు- చివరకు క్లియోపాత్రా కూడా ఊహించలేకపోయింది. సమయానికి భోజనం వచ్చినా, ఒక్కోనాడు వచ్చింది వచ్చినట్లుగా తిప్పి పంపబడుతోంది. మధుపానం మాత్రం నిరాటంకంగానే సాగుతుంది. క్లియోపాత్రా కూడా భర్త పద్ధతినే అనుసరించింది. ఆమె కూడా బయటికి రావడంలేదు. అన్నపానాదులపైన కూడా ఆమె నిరాదరణ చూపుతోంది.
భార్యాభర్తల్లో పెద్దఎత్తున కలహాలు జరిగినవనీ, మనసులు బాగుండక ఒకరిమీద ఒకరు అలిగి, ద్వేషంతో కుమిలిపోతున్నారని రాజభవనంలోని వారందరూ అర్థం చేసుకున్నారు. ఏ క్షణాన ఏ భూకంపం వస్తుందోనని అందరూ హడలిపోతున్నారు. చివరకు పిల్లలు తల్లిదండ్రుల్ని చూడాలన్నా కూడా సేవకులు వారిని మరిపించి దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనందంతో తాండవించే రాజప్రాసాదం విషాదంతో నిశ్శబ్దంతో భయంకరమైన వాతావరణంలో గీపెడుతోంది.
ఏంటని తీవ్రంగా ఆలోచించిన మీద రోమ్‌తో సరిపెట్టుకుందామని నిర్ణయానికి వచ్చారు. తన వ్యక్తిగత జీవితాల్లో క్లియోపాత్రా అగ్రస్థానాన్ని వహించినప్పటికీ, రోమ్‌లో ప్రజాస్వామ్యాన్ని నడిపించవలసిన బాధ్యత, దేశ క్షేమం కోసం పాటుపడవలసిన అవసరాన్ని అతను మర్చిపోలేదు. ఏ విధంగానైనా ఆక్టోవియన్‌తో అభిప్రాయ భేదాలులేకుండా చూసుకోవాలి. తనకు ఎటూ అధికారం, రాజ్యపాలన భారం అక్కర్లేదు. ఇక్కడే ప్రాచ్య దేశాలలో ప్రశాంతంగా పడి వుంటే చాలు. ఇది సంభవమైతే అటు రోమ్‌లోనూ శాంతి దేవతకు స్థానముంటుంది. తన అండ వుంటుంది కనుక ఇక్కడ ప్రాచ్య దేశాలలో ముఖ్యంగా ఈజిప్టులో కూడా శాంతి నిలుస్తుంది. ఎందుకంటే, ఈజిప్టుకు రోమ్ భయం ఉండదు.
ఒకవేళ క్లియోపాత్రా తనను వేధించినట్లయితే, కొన్నాళ్లపాటు తాను ఏ సిరియాలోనో గడపవచ్చు. లేదా ఏథెన్స్‌కు వెళ్లి అక్కడ ఆక్టోవియాతోను, తన పిల్లలతోనూ హాయిగా ఉండచ్చు. అంతేకానీ, అనవసరంగా తన దేశంమీద తిరుగుబాటు చేయడం సబబుగా తోచడంలేదు. తాను క్లియోపాత్రాకు ఆమె సంతానానికి చేయగలిగిందంతా చేశానని తృప్తి వున్నది. తాను అన్యాయం చేసినదన్నా ఆక్టోవియాకేననే జ్ఞానం కూడా వున్నది. నిజానికి ఆక్టోవియా కాలిగోటి కూడా క్లియోపాత్రా సరిరాదు.
ఈ ఆలోచనలతో అతను రోమ్‌తో మైత్రి సాగిద్దామని విశ్వప్రయత్నాలు చేయసాగాడు. ఆక్టోవియన్‌కు ఎన్నో ఉత్తరాలు రాశాడు. ప్రతి ఉత్తరంలోనూ తన అధికారాన్ని గూర్చి తాను రోమ్ పట్ల చూపించిన విశ్వాసాన్ని గురించి ప్రస్తావించాడు. తాను లొంగిపోతున్నట్లు కాకుండా అనవసరపు కలహాలు తనకిష్టంలేనట్లు సూచించాడు. అభిప్రాయ భేదాలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు కదానని తెలియజెప్పాడు.
తనను కానీ, తన భార్య క్లియోపాత్రాను కూడా నోటికొచ్చినట్లు దూషించడం నీచ మార్గాన సాధించడమేనన్నారు. ఆక్టోవియన్ తనను తిట్టిన ప్రతి తిట్టును తనను గూర్చి విమర్శించిన ప్రతి అక్షరాన్ని పట్టుకొని తనని తాను సమర్థించుకొనేందుకు ప్రయత్నించాడు.
ఈ విధంగా లేఖలు ప్రవాహ వేగంతో రోమ్ చేరినవి. వాటికి జవాబులు రావలసిన వ్యవధి దాటిపోయింది. తనకూ తన ఆశయాలకు అనుకూలంగా వుండే ప్రత్యుత్తరాలకోసం అతను కళ్లు కాయలు కాచేట్లు ఎదురుతెన్నులు చూశాడు. కానీ చివరకు నిరాశే మిగిలింది. కనీసం ప్రతికూలమైన జవాబులు కూడా రాలేదు. ఆక్టోవియన్ వాటిని అందుకొని సమయం వచ్చినపుడు వాటి సారాంశాన్ని వేరొక విధంగా తనకు అనుకూలంగా చిత్రించవచ్చని దురద్దేశ్యంతో దాచి ఉంచుకున్నాడు.
ఇలాటి వౌనం ఏంటనికి భరించరానిదైంది. అక్కడ రోమ్‌లో నిజంగానే తన వెనుక గోతులు తవ్వబడుతున్నవనే అనుమానం దృఢమవుతోంది. అయితే జీవితానుభవం ప్రసాదించిన ఓర్పు మాత్రం అతనిలో ఇంకా చావలేదు. కాలమే తన గాయాల్ని మాన్పుతుందని ఆశిస్తున్నాడు. ఈ కల్మశాన్ని మరిచిపోదామని ఎప్పుడో విద్యాభ్యాస సమయంలో మాత్రం తెరిచిన వేదాంత గ్రంథాలను తిరిగి పఠించసాగాడు.
క్లియోపాత్రా కూడా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోలేదు. ఆమె ఏంటని కన్నా తీవ్రంగానూ తెలివిగానూ ఆలోచిస్తూ వల పన్నుతోంది. రోమ్‌కు ఏంటని రాయబారం పంపుతున్నాడని ఆమెకు తెలుసు. ఆ రాయబారాలు వృధా అని కూడా ఆమె ముందే తెలుసుకోగలిగింది. తాను తలచిన విధంగా జరుగుతుంది కనుక, కొత్త పథకాన్ని అమలు జరిపేందుకు ఎలాటి అడ్డంకి ఉండరాదని ఆమె తేల్చుకున్నది.
ఏంటనితో మంతనాలు జరుపుకుండానే ఆమె పెద్ద ఎత్తున కొత్త సైన్యాన్ని సమకూర్చుతూ, వాటికి శిక్షణలనిప్పించే ఏర్పాట్లు చేయసాగింది. గదిలో నాలుగు గోడలమధ్య కూర్చొని ప్రశాంతంగా కాలం గడపాల్సిన తత్వం ఆమెకు లేదు.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు